
జీఐ ట్యాగ్ రేసులో బాలానగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపు
అధ్యయనానికి ఉద్యాన వర్సిటీ ప్రత్యేక బృందం
మరో 20 రోజుల్లో దరఖాస్తు.. జీఐ ట్యాగ్ లభిస్తే రైతులకు అధిక ఆదాయం
తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు జీఐ ట్యాగ్ రేసులో పోటీ పడుతున్నాయి. తాజాగా వరంగల్ చపాటా మిర్చి ఆ జాబితాలో చేరింది. ఇప్పుడు బాలానగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపు రేసులో నిలుస్తున్నాయి. బాలానగర్ అడవుల్లో పుట్టిన సీతాఫలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
సాక్షి, సిద్దిపేట: చపాటా మిర్చి బాటలో మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) తెచ్చేందుకు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇదివరకే తాండూరు కంది పప్పునకు జీఐ గుర్తింపు రాగా, తాజాగా వరంగల్ చపాటా మిర్చి చేరింది.
ఈ నేపథ్యంలో నాబార్డు సహకారంతో బాలానగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపునకు జీఐ ట్యాగ్ కోసం ఉద్యాన వర్సిటీ త్వరలో దరఖాస్తు చేయనుంది. దేశవ్యాప్తంగా 697 ఐటమ్స్‌కు జీఐ ట్యాగ్ ఉండగా.. అందులో 198 వ్యవసాయ ఉత్పత్తులున్నా యి. వాటిలో పది రకాల మిర్చీలకు జీఐ ట్యాగ్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులకు జీఐ సాధించేందుకు ఉద్యాన వర్సిటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాన్ని నియమించింది.
అధ్యయనం మరింత ముమ్మరం
చపాటా మిర్చికి జీఐ నంబర్ కేటాయించడంతో బాలానగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపుపై అధ్యయనాన్ని మరింత ముమ్మరం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సీతాఫలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రుచి, నాణ్యతకు పేరొందిన ఆ సీతాఫలాలు ఇక్కడి నుంచి ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు.
బాలానగర్ అడవుల్లో పుట్టిన సీతాఫలం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు విస్తరించింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం పోమల్ గ్రామంలోని పోమల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో మరో 20 రోజుల్లో జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేయనున్నారు.
ఆర్మూర్ పసుపు కోసం..
ఆర్మూరు పసుపునకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజామాబాద్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన పంటగా పసుపు సాగుచేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మొక్క ప్రత్యేక లక్షణాలు, సాగు విస్తీర్ణం, ఆ ప్రాంత భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై సమాచారం సేకరిస్తున్నారు. జీఐ ట్యాగ్ పొందితే ఎగుమతులు పెరిగే అవకాశముంది. ఈ రెండు ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం నియమించిన బృందంలో ముఖ్యంగా ప్రధాన పరిశోధకులు డాక్టర్ పిడిగం సైదయ్య, శాస్త్రవేత్త మహేందర్ ఉన్నారు. త్వరలో కొల్లాపూర్ మామిడి, జగిత్యాల పొడుగు బీరకాయలు, నల్లగొండ పచ్చడి దోసకాయలు, నిజామాబాద్ గుత్తి బీరకాయలకు సైతం జీఐ ట్యాగ్ కోసం కసరత్తు ప్రారంభించనున్నారు.
జీఐతో అనేక లాభాలు
భౌగోళిక గుర్తింపు వస్తే ఆయా ఉత్పత్తులకు న్యాయపరమైన రక్షణ ఉంటుంది. జీఐ లభిస్తే మార్కెట్‌లో ఆ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. పండించే రైతులకు కూడా అధిక ఆదాయం వస్తుంది. – డాక్టర్ దండా రాజిరెడ్డి, వైస్‌చాన్స్‌లర్, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వర్సిటీ