pharmacy sector
-
ఫార్మాలో భారత్ ‘విశ్వగురు’
బాలానగర్: ఫార్మసీ రంగంలో భారతదేశం ఎంతో పురోగతి సాధించిందని, ప్రస్తుతం విశ్వగురువుగా కూడా మారిందని కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి భగవత్ కూబా అన్నారు. శుక్రవారం బాలానగర్‌లోని నైపర్ 10వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల్లో పాలుపంచుకుని విజయం సాధించాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. కరోనా లాంటి కష్టకాలంలోనే మన ఫార్మసీలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయని అన్నారు. 2017 సంవత్సరంలో ప్రారంభమైన నైపర్ కేవలం 16 సంవత్సరాల కాలంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో అధునాతన అధ్యయనాలు, అభ్యాసానికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడటం మంచి పరిణామమన్నారు. ‘నా కెరీర్లో నాకెప్పుడూ గోల్డ్‌మెడల్ రాలేదు...కానీ నేను విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని’ ఆయన పేర్కొన్నారు. లారస్ ల్యాబ్స్ చైర్మన్ చావా సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఫార్మా రంగంలోకి రావడానికి ఇదే సరైన సమయం అన్నారు. దేశ ఖ్యాతిని పెంచేలా విద్యార్థులు పనిచేయాలని కోరారు. అనంతరం స్నాతకోత్సవంలో 187 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అందులో 25 మంది పీహెచ్డీ, 162 మంది ఎంఎస్ (ఫార్మ్), ఎంబీఏ(ఫార్మ్) విద్యార్థులు ఉన్నారు. కార్యక్రమంలో నైపర్ హైదరాబాద్ డైరెక్టర్ డా.శశిబాలా సింగ్, డీన్ డా.ఎం. శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ గణనాథం తదితరులు పాల్గొన్నారు. -
ధరాభారానికి ఆన్లైన్ ‘ఔషధం’!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గ్రోసరీలు, ఇతర వస్తువుల విషయంలో ఈ–కామర్స్ లావాదేవీలు పెరుగుతున్నట్టే... ఫార్మసీ రంగంలోనూ ఆన్లైన్ లావాదేవీలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. వచ్చే నాలుగేళ్లలో... అంటే 2023 నాటికి దేశీయంగా ఈ–ఫార్మసీల మార్కెట్ 18.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుందనేది కన్సల్టెన్సీ సంస్థ ఈవై (ఎర్నస్ట్ అండ్ యంగ్) అంచనా. స్మార్ట్‌ఫోన్స్ ద్వారా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం, ప్రాణాంతక వ్యాధులు.. వైద్య చికిత్స వ్యయాలు ఎక్కువవుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం కానున్నాయని ఈవై అభిప్రాయపడింది. ఈ నివేదిక మేరకు... ప్రస్తుతం ఈ–ఫార్మా సంస్థలకు అందు బాటులో ఉన్న మార్కెట్ పరిమాణం సుమారు 9.3 బిలియన్ డాలర్లు. ఇది వార్షికంగా 18.1% వృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుతుండటం.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం ద్వారా ఔషధాలను సులభతరంగా ఆర్డరు చేయగలుగుతుండటం వంటి అంశాలు ఈ–ఫార్మా మార్కెట్ వృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రాణాంతక వ్యాధులు, తలసరి ఆదాయం, వైద్య చికిత్స వ్యయాలు పెరుగుతుండటం సైతం ఈ–ఫార్మసీ మార్కెట్‌కు తోడ్పడుతోంది. ‘మొబైల్స్ వినియోగం పెరగటం, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు మెరుగుపడటం వంటి అంశాలతో భారత్‌లో ఈ–కామర్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ–కామర్స్‌లో భాగమైన ఆన్లైన్ ఫార్మసీలకు క్రమంగా ప్రాచుర్యం పెరుగుతోంది. వీటికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయి‘ అని ఈవై ఇండియా పార్ట్నర్ (ఈ–కామర్స్ అండ్ కన్జూమర్ ఇంటర్నెట్ విభాగం) అంకుర్ పహ్వా చెప్పారు. ప్రభుత్వ వ్యయాల తోడ్పాటు.. వైద్యంపై ఇటు ప్రభుత్వం అటు ప్రజలు చేసే వ్యయాలు గణనీయంగా పెరుగుతుండటం వచ్చే నాలుగేళ్లలో ఈ–ఫార్మసీ మార్కెట్ మరింతగా విస్తరించేందుకు దోహదపడనుందని ఈవై తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 35 శాతం ఫార్మా మార్కెట్ ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలది కాగా మిగతా 65 శాతం.. తీవ్ర అనారోగ్యాలకు సంబంధించినదిగా ఉంటోంది. ప్రాణాంతక వ్యాధుల ఔషధాల మార్కెట్లో 85 శాతం వాటాను, తీవ్ర అనారోగ్యాల ఔషధాల మార్కెట్లో 40 శాతాన్ని ఈ– ఫార్మసీలు లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదిక సూచించింది. స్థానిక ఫార్మసీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని నేరుగా ఇంటి దగ్గరకే ఔషధాలను అందించగలగడం ఈ– ఫార్మసీలకు దోహదపడవచ్చని పేర్కొంది. ఈ–ఫార్మా కంపెనీలు భారీమొత్తంలో డిస్కౌంట్లు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. లాభనష్ట రహిత స్థితికి రావాలన్నా, అర్థవంతమైన లాభాలు చూడాలన్నా డిస్కౌంట్లు సముచిత స్థాయిలకు రావాల్సిన అవసరం ఉందని నివేదిక వివరించింది. అంతర్జాతీయ సంస్థల దూకుడు.. రాబోయే రోజుల్లో ఈ–ఫార్మా వ్యాపార విభాగంలో అంతర్జాతీయ ఈ–కామర్స్ సంస్థలు మరింత దూకుడుగా కార్యకలాపాలు విస్తరించవచ్చని ఈవై నివేదిక వివరించింది. అంతర్జాతీయ అనుభవం, దేశీయంగా వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉండటం వాటికి తోడ్పడగలదని పేర్కొంది. ఫిన్‌టెక్, హెల్త్‌టెక్ సంస్థలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశించి తమ సేవల పరిధిని మరింతగా విస్తరించడానికి వీలుందని వివరించింది. డెలివరీ వ్యవస్థను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు హైపర్‌లోకల్ సంస్థలు (ఫుడ్ టెక్, నిత్యావసరాల విక్రయ సంస్థలు, కేవలం డెలివరీ మాత్రమే చేసే సంస్థలు) కూడా ఈ–ఫార్మా విభాగంపై దృష్టి పెట్టొచ్చని పేర్కొంది. -
ఫార్మసీ రంగంలో భారత్ ముందంజ
యూనివర్సిటీ : ఫార్మసీ రంగంలో భారత్ అమెరికా కంటే ముందంజలో ఉందని జేఎన్టీయూ ఇన్చార్జ్ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. ఓటీఆర్‌ఐ కేంద్రంలో ‘అవెర్నెస్ ఆన్ ఫారిన్ యూనివర్సిటీస్ కొలాబిరేషన్ ఫర్ ఫార్మసీ కోర్సెస్’ అంశంపై గురువారం నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటీఆర్‌ఐ సంస్థ పటిష్టత కొరకు వర్సిటీ కృషి చేస్తోందన్నారు. ఇందులో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఫార్మసీ విభాగం పరిశోధనల ద్వారా మానవాళికి ఉపయోగపడుతాయన్నారు. అనంతరం కీనోట్ స్పీకర్‌గా మాట్లాడిన డాక్టర్ ఎం.చంద్రశేఖర్, యూనివర్సిటీ ఆఫ్ ఫిండ్లే,ఓహియో మాట్లాడుతూ.. ఫార్మసీ రంగంలో ప్రపంచంలోని తక్కిన దేశాల కంటే నాణ్యమైన పరిశోధనలు ఉన్నాయని అభిలషించారు. ఓటీఆర్‌ఐ డెరైక్టర్ ఆచార్య కేబీ.చంద్రశేఖర్, ఆచార్య వి.శంకర్, డాక్టర్ ప్రసాద్, ప్రోగ్రాం కో కన్వీనర్ శ్రీనివాస కృష్ణ, కో ఆర్డినేటర్స్ సంధ్యారాణి, జి.నేత్రావణి, సి.తిరుమలేష్ నాయక్, బాలకృష్ణ, రంగానాయక్, శ్రీధర్ పాల్గొన్నారు. -
ఫార్మసీలో మాస్టర్స్.. కేరాఫ్ నైపర్
ఫార్మసీ కోర్సు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. కారణం.. మారుతున్న ప్రజల జీవన శైలి.. వెలుగు చూస్తున్న కొత్త వ్యాధులు.. వీటి నిర్మూలనకు అవసరమైన ఔషధాల తయారీ.. వాటి కోసం చేసే పరిశోధనలు.. ఈ క్రమంలో ఇమిడి ఉన్న ఎన్నో విభాగాలు.. వాటన్నింటిపై నైపుణ్యాలను అందించే కోర్సు.. ఫార్మసీ. ఫార్మసీ కోర్సులను అందించడంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ విద్యాసంస్థ... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్). హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు క్యాంపస్‌ల ద్వారా ఫార్మసీలో ఉన్నత విద్యనందిస్తున్న నైపర్లలో.. ప్రత్యేక ముద్ర వేసుకున్న నైపర్-హైదరాబాద్ క్యాంపస్‌పై ఇన్స్టిట్యూట్ వాచ్... దేశంలో ఫార్మసీ రంగంలో కొత్త ఔషధాల తయారీ.. పరిశోధనల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. 1998లో మొహాలీ ప్రధాన కేంద్రంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు రూపకల్పన చేసింది. ఆ తర్వాత క్యాంపస్‌ల విస్తరణలో భాగంగా 2007లో ప్రారంభమైన నైపర్-హైదరాబాద్ అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకుంటోంది. మౌలిక సదుపాయాలు మొదలు.. మెరుగైన పరిశోధనల వరకు అన్ని కోణాల్లో ప్రత్యేకత నిరూపించుకుంటోంది. మాస్టర్స్ కోర్సులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన నైపర్ ప్రధాన ఉద్దేశం.. ఫార్మసీలో ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్ది ఈ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించడం. ఈ క్రమంలో నైపర్-హైదరాబాద్‌లో మాస్టర్స్ (పీజీ) స్థాయిలో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. - ఎంఎస్ ఫార్మసీలో మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, రెగ్యులేటరీ టాక్సికాలజీ స్పెషలైజేషన్లు. - అదే విధంగా ఫార్మసీలో టెక్నాలజీ అంశాలను సమ్మిళితం చేస్తూ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ(ప్రాసెస్ కెమిస్ట్రీ) స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ను అందిస్తోంది. - దాంతోపాటు ఫార్మాస్యూటికల్ విభాగాల్లో నిర్వహణ నైపుణ్యాలు అందించే విధంగా ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సునూ ఆఫర్ చేస్తోంది. పరిశోధనలకూ ప్రాధాన్యం నైపర్-హైదరాబాద్ క్యాంపస్.. అకడెమిక్ కోర్సులకే పరిమితం కాకుండా.. పరిశోధనలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్ విభాగాల్లో నిరంతర పరిశోధనలు చేస్తోంది. దీనిలో భాగంగా స్పాన్సర్డ్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ ఆధారిత రీసెర్చ్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తోంది. 2009లో ప్రారంభమైన రీసెర్చ్ విభాగంలోని ఫ్యాకల్టీ ఇప్పటివరకు దాదాపు వందకుపైగా అంతర్జాతీయ పబ్లికేషన్స్ ప్రచురించడమే నైపర్-హైదరాబాద్‌లో ఆర్ అండ్ డీ ప్రాధాన్యతకు నిదర్శనం. వీటికి అదనంగా ఈ ఇన్స్టిట్యూట్ సొంతంగా సైంటిఫిక్ జర్నల్ ఆఫ్ నైపర్-హైదరాబాద్ పేరుతో ఫార్మా రంగంలోని తాజా పరిణామాలతోఇన్హౌస్ మ్యాగజైన్‌ను కూడా ప్రచురిస్తోంది. ఇలా అన్ని విధాలుగా విద్యార్థులకు తాజా సమాచారం, సరికొత్త అంశాలపై విసృ్తతమైన అవగాహన కల్పిస్తోంది. టాప్ క్లాస్ లేబొరేటరీ ఫార్మసీ విద్యలో నైపుణ్యం సాధించడంలో కీలక పాత్ర లేబొరేటరీలదే. దీనికి సంబంధించి డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్‌లో అవసరమైన సాంకేతిక సదుపాయాలు కలిగిన ఆధునిక లేబొరేటరీ నైపర్-హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ విధానంలో భాగంగా దేశవ్యాప్తంగా నెలకొన్న ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్లతో విద్యార్థులు అనుసంధానమయ్యే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులకు క్షేత్ర స్థాయిలోని తాజా పరిణామాలపై అవగాహన కలిగించేలా నిరంతరం జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. క్లాస్ రూం టీచింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. టీచర్- స్టూడెంట్ నిష్పత్తి 1:8 ఉండేలా వ్యవహరిస్తూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన బోధన లభించేందుకు కృషి చేస్తోంది. సగటున 80 శాతం ప్లేస్‌మెంట్స్ సాధారణంగా ఇన్స్టిట్యూట్, కోర్సు ఏదైనా విద్యార్థుల లక్ష్యం.. ఉన్నతమైన కెరీర్‌ను సొంతం చేసుకోవడం. ఈ విషయంలోనూ నైపర్-హైదరాబాద్ ముందంజలో నిలుస్తోంది. ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా సగటున 80 శాతం మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. అరబిందో ఫార్మా, రెడ్డీ ల్యాబ్స్ వంటి జాతీయ స్థాయి సంస్థలతోపాటు యూఎస్ ఫార్మాకోపియా, పెర్కిన్ ఎల్మర్ వంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కూడా ఏటా నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పాల్గొంటున్నాయి. ప్రవేశం పొందాలంటే నైపర్-హైదరాబాద్‌లోని పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే.. ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నైపర్-మొహాలీ ప్రతి ఏటా నిర్వహించే నైపర్-జేఈఈలో ర్యాంకు సాధించాలి. ఆ తర్వాత నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా నైపర్- క్యాంపస్‌లలో సీట్ల భర్తీ జరుగుతుంది. పీహెచ్డీ ఔత్సాహిక అభ్యర్థులు నైపర్ పీహెచ్డీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్‌లో అర్హత సాధించాలి. వెబ్సైట్: www.niperhyd.ac.in ఫార్మసీ కోర్సులకు చిరునామా ‘‘నైపర్ క్యాంపస్‌లు ఫార్మసీ కోర్సులకు చిరునామాలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ క్యాంపస్ వేగంగా విస్తరిస్తోంది. విద్యార్థులకు క్షేత్ర స్థాయి నైపుణ్యాలు సొంతమయ్యేందుకు నగర పరిసరాల్లో ఏర్పాటైన బల్క్ డ్రగ్ సంస్థలు, ఇతర డ్రగ్ డెవలప్మెంట్ సంస్థలు కూడా దోహదపడుతున్నాయి. అంతేకాకుండా పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా విద్యార్థులకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఇతర యూనివర్సిటీల్లోని పీజీ ఫార్మసీ కోర్సులతో పోల్చితే నైపర్ కరిక్యులం, బోధన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రాక్టికల్ ఓరియెంటేషన్, రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యమిచ్చేలా ఉండే కరిక్యులం ద్వారా విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునే సమయానికి ఫార్మసీ రంగంలో పరిపూర్ణత సాధిస్తారు. ఫార్మసీలో నాణ్యమైన మానవ వనరులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడినందున నైపర్‌లో ప్రవేశాలు కూడా జీప్యాట్ కాకుండా నైపర్-జేఈఈలో ర్యాంకు ఆధారంగా జరుగుతాయి’’ - ప్రొఫెసర్ ఎన్.సత్యనారాయణ, రిజిస్ట్రార్, నైపర్-హైదరాబాద్