అన్నం వండాలంటే బియ్యాన్ని నానబెట్టాలి.. తర్వాత వాటిని పొయ్యిపై పెట్టి వండాలి. అప్పుడే అన్నం తయారవుతుంది. అయితే అసోంలో లభించే ఓ రకం బియ్యాన్ని వండక్కర్లేదు. కొద్దిసేపు నానబెడితే చాలు.. వండకుండానే ఎంచక్కా తినేయొచ్చు. అక్కడ మాత్రమే పండించే బొకా చావల్ రకం బియ్యం ప్రత్యేకత అదే. ఈ బియ్యాన్ని మడ్‌రైస్ అని కూడా పిలుస్తారు. ఇటీవల ఆ బియ్యానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) కూడా లభించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానంగా జీవవైవిధ్యం ఉన్న పంటలను సాగుచేస్తారు. పెరటిలోనే కూరగాయలు, పండ్లు పెంచుతారు. ప్రతీ ఇంటికి సమీపంలో ఓ చెరువు ఉంటుంది. అందులో చేపలు పెంచుతారు. తక్కువ విస్తీర్ణం ఉన్న భూముల్లోనే అనేక రకాల పంటలను సాగు చేయడం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకత.
ఏమిటీ బొకా చావల్..
అసోంలోని నల్‌బారీ, బార్‌పేట, గోల్‌ప్రా, కామ్‌రూప్, ధరాంగ్, దూబ్రే, చిరాంగ్ ప్రాంతాల్లో ఈ బొకా చావల్‌ను జూన్–డిసెంబర్ మధ్యలో సాగు చేస్తారు. 17వ శతాబ్దంలో మొఘలాయిలతో తలపడే సైనికుల కోసం ఈ బియ్యాన్ని ఉపయోగించేవారు. ఈ బియ్యా న్ని వండేందుకు ఇంధనం కూడా అవసరం లేదు. దీంతో ఈ బియ్యా న్ని వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర సమయాల్లో చాలా సులువుగా వినియోగించవచ్చు. ఈ బియ్యాన్ని నీటిలో ఓ గంటసేపు నానబెడితే చాలు ఉబ్బి అన్నంలా మారుతాయి. ఇందులో ఎక్కువ శ్రేణి రకం బియ్యాన్ని పావుగంట నానబెడితే చాలు.. అన్నం తయారవుతుంది. ఈ బియ్యాన్ని పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అసోంలో అతిథులకు వడ్డిస్తారు. ఈ బియ్యం అక్కడి ప్రజల ఆచారంలో భాగమైపోయాయి.
పోషకాలు అధికం
బొకా చావల్ బియ్యంలో పోషకాలూ అధికంగానే ఉంటాయి. ఈ బియ్యంలో 10.73 శాతం పీచుపదార్థాలు, 6.8 శాతం ప్రొటీన్లు ఉన్నట్లు గువాహటి యూనివర్సిటీకి చెందిన బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ చేసిన అధ్యయనంలో తేలింది. ఈ బియ్యాన్ని వాడటం వల్ల మనిషి శరీరంలోని వేడి కూడా తగ్గుతుందని వెల్లడైంది. వీటి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ పంటను ఎరువులు, పురుగు మందులు వాడి పండిద్దామనుకుంటే అసలుకే మోసం వస్తుంది. పంట పండకపోగా, మొత్తం నాశనమైపోతుందట. ఎలాంటి రసాయనాలు వాడరు కాబట్టి ఆరోగ్యానికి ఎంతగానో మేలు. అయితే ఈ బియ్యాన్ని రైతులు ప్రస్తుతం తమ అవసరాల కోసమే పండిస్తున్నారు. సరిపడా మార్కెట్ ఉంటే దీన్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో విస్తృతంగా పండించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment