బాలానగర్: ఫార్మసీ రంగంలో భారతదేశం ఎంతో పురోగతి సాధించిందని, ప్రస్తుతం విశ్వగురువుగా కూడా మారిందని కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి భగవత్ కూబా అన్నారు. శుక్రవారం బాలానగర్‌లోని నైపర్ 10వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల్లో పాలుపంచుకుని విజయం సాధించాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. కరోనా లాంటి కష్టకాలంలోనే మన ఫార్మసీలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయని అన్నారు.
2017 సంవత్సరంలో ప్రారంభమైన నైపర్ కేవలం 16 సంవత్సరాల కాలంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో అధునాతన అధ్యయనాలు, అభ్యాసానికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడటం మంచి పరిణామమన్నారు. ‘నా కెరీర్‌లో నాకెప్పుడూ గోల్డ్‌మెడల్ రాలేదు...కానీ నేను విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని’ ఆయన పేర్కొన్నారు.
లారస్ ల్యాబ్స్ చైర్మన్ చావా సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఫార్మా రంగంలోకి రావడానికి ఇదే సరైన సమయం అన్నారు. దేశ ఖ్యాతిని పెంచేలా విద్యార్థులు పనిచేయాలని కోరారు. అనంతరం స్నాతకోత్సవంలో 187 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అందులో 25 మంది పీహెచ్‌డీ, 162 మంది ఎంఎస్ (ఫార్మ్), ఎంబీఏ(ఫార్మ్) విద్యార్థులు ఉన్నారు. కార్యక్రమంలో నైపర్ హైదరాబాద్ డైరెక్టర్ డా.శశిబాలా సింగ్, డీన్ డా.ఎం. శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ గణనాథం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment