No cooking
-
వంట నేర్చుకోను
విద్యా బాలన్‌కు వంట రాదు. నేర్చుకునే ఉద్దేశం కూడా లేదు. అయినా ఆసక్తి లేని పనులను పనికట్టుకుని చేయడం ఎందుకూ? అంటారామె. 2012లో నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు విద్యాబాలన్. పెళ్లయిన వెంటనే విద్యా వాళ్ల అమ్మ ‘ఇప్పుడైనా వంట నేర్చుకో..’ అని సలహా ఇచ్చారట. ‘‘ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు నేను బాగా సంపాదిస్తున్నాను. కావాలంటే వంటవాళ్లను పెట్టుకుంటాను. వాళ్లు లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటా. లేదా బయటకు వెళ్లి తింటా. నాకు వంటా వార్పు మీద ఆసక్తి లేదు’ అని తల్లికి బదులిచ్చారు. అది మాత్రమే కాదు.. ‘‘వంట నేర్చుకో అని నాకు చెప్పే బదులు వంట వచ్చిన వాళ్లను పెళ్లి చేసుకోవచ్చుగా అని ఎందుకు చెప్పడం లేదు’ అని తిరిగి ప్రశ్నించారు కూడా. ‘‘వీళ్లు ఈ పని కచ్చితంగా చేయాలి’’ అని తరతరాలుగా వస్తున్న ఈ ఆలోచనా విధానాన్ని నేను పట్టించుకోను. నా భర్త కూడా నా ఆలోచనలను అర్థం చేసుకున్నారు’’ అని పేర్కొన్నారు విద్యా బాలన్. -
ఈ బియ్యాన్ని వండక్కర్లేదు
అన్నం వండాలంటే బియ్యాన్ని నానబెట్టాలి.. తర్వాత వాటిని పొయ్యిపై పెట్టి వండాలి. అప్పుడే అన్నం తయారవుతుంది. అయితే అసోంలో లభించే ఓ రకం బియ్యాన్ని వండక్కర్లేదు. కొద్దిసేపు నానబెడితే చాలు.. వండకుండానే ఎంచక్కా తినేయొచ్చు. అక్కడ మాత్రమే పండించే బొకా చావల్ రకం బియ్యం ప్రత్యేకత అదే. ఈ బియ్యాన్ని మడ్‌రైస్ అని కూడా పిలుస్తారు. ఇటీవల ఆ బియ్యానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) కూడా లభించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానంగా జీవవైవిధ్యం ఉన్న పంటలను సాగుచేస్తారు. పెరటిలోనే కూరగాయలు, పండ్లు పెంచుతారు. ప్రతీ ఇంటికి సమీపంలో ఓ చెరువు ఉంటుంది. అందులో చేపలు పెంచుతారు. తక్కువ విస్తీర్ణం ఉన్న భూముల్లోనే అనేక రకాల పంటలను సాగు చేయడం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకత. ఏమిటీ బొకా చావల్.. అసోంలోని నల్బారీ, బార్పేట, గోల్ప్రా, కామ్రూప్, ధరాంగ్, దూబ్రే, చిరాంగ్ ప్రాంతాల్లో ఈ బొకా చావల్‌ను జూన్–డిసెంబర్ మధ్యలో సాగు చేస్తారు. 17వ శతాబ్దంలో మొఘలాయిలతో తలపడే సైనికుల కోసం ఈ బియ్యాన్ని ఉపయోగించేవారు. ఈ బియ్యా న్ని వండేందుకు ఇంధనం కూడా అవసరం లేదు. దీంతో ఈ బియ్యా న్ని వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర సమయాల్లో చాలా సులువుగా వినియోగించవచ్చు. ఈ బియ్యాన్ని నీటిలో ఓ గంటసేపు నానబెడితే చాలు ఉబ్బి అన్నంలా మారుతాయి. ఇందులో ఎక్కువ శ్రేణి రకం బియ్యాన్ని పావుగంట నానబెడితే చాలు.. అన్నం తయారవుతుంది. ఈ బియ్యాన్ని పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అసోంలో అతిథులకు వడ్డిస్తారు. ఈ బియ్యం అక్కడి ప్రజల ఆచారంలో భాగమైపోయాయి. పోషకాలు అధికం బొకా చావల్ బియ్యంలో పోషకాలూ అధికంగానే ఉంటాయి. ఈ బియ్యంలో 10.73 శాతం పీచుపదార్థాలు, 6.8 శాతం ప్రొటీన్లు ఉన్నట్లు గువాహటి యూనివర్సిటీకి చెందిన బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ చేసిన అధ్యయనంలో తేలింది. ఈ బియ్యాన్ని వాడటం వల్ల మనిషి శరీరంలోని వేడి కూడా తగ్గుతుందని వెల్లడైంది. వీటి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ పంటను ఎరువులు, పురుగు మందులు వాడి పండిద్దామనుకుంటే అసలుకే మోసం వస్తుంది. పంట పండకపోగా, మొత్తం నాశనమైపోతుందట. ఎలాంటి రసాయనాలు వాడరు కాబట్టి ఆరోగ్యానికి ఎంతగానో మేలు. అయితే ఈ బియ్యాన్ని రైతులు ప్రస్తుతం తమ అవసరాల కోసమే పండిస్తున్నారు. సరిపడా మార్కెట్ ఉంటే దీన్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో విస్తృతంగా పండించే అవకాశం ఉంది. -
పగటిపూట పొయ్యి వెలిగిస్తే చెప్పుదెబ్బలు!
పట్నా: 'ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత పొయ్యి వెలిగించ వద్దు. వెలిగించినవాళ్లకు చెప్పు దెబ్బలతో పాటు జరిమానా వేస్తాం' .. ఇది బిహార్ లోని కొన్ని గ్రామాల్లో వినిపిస్తోన్న దండోరా. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో అగ్నిప్రమాదాలను నివారించేందుకు పగటిపూట వంట చేయడానికి వీల్లేదని ఫత్వా జారీచేస్తున్నారు బిహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా అధికారులు! ఆజ్ఞలు అతిక్రమించిన వారికి రూ.1,000 జరిమానా కూడా ఉంటుందని ప్రకటించారు. రాష్ర్ట విపత్తు నిర్వహణ శాఖ సమాచారం ప్రకారం ఇప్పటివరకు అగ్నిప్రమాదాల మూలంగా 23 మంది పౌరులతో 50 జంతువులు మృత్యువాత పడ్డాయి. ఇల్లు కాలిపోవడంతో 5,742 కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఒక్క పశ్చిమ చంపారన్ జిల్లాలోనే దాదాపు 800 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఎక్కువ కుటుంబాలు పూరి గుడిసెల్లో నివాసం ఉంటుండటం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. లక్ష్మీపూర్, పటిలార్, రత్వాల్, లగునహ, సితాపూర్, అహిర్వలియా గ్రామాలు ఉదయాన్నే వంట పూర్తి చేసుకోవడానికి ముందుకొచ్చాయి. మరికొన్ని గ్రామాలు అసలు భోజనం వండుకోకుండా ఉండేందుకు అంగీకరించాయి. రాత్రుళ్లు ఇళ్లలో వెలిగించే దీపాలను కూడా వాడమని మరికొన్ని గ్రామాలు నిర్ణయం తీసుకున్నాయి. బీహార్ రాష్ర్టంలో ఇప్పటివరకు అధికారికంగా 400 అగ్నిప్రమాదాలు జరిగినట్లు రికార్డుల్లో నమోదు చేశారు.