ఒక్కో ప్రాంతానికి వేరువేరు ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన రుచులు ఉంటాయి. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలకు వంటల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆత్రేయపురం పూతరేకులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్.. పూతరేకులకు పుట్టిల్లుగా ఉంది ప్రస్తుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం. పూతరేకు అనగానే ఆత్రేయపురం గుర్తుకు వస్తుంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆత్రేయపురం పూతరేకులకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది.
ఆత్రేయపురం అంటే గుర్తుకు వచ్చేది పూతరేకు. పూతరేకు అంటే గుర్తుకువచ్చేది ఆత్రేయపురం. ఈ రెండింటి మధ్య అంత బంధం ఉంది. తాజాగా ఆ బంధం మరింత బలపడింది. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిటీ)తో ఆత్రేయపురం కీర్తి జాతీయ స్థాయికి చేరింది. తరతరాలుగా వారసత్వ సంపదగా వస్తున్న పూతరేకుల తయారీలో ఈ ఊరికే పూర్తిస్థాయి గుర్తింపు..హక్కులు ఉన్నాయని తేలింది. ఈ నెల 15న విశాఖపట్నం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ప్రాంగణంలో ఆత్రేయపురం పూతరేకులకు గ్లోబల్ ఇండికేషన్ ట్యాగ్ సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు.
నాలుగు శతాబ్దాల పేద మహిళల నైపుణ్యం, కష్టానికి గుర్తింపు దక్కే అపూర్వ సన్నివేశం ఆరోజు ఆవిష్కారం కానుంది. జీఐ కోసం ఎంతో కృషి తమ ఊరితో ఇంతగా అనుబంధాన్ని పెనవేసుకున్న పూతరేకుకు భౌగోళిక గుర్తింపు రావాలని ఆత్రేయపురం వాసులు చాన్నాళ్లుగా కోరుకుంటున్నారు. మూడేళ్లుగా ఇందుకోసం గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్ధర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల సంక్షేమ సంఘంతోపాటు మరికొందరు ఈ ప్రయత్నాల్లో పాలుపంచుకున్నారు.
విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలోని ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ విభాగం ఆధ్వర్యంలో లా స్టూడెంట్స్ వీరికి కృషికి తోడయ్యారు. ఆత్రేయపురం వచ్చి పూతరేకుకూ ఈ గ్రామానికి ఏర్పడిన విడదీయరాని బంధానికి సంబంధించి వివిధ ఆధారాలను సేకరించారు. ఉపాధిగా మారి ఎగుమతుల స్థాయికి చేరిన ఈ ఆహార ఉత్పత్తిపై డాక్యుమెంట్లను తయారు చేశారు. 2021 డిసెంబర్ 13న చైన్నెలోని జియో ఐడెంటిటీ కార్యాలయానికి అధికారికంగా దరఖాస్తును సమర్పించారు.
కొద్ది నెలల అనంతరం చైన్నె కార్యాలయంలో దరఖాస్తు ప్రాసెస్ మొదలైంది. ఆధారాలతో సహా హాజరుకావాలని ఇక్కడివారికి ఆహ్వానం అందింది. ఆత్రేయపురం నుంచి ఏడుగురు సభ్యులు జీఐ కార్యాలయానికి వెళ్లారు. వివిధ రంగాలకు చెందిన తొమ్మిది మంది నిపుణులు వీరిని లోతుగా ప్రశ్నించారు. సమాధానాలు రాబట్టారు. ఈ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా హాజరైన ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన గోనెల రాజేంద్రప్రసాద్ జీఐ అధికారుల ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వగలిగారు. దీంతో వారు సంతృప్తి చెందారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 13న జీఐ జర్నల్ ఆత్రేయపురం పూతరేకుల గురించి ప్రచురించింది. దీనిపై అభ్యంతరాలుంటే 120 రోజుల్లో తెలియజేయాలని సూచించింది. ఈ గడువు జూన్ 13వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీంతో ఆత్రేయపురం వాసుల కల నెరవేరింది. భౌగోళిక గుర్తింపు(GI) లభించింది.
Comments
Please login to add a commentAdd a comment