స్వదేశానికి శ్రీలంక జాలర్లు
Published Sun, Feb 9 2014 1:57 AM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : భారత సముద్ర జలాల్లో అక్రమంగా చొరబడి, చేపలవేట సాగిస్తూ ఇండియన్ కోస్ట్‌గార్డు అధికారులకు పట్టుబడిన శ్రీలంక జాలర్లు శనివారం తమ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. శ్రీలంకకు చెందిన 20 మంది మత్స్యకారులు నాలుగు బోట్లలో గతేడాది నవంబర్‌లో భారత్ సముద్ర జలాల్లో అక్రమంగా ప్రవేశించారు. చేపలు వేటాడుతున్న వారిని కోస్ట్‌గార్డు గస్తీ నౌకలోని సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాకినాడ మెరైన్ పోలీసులకు అప్పగించారు. శ్రీలంక జాలర్లను కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి అపరాధ రుసుం విధించారు. ఆ దేశ అధికారులు సొమ్మును చెల్లించారు. దీంతో ఆ 20 మంది జాలర్లను మెరైన్ సీఐ ఎస్.ప్రసాదరావు నేతృత్వంలో శనివారం తిరిగి ఇండియన్ కోస్ట్‌గార్డు అధికారులకు అప్పగించారు. వారిని గంగాదేవి గస్తీ నౌకలో కోస్టుగార్డు సిబ్బంది తరలించారు. ఈ నెల 15న శ్రీలంక మత్స్యకారులకు సముద్రంలో వారిని అప్పగించనున్నట్టు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement