ఇనుప బారికేడ్ల మధ్య చిక్కుకున్న మహిళలు
పాయకాపురం (విజయవాడరూరల్): వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కుక్కర్లు, గ్యాస్ స్టవ్‌ల పంపిణీ ప్రారంభించి.. ఒక్కసారిగా గేట్లు తీయడంతో బాధితులంతా కల్యాణ మండపంలోకి ప్రవేశించడంతో జరిగిన తొక్కిసలాటలో వృద్ధులు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 64వ డివిజన్ కండ్రికలోని కల్యాణమండపంలో వరద బాధితుల సహాయార్థం టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గ్యాస్‌స్టవ్‌లు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
అయితే గురువారం రాత్రే టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కూపన్లు పంపిణీ చేశారు. సర్వం కోల్పోయిన బాధితులంతా అక్కడికి చేరుకుని క్యూలైన్లలో నిలబడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమా, అధికార ప్రతినిధి పట్టాభి, బుద్ధా వెంకన్న పంపిణీ ప్రారంభించారు. కల్యాణ మండపం గేట్లు తెరవడంతో బాధితులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో భారీ ఎత్తున తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు కిందపడిపోయారు. వారిపై బారికేడ్లు పడడం, వెనుక నుంచి వచ్చే వారు తొక్కుకుంటూ వెళ్లడంతో ఊపిరాడక హాహాకారాలు చేశారు.
ఆ ప్రాంతమంతా బాధితుల ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో వారు తోపులాటలో చిక్కుకుని గాయపడ్డారు. పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేశారు. మహిళా పోలీసులు బారికేడ్లను తొలగించడంతో ప్రాణ నష్టం తప్పింది. టీడీపీ జనసేన కార్యకర్తలకే టోకెన్లు పంచుకున్నారు. ముఖాలు చూసి మరీ టోకెన్లు ఇచ్చారు. టీడీపీ జనసేన కార్యకర్తలే వరద బాధితులా? మేం బాధితులం కాదా అంటూ కండ్రిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment