వీళ్లా ‘పాలకులు’? | TTD Governing Council as a rehabilitation center | Sakshi
Sakshi News home page

వీళ్లా ‘పాలకులు’?

Published Fri, Jan 10 2025 5:58 AM | Last Updated on Fri, Jan 10 2025 5:58 AM

TTD Governing Council as a rehabilitation center

పునరావాస కేంద్రంగా టీటీడీ పాలక మండలి

అసమర్థులు.. వందిమాగదులను నియమించిన సీఎం చంద్రబాబు

టీడీపీకి బాకా ఊదిన బీఆర్‌ నాయుడుకు చైర్మన్‌ పదవి 

అదనపు ఈవో వెంకయ్య చౌదరికి నిలువెల్లా కులం.. అదొక్కటే ఆయన బలం

సాక్షి, అమరావతి:  టీటీడీని సీఎం చంద్రబాబు పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చే­శారు. అత్యంత వివాదాస్పదులు, తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నవారికి టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలలో దళారుల దందాకు తలుపులు బార్లా తెరిచారు. ఎన్నికల్లో తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టి టీడీపీకి  బాకా ఊదిన టీవీ 5 చానల్‌ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును టీటీడీ చైర్మన్‌గా నియమించారు. 

టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు.. దేవుడి పట్ల భక్తి లేదు. సివిల్‌ సర్వెంట్‌గా పాటించాల్సిన నిబంధనల పట్ల పట్టింపు లేదు. ఉన్నదల్లా కులం.. దాని నుంచి వచ్చిన బలం! అంతకు మించి ఏ కోశా­నా సమర్థత, నిజాయితీ, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలన్న ఇంగితం లేవు. వెంకయ్య చౌదరి భక్తులను పురుగుల్లా చూస్తూ ఇప్పుడు ఆరుగురి ప్రాణాలు బలిగొనడానికి కారణమయ్యా­రు. 

టీడీపీ కార్యకర్తలా వెంకయ్య చౌదరి...
నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన వెంకయ్య చౌదరి టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ రాజ్యాంగేతర శక్తిలా చెలరేగిపోతుంటారు. శ్రీవారి కన్నా స్వప్రయోజనాలే ఎక్కువ అనే తెంపరితనంతో వ్యవహరిస్తుంటారని టీటీడీ వర్గాలు చెబుతున్నా­యి. 

తన సామాజిక వర్గానికి చెందిన అస్మదీయ అధికారి అనే ఏకైక అర్హతతో సీఎం చంద్రబాబు ఆయన్ను ఏఈవోగా నియమించారు. ఆయన్ను కలిసేందుకు ఎవరైనా వస్తే మీరు టీడీపీకి చెందిన వారా? అని ప్రశ్నించిన తర్వాతే ఇతర విషయాలు మాట్లాడతారనేది బహిరంగ రహస్యం. 

డీఆర్‌ఐలో విధులు..
వెంకయ్య చౌదరి డీఆర్‌ఐలో పని చేసినప్పుడు పూర్తిగా టీడీపీ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించారనే తీవ్ర ఆరోపణలున్నాయి. అప్పట్లో టీడీపీలో ఒక వెలుగు వెలిగి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించి ఇప్పుడు పార్టీ మారి శాసనసభ్యుడిగా ఉంటూ... బ్యాంకులనుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా కుచ్చు టోపీ పెట్టిన ఓ నాయకుడికి వెంకయ్య ప్రధాన అనుచరుడిగా మెలిగారని చెబుతారు. 

ఓఎస్డీగా వ్యవహారాలు..
2014 –19 మధ్య బాబు సీఎంగా ఉన్న సమయంలో వెంకయ్య చౌదరి ఓఎస్డీగా నియమితుల­య్యారు. పెద్దల అండ ఇబ్బడి ముబ్బడిగా ఉండటంతో అడిగేవారు లేరని రెచ్చిపో­యి­న వెంకయ్య చౌదరి కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తించారని చెబుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎంని కలవడా­నికి వచ్చినా వారి పట్ల నిర్లక్యంగా వ్యవహరించేవారని, వెకిలిగా మాట్లాడే­వా­డని అంటుంటారు.

ఖనిజాభివృద్ధి శాఖ ఎండీగా..
అనంతరం వెంకయ్య చౌదరిని ఓఎస్డీ పదవి నుంచి తప్పించి ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) ఎండీగా నియమించారు. ఆ పదవిలోనూ చంద్రబాబు, తన కులస్తుల నమ్మకా­న్ని వెంకయ్య చౌదరి ఏమాత్రం వమ్ము చేయలేదనే ఆరోపణలున్నాయి. టీడీపీకి చెందిన వారికి మరీ ముఖ్యంగా తన కులానికి చెందిన వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చే విధంగా వ్యవహరించారు. 

2019లో టీడీపీ పరాజయం అనంతరం వెంకయ్య చౌదరి అక్రమాలు, అవినీతిపై విచారణకు ప్రభు­త్వం సిద్ధం కావడంతో దీన్ని పసిగట్టిన ఆయన అడ్డదారుల్లో, టీడీపీ మద్దతుదారుల సాయంతో రిలీవింగ్‌ లెటర్‌ సంపాదించుకుని కేంద్ర సర్వీసు­లకు వెళ్లిపోయారు. బాబు తిరిగి అధికారంలోకి రాగానే చంద్రముఖి మళ్లీ నిద్రలేచింది అన్నట్లుగా వెంకయ్య చౌదరి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చారు. 

అడుగులకు మడుగులొత్తినందుకే... 
ఎల్లో మీడియాలో ఒకటైన టీవీ–5 చైర్మన్‌ బీఆర్‌ నాయుడు టీడీపీని స్థాపించినప్పటి నుంచి తాను ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నానని చెప్పుకుంటూ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు అడుగులకు మడుగులొత్తారు. అందుకే చంద్రబాబు ఇప్పుడు ఆయనకు టీటీడీ చైర్మన్‌ పదవిని బహుమతిగా ఇచ్చారు. టీటీడీ చైర్మన్‌ పదవి దక్కాక బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై నోరుపారేసుకున్నారు. 

జగన్‌ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని.. చంద్రబాబు కొత్త కేసులు పెడితే జగన్‌ శాశ్వతంగా జైల్లో ఉండాల్సిందేనని విషం కక్కారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక ఆ సంస్థ పరిపాలన వ్యవహారాల కంటే రాజకీయ వ్యవహారాలకే బీఆర్‌ నాయుడు  పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. 

పాలనా వ్యవహారాలను గాలికొదిలేసి టీటీడీని టీడీపీ కార్యాలయంగా మార్చేయడంవల్లే తిరుమల చరిత్రలో ఎన్నడూలేని రీతిలో ఘోరం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement