బ్రిటీష్–ఇండియన్ మోడల్‌గా ప్రసిద్ధురాలైన డీన వాపో లండన్–ఇండియాల మధ్య సంచరిస్తూ ఉంటుంది. ‘మల్టీ టాలెంటెడ్’గా పేరు తెచ్చుకున్న డీన మన దేశ పేదల కోసం పనిచేస్తోంది. అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో స్త్రీసాధికారతకు సంబంధించి కీలక ఉపన్యాసం చేసింది...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో వందదేశాల నుంచి వివిధరంగాల మహిళలు పాల్లొన్నారు. ప్రధాన వక్తల్లో డీన వాపో (మిస్ ఇండియా, యూకే విన్నర్ 2012) ఒకరు. ‘భిన్నరంగాలకు చెందిన నిష్ణాతులు, మేధావులతో కలిసి ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉంది. లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళల నాయకత్వం...మొదలైన అంశాలపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎన్నో రకాల విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది డీన.
భారతీయ మూలాలు ఉన్న డీన వాపో బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘కొత్త విద్య నేర్చుకున్నప్పుడల్లా నీకు నువ్వు కొత్తగా కనిపిస్తావు. కొత్త శక్తి నీలోకి వచ్చి చేరుతుంది’ అంటున్న డీన చిన్న వయసులోనే పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించింది. నటన, నృత్యాలలో భేష్ అనిపించుకుంది. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. మోడల్ రంగంలోకి అడుగు పెట్టి సక్సెస్ అయింది.2012లో ‘మిస్ ఇండియా యూకే’ కిరీటంతో ప్రపంచదృష్టిని ఆకర్షించింది.
మన బాలీవుడ్‌తో సహా ఎన్నో సినిమాల్లో నటించిన డీన ‘డీకెయూ వరల్డ్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది....ఇదంతా ఒక కోణం అయితే ‘డీకేయూ కైండ్‌నెస్’ ట్రస్ట్ అనేది మరో కోణం. సామాజిక కోణం. అట్టడుగు వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, లైఫ్‌స్కిల్స్...మొదలైన వాటికి ఉపకరించే ట్రస్ట్ ఇది. ఈ ట్రస్ట్ తరపున రెండు సంవత్సరాల క్రితం రాజస్థాన్‌లోని వివిధ ప్రాంంతాలకు వెళ్లి స్కూల్లో చదివే బాలికలతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడింది. ట్రస్ట్ తరఫున ఎడ్యుకేషనల్ కిట్స్ పంచింది.
‘మీకు సహాయం చేయడానికి డీకేయూ ట్రస్ట్ ఉందనే విషయం ఎప్పుడూ మరవద్దు. ఇది మా ట్రస్ట్ కాదు. మనందరి ట్రస్ట్’ అని చెప్పి పిల్లలు, తల్లిదండ్రులలో ధైర్యాన్ని నింపింది డీన. గత సంవత్సరం దీపావళి పండగను రాజస్థాన్‌లోని జహొర అనే గ్రామంలో జరుపుకుంది. స్వీట్లు, ఎడ్యుకేషనల్ టూల్స్ పంచడమే కాదు తమ ట్రస్ట్ గురించి వారికి వివరించింది. ‘క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. మన ప్రపంచం విస్తృతం అవుతుంది. చేయాలనుకున్న మంచి పనుల జాబితాలో మరి కొన్ని పనులు వచ్చి చేరుతాయి’ అంటుంది డీన.
ఇంగ్లాండ్‌లోని బ్రాగటి నగరంలో పుట్టింది డీన. తన పన్నెండవ యేట తండ్రి క్యాన్సర్‌తో చనిపోయాడు. ఆతరువాత తల్లితో కలిసి మిడ్‌లాండ్స్(సెంట్రల్ ఇంగ్లాండ్)కు వెళ్లింది. ఒక విషాదానికి సంబంధించిన జ్ఞాపకాలకు దూరంగా, గాలి మార్పు కోసం తల్లి తనను కొత్త ప్రదేశానికి తీసుకు వెళ్లింది. అయితే డీనకు కొత్త ప్రదేశాలే కాదు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే తనను పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేలా చేసింది.
‘ఇండియాస్ ఫర్‌గాటెన్ పీపుల్’ (నెట్‌ఫిక్స్)లో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది డీన. అయితే విస్మరణ వర్గాల గురించి ఆమె తపన కాల్పనిక చలన చిత్రానికే పరిమితం కావడం లేదు. ట్రస్ట్ కార్యకలాపాల ద్వారా తన ఆదర్శలు, ఆలోచనలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment