GI tag
-
వరంగల్ చపాట మిర్చికి జీఐ ట్యాగ్
సాక్షి, వరంగల్/సిద్దిపేట: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండిస్తున్న చపాట మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (జీఐ ట్యాగ్) లభించింది. ఇప్పటికే తెలంగాణ నుంచి పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, హైదరాబాద్ హలీమ్తోపాటు మరికొన్ని ప్రత్యేక ఉత్పత్తులు జీఐ గుర్తింపు దక్కించుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో దేశంలోని తీపి మిర్చి రకాల్లో ఒకటైన చపాట మిరప చేరింది.చపాట మిరపకు జీఐ ట్యాగ్ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేయగా.. ఇండియన్ పేటెంట్ ఆఫీస్ (ఐపీవో) తాజాగా ఆమోదించింది. ‘జియోగ్రాఫిక్ ఇండికేషన్స్ జర్నల్’ లోనూ చపాట రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. రెండేళ్ల క్రితం చపాట మిర్చికి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.లక్ష వరకు ధర పలికింది. తక్కువ ఘాటుతో ఎర్రని టమాటా పండులాంటి రంగు కలిగి ఉండటం ఈ మిర్చి ప్రత్యేకత. అందుకే దీనిని టమాటా మిర్చి అని కూడా పిలుస్తారు. -
మన ముత్యానికి మెరుపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకే ప్రత్యేకమైన పలు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ –జీఐ) సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఆహారం, హస్తకళలు, వంగడాలు తదితర 17 రకాల ఉత్పత్తులకు ఇప్పటికే జీఐ గుర్తింపు లభించింది. ఇప్పుడు మరిన్ని ఉత్పత్తులకు జీఐ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ జాబితాలో హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కలంకారీ, వరంగల్ మిర్చి తదితర ఉత్పత్తులు ఉన్నాయి. వీటికి జీఐ గుర్తింపు కోసం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని ‘కం్రప్టోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్’విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు సమర్పించింది. 30 ఉత్పత్తులకు జీఐ ట్యాగింగ్ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీఐ ట్యాగింగ్ జాబితాలో తెలంగాణకు చెందిన ఉత్పత్తులకు పెద్దగా చోటు దక్కలేదు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో జీఐ టాగింగ్ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కనీసం 30 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ దక్కేలా చూడాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కళంకారీ, వరంగల్ చపాటా మిర్చీకి గుర్తింపు ఇవ్వాలని దరఖాస్తు చేసింది. వరంగల్ చపాటా మిర్చీ తరహాలోనే ఖమ్మం మిర్చికి కూడా జీఐ టాగింగ్ ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు కోరింది. తెలంగాణకు చెందిన ప్రత్యేక ఉత్పత్తుల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు జీఐ టాగింగ్ నోడల్ అధికారి శ్రీహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. – ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 17 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ లభించింది. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ వెండి ఫిలిగ్రీ, నిర్మల్ కొయ్య బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హలీమ్, చేర్యాల పెయింటింగ్స్, పెంబర్తి ఇత్తడి కళాకృతులు, సిద్దిపేట గొల్లభామ చీరలు, బంగినపల్లి మామిడి, పోచంపల్లి ఇక్కత్ లోగో, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీస్, తేలియా రుమాల్, లక్క గాజులకు జీఐ గుర్తింపు లభించింది. – జీఐ చట్టం 1999 ప్రకారం భౌగోళిక ప్రత్యేకత, నాణ్యత, ప్రాముఖ్యత తదితరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వాటికి జీఐ గుర్తింపు ఇస్తారు. వారసత్వ, సాంస్కృతిక సంపదను కాపాడటం, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం, ఉత్పత్తుల నాణ్యత, ప్రత్యేకతను పరిరక్షించడం, ఉత్పత్తులను నకలు కొట్టకుండా నిరోధించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడం జీఐ టాగింగ్ లక్ష్యం. -
చపాటా మిర్చికి త్వరలో జీఐ ట్యాగ్!
సాక్షి, సిద్దిపేట: ఒక ప్రాంతంలో పండించే పంటలకు, ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభిస్తుంది. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 17 రకాల ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందాయి. మరిన్ని ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో త్వరలో వరంగల్ చపాటా మిర్చికి జీఐ గుర్తింపు లభించే అవకాశం ఉంది. వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూగెం, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో చపాటా మిర్చిని పండిస్తున్నారు.సుమారు 7 వేల ఎకరాల్లో దీని సాగు జరుగుతోంది. పంటను వరంగల్, ఖమ్మం, గుజరాత్, ముంబై, ఆహ్మదాబాద్ మార్కెట్లకు తరలించి అక్కడి నుంచి వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, ఇంగ్లండ్, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆహారంలో కృత్రిమ రంగును నిషేధించిన దేశాల్లో ఈ చపాటా మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంది. కృత్రిమ రంగులకు ప్రత్యామ్నాయంగా ఈ చపాటా మిర్చిని ఉపయోగిస్తారు. ఇందులో నుంచి ఓల్యూరోసిస్ అనే ఎరుపు రంగు ద్రావణాన్ని తీసి ఫుడ్ కలర్‌గా వినియోగిస్తారు. మన దగ్గర వీటిని ఎక్కువగా పచ్చళ్ల తయారీలో వినియోగిస్తారు.తిమ్మంపేట చిల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ నర్సంపేట, వరంగల్, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ పంటకు జీఐ ట్యాగ్ కోసం 2022లో దరఖాస్తు చేశాయి. ఎంత మంది రైతులు దీనిని పండిస్తున్నారు. దీని వలన లాభాలు తెలుపుతూ పలు అంశాలతో కూడిన నివేదికను చెన్నైలోని జీఐ కార్యాలయంలో అందజేశారు. ఈ క్రమంలో ఈ నెలలో రైతులతో చెన్నైలో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. సాగు విధానం, ఉపయోగాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే చపాటా మిర్చికి జీఐ ట్యాగ్ లభించే అవకాశం ఉంది. సాధారణ మిర్చిని క్వింటాల్ రూ.8 వేల నుంచి రూ.18 వేల వరకు విక్రయిస్తుండగా..చపాటా మిర్చి రూ.30 వేల నుంచి 35 వేలు పలుకుతుంది.మరికొన్ని పంటలకు కూడా..⇒ ఆర్మూరు పసుపునకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి జీఐ ట్యాగ్ సాధించేందుకు తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందుకు నాబార్డు సహకరిస్తోంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు. జీఐ ట్యాగ్ పొందితే ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయి. అధిక ధరలు పలకడంతో రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. ఇక రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సీతాఫలాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు. దీనికి జీఐ ట్యాగ్ కోసం కూడా ఉద్యాన వర్సిటీ కసరసత్తును ప్రారంభించింది. వర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. అలాగే కొల్లాపూర్ మామిడి, జగిత్యాల పొడుగు బీరకాయలు, నల్లగొండ పచ్చడి దోసకాయలు, నిజామాబాద్ గుత్తి బీరకాయలు సైతం జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు ప్రక్రియలో ఉన్నాయి. ప్లాంట్ అథారిటీలో నల్లగొండ పచ్చడి దోసకాయను నమోదు చేయించేందుకు ఉద్యాన వర్సిటీ దరఖాస్తు చేయించింది. నమోదు జరిగితే ఈ దోసకాయకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది.జీఐ ట్యాగ్ ఉన్న 17 ఉత్పత్తులివే..పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ ఫిలిగ్రీ, గద్వాల చీరలు, నిర్మల్ బొమ్మలు, చేర్యాల నకాశి కళ, నిర్మల్ ఫర్నిచర్, నారాయణపేట చీరలు, పుట్టపాక తేలియా రుమాలు, గొల్లభామ చీరలు, ఆదిలాబాద్ డోక్రా ఇత్తడి బొమ్మలు, వరంగల్ డర్రీస్, నిర్మల్ చిత్రాలు, తాండూరు కందిపప్పు, పాతబస్తీ లక్కగాజులు, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, బంగినపల్లి మామిడి ఉన్నాయి.ఎన్నో ప్రయోజనాలుజీఐ ట్యాగ్‌తో పంటల ఎగుమతులు పెరిగేందుకు, అధిక ధరలు లభించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకు మేలు జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పతుంది. ఈ ఉత్పత్తులను ఇతరులు అనధికారికంగా ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. – నీరజ ప్రభాకర్, వీసీ, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం -
కుండలు చేసే ఊరు
ప్రతి ఊరిలో కుండలు చేస్తారు. కాని కుండలు చేయడానికి మాత్రమే ఒక ఊరు ప్రసిద్ధం అయ్యింది.అదే తమిళనాడులోని ‘మనమదురై’.అక్కడ పారే వైగై నది తెచ్చే ఒండ్రు మట్టితో తయారయ్యే ఈ కుండలు చల్లదనానికి ప్రతీకలు. స్త్రీలు ఈ కుండల తయారీలో సరి సమాన శ్రమ చేస్తారు. ఘటాలు కూడా తయారు చేస్తారు. ఈ కుండల ప్రత్యేకత వల్ల వీటికి ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్’ (జిఐ) ట్యాగ్ దక్కింది. వేసవి రాగానే కుండలు గుర్తుకొస్తాయి. ప్రతి ఇంటిలో కుండలోని చల్లటి నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. ఫ్రిజ్‌లోని నీళ్లలో ఉండే కృత్రిమ చల్లదనం కుండ నీళ్లలో ఉండదు. అందుకే కొత్త కుండలు వేసవిలో ప్రతి ఇంటికి చేరుతాయి. చలివేంద్రాలు పెట్టేవారు పెద్ద పెద్ద కుండలు కొని దాహార్తి తీర్చి పుణ్యం కట్టుకుంటారు. పక్షులకు నీరు పెట్టాలనుకునేవారు మట్టి పాత్రల్లో నీళ్లు నింపి పెడతారు. ఒకప్పుడు పల్లెల్లో పాలకుండ, పెరుగు కుండ, నెయ్యి కుండ ఉండేవి. పెరుగు కుండలో తోడు పెడితే చాలా రుచి. స్టీలు, ప్లాస్టిక్ దెబ్బకు కుండలు కొన్నాళ్లు వెనుకబడినా మళ్లీ ఇప్పుడు ఆరోగ్యస్పృహ వల్ల పుంజుకున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక కుండలకు గిరాకీ తగ్గలేదు. వాటిలో మనమదురై కుండలు మరీ ప్రత్యేకం. కుండల ఊరు తమిళనాడులోని శివగంగ జిల్లాలోని చిన్న ఊరు మనమదురై. యాభై వేల జనాభా ఉంటుంది. ఇది మదురై నుంచి 60 కిలోమీటర్ల దూరం. ఇక్కడ పారే వైగై నది ఈ ఊరికి ఇచ్చిన అనుకోని వరం కుండలు తయారు చేయడానికి అవసరమైన ఒండ్రుమట్టి. నది ఒడ్డు నుంచి తెచ్చుకున్న ఒండ్రుమట్టి కాల్షియం లైమ్, బూడిద, సోడియం సిలికేట్, మాంగనీస్, ఐరన్ మిశ్రమాలను కలిపి కుండలు తయారు చేస్తారు. మనమదురై కుండను గుర్తించడం ఎలా అంటే దాని అడుగు పరిపూర్ణమైన గుండ్రంగా ఉంటుంది. అదే సమయంలో నేల మీద సరిగ్గా కూచుంటుంది. ఈ కుండల తయారీలో పంచభూతాలు ఉంటాయి అంటారు ఈ ఊరి వాళ్లు. నేల, నీరు, అగ్ని తయారీలో ఉపయోగిస్తే మట్టిలోని సూక్ష్మరంధ్రాలు గాలి రాకపోకలను సూచిస్తాయి. కుండ లోపలి ఖాళీ (శూన్యం) ఆకాశాన్ని సూచిస్తుంది. వేసవి కోసం ఇక్కడ విశేష సంఖ్యలు కుండలను స్త్రీ, పురుషులు కలిసి తయారు చేస్తారు. కుటుంబాలన్నీ కుండల మీదే ఆధారపడి బతుకుతాయి. వీటికి ఎంత డిమాండ్ ఉన్నా దూర్రపాంతాలకు పంపడం ఖర్చుతో, రిస్క్‌తో కూడుకున్న పని. కుండలు పగిలిపోతాయి. అందుకే స్థానికంగా తప్ప ఇవి ఎక్కువగా దొరకవు. ఘటం ఎలా తయారు చేస్తారు? మనమదురై కుండలకే కాదు ఘటాలకు కూడా ప్రసిద్ధి. నీరు పోస్తే కుండ. సంగీతం పలికిస్తే ఘటం. కాని అది సంగీతం పలికించాలంటే కొంచెం ప్రత్యేకంగా తయారు చేయాలి. మనమదురై ఘటాలు చాలా ప్రసిద్ధి. ఇక్కడ మీనాక్షి కేశవన్ అనే మహిళ ఘటాలు తయారు చేయడంలో ఖ్యాతి ΄÷ందింది. పెద్ద పెద్ద విద్వాంసులు ఆమె తయారు చేసిన ఘటాలనే వాయించేవారు. ఘటం తయారు చేయాలంటే కుమ్మరి చక్రంపై కుండ తయారయ్యాక ఒక రోజు ఉంచేస్తారు. మర్నాడు దానిని ప్రత్యేక చెక్కమెత్తతో మెత్తుతారు. ఒక పచ్చికుండ కాల్చడానికి ముందు ఘటంగా మారాలంటే ఆ కుండలోని ప్రతి అంగుళాన్ని మెత్తాలి. అలా 3000 సార్లు మెత్తి ఆ తర్వాత కాల్చుతారు. అప్పుడే ఘటం తయారవుతుంది. ఇది ఓపికతో కూడిన పని కాబట్టి స్త్రీలు ఎక్కువగా చేస్తారు. వీటి కోసం వేల కిలోమీటర్ల నుంచి వచ్చి కొనుక్కెళ్లేవారు ఉన్నారు. కుండలు చేసే కుటుంబాలు ఉన్నా ఘటాలు చేసే కుటుంబాలు అంతరించి పోతున్నాయని ఇటీవల సాంస్కృతిక, సంగీత అభిమానులు క్రౌడ్ ఫండింగ్ చేసి ఘటాల తయారీని పునరుద్ధరించేలా చూశారు. -
ఆ వెల్లుల్లికి జీఐ ట్యాగ్!
మధ్యప్రదేశ్‌లోని రియావాన్ గ్రామానికి చెందిన వెల్లుల్లికి జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్ లభించింది. రియాన్ వెల్లులి జీఐ నమోదు కోసం చెన్నైలోని రైతు ఉత్పత్తుల సంస్థ(ఎఫ్‌పీఓ) రియావాన్ ఫార్మ్ ఫ్రెష్ ప్రొడ్యూసర్ కంపెనీ జనవరి 2022 నుంచి ప్రారంభించింది. ఉద్యానవన శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం జిల్లా పరిపాలన సహకారంతో మార్చి 2న రియాన్ వెల్లుల్లి ఈ జిఐ ట్యాగ్‌ని పొందింది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యే పాండే, వ్యవసాయమంత్రి, ముఖ్యమంత్రి అభ్యర్థనలు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో ఆ వెల్లుల్లి ఈ ప్రతిష్టాత్మక ట్యాగ్‌ని పొందగలిగింది. ఈ వెల్లుల్లి ప్రత్యేకత.. ఈ వెల్లుల్లి ప్రతి రెమ్మ లవంగంతో సరిపడ ఘాటు ఉంటుంది. దీనిలో అధిక నూనె ఉంటుంది. ఈ వెల్లుల్లిని రియావాన్ సిల్వర్ గార్లిక్ అని కూడా పిలుస్తారు. దేశంలోనే అత్యధిక డిమాండ్ కలిగిన వెల్లుల్లి ఇది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఇతర వెల్లుల్లిపాయల కంటే మంచి సువాసనతో కూడిన ఘాటు ఉంటుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ గ్రామస్తులు దశాబ్దాలుగా ఈ వెల్లుల్లిని సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తుండటం విశేషం. పొరగు ప్రాంతా వారు ఇక్కడ రైతుల నుంచి రియావాన్ వెల్లుల్లి విత్తనాలను పట్టుకెళ్తుంటారు. నాణ్యతకు, అధిక దిగుబడికి పెట్టింది పేరు ఈ వెల్లుల్లి (చదవండి: మొక్కలతో భారత్ మాత అని రాసి గిన్నిస్ రికార్డు!) -
స్పైసీ స్పైసీ ఎర్ర చీమల చట్నీ: ఇక వరల్డ్ వైడ్‌గా మారు మోగనుంది
చీమల పచ్చడి గురించి ఎపుడైనా విన్నారా? ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్, ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోనూ ఇది ఫ్యామస్. రుచికరమైన చట్నీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలున్నాయని తాజాగా పరిశోధకులు తేల్చారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌తో సహా జిల్లాలోని ప్రతి బ్లాక్ ఏరియాలోని అడవులలో ఏడాది పొడవునా సమృద్ధిగా కనిపిస్తాయి. ఒడిశాలోని మయూర్భంజ్ ప్రజలు దీన్ని విరివిగా వాడతారు. వీరు తయారు చేసే స్పైసీ స్పైసీ రెడ్ యాంట్ చట్నీకి ఇప్పటికే భిన్నమైన గుర్తింపు లభించడంతో పాటు ఇపుడిక జీఐ ట్యాగ్ కూడా అందుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో రెడ్ యాంట్ చట్నీ ఇక వరల్డ్ వైడ్‌గా గుర్తింపును తెచ్చుకోనుంది. మయూర్భంజ్ రెడ్ యాంట్ చట్నీకి GI ట్యాగ్ మయూర్భంజ్లోని రెడ్ చట్నీపై చేసిన పరిశోధనలో, శాస్త్రవేత్తలు రెడ్ వీవర్ చీమలను విశ్లేషించారు. ఇందులో ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ బి-12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, అమినో యాసిడ్లు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పోషకాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులను నివారించవచ్చని గుర్తించారు. రెండ్ యాంట్ చట్నీ కేవలం రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దాని వైద్యపరమైన లక్షణాల కారణంగా ఇది స్థానిక ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతితో ముడిపడి ఉన్న ప్రజల పోషకాహార భద్రతకు ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. స్థానికుల విశ్వాసంతో పాటు, ఈ చట్నీలోని ఔషధ గుణాలను నిపుణులు ఇప్పటికే గుర్తించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిని తగ్గించడానికి, కంటి చూపు, కీళ్ల నొప్పులు, ఆరోగ్యకరమైన మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుందని తేల్చిన సంగతి తెలిసిందే. ఈ చీమల నుండి తయారుచేసిన సూప్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందట. స్థానికంగా చాప్ డా అని పిలిచే ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎర్ర చీమల చట్నీ ఎలా తయారు చేస్తారంటే ఈ రెడ్ వీవర్ చీమలను వాటి గుడ్లతో పాటు గూళ్ళ నుండి సేకరించి శుభ్రం చేస్తారు. దీని తరువాత, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, కారం కలిపి, గ్రైండ్ చేయడం ద్వారా చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ కారం..కారంగా , పుల్లగా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది. స్థానిక గిరిజనులు తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఇందులోని ప్రొటీన్, కాల్షియం, ఫామిక్ యాసిడ్, ఇతర పోషక గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మారుమూల గిరిజనవాసులకు ఎంతో మేలు చేస్తాయి. ఈ చట్నీ మలేరియా, కామెర్లు తదితర కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేస్తుందని స్థానిక గిరిజనుల విశ్వాసం. అలాగే కొలంబియా, మెక్సికో, బ్రెజిల్‌లోనూ చీమలను ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే OUAT బృందం 2020లో శాస్త్రీయ ఆధారాలతో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపుకోసం చేసిన ప్రయత్నం ఫలించింది. -
ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం.. ఫలించిన మూడేళ్ల కృషి
ఒక్కో ప్రాంతానికి వేరువేరు ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన రుచులు ఉంటాయి. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలకు వంటల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆత్రేయపురం పూతరేకులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్.. పూతరేకులకు పుట్టిల్లుగా ఉంది ప్రస్తుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం. పూతరేకు అనగానే ఆత్రేయపురం గుర్తుకు వస్తుంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆత్రేయపురం పూతరేకులకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఆత్రేయపురం అంటే గుర్తుకు వచ్చేది పూతరేకు. పూతరేకు అంటే గుర్తుకువచ్చేది ఆత్రేయపురం. ఈ రెండింటి మధ్య అంత బంధం ఉంది. తాజాగా ఆ బంధం మరింత బలపడింది. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిటీ)తో ఆత్రేయపురం కీర్తి జాతీయ స్థాయికి చేరింది. తరతరాలుగా వారసత్వ సంపదగా వస్తున్న పూతరేకుల తయారీలో ఈ ఊరికే పూర్తిస్థాయి గుర్తింపు..హక్కులు ఉన్నాయని తేలింది. ఈ నెల 15న విశాఖపట్నం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ప్రాంగణంలో ఆత్రేయపురం పూతరేకులకు గ్లోబల్ ఇండికేషన్ ట్యాగ్ సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు. నాలుగు శతాబ్దాల పేద మహిళల నైపుణ్యం, కష్టానికి గుర్తింపు దక్కే అపూర్వ సన్నివేశం ఆరోజు ఆవిష్కారం కానుంది. జీఐ కోసం ఎంతో కృషి తమ ఊరితో ఇంతగా అనుబంధాన్ని పెనవేసుకున్న పూతరేకుకు భౌగోళిక గుర్తింపు రావాలని ఆత్రేయపురం వాసులు చాన్నాళ్లుగా కోరుకుంటున్నారు. మూడేళ్లుగా ఇందుకోసం గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్ధర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల సంక్షేమ సంఘంతోపాటు మరికొందరు ఈ ప్రయత్నాల్లో పాలుపంచుకున్నారు. విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలోని ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ విభాగం ఆధ్వర్యంలో లా స్టూడెంట్స్ వీరికి కృషికి తోడయ్యారు. ఆత్రేయపురం వచ్చి పూతరేకుకూ ఈ గ్రామానికి ఏర్పడిన విడదీయరాని బంధానికి సంబంధించి వివిధ ఆధారాలను సేకరించారు. ఉపాధిగా మారి ఎగుమతుల స్థాయికి చేరిన ఈ ఆహార ఉత్పత్తిపై డాక్యుమెంట్లను తయారు చేశారు. 2021 డిసెంబర్ 13న చైన్నెలోని జియో ఐడెంటిటీ కార్యాలయానికి అధికారికంగా దరఖాస్తును సమర్పించారు. కొద్ది నెలల అనంతరం చైన్నె కార్యాలయంలో దరఖాస్తు ప్రాసెస్ మొదలైంది. ఆధారాలతో సహా హాజరుకావాలని ఇక్కడివారికి ఆహ్వానం అందింది. ఆత్రేయపురం నుంచి ఏడుగురు సభ్యులు జీఐ కార్యాలయానికి వెళ్లారు. వివిధ రంగాలకు చెందిన తొమ్మిది మంది నిపుణులు వీరిని లోతుగా ప్రశ్నించారు. సమాధానాలు రాబట్టారు. ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా హాజరైన ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన గోనెల రాజేంద్రప్రసాద్ జీఐ అధికారుల ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వగలిగారు. దీంతో వారు సంతృప్తి చెందారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న జీఐ జర్నల్ ఆత్రేయపురం పూతరేకుల గురించి ప్రచురించింది. దీనిపై అభ్యంతరాలుంటే 120 రోజుల్లో తెలియజేయాలని సూచించింది. ఈ గడువు జూన్ 13వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీంతో ఆత్రేయపురం వాసుల కల నెరవేరింది. భౌగోళిక గుర్తింపు(GI) లభించింది. -
గొల్లభామ చీరలు.. ఇంటి నుంచే కొనేయచ్చు
సాక్షి, హైదరాబాద్: చేనేత వస్త్రాల్లో సిద్దిపేట గొల్లభామ చీరలది ప్రత్యేకమైన స్థానం. ఇకపై ఆ చీరలు కొనాలంటే సిద్దిపేటకు వెళ్లక్కర్లేదు. మరేషాప్కి పోనక్కర్లేదు. ఇంట్లో ఉండే ఏంచక్కా ఆ చీరలను పొందవచ్చు. పోస్టల్ శాఖకు చెందిన ఈ షాప్ పోర్టల్ ద్వారా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ చీరలను బుక్ చేసుకుని హోం డెలివరీ పొందవచ్చు. ఈ షాప్ జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్కలిగిన తెలంగాణ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్లతోపాటు ఆ శాఖ ఈ కామర్స్ వెబ్‌పోర్టల్ ‘ఈ–షాప్’ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. తెలంగాణలోని హస్తకళల ఉత్పత్తులు, జీఐ ట్యాగ్ ఉత్పత్తుల విక్రయాల కోసం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఏచ్పాటు చేసిన ప్రత్యేక ఈ కామర్స్ పోర్టల్ (www.eshop.tsposts.in) ను గవర్నర్ తమిళసై ప్రారంభించారు. ఈ సేవలను ప్రవేశపెట్టడంలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ చేసిన కృషిని గవర్నర్ అభినందించారు. నిర్మల్ కొయ్యబొమ్మలు, వరంగల్ రగ్గులు, నారాయణపేట చేనేత చీరలు, హైదరాబాద్ హలీమ్, సిద్దిపేట గొల్లభామ చీరలపై రూపొందించిన పోస్టల్ కవర్లను గవర్నర్ తాజాగా ఆవిష్కరించారు. ప్రస్తుతం జీఐ ట్యాగ్‌కి సంబంధించి గొల్లభామ చీరలు ఈ షాప్‌లో అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ కవర్లు భౌగోళికంగా ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తులకు సంబంధించిన మేధోపరహక్కుల పరిరక్షణ కోసం వాటికి జీఐ ట్యాగ్ హోదాను కల్పిస్తున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన 13 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ హోదా లభించగా, ఇందులో ఐదు ఉత్పత్తులపై ప్రత్యేక పోస్టర్ కవర్లను పోస్టల్ శాఖ తీసుకొచ్చింది. -
క్రేజీ ఫుడ్డు.. బందరు లడ్డు
సాక్షి, మచిలీపట్నం: బెల్లం తునక.. బంగారు పుడక (శనగ పిండితో చేసే సన్నపూస) కలిస్తే బందరు లడ్డూ రెడీ అవుతుంది. సై అనడమే ఆలస్యం. సరసకు చేరిపోతుంది. నోట్లో వేయగానే నేతిని ఊరిస్తూ తీయగా గొంతులోకి జారిపోతుంది. తోక గోధుమ పాలు, బెల్లం పాకం కలగలిస్తే నల్ల హల్వా ప్రత్యక్షమవుతుంది. తియ్యటి రుచుల్ని భలే పంచుతుంది. నిన్నమొన్నటి వరకు తెలుగు ప్రాంతాలకే పరిమితమైన ఈ క్రేజీ వంటకాలు ఇప్పుడు భౌగోళిక గుర్తింపును సొంతం చేసుకుని ప్రపంచ దేశాల్ని చుట్టేస్తున్నాయి. బందరు ఖ్యాతిని దశ దిశలా చాటుతున్నాయి. ఇలా మొదలైంది క్రీస్తు శకం 17వ శతాబ్దం చివరిలో బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి బందరుకు వలస వచ్చిన మిఠాయి వ్యాపారి బొందలి రామ్‌సింగ్ సోదరులు బెల్లపు తొక్కుడు లడ్డూ, నల్ల హల్వాను ఈ ప్రాంత వాసులకు పరిచయం చేశారు. వారి నుంచి మిఠాయి తయారీ విధానాన్ని అందిపుచ్చుకున్న బందరు వాసులు కశిం సుబ్బారావు, విడియాల శరభయ్య, శిర్వశెట్టి రామకృష్ణారావు (రాము), శిర్విశెట్టి సత్యనారాయణ (తాతారావు), గౌరా మల్లయ్య తదితరులు లడ్డూ, హల్వా ప్రాశస్త్యాన్ని కాపాడుకుంటూ విశ్వవ్యాప్తం చేశారు. తయారీయే ప్రత్యేకం లడ్డూ తయారీకి కనీసం 12 గంటల సమయం పడుతుంది. ఇందులో శనగపిండి, బెల్లం, నెయ్యి, పటిక బెల్లం, యాలకుల పొడి, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, బాదం పప్పు వినియోగిస్తారు. తొలుత శనగ పిండిని నీట్లో కలిపి నేతి బాండీలో కారప్పూస మాదిరిగా పోస్తారు. అలా వచ్చిన పూసను ఒకపూట ఆరబెట్టి రోకలితో దంచి పొడి చేస్తారు. ఆ పొడిని శుద్ధమైన బెల్లం పాకంలో వేసి లడ్డూ తయారీకి అనువుగా మారేంత వరకు కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కొంతసేపు ఆరబెట్టి మళ్లీ రోకళ్లతో దంచుతూ మధ్య మధ్యలో నెయ్యి దట్టిస్తారు. ఒకరు పిండిని తిప్పుతుండగా మరొకరు రోకలితో మిశ్రమాన్ని దంచి జీడిపప్పు, యాలకుల పొడి, పటిక బెల్లం ముక్కలు కలుపుతారు. ఈ మిశ్రమం లడ్డూ తయారీకి అనువుగా మారిన తర్వాత రెండుగంటలు ఆరబెట్టి చెక్క బల్లపై ఒత్తుతూ తగినంత సైజులో లడ్డూలు చుడతారు. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. నేతి హల్వా తయారీలో తోక గోధుమలను వినియోగిస్తారు. వాటిని రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు పిండిగా రుబ్బి.. దాని నుంచి పాలు తీస్తారు. దశల వారీగా బెల్లం పాకంలో పోస్తూ కలియ తిప్పతారు. దానిని పొయ్యి నుంచి దించే అరగంట ముందు తగినంత నెయ్యి పోస్తారు. ఆ తర్వాత సరిపడా జీడిపప్పును దట్టించి ప్రత్యేక ట్రేలలో పోసి 24 గంటల పాటు ఆరబెడతారు. ఈ హల్వా రెండు నెలలు నిల్వ ఉంటుంది. దేశ విదేశాలకు ఎగుమతులు బృందావన మిఠాయి వర్తక సంఘం పరిధిలో 50 మందికి పైగా వ్యాపారులు బందరు లడ్డూ, హల్వా విక్రయిస్తున్నారు. వీరి వద్ద వెయ్యి మందికి పైగా పని చేస్తుండగా, వారిలో 200 మందికి పైగా మహిళలు. బందరు బెల్లపు తొక్కుడు లడ్డూ పరిశ్రమకు 2017లో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ విభాగం భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్) ఇచ్చింది. సంఘం తరఫున మల్లయ్య స్వీట్స్‌కు పేటెంట్ హక్కు (పార్ట్–బి) లభించింది. దీంతో ప్రపంచ దేశాలకు బందరు లడ్డూ, హల్వా ఎగుమతులు భారీగా పెరిగాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, లండన్, దుబాయ్, కువైట్, బాగ్దాద్ వంటి దేశాలకు నిత్యం ఎగుమతి అవుతున్నాయి. జీఐ గుర్తింపు రావడం గర్వకారణం మా నాన్న మల్లయ్య తోపుడు బండిపై తిరుగుతూ లడ్డూ అమ్మేవారు. ఆయన వారసులుగా 1993లో మేం ఈ రంగంలోకి అడుగు పెట్టాం. బందరు లడ్డూకు భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించాలన్న పట్టుదలతో సంఘం తరఫున కృషి చేశాం. బందరు వాసి, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎం గోనెల అవిశ్రాంత కృషి ఫలితంగానే బందరు లడ్డూకు జీఐ సర్టిఫికెట్ లభించింది. – గౌరా వెంకటేశ్వరరావు, బందరు లడ్డూల తయారీదారు -
‘పళని’ పంచామృతానికి జీఐ గుర్తింపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పళని పంచామృతానికి జీఐ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని జియోగ్రాఫిక్ ఇండెక్షన్ డిప్యూటీ రిజిస్ట్రార్ చిన్న రాజ్ చెప్పారు. దిండుగల్ జిల్లా పళనిలో దండాయుధపాణి స్వామిగా వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. పళని అంటే పంచామృతం. సహజ సిద్ధంగా ఐదు రకాల వస్తువులతో ఈ ప్రసాదం తయారు చేస్తారు. అరటి, బెల్లం, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన తేనె, కర్జూరం వంటి వాటితో సిద్ధం చేస్తున్న ఈ పంచామృతం కొనుగోలుకు భక్తులు బారులు తీరుతుంటారు. దీని విక్రయాలు, అన్ని రకాల హక్కులు పళని ఆలయ పాలక మండలికే అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధి చెందిన ఈ పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పించేందుకు తగ్గ చర్యలు చేపట్టి, సెంటర్ ఫుడ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రంలో అన్ని రకాల పరిశోధనలు చేశారు. ప్రక్రియలన్నీ ముగియడంతో పళని పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పిస్తూ బుధవారం సంబంధిత వర్గాలు ప్రకటించాయి. -
కొల్హాపురి చెప్పులకు అరుదైన ఘనత
ముంబై : సాంప్రదాయ పాదరక్షలు అనగానే గుర్తొచ్చేది కొల్హాపురి చెప్పులు. దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ కలిగిన కొల్హాపురి బ్రాండ్‌కు తాజాగా జీఐ(జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించింది. జీఐ ట్యాగ్ లభించడం ద్వారా కొల్హాపురి చెప్పుల మార్కెట్ మరింతగా పెరగనుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్, షోలాపూర్, సంగ్లీ, సతారా, కర్ణాటకలోని ధార్వాడ్, బెల్గామ్, బగల్కోట్, బీజాపూర్ జిల్లాలను కొల్హాపురి చెప్పుల మూల స్థానంగా పేర్కొన్నారు. నిర్ధిష్ట భూగోళ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వాటికి ఈ జీఐ ట్యాగ్‌ని అందజేస్తారు. ఇది మరో చోట ఉత్పత్తి కాదని అర్థం. ఈ ట్యాగ్ క్వాలిటీని కూడా సూచిస్తుంది. ఈ జియో ట్యాగ్ వల్ల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో గుర్తింపు లభిస్తోంది. -
ఈ బియ్యాన్ని వండక్కర్లేదు
అన్నం వండాలంటే బియ్యాన్ని నానబెట్టాలి.. తర్వాత వాటిని పొయ్యిపై పెట్టి వండాలి. అప్పుడే అన్నం తయారవుతుంది. అయితే అసోంలో లభించే ఓ రకం బియ్యాన్ని వండక్కర్లేదు. కొద్దిసేపు నానబెడితే చాలు.. వండకుండానే ఎంచక్కా తినేయొచ్చు. అక్కడ మాత్రమే పండించే బొకా చావల్ రకం బియ్యం ప్రత్యేకత అదే. ఈ బియ్యాన్ని మడ్‌రైస్ అని కూడా పిలుస్తారు. ఇటీవల ఆ బియ్యానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) కూడా లభించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానంగా జీవవైవిధ్యం ఉన్న పంటలను సాగుచేస్తారు. పెరటిలోనే కూరగాయలు, పండ్లు పెంచుతారు. ప్రతీ ఇంటికి సమీపంలో ఓ చెరువు ఉంటుంది. అందులో చేపలు పెంచుతారు. తక్కువ విస్తీర్ణం ఉన్న భూముల్లోనే అనేక రకాల పంటలను సాగు చేయడం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకత. ఏమిటీ బొకా చావల్.. అసోంలోని నల్బారీ, బార్పేట, గోల్ప్రా, కామ్రూప్, ధరాంగ్, దూబ్రే, చిరాంగ్ ప్రాంతాల్లో ఈ బొకా చావల్‌ను జూన్–డిసెంబర్ మధ్యలో సాగు చేస్తారు. 17వ శతాబ్దంలో మొఘలాయిలతో తలపడే సైనికుల కోసం ఈ బియ్యాన్ని ఉపయోగించేవారు. ఈ బియ్యా న్ని వండేందుకు ఇంధనం కూడా అవసరం లేదు. దీంతో ఈ బియ్యా న్ని వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర సమయాల్లో చాలా సులువుగా వినియోగించవచ్చు. ఈ బియ్యాన్ని నీటిలో ఓ గంటసేపు నానబెడితే చాలు ఉబ్బి అన్నంలా మారుతాయి. ఇందులో ఎక్కువ శ్రేణి రకం బియ్యాన్ని పావుగంట నానబెడితే చాలు.. అన్నం తయారవుతుంది. ఈ బియ్యాన్ని పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అసోంలో అతిథులకు వడ్డిస్తారు. ఈ బియ్యం అక్కడి ప్రజల ఆచారంలో భాగమైపోయాయి. పోషకాలు అధికం బొకా చావల్ బియ్యంలో పోషకాలూ అధికంగానే ఉంటాయి. ఈ బియ్యంలో 10.73 శాతం పీచుపదార్థాలు, 6.8 శాతం ప్రొటీన్లు ఉన్నట్లు గువాహటి యూనివర్సిటీకి చెందిన బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ చేసిన అధ్యయనంలో తేలింది. ఈ బియ్యాన్ని వాడటం వల్ల మనిషి శరీరంలోని వేడి కూడా తగ్గుతుందని వెల్లడైంది. వీటి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ పంటను ఎరువులు, పురుగు మందులు వాడి పండిద్దామనుకుంటే అసలుకే మోసం వస్తుంది. పంట పండకపోగా, మొత్తం నాశనమైపోతుందట. ఎలాంటి రసాయనాలు వాడరు కాబట్టి ఆరోగ్యానికి ఎంతగానో మేలు. అయితే ఈ బియ్యాన్ని రైతులు ప్రస్తుతం తమ అవసరాల కోసమే పండిస్తున్నారు. సరిపడా మార్కెట్ ఉంటే దీన్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో విస్తృతంగా పండించే అవకాశం ఉంది. -
బెంగాల్‌దే రసగుల్లా
-
హైదరాబాదీ బిర్యానీ.. ఫెయిలైంది!
మన హైదరాబాదీ బిర్యానీ అంటే చాలు.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ విదేశాలకు చెందినవాళ్లు, సినీ తారలు, క్రికెటర్లు, ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్లయినా సరే హైదరాబాద్ వచ్చారంటే చాలు.. ఇక్కడి బిర్యానీ తినకుండా వెళ్లలేని పరిస్థితి. కానీ ఇంతటి ఫేమస్ బిర్యానీ ఒక్క విషయంలో మాత్రం ఫెయిలైంది. తొలిసారిగా నిజాం నవాబులు హైదరాబాద్‌కు పరిచయం చేసిన ఈ బిర్యానీ.. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ సంపాదించలేకపోయింది. ఈ ట్యాగ్ కోసం హైదరాబాద్‌లోని అసోసియేషన్ ఆఫ్ బిర్యానీ మేకర్స్ వాళ్లు దరఖాస్తు చేశారు. తమకు 'హైదరాబాదీ బిర్యానీ' అనే ట్యాగ్ కావాలన్నారు. కానీ.. దాని మూలాలను నిరూపించే చారిత్రక సమాచారాన్ని అందించడంలో మాత్రం వాళ్లు విఫలమయ్యారు. దాంతో మన బిర్యానీకి జీఐ ట్యాగ్ రాలేదు. ఏవైనా ఉత్పత్తులు ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయనుకుంటే వాటికి జీఐ ట్యాగ్ ఇస్తారు. అప్పుడు ఆ పేరును ట్యాగ్ పొందినవాళ్లు తప్ప వేరే ఎవ్వరూ వాడుకోడానికి వీలుండదు. హైదరాబాదీ బిర్యానీకి జీఐ ట్యాగ్ కావాలని మనవాళ్లు 2009 ఏప్రిల్‌లోనే దరఖాస్తు చేశారు. దాంతో.. తమ నిబంధనల మేరకు తగిన పత్రాలు అందించాల్సిందిగా ఆ సంస్థ కోరింది. హైదరాబాదీ బిర్యానీకి సంబంధించిన చారిత్రక ఆధారాలు (గెజిట్ పబ్లికేషన్ల లాంటివి) సమర్పించాలని తెలిపింది. కానీ.. అలాంటివాటిని చూపించలేకపోయారు. 2010 ఆగస్టు నెలలో మరోసారి ఈ అంశం మీద చర్చ జరిగింది. అప్పుడు కూడా డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించాల్సిందిగా కోరారు. హైదరాబాద్ బిర్యానీ తయారీదారుల సంఘం వాళ్ల నుంచి సమాధానం ఏమీ రాకపోవడంతో 2013 జూలైలో మరోసారి లేఖ రాశారు. దరఖాస్తులో ఉన్న లోటుపాట్లను సవరించాల్సిందిగా చెప్పారు. అయినా సమాధానం ఏమీ రాకపోవడంతో.. తమ సూచనలు పాటించడం లేదంటూ 2016 మే నెలలో ఇంకోసారి గట్టిగా చెప్పారు. ఈసారి కూడా సమాధానం ఏమీ రాకపోవడంతో ఈ సంవత్సరం జనవరి 23న చిట్టచివరిసారిగా షోకాజ్ నోటీసు జారీచేశారు. అప్పుడు కూడా సంఘం మౌనంగానే ఉండిపోయింది. దాంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నామని తేల్చి చెప్పేశారు. దాంతో ఇక మన హైదరాబాదీ బిర్యానీకి జీఐ ట్యాగ్ రావడం కలలో కూడా జరగదని తేలిపోయింది.