శివారులో వినూత్న హోటళ్లు | - | Sakshi
Sakshi News home page

శివారులో వినూత్న హోటళ్లు

Published Sun, Nov 26 2023 2:14 AM | Last Updated on Thu, Jan 4 2024 12:50 PM

- - Sakshi

కర్నూలు: ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు ఎలాంటి పని మీద కర్నూలుకు వచ్చి టిఫిన్‌ తినాలనుకున్నా, మధ్యాహ్నం ఆకలి తీర్చుకోవాలన్నా.. రాత్రికి నాలుగు మెతుకులు గొంతు దిగాలన్నా ముందుగా గుర్తుకొచ్చే పేర్లు అజంతా, గోపి, హిందుస్తాన్, రమా దర్శన్, గీతా లంచ్‌హోం, అమరావతి.. తరహా పదుల సంఖ్యలో హోటళ్లు మాత్రమే. అప్పటి జనాభాకు అనుగుణంగా ఈ హోటళ్లు ఎంతో రుచికరమైన అల్పాహారంతో పాటు షడ్రుచులను అందించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాయి. ఇందులో కొన్ని హోటళ్లు మారిన కాలంతో పాటు భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసుకొని ఇప్పటికీ ఉనికి చాటుకుంటున్నాయి. అయితే నగరం వేగంగా విస్తరించడంతో పాటు నాలుక భిన్న ఆహారాన్ని కోరుకోవడంతో అందుకు అనుగుణంగా హోటళ్లు వెలుస్తూ వచ్చాయి. ఇప్పుడు నగరంలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ భారీ రెస్టారెంట్లు స్వాగతం పలుకుతున్నాయి. జాతీయ రహదారుల్లో దారి పొడవునా ఆకలి తీర్చే ఘుమఘుమలు వాహనాలు ముందుకు కదలనివ్వవంటే అతిశయోక్తి కాదు.

  

ఒక్క పూటైనా కలిసి మెలసి భోజనం 
నగర వాతావరణానికి అలవాటుపడిన చాలా కుటుంబాలు, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడంతో ఇటీవల కాలంలో ఇంట్లో వంట చేసుకోవడం చాలా వరకు తగ్గిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉరుకులు పరుగుల జీవితం నుంచి కాస్త ఊరట పొందేందుకు, ఇంటిల్లిపాదీ కలసి భోజనం చేసేందుకు అనువుగా హోటళ్లు ఏర్పాటయ్యాయి. ఇక ఇటీవల నగరంలోని గుత్తి పెట్రోల్‌ బంకు సమీపంలో బ్రిడ్జి కింద రూపుదిద్దుకున్న ఖానా ఖజానా ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఆకలి తీరుస్తోంది. సాయంత్రం వేళ వెలుగుజిలుగులు మధ్య ఇక్కడి అల్పాహార.. వెజ్, నాన్‌ వెజ్‌ ఆహారం తియ్యని అనుభూతి మిగులుస్తోంది. అదేవిధంగా ఇంకాస్త ప్రయాణం చేసి ఊరి బయటకు వెళ్లాలనుకునే వారికి, సమయం వెచ్చించాలనుకుంటే అందుకు అనువైన హోటళ్లు కూడా రారమ్మని ఆహ్వానిస్తుండటం విశేషం. 

సరికొత్త రుచులు 
ఒకప్పుడు హోటళ్లకు వెళితే ఇడ్డీ, వడ, దోశ.. మధ్యాహ్నమైతే అరిటాకులో వడ్డించే భోజనం.. రాత్రికి వీటితో పాటు చపాతి, పరోటా అదనం. మాంసాహార ప్రియులకు బిర్యానీ ఉండనే ఉంటుంది. ఇప్పుడు వీటితో పాటు సరికొత్త రుచులు భోజన ప్రియులను హోటళ్ల వైపునకు కాళ్లు కదిపేలా చేస్తున్నాయి. రకరకాల బిర్యానీలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై తదితర మహానగరాల్లో లభించే అన్నిరకాల వంటకాలు దాదాపుగా ఇక్కడ లభ్యమవుతున్నాయి. కేఎఫ్‌సీ, బార్బీక్యూ, ఇంకా ఎన్నో ఇప్పుడు నగరంలోనే అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పాతబస్టాండ్‌ ప్రాంతంలో నెయ్యి దోశ నోరూరిస్తుంది. 

రకరకాల వంటకాలు 
దాదాపుగా ప్రతి హోటల్‌లో వెజ్, నాన్‌ వెజ్‌ భోజనాలు లభిస్తున్నా.. ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను సొంతం చేసుకుంటున్నారు. ఒకచోట కుండ బిర్యానీ, మరోచోట చిట్టి ముత్యాల బిర్యానీ, మరోచోట రాగిముద్ద తలకాయ కూర.. ఇంకోచోట నెల్లూరు చేపల పుసులు.. ఇక మటన్‌ కడ్డీలు నోరూరిస్తుంటాయి. ఇటీవల కాలంలో మండీ భోజనం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక భారీ ప్లేట్‌లో ఇంటిల్లిపాదీ భోజనం చేసే సదుపాయం ఉండటం సరికొత్త అనుభూతిని పంచుతోంది. అదేవిధంగా బకెట్‌ బిర్యానీ ప్యాకింగ్‌లోనూ వినూత్న పంథాకు అద్దం పడుతోంది. ఒకరు.. ఇద్దరు.. నలుగురు.. ఆరుగురు.. పది మంది వరకు తినేలా ఈ బకెట్‌ బిర్యానీలను సిద్ధం చేస్తున్నారు.

ఆరోగ్యానికి అనువుగా.. 
పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో వ్యాధుల తీవ్రత కూడా అదేస్థాయిలో ఉంటోంది. చిన్న వయస్సులోనే బీసీ, షుగర్, క్యాన్సర్‌ మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఆ రోగాల నుంచి బయటపడేందుకు జేబుకు చిల్లు పెట్టుకోక తప్పనిపరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆహార అలవాట్లలో మార్పు చేసుకుంటున్నారు. తద్వారా కొద్ది వరకైనా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చనే భావన కనిపిస్తోంది. ఇందుకు అనుగుణంగా నగరంలో పలుచోట్ల మిల్లెట్‌ హోటళ్లు కూడా ఏర్పాటయ్యాయి. చిరుధాన్యాలతో తయారు చేసిన ఇడ్లీ, దోశ, పూరీలు ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. ఇదే సమయంలో రాగి సంకటితో పాటు జొన్నరెట్టె కూడా కడుపును చల్లబరుస్తూ బలాన్ని చేకూరుస్తుండటం విశేషం. 

శివారులో వినూత్న హోటళ్లు 
జాతీయ రహదారుల వెంట వెలసిన హోటళ్లు భోజన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులతో పాటు నగరవాసులు సైతం ఈ హోటళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయా హోటళ్లలో బిగ్‌ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి సినిమాలు, పాటలను ప్రదర్శిస్తున్నారు. ఇక క్రికెట్‌ మ్యాచ్‌లు ఉంటే.. ఆ రోజుల్లో సందడే సందడి. ముందుగానే టేబుళ్లు బుక్‌ చేసుకొని మరీ ఈ రెస్టారెంట్లకు క్యూకడుతున్నారు. ఒక హోటల్‌ ఎదుట ఏర్పాటు చేసిన ఏనుగు అటుఇటూ కదులుతూ, పిల్లలకు సరికొత్త అనుభూతిని మిగులుస్తున్నాయి. అసలైన ఏనుగునే ఇలా నిల్చోబెట్టారా అనే భావన కలిగించే రీతిలో నిర్వాహకులు ఈ సెట్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఓ యజమాని ఇంకాస్త ముందుకెళ్లి ఏకంగా విమానాన్నే హోటల్‌గా మారుస్తున్న తీరు చూస్తే ఈ రంగం ఏస్థాయిలో విస్తరిస్తుందో అర్థమవుతోంది. 

కేరళ ఆపం: నగర శివారులోని ఓ చిన్న దుకాణంలో ఏర్పాటు చేసిన హోటల్‌ ఇటీవల కాలంలో తమ ప్రత్యేకతను చాటుకుంటోంది. కేరళవాసులకే పరిమితమైన ఆపం ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన ఇద్దరు అన్నదమ్ములు ఈ హోటల్‌ నిర్వహిస్తున్నారు. స్వయంగా వీరిద్దరే ఆపం తయారు చేస్తూ చెట్నీతో పాటు నాన్‌ వెజ్‌తోనూ అందిస్తున్నారు. కొత్త వంటకాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుందనేందుకు వీరి వినూత్న ఆలోచనే నిదర్శనం. 

కోకోనట్‌ జ్యూస్‌: ఇప్పటి వరకు టెంకాయ నీళ్లను మాత్రమే తాగిన వాళ్లకు.. ఈ దుకాణానికి వస్తే సరికొత్త రుచి లభిస్తుంది. బయట ఒక టెంకాయ కొనుగోలు చేయాలంటే రూ.50 తీసుకుంటున్నారు. ఇదే ధరతో ఇక్కడ కోకోనట్‌ జ్యూస్‌ లభిస్తుంది. ఇందులో టెంకాయ నీళ్లకు తోడు అందులోని కొబ్బరి, గ్లూకోస్, కాస్త చక్కెరను మిక్సీలో వేసి జ్యూస్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనికి అదనంగా ఫ్లేవర్‌ కోరుకునే వాళ్లకు మరో రూ.10 అదనంగా తీసుకొని సీజన్‌కు అనుగుణంగా లభించే పండ్లతో కూడిన కోకోనట్‌ జ్యూస్‌తో ఆకట్టుకుంటున్నారు. 

చిట్టిముత్యాల బిర్యానీ ఎంతో రుచి 
వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కర్నూలుకు వచ్చిన ప్రతీసారి నగర శివారులోని రెస్టారెంట్‌లో చిట్టిముత్యాల బిర్యానీ తినడం అలవాటుగా మారింది. శివారు ప్రాంతం కావడంతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వాహనాల పార్కింగ్‌కు అనువుగా ఉండటంతో వీలైనంత వరకు ఇలాంటి హోటళ్లకే వెళ్తుంటా.  
– వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement