వరంగల్ చపాటా మిర్చీకి కూడా గుర్తింపు కోసం దరఖాస్తు
కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే లక్కగాజులు సహా 17 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు
జీఐతో ఉత్పత్తులకు పేటెంట్ రక్షణ, కార్మీకులకు ఉపాధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకే ప్రత్యేకమైన పలు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ –జీఐ) సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఆహారం, హస్తకళలు, వంగడాలు తదితర 17 రకాల ఉత్పత్తులకు ఇప్పటికే జీఐ గుర్తింపు లభించింది. ఇప్పుడు మరిన్ని ఉత్పత్తులకు జీఐ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ జాబితాలో హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కలంకారీ, వరంగల్ మిర్చి తదితర ఉత్పత్తులు ఉన్నాయి. వీటికి జీఐ గుర్తింపు కోసం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని ‘కం్రప్టోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్’విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు సమర్పించింది.
30 ఉత్పత్తులకు జీఐ ట్యాగింగ్
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీఐ ట్యాగింగ్ జాబితాలో తెలంగాణకు చెందిన ఉత్పత్తులకు పెద్దగా చోటు దక్కలేదు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో జీఐ టాగింగ్ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కనీసం 30 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ దక్కేలా చూడాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కళంకారీ, వరంగల్ చపాటా మిర్చీకి గుర్తింపు ఇవ్వాలని దరఖాస్తు చేసింది.
వరంగల్ చపాటా మిర్చీ తరహాలోనే ఖమ్మం మిర్చికి కూడా జీఐ టాగింగ్ ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు కోరింది. తెలంగాణకు చెందిన ప్రత్యేక ఉత్పత్తుల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు జీఐ టాగింగ్ నోడల్ అధికారి శ్రీహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
– ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 17 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ లభించింది. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ వెండి ఫిలిగ్రీ, నిర్మల్ కొయ్య బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హలీమ్, చేర్యాల పెయింటింగ్స్, పెంబర్తి ఇత్తడి కళాకృతులు, సిద్దిపేట గొల్లభామ చీరలు, బంగినపల్లి మామిడి, పోచంపల్లి ఇక్కత్ లోగో, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీస్, తేలియా రుమాల్, లక్క గాజులకు జీఐ గుర్తింపు లభించింది.
– జీఐ చట్టం 1999 ప్రకారం భౌగోళిక ప్రత్యేకత, నాణ్యత, ప్రాముఖ్యత తదితరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వాటికి జీఐ గుర్తింపు ఇస్తారు. వారసత్వ, సాంస్కృతిక సంపదను కాపాడటం, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం, ఉత్పత్తుల నాణ్యత, ప్రత్యేకతను పరిరక్షించడం, ఉత్పత్తులను నకలు కొట్టకుండా నిరోధించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడం జీఐ టాగింగ్ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment