2022 లోనే ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు.. త్వరలో రైతులతో జరిగే సమావేశంలో నిర్ణయం
ఆర్మూర్ పసుపు, బాలానగర్ సీతాఫలం తదితర పంటలకు దరఖాస్తుపై కసరత్తు.. జీఐ ట్యాగ్ లభిస్తే రైతులకు ఎంతో మేలు
సాక్షి, సిద్దిపేట: ఒక ప్రాంతంలో పండించే పంటలకు, ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభిస్తుంది. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 17 రకాల ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందాయి. మరిన్ని ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో త్వరలో వరంగల్ చపాటా మిర్చికి జీఐ గుర్తింపు లభించే అవకాశం ఉంది. వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూగెం, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో చపాటా మిర్చిని పండిస్తున్నారు.
సుమారు 7 వేల ఎకరాల్లో దీని సాగు జరుగుతోంది. పంటను వరంగల్, ఖమ్మం, గుజరాత్, ముంబై, ఆహ్మదాబాద్ మార్కెట్లకు తరలించి అక్కడి నుంచి వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, ఇంగ్లండ్, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆహారంలో కృత్రిమ రంగును నిషేధించిన దేశాల్లో ఈ చపాటా మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంది. కృత్రిమ రంగులకు ప్రత్యామ్నాయంగా ఈ చపాటా మిర్చిని ఉపయోగిస్తారు. ఇందులో నుంచి ఓల్యూరోసిస్ అనే ఎరుపు రంగు ద్రావణాన్ని తీసి ఫుడ్ కలర్‌గా వినియోగిస్తారు. మన దగ్గర వీటిని ఎక్కువగా పచ్చళ్ల తయారీలో వినియోగిస్తారు.
తిమ్మంపేట చిల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ నర్సంపేట, వరంగల్, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ పంటకు జీఐ ట్యాగ్ కోసం 2022లో దరఖాస్తు చేశాయి. ఎంత మంది రైతులు దీనిని పండిస్తున్నారు. దీని వలన లాభాలు తెలుపుతూ పలు అంశాలతో కూడిన నివేదికను చెన్నైలోని జీఐ కార్యాలయంలో అందజేశారు. ఈ క్రమంలో ఈ నెలలో రైతులతో చెన్నైలో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. సాగు విధానం, ఉపయోగాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే చపాటా మిర్చికి జీఐ ట్యాగ్ లభించే అవకాశం ఉంది. సాధారణ మిర్చిని క్వింటాల్ రూ.8 వేల నుంచి రూ.18 వేల వరకు విక్రయిస్తుండగా..చపాటా మిర్చి రూ.30 వేల నుంచి 35 వేలు పలుకుతుంది.
మరికొన్ని పంటలకు కూడా..
⇒ ఆర్మూరు పసుపునకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి జీఐ ట్యాగ్ సాధించేందుకు తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందుకు నాబార్డు సహకరిస్తోంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు. జీఐ ట్యాగ్ పొందితే ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయి. అధిక ధరలు పలకడంతో రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. ఇక రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సీతాఫలాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇక్కడి నుంచి ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు. దీనికి జీఐ ట్యాగ్ కోసం కూడా ఉద్యాన వర్సిటీ కసరసత్తును ప్రారంభించింది. వర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. అలాగే కొల్లాపూర్ మామిడి, జగిత్యాల పొడుగు బీరకాయలు, నల్లగొండ పచ్చడి దోసకాయలు, నిజామాబాద్ గుత్తి బీరకాయలు సైతం జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు ప్రక్రియలో ఉన్నాయి. ప్లాంట్ అథారిటీలో నల్లగొండ పచ్చడి దోసకాయను నమోదు చేయించేందుకు ఉద్యాన వర్సిటీ దరఖాస్తు చేయించింది. నమోదు జరిగితే ఈ దోసకాయకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది.
జీఐ ట్యాగ్ ఉన్న 17 ఉత్పత్తులివే..
పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ ఫిలిగ్రీ, గద్వాల చీరలు, నిర్మల్ బొమ్మలు, చేర్యాల నకాశి కళ, నిర్మల్ ఫర్నిచర్, నారాయణపేట చీరలు, పుట్టపాక తేలియా రుమాలు, గొల్లభామ చీరలు, ఆదిలాబాద్ డోక్రా ఇత్తడి బొమ్మలు, వరంగల్ డర్రీస్, నిర్మల్ చిత్రాలు, తాండూరు కందిపప్పు, పాతబస్తీ లక్కగాజులు, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, బంగినపల్లి మామిడి ఉన్నాయి.
ఎన్నో ప్రయోజనాలు
జీఐ ట్యాగ్‌తో పంటల ఎగుమతులు పెరిగేందుకు, అధిక ధరలు లభించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకు మేలు జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పతుంది. ఈ ఉత్పత్తులను ఇతరులు అనధికారికంగా ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. – నీరజ ప్రభాకర్, వీసీ, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం
Comments
Please login to add a commentAdd a comment