ప్రాణాలతో వస్తాననుకోలేదు..
► ఎడారి దేశంలో కష్టాలు..
► స్వదేశానికి క్షేమంగా చేరుకున్న దీన
► ‘సాక్షి’కథనమే చేర్చింది
యానాం (ముమ్మిడివరం) : ‘ఎడారి దేశంలో కష్టాలు ఎదుర్కొన్నాను.. స్వదేశానికి పంపండని వేడుకున్నందుకు వారితో దెబ్బలు తిన్నాను. తిండి, నిద్ర లేదు. ప్రాణాలపై ఆశలు వదులుకున్నాను. అయితే మే 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ప్రాణాలను నిలిపి.. స్వదేశానికి తిరిగివచ్చేలా చేసింది. నా కుమార్తె, కుమారుడి వద్దకు చేర్చింది. ఆ కథనం నాడు మరో జన్మను ఇచ్చింది. ‘సాక్షి’ పత్రికకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను?’... ఏజెంట్ మోసానికి గురై దుబాయ్‌కు విజిటింగ్ వీసాపై వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన దరియాలతిప్ప గ్రామానికి చెందిన సంగాడి దీన విలపిస్తూ చెప్పిన మాటలివి.
ఏప్రిల్ 28న దుబాయ్ వెళ్లిన ఆమె తిరిగి క్షేమంగా గురువారం తెల్లవారుజామున దరియాలతిప్ప చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, తనను ఉంచిన ప్రదేశంలో వందలాది మంది తెలుగు వాళ్లు, శ్రీలంక, ఫిలిప్పిన్స్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారని తెలిపింది. అక్కడ పని దొరుకుతుందనే ఆశతోనే అందరూ వెళుతున్నారని, అయితే పని దొరకడం లేదని చెప్పింది.
తమను ఒక ఇంట్లో ఉంచిన అనంతరం యూఏఈలోని అజ్మాన్ అనే ప్రాంతంలో.. అల్‌వాసెట్ అనే లేబర్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ కార్యాలయానికి చేర్చేవారని చెప్పింది. అందరినీ గదులలో బంధించేవారని, పనిలో చేరేందుకు వచ్చిన మహిళలు దుర్భర పరిస్ధితులలో ఉంటున్నారని వివరించింది. సెల్‌ఫోన్ తీసేసుకుంటారని, ఆఖరికి టీ తాగాలన్నా వాళ్ల అనుమతి ఉండాలని, తిన్నారో లేదో అడిగేవారు కూడా లేరని వాపోయింది. అనంతమైన ఎడారిలో కొన్ని ఇళ్లు మాత్రమే ఉండేవని తెలిపింది.
విజిటింగ్ (టూరిస్ట్) వీసా కాలపరిమితి జూన్ 10లోగా ముగిసిపోతుందని, పని దొరకని పరిస్థితిలో వేధింపులు భరించలేకపోయానని వాపోయింది. ఏజెంట్ వాతాడి సత్యనారాయణ తనకు వర్కింగ్ వీసా అని చెప్పి విజిటింగ్ వీసాపై పంపడం వల్లే మోసపోయానని ఆరోపించింది. తన పరిస్థితిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అక్కడి వారు ఈ విషయం ఏజెంట్ ద్వారా తెలుసుకుని తనను స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపింది. ఈ సమస్యపై స్పందించిన పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితర అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.