Repatriation
-
ప్రేమ అంటూ కంచె దాటింది.. కాపురం పెట్టేలోపే..
ఆమెది పాకిస్తాన్. అతనిది భారత్. అతనితో జీవితం పంచుకోవాలని ఉందంటూ.. దాయాది దేశం నుంచి కంచెదాటి భారత్‌లో అడుగుపెట్టింది. వివాహ బంధంతో ఒక్కటై కాపురం పెట్టేలోపే.. ఇక్కడి అధికారులు పసిగట్టి గట్టి షాకే ఇచ్చారు. పాకిస్తాన్‌కు చెందిన ఇక్రా జివాని(19).. ఆన్లైన్ లూడో ద్వారా యూపీకి చెందిన ములాయం సింగ్(26)కు దగ్గరైంది. ములాయం బెంగళూరులో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఆమెను భారత్‌కు రావాలని.. ఇక్కడే పెళ్లి చేసుకుని కాపురం పెడదామని ఇక్రాకు సూచించాడు ములాయం. అయితే.. ఆమెకు వీసా సమస్యలు ఎదురయ్యాయి. ఈలోపు ములాయం.. ఆమెను నేపాల్‌కు రమ్మని చెప్పాడు. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఆమె ఖాట్మాండు త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. అప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్న ములాయం.. తొలిసారి ఆమెను ప్రత్యక్షంగా చూసి మురిసిపోయాడు. ఆపై ఇద్దరూ ఖాట్మాండులోనే వివాహం చేసుకుని.. అక్కడే వారంపాటు ఉన్నారు. అటుపై సనోలీ సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించించింది ఈ జంట. బెంగళూరుకు చేరుకుని.. ఇక్రా పేరును కాస్త ‘రవ’గా అనే హిందూ పేరుగా మార్చేశాడు ములాయం. ఇక.. కాపురం ప్రారంభమైన కొద్దిరోజులకే ఆమె తీరుపై చుట్టుపక్కల వాళ్లకు అనుమానాలు వచ్చాయి. హిందూ అమ్మాయి.. తరచూ నమాజ్ చేయడం ఏంటని షాక్ తిన్నారు చుట్టుపక్కల వాళ్లు. చివరకు పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు ములాయం ఇంటిపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆమె పేరిట ఉన్న పాకిస్థానీ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఇక్రాకు అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఆమె నుంచి ఏమైనా కీలక సమాచారం దొరుకుతుందేమోనని యత్నించారు. చివరకు ఆమె ములాయం కోసమే వచ్చిందని, గూఢాచారి కాదని నిర్ధారించుకున్నారు. ఆపై ఆమెకు మానసిక నిపుణులచేత కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆపై ఆమెను అమృత్‌సర్‌కు తరలించారు. అక్కడ సైనికాధికారులు ఆదివారంనాడు అట్టారి సరిహద్దు ద్వారా ఆమెను తిరిగి పాకిస్థాన్‌కు పంపించేశారు. -
పాక్ ప్రజలకు భారత్ తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా 193 మంది పాకిస్తాన్ ప్రజలను మే 5న వారి సొంత దేశానికి తరలించడానికి అనుమతి ఇస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి ఓ పకటనలో తెలిపారు. అట్టారి-వాఘా సరిహద్దు గుండా వారిని తమ దేశానికి పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా పది రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో 193 పాకిస్తానీయులు చిక్కుకున్నారు. ఇక వారిని మంగళవారం అట్టారి-వాఘా సరిహద్దు వరకు సురక్షితంగా తీసుకురావాలని ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారలకు విదేశాంగశాఖ ఆదేశాలు జారీ చేసింది. (వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?) మే 5న ఇమ్మిగ్రేషన్, సరిహద్దు తనిఖీ ప్రక్రియ ప్రారంభమవుతుందని విదేశాంగశాఖ తెలిపింది. పాకిస్తాన్ హైకమిషన్ భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న తమ పౌరులను తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొంతమంది పాకిస్తాన్ ప్రజలను ఒక సమూహంగా తమ దేశానికి భారత ప్రభుత్వం పంపించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్‌లోని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీలో చిక్కుకున్న193 మంది పాకిస్తాన్ ప్రజలు తమ స్వదేశానికి చేరుకోనున్నారు. -
ప్రాణాలతో వస్తాననుకోలేదు..
► ఎడారి దేశంలో కష్టాలు.. ► స్వదేశానికి క్షేమంగా చేరుకున్న దీన ► ‘సాక్షి’కథనమే చేర్చింది యానాం (ముమ్మిడివరం) : ‘ఎడారి దేశంలో కష్టాలు ఎదుర్కొన్నాను.. స్వదేశానికి పంపండని వేడుకున్నందుకు వారితో దెబ్బలు తిన్నాను. తిండి, నిద్ర లేదు. ప్రాణాలపై ఆశలు వదులుకున్నాను. అయితే మే 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ప్రాణాలను నిలిపి.. స్వదేశానికి తిరిగివచ్చేలా చేసింది. నా కుమార్తె, కుమారుడి వద్దకు చేర్చింది. ఆ కథనం నాడు మరో జన్మను ఇచ్చింది. ‘సాక్షి’ పత్రికకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను?’... ఏజెంట్ మోసానికి గురై దుబాయ్‌కు విజిటింగ్ వీసాపై వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన దరియాలతిప్ప గ్రామానికి చెందిన సంగాడి దీన విలపిస్తూ చెప్పిన మాటలివి. ఏప్రిల్ 28న దుబాయ్ వెళ్లిన ఆమె తిరిగి క్షేమంగా గురువారం తెల్లవారుజామున దరియాలతిప్ప చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, తనను ఉంచిన ప్రదేశంలో వందలాది మంది తెలుగు వాళ్లు, శ్రీలంక, ఫిలిప్పిన్స్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారని తెలిపింది. అక్కడ పని దొరుకుతుందనే ఆశతోనే అందరూ వెళుతున్నారని, అయితే పని దొరకడం లేదని చెప్పింది. తమను ఒక ఇంట్లో ఉంచిన అనంతరం యూఏఈలోని అజ్మాన్ అనే ప్రాంతంలో.. అల్వాసెట్ అనే లేబర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కార్యాలయానికి చేర్చేవారని చెప్పింది. అందరినీ గదులలో బంధించేవారని, పనిలో చేరేందుకు వచ్చిన మహిళలు దుర్భర పరిస్ధితులలో ఉంటున్నారని వివరించింది. సెల్‌ఫోన్ తీసేసుకుంటారని, ఆఖరికి టీ తాగాలన్నా వాళ్ల అనుమతి ఉండాలని, తిన్నారో లేదో అడిగేవారు కూడా లేరని వాపోయింది. అనంతమైన ఎడారిలో కొన్ని ఇళ్లు మాత్రమే ఉండేవని తెలిపింది. విజిటింగ్ (టూరిస్ట్) వీసా కాలపరిమితి జూన్ 10లోగా ముగిసిపోతుందని, పని దొరకని పరిస్థితిలో వేధింపులు భరించలేకపోయానని వాపోయింది. ఏజెంట్ వాతాడి సత్యనారాయణ తనకు వర్కింగ్ వీసా అని చెప్పి విజిటింగ్ వీసాపై పంపడం వల్లే మోసపోయానని ఆరోపించింది. తన పరిస్థితిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అక్కడి వారు ఈ విషయం ఏజెంట్ ద్వారా తెలుసుకుని తనను స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపింది. ఈ సమస్యపై స్పందించిన పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితర అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. -
స్వదేశానికి శ్రీలంక జాలర్లు
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : భారత సముద్ర జలాల్లో అక్రమంగా చొరబడి, చేపలవేట సాగిస్తూ ఇండియన్ కోస్ట్‌గార్డు అధికారులకు పట్టుబడిన శ్రీలంక జాలర్లు శనివారం తమ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. శ్రీలంకకు చెందిన 20 మంది మత్స్యకారులు నాలుగు బోట్లలో గతేడాది నవంబర్‌లో భారత్ సముద్ర జలాల్లో అక్రమంగా ప్రవేశించారు. చేపలు వేటాడుతున్న వారిని కోస్ట్‌గార్డు గస్తీ నౌకలోని సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాకినాడ మెరైన్ పోలీసులకు అప్పగించారు. శ్రీలంక జాలర్లను కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి అపరాధ రుసుం విధించారు. ఆ దేశ అధికారులు సొమ్మును చెల్లించారు. దీంతో ఆ 20 మంది జాలర్లను మెరైన్ సీఐ ఎస్.ప్రసాదరావు నేతృత్వంలో శనివారం తిరిగి ఇండియన్ కోస్ట్‌గార్డు అధికారులకు అప్పగించారు. వారిని గంగాదేవి గస్తీ నౌకలో కోస్టుగార్డు సిబ్బంది తరలించారు. ఈ నెల 15న శ్రీలంక మత్స్యకారులకు సముద్రంలో వారిని అప్పగించనున్నట్టు అధికారులు తెలిపారు.