న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గ్రోసరీలు, ఇతర వస్తువుల విషయంలో ఈ–కామర్స్ లావాదేవీలు పెరుగుతున్నట్టే... ఫార్మసీ రంగంలోనూ ఆన్‌లైన్ లావాదేవీలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. వచ్చే నాలుగేళ్లలో... అంటే 2023 నాటికి దేశీయంగా ఈ–ఫార్మసీల మార్కెట్ 18.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుందనేది కన్సల్టెన్సీ సంస్థ ఈవై (ఎర్నస్ట్ అండ్ యంగ్) అంచనా. స్మార్ట్‌ఫోన్స్ ద్వారా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం, ప్రాణాంతక వ్యాధులు.. వైద్య చికిత్స వ్యయాలు ఎక్కువవుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం కానున్నాయని ఈవై అభిప్రాయపడింది.
ఈ నివేదిక మేరకు...
ప్రస్తుతం ఈ–ఫార్మా సంస్థలకు అందు బాటులో ఉన్న మార్కెట్ పరిమాణం సుమారు 9.3 బిలియన్ డాలర్లు. ఇది వార్షికంగా 18.1% వృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుతుండటం.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం ద్వారా ఔషధాలను సులభతరంగా ఆర్డరు చేయగలుగుతుండటం వంటి అంశాలు ఈ–ఫార్మా మార్కెట్ వృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రాణాంతక వ్యాధులు, తలసరి ఆదాయం, వైద్య చికిత్స వ్యయాలు పెరుగుతుండటం సైతం ఈ–ఫార్మసీ మార్కెట్‌కు తోడ్పడుతోంది. ‘మొబైల్స్ వినియోగం పెరగటం, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు మెరుగుపడటం వంటి అంశాలతో భారత్‌లో ఈ–కామర్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ–కామర్స్‌లో భాగమైన ఆన్‌లైన్ ఫార్మసీలకు క్రమంగా ప్రాచుర్యం పెరుగుతోంది. వీటికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయి‘ అని ఈవై ఇండియా పార్ట్‌నర్ (ఈ–కామర్స్ అండ్ కన్జూమర్ ఇంటర్నెట్ విభాగం) అంకుర్ పహ్వా చెప్పారు.
ప్రభుత్వ వ్యయాల తోడ్పాటు..
వైద్యంపై ఇటు ప్రభుత్వం అటు ప్రజలు చేసే వ్యయాలు గణనీయంగా పెరుగుతుండటం వచ్చే నాలుగేళ్లలో ఈ–ఫార్మసీ మార్కెట్ మరింతగా విస్తరించేందుకు దోహదపడనుందని ఈవై తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 35 శాతం ఫార్మా మార్కెట్ ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలది కాగా మిగతా 65 శాతం.. తీవ్ర అనారోగ్యాలకు సంబంధించినదిగా ఉంటోంది. ప్రాణాంతక వ్యాధుల ఔషధాల మార్కెట్‌లో 85 శాతం వాటాను, తీవ్ర అనారోగ్యాల ఔషధాల మార్కెట్‌లో 40 శాతాన్ని ఈ– ఫార్మసీలు లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదిక సూచించింది. స్థానిక ఫార్మసీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని నేరుగా ఇంటి దగ్గరకే ఔషధాలను అందించగలగడం ఈ– ఫార్మసీలకు దోహదపడవచ్చని పేర్కొంది. ఈ–ఫార్మా కంపెనీలు భారీమొత్తంలో డిస్కౌంట్లు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. లాభనష్ట రహిత స్థితికి రావాలన్నా, అర్థవంతమైన లాభాలు చూడాలన్నా డిస్కౌంట్లు సముచిత స్థాయిలకు రావాల్సిన అవసరం ఉందని నివేదిక వివరించింది.
అంతర్జాతీయ సంస్థల దూకుడు..
రాబోయే రోజుల్లో ఈ–ఫార్మా వ్యాపార విభాగంలో అంతర్జాతీయ ఈ–కామర్స్ సంస్థలు మరింత దూకుడుగా కార్యకలాపాలు విస్తరించవచ్చని ఈవై నివేదిక వివరించింది. అంతర్జాతీయ అనుభవం, దేశీయంగా వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉండటం వాటికి తోడ్పడగలదని పేర్కొంది. ఫిన్‌టెక్, హెల్త్‌టెక్ సంస్థలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశించి తమ సేవల పరిధిని మరింతగా విస్తరించడానికి వీలుందని వివరించింది. డెలివరీ వ్యవస్థను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు హైపర్‌లోకల్ సంస్థలు (ఫుడ్ టెక్, నిత్యావసరాల విక్రయ సంస్థలు, కేవలం డెలివరీ మాత్రమే చేసే సంస్థలు) కూడా ఈ–ఫార్మా విభాగంపై దృష్టి పెట్టొచ్చని పేర్కొంది.
ధరాభారానికి ఆన్‌లైన్ ‘ఔషధం’!
Published Thu, May 30 2019 5:37 AM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment