deena
-
మళ్లీ ఎందుకు?.. సంచలనంగా మారిన ఇళయరాజా కామెంట్స్!
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా, దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు, సంగీత దర్శకుడు దీనా మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? అంటే ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. సంగీత రంగంలో అపర చాణుక్యులుగా ముద్ర వేసుకున్న ఇళయరాజాను వ్యతిరేకించి ఇక్కడ మనుగడ సాగించటం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఆయన్ని ఎదుర్కోవడానికే మరో సంగీత దర్శకుడు దీనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘానికి రెండుసార్లు అధ్యక్షుడిగా ఎంపికయ్యా రు. కాగా ఈ సంఘానికి ప్రస్తు త కార్యవర్గ పదవీ బాధ్యతలు ముగియనున్నాయి. దీంతో ఈ సంఘానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే సంగీత దర్శకుడు దీనా మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలోనే ఇళయరాజాకు, ఆయనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుత దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు దీనాతో ఇళయరాజా మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో సినీ రంగంలో మొట్టమొదటిసారిగా సంగీత కళాకారుల సంఘం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సంఘాన్ని ప్రారంభించింది ఎంపీ శ్రీనివాసన్ అని తెలిపారు. సంఘానికి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే సంఘానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలనే నిబంధన కూడా ఉందన్నారు. అందువల్ల నువ్వు ఇప్పటికే రెండుసార్లు సంఘం అధ్యక్షత బాధ్యతలను నిర్వహించావని.. మూడోసారి ఎందుకు పోటీ చేస్తున్నావని ఇళయ రాజా ప్రశ్నించారు. ఈసారి కొత్త తరానికి అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. ఈ సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు. అయితే తాను ఆ విషయం గురించి లోతుగా పోదలచుకోలేదని.. సంఘం సభ్యులు కోరిక మేరకే అధ్యక్షుడిగా అంగీకరించాలని అంటున్నారు. అయితే దీన్ని ఇళయరాజా వ్యతిరేకించారు. దీనిపై స్పందించిన దీనా కాలానుగుణంగా సంఘం నిబంధనలు మారుతాయని అన్నారు. ఇళయరాజా అన్నయ్యను ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఇళయరాజాను కలిసి వాస్తవ పరిస్థితులు వివరిస్తానని దీనా స్పష్టం చేశారు. -
లండన్ నుంచి పేదోళ్ల ఇంటి వరకు...
బ్రిటీష్–ఇండియన్ మోడల్‌గా ప్రసిద్ధురాలైన డీన వాపో లండన్–ఇండియాల మధ్య సంచరిస్తూ ఉంటుంది. ‘మల్టీ టాలెంటెడ్’గా పేరు తెచ్చుకున్న డీన మన దేశ పేదల కోసం పనిచేస్తోంది. అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో స్త్రీసాధికారతకు సంబంధించి కీలక ఉపన్యాసం చేసింది... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో వందదేశాల నుంచి వివిధరంగాల మహిళలు పాల్లొన్నారు. ప్రధాన వక్తల్లో డీన వాపో (మిస్ ఇండియా, యూకే విన్నర్ 2012) ఒకరు. ‘భిన్నరంగాలకు చెందిన నిష్ణాతులు, మేధావులతో కలిసి ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉంది. లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళల నాయకత్వం...మొదలైన అంశాలపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎన్నో రకాల విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది డీన. భారతీయ మూలాలు ఉన్న డీన వాపో బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘కొత్త విద్య నేర్చుకున్నప్పుడల్లా నీకు నువ్వు కొత్తగా కనిపిస్తావు. కొత్త శక్తి నీలోకి వచ్చి చేరుతుంది’ అంటున్న డీన చిన్న వయసులోనే పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించింది. నటన, నృత్యాలలో భేష్ అనిపించుకుంది. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. మోడల్ రంగంలోకి అడుగు పెట్టి సక్సెస్ అయింది.2012లో ‘మిస్ ఇండియా యూకే’ కిరీటంతో ప్రపంచదృష్టిని ఆకర్షించింది. మన బాలీవుడ్‌తో సహా ఎన్నో సినిమాల్లో నటించిన డీన ‘డీకెయూ వరల్డ్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది....ఇదంతా ఒక కోణం అయితే ‘డీకేయూ కైండ్‌నెస్’ ట్రస్ట్ అనేది మరో కోణం. సామాజిక కోణం. అట్టడుగు వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, లైఫ్‌స్కిల్స్...మొదలైన వాటికి ఉపకరించే ట్రస్ట్ ఇది. ఈ ట్రస్ట్ తరపున రెండు సంవత్సరాల క్రితం రాజస్థాన్‌లోని వివిధ ప్రాంంతాలకు వెళ్లి స్కూల్లో చదివే బాలికలతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడింది. ట్రస్ట్ తరఫున ఎడ్యుకేషనల్ కిట్స్ పంచింది. ‘మీకు సహాయం చేయడానికి డీకేయూ ట్రస్ట్ ఉందనే విషయం ఎప్పుడూ మరవద్దు. ఇది మా ట్రస్ట్ కాదు. మనందరి ట్రస్ట్’ అని చెప్పి పిల్లలు, తల్లిదండ్రులలో ధైర్యాన్ని నింపింది డీన. గత సంవత్సరం దీపావళి పండగను రాజస్థాన్‌లోని జహొర అనే గ్రామంలో జరుపుకుంది. స్వీట్లు, ఎడ్యుకేషనల్ టూల్స్ పంచడమే కాదు తమ ట్రస్ట్ గురించి వారికి వివరించింది. ‘క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. మన ప్రపంచం విస్తృతం అవుతుంది. చేయాలనుకున్న మంచి పనుల జాబితాలో మరి కొన్ని పనులు వచ్చి చేరుతాయి’ అంటుంది డీన. ఇంగ్లాండ్‌లోని బ్రాగటి నగరంలో పుట్టింది డీన. తన పన్నెండవ యేట తండ్రి క్యాన్సర్‌తో చనిపోయాడు. ఆతరువాత తల్లితో కలిసి మిడ్లాండ్స్(సెంట్రల్ ఇంగ్లాండ్)కు వెళ్లింది. ఒక విషాదానికి సంబంధించిన జ్ఞాపకాలకు దూరంగా, గాలి మార్పు కోసం తల్లి తనను కొత్త ప్రదేశానికి తీసుకు వెళ్లింది. అయితే డీనకు కొత్త ప్రదేశాలే కాదు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే తనను పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేలా చేసింది. ‘ఇండియాస్ ఫర్గాటెన్ పీపుల్’ (నెట్ఫిక్స్)లో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది డీన. అయితే విస్మరణ వర్గాల గురించి ఆమె తపన కాల్పనిక చలన చిత్రానికే పరిమితం కావడం లేదు. ట్రస్ట్ కార్యకలాపాల ద్వారా తన ఆదర్శలు, ఆలోచనలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. -
‘డాన్కీ’ తెరపైకి రావడానికి రెడీ
డాన్కీ ద్విభాషా చిత్రంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. స్ట్రీట్ లైట్ పిక్చర్స్ పతాకంపై జో యోవానిసింగ్ స్వీయ దర్శత్వంలో నిర్మించి, ప్రతినాయకుడిగా నటించిన చిత్రం డాన్కీ. మురళీరామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సింగపూర్‌కు చెందిన పాప్‌సింగర్, మోడల్ నబాసా బేగం హీరోయిన్‌గానూ, ష్రీన్ కాంజ్వాలా మరో హీరోయిన్‌గానూ నటించారు. హబీబీ, విక్కీ, ప్రభు, కదిరేశన్రాజ్, సావిత్రి ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. నృత్య దర్శకుడు దీనా, ఛాయాగ్రాహకుడు విలియమ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ డాన్కీ చిత్ర వివరాలను దర్శక నిర్మాత తెలుపుతూ ప్రియురాలి చేత తిరస్కరించబడ్డ ఒక యువకుడు ఉద్యోగం లేక, ఆర్థికసమస్యలతో ఇబ్బందులు పడుతూ పని కోసం సింగపూర్‌లో ఉన్న తన బంధువును ఆశ్రయిస్తాడన్నారు. అయితే అతను చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేస్తుండడంతో వేరే గతి లేక ఈ యువకుడు కూడా అదే పనికి పూనుకుంటాడనని తెలిపారు. అలా ఒక యువతిని కిడ్నాప్ చేయగా తను ఒక పెద్ద గ్యాంగస్టర్ కూతురని తెలుస్తుందన్నారు. దీంతో ఆ యువకుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా డాన్కీ ఉంటుందని చెప్పారు. చిత్రంలో నాలుగు పాటలు చోటు చేసుకుంటాయని, చిత్ర షూటింగ్‌ను పూర్తిగా సింగపూర్‌లో 50 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. చిత్రంలో పాటలు, పోరాట దృశ్యాలు ప్రేక్షకులను అలరిస్తాయని అన్నారు.నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాత జో యోవానిసింగ్ తెలిపారు. -
ప్రాణాలతో వస్తాననుకోలేదు..
► ఎడారి దేశంలో కష్టాలు.. ► స్వదేశానికి క్షేమంగా చేరుకున్న దీన ► ‘సాక్షి’కథనమే చేర్చింది యానాం (ముమ్మిడివరం) : ‘ఎడారి దేశంలో కష్టాలు ఎదుర్కొన్నాను.. స్వదేశానికి పంపండని వేడుకున్నందుకు వారితో దెబ్బలు తిన్నాను. తిండి, నిద్ర లేదు. ప్రాణాలపై ఆశలు వదులుకున్నాను. అయితే మే 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ప్రాణాలను నిలిపి.. స్వదేశానికి తిరిగివచ్చేలా చేసింది. నా కుమార్తె, కుమారుడి వద్దకు చేర్చింది. ఆ కథనం నాడు మరో జన్మను ఇచ్చింది. ‘సాక్షి’ పత్రికకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను?’... ఏజెంట్ మోసానికి గురై దుబాయ్‌కు విజిటింగ్ వీసాపై వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన దరియాలతిప్ప గ్రామానికి చెందిన సంగాడి దీన విలపిస్తూ చెప్పిన మాటలివి. ఏప్రిల్ 28న దుబాయ్ వెళ్లిన ఆమె తిరిగి క్షేమంగా గురువారం తెల్లవారుజామున దరియాలతిప్ప చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, తనను ఉంచిన ప్రదేశంలో వందలాది మంది తెలుగు వాళ్లు, శ్రీలంక, ఫిలిప్పిన్స్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారని తెలిపింది. అక్కడ పని దొరుకుతుందనే ఆశతోనే అందరూ వెళుతున్నారని, అయితే పని దొరకడం లేదని చెప్పింది. తమను ఒక ఇంట్లో ఉంచిన అనంతరం యూఏఈలోని అజ్మాన్ అనే ప్రాంతంలో.. అల్వాసెట్ అనే లేబర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కార్యాలయానికి చేర్చేవారని చెప్పింది. అందరినీ గదులలో బంధించేవారని, పనిలో చేరేందుకు వచ్చిన మహిళలు దుర్భర పరిస్ధితులలో ఉంటున్నారని వివరించింది. సెల్‌ఫోన్ తీసేసుకుంటారని, ఆఖరికి టీ తాగాలన్నా వాళ్ల అనుమతి ఉండాలని, తిన్నారో లేదో అడిగేవారు కూడా లేరని వాపోయింది. అనంతమైన ఎడారిలో కొన్ని ఇళ్లు మాత్రమే ఉండేవని తెలిపింది. విజిటింగ్ (టూరిస్ట్) వీసా కాలపరిమితి జూన్ 10లోగా ముగిసిపోతుందని, పని దొరకని పరిస్థితిలో వేధింపులు భరించలేకపోయానని వాపోయింది. ఏజెంట్ వాతాడి సత్యనారాయణ తనకు వర్కింగ్ వీసా అని చెప్పి విజిటింగ్ వీసాపై పంపడం వల్లే మోసపోయానని ఆరోపించింది. తన పరిస్థితిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అక్కడి వారు ఈ విషయం ఏజెంట్ ద్వారా తెలుసుకుని తనను స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపింది. ఈ సమస్యపై స్పందించిన పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితర అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.