Atreyapuram Pootharekulu
-
రుచితో అదరగొట్టే మధురాలు, ఈ పూతరేకులు
-
ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం.. ఫలించిన మూడేళ్ల కృషి
ఒక్కో ప్రాంతానికి వేరువేరు ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన రుచులు ఉంటాయి. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలకు వంటల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆత్రేయపురం పూతరేకులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్.. పూతరేకులకు పుట్టిల్లుగా ఉంది ప్రస్తుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం. పూతరేకు అనగానే ఆత్రేయపురం గుర్తుకు వస్తుంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆత్రేయపురం పూతరేకులకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఆత్రేయపురం అంటే గుర్తుకు వచ్చేది పూతరేకు. పూతరేకు అంటే గుర్తుకువచ్చేది ఆత్రేయపురం. ఈ రెండింటి మధ్య అంత బంధం ఉంది. తాజాగా ఆ బంధం మరింత బలపడింది. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిటీ)తో ఆత్రేయపురం కీర్తి జాతీయ స్థాయికి చేరింది. తరతరాలుగా వారసత్వ సంపదగా వస్తున్న పూతరేకుల తయారీలో ఈ ఊరికే పూర్తిస్థాయి గుర్తింపు..హక్కులు ఉన్నాయని తేలింది. ఈ నెల 15న విశాఖపట్నం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ప్రాంగణంలో ఆత్రేయపురం పూతరేకులకు గ్లోబల్ ఇండికేషన్ ట్యాగ్ సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు. నాలుగు శతాబ్దాల పేద మహిళల నైపుణ్యం, కష్టానికి గుర్తింపు దక్కే అపూర్వ సన్నివేశం ఆరోజు ఆవిష్కారం కానుంది. జీఐ కోసం ఎంతో కృషి తమ ఊరితో ఇంతగా అనుబంధాన్ని పెనవేసుకున్న పూతరేకుకు భౌగోళిక గుర్తింపు రావాలని ఆత్రేయపురం వాసులు చాన్నాళ్లుగా కోరుకుంటున్నారు. మూడేళ్లుగా ఇందుకోసం గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్ధర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల సంక్షేమ సంఘంతోపాటు మరికొందరు ఈ ప్రయత్నాల్లో పాలుపంచుకున్నారు. విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలోని ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ విభాగం ఆధ్వర్యంలో లా స్టూడెంట్స్ వీరికి కృషికి తోడయ్యారు. ఆత్రేయపురం వచ్చి పూతరేకుకూ ఈ గ్రామానికి ఏర్పడిన విడదీయరాని బంధానికి సంబంధించి వివిధ ఆధారాలను సేకరించారు. ఉపాధిగా మారి ఎగుమతుల స్థాయికి చేరిన ఈ ఆహార ఉత్పత్తిపై డాక్యుమెంట్లను తయారు చేశారు. 2021 డిసెంబర్ 13న చైన్నెలోని జియో ఐడెంటిటీ కార్యాలయానికి అధికారికంగా దరఖాస్తును సమర్పించారు. కొద్ది నెలల అనంతరం చైన్నె కార్యాలయంలో దరఖాస్తు ప్రాసెస్ మొదలైంది. ఆధారాలతో సహా హాజరుకావాలని ఇక్కడివారికి ఆహ్వానం అందింది. ఆత్రేయపురం నుంచి ఏడుగురు సభ్యులు జీఐ కార్యాలయానికి వెళ్లారు. వివిధ రంగాలకు చెందిన తొమ్మిది మంది నిపుణులు వీరిని లోతుగా ప్రశ్నించారు. సమాధానాలు రాబట్టారు. ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా హాజరైన ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన గోనెల రాజేంద్రప్రసాద్ జీఐ అధికారుల ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వగలిగారు. దీంతో వారు సంతృప్తి చెందారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న జీఐ జర్నల్ ఆత్రేయపురం పూతరేకుల గురించి ప్రచురించింది. దీనిపై అభ్యంతరాలుంటే 120 రోజుల్లో తెలియజేయాలని సూచించింది. ఈ గడువు జూన్ 13వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీంతో ఆత్రేయపురం వాసుల కల నెరవేరింది. భౌగోళిక గుర్తింపు(GI) లభించింది. -
ఆత్రేయపురం పూతరేకులకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
రాజమహేంద్రవరం డెస్క్: ఆత్రేయపురం.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది పూతరేకు. ఈ పేరు వింటేనే నోరూరుతుంది. రుచిలో.. రూపంలో దీనికేదీ సాటి రాదు. ఆత్రేయపురంలో పుట్టి ఆ ప్రాంతానికి ఓ బ్రాండ్ ఇమేజిని తెచ్చిపెట్టింది అందుకే. వందేళ్లకు పైబడిన చరిత్రను సొంతం చేసుకున్న ఆత్రేయపురం పూతరేకులకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ఇచ్చేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇందుకోసం విశాఖలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వ విద్యాలయం సహకారంతో సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ఇప్పటికే దరఖాస్తు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే మూడు నెలల్లోనే చెన్నైలోని జీఐ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఆత్రేయపురం పూతరేకులకు గుర్తింపు జారీ అవుతుంది. దీంతో ఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుంది. పూతరేకులకు స్ఫూర్తి పూర్వం మైసూరుకు చెందిన ఒక మహిళ ఆత్రేయపురం కోడలిగా వచ్చింది. అప్పట్లో అన్నం వారుస్తుండగా వచ్చిన గంజి కుండపై పడి, రేకుగా వచ్చింది. దానిని చూసి విస్తుపోయిన ఆమె సరదాగా పంచదారతో కలిపి తిని ముచ్చట పడింది. అలా ఆవిర్భవించిందే పూతరేకు. తొలినాళ్లలో క్షత్రియ మహిళలు ఈ రేకు తయారు చేసి, పంచదార అద్దేవారు. కాలక్రమంలో ఇతర వర్గాల మహిళలు కూడా ఈ రేకు తయారీ నేర్చుకున్నారు. ఉపాధిగా మార్చుకున్నారు. ఒక్క ఆత్రేయపురంలోనే సుమారు 400 కుటుంబాలు పూతరేకుల తయారీపై ఆధారపడ్డాయి. ఇతర ప్రాంతాలతో కలుపుకొంటే రెండు వేల మందికి పైగా మహిళలు ఈ రేకుల తయారీలో ఆరితేరిపోయారు. మనం ఎక్కడ పూతరేకు తిన్నా ఆ రేకు ఆత్రేయపురానిదేనని ఘంటాపథంగా చెప్పొచ్చు. కాలానుగుణంగా ఎన్ని సోకులో.. తొలినాళ్లలో ఒక్క పంచదారతోనే పూతరేకులు తయారు చేసేవారు. ఇవి తెల్లగా మెరిసిపోతూ.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేవి. కాలానుగుణంగా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇందులోనూ అనేక రకాలు వచ్చేశాయి. బెల్లంతో తయారు చేస్తున్నారు. మధుమేహ బాధితుల కోసం షుగర్ ఫ్రీగా అమ్ముతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి డ్రైఫూట్స్నూ కలుపుతున్నారు. అసలు రుచి మారినా.. కొత్త రుచితో ఉన్న పూతరేకులను ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. ఈ రుచులను ఆస్వాదిస్తున్నారు. స్వీట్స్ ప్రియులను ఆకట్టుకోవడానికి బోర్న్‌విటా, హార్లిక్స్ వంటివి చల్లుతూ కొత్త ఫ్లేవర్లు తయారు చేస్తున్నారు. రేకుల వెనుక రెక్కల కష్టం సాధారణంగా మనం స్వీట్‌స్టాల్‌లో పూ తరేకుల ప్యాకెట్ రేటు అడగ్గానే కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ రేకుల తయారీదారుల మాటలు వింటే వా రికి పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. గట్టిగా రోజంతా కష్టపడితే రూ.300 సంపాదిస్తున్నానని ఆత్రేయపురానికి చెందిన ఓ మహిళ చెప్పింది. మరికొందరు కూడా ఇదే తరహా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యాపారులు వీరికి కొద్దోగొప్పో రుణం ఇచ్చి, తక్కువ కూలికే రేకులు తయారు చేయించుకుంటున్న వైనాలూ ఉంటున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా తయారీ మహిళల నోట తీపి మాటలు మాత్రం వినిపించకపోవడం కొంత బాధ కలుగుతుంది. వీరందరినీ ఒక తాటి మీదకు తీసుకువస్తే మార్కెట్‌నూ శాసించగలుగుతారు. ఒకే తరహా రేటూ పొందగలుగుతారు. పూతరేకుల కబుర్లు ♦దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కోనసీమలో తయారైన పిండి వంటలతో పాటు ఆత్రేయపురం పూతరేకులను అప్పటి ప్రధాని వాజ్‌పేయ్‌కు రుచి చూపించారని ఇక్కడి ప్రజలు గర్వంగా చెబుతారు. ఆత్రేయపురం పూతరేకుల ఖ్యాతిని మరింత వ్యాప్తి చేసేలా తపాలా శాఖ గత ఏడాది ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది. ♦రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ, భవానీ ల్యాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ) నేతృత్వంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కోసం 10 మీటర్ల పూతరేకు తయారు చేసింది. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంపాదించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. త్వరలో అధికారికంగా సర్టిఫికెట్ జారీ కానుంది. ♦చాలా సినిమాల్లో పూతరేకుల ప్రస్తావన కనిపిస్తుంది. దిగ్గజ బాలీవుడ్ నటుడు అమ్రీష్‌పురీకి అత్యంత ఇష్టమైన వాటిలో పేపర్ స్వీట్ (పూతరేకును ఆయన ముద్దుగా పిలుచుకునే పేరు) ఒకటని చెబుతారు. ఏకతాటి మీదకు రావాలి ఆత్రేయపురానికి విశిష్ట ఖ్యాతి ఆర్జించి పెడుతున్న పూతరేకుల తయారీలో మహిళలదే కీలక పాత్ర. ప్రస్తుతం అసంఘటితంగా ఉన్న వీరందరూ ఒకే తాటి పైకి రావాల్సిన అవసరముంది. నాణ్యత, మార్కెట్ విషయంలో ఏకాభిప్రాయానికి రావాలి. అప్పుడే వీరికి శ్రమకు తగ్గ ప్రతిఫలం వస్తుంది. తలోదారిలో తయారు చేసుకుంటూ పోతే మార్కెట్‌ను శాసించలేని పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో మార్పు రావాలి. – గాదిరాజు ప్రసాదరాజు, ఆత్రేయపురం ప్రోత్సాహం అందించాలి చాలా కాలం నుంచి పూత రేకులు తయారు చేస్తున్నాం. మా ముందు తరాల నుంచీ ఇదే చేస్తున్నాం. పేద మహిళలు చాలా మంది రేకులు తయారు చేస్తున్నారు. సరైన కూలి కూడా రావడం లేదు. ఎంతో ఓపికగా చేయాల్సిన పని ఇది. బ్యాంకులు ముందుకొచ్చి రుణాలు మంజూరు చేయాలి. ప్రోత్సాహం అందించాలి. – జి. నాగమణి, ఆత్రేయపురం -
పూతరేకులు..చాలా ఈజీ
సాక్షి, అనకాపల్లి: పూతరేకులంటే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఆత్రేయపురం. ఆంధ్ర సంప్రదాయ స్వీట్ల వంటకాల్లో వీటిది ప్రత్యేక స్థానం. నోట్లో వేస్తే చటక్కున కరిగిపోయే లక్షణమున్న వీటిని ఉమ్మడి తూర్పు గోదావరి, విజయనగరం– విశాఖపట్నం, గుంటూరు జిల్లాల సరిహద్దు గ్రామాల్లో సాధారణ పద్ధతుల్లో ఎక్కువగా తయారుచేస్తుంటారు. కానీ, ఈ ప్రాంతాలు ఆత్రేయపురం అంత ప్రసిద్ధి కాదనే చెప్పుకోవచ్చు. ఇక సంప్రదాయ పద్ధతిలో కొంచెం కష్టతరమైన వీటి తయారీ ఇప్పుడు చాలా సులభతరమైంది. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు వీటి తయారీకి ప్రత్యేక యంత్రాన్ని రూపొందించారు. సాధారణ పద్ధతిలో తయారీ ఇలా.. పూతరేకుల తయారీకి ప్రత్యేకంగా తయారుచేసిన మట్టికుండను వాడతారు. కుండ పైభాగం నున్నగా వెడల్పుగా ఉంటూ. మంటపెట్టడానికి కింది భాగంలో రంధ్రాన్ని పెడతారు. ఇక బియ్యాన్ని ఒకరోజు ముందుగా నీటిలో నానబెట్టి మరుసటి రోజు రుబ్బురోలులో రుబ్బేవారు. ఈ ప్రక్రియ కష్టతరంగా మారడంతో మారుతున్న కాలానుగుణంగా గ్రైండర్లలో రుబ్బుతున్నారు. ఇలా.. మెత్తగా రుబ్బిన పిండిలో తగిన మోతాదులో నీటిని కలిపి పలచగా జాలుగా వచ్చేలా చేస్తారు. బోర్లించిన కుండ అడుగుభాగం నుంచి కొబ్బరి ఆకులతో సన్నని మంట పెడుతూ కుండ వేడెక్కిన తర్వాత పూతరేకుల తయారీ ప్రక్రియ ప్రారంభిస్తారు. మంచినూనే లేదా నేతిని కుండ పైభాగాన రాస్తారు. పలుచని వస్త్రాన్ని జాలుగా ఉన్న బియ్యపు పిండిలో ముంచి కుండ వేడెక్కిన తరువాత ఆ వస్త్రాన్ని కుండపై ఒకవైపు నుంచి మరొక వైపుకు లాగుతారు. కుండ వేడికి పిండి పలుచని పొరలా వస్తుంది. మంట ఎక్కువైనా తక్కువైనా పూతరేకులు విరిగిపోతాయి. ఇలా వీటిని ఈ విధానంలో రోజుకు కేవలం 200వరకు మాత్రమే చేయగల్గుతారు. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు తయారుచేసిన పూతరేకుల తయారీ యంత్రం తయారీ సులభతరానికి యంత్రం ఈ నేపథ్యంలో.. సాంకేతికత జోడించి పూతరేకుల తయారీని సులభతరం చేయాలన్న ఆలోచన అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలకు 2016లో కల్గింది. అంతే.. ఈ ఆలోచనను శాస్త్రవేత్తలు డాక్టర్ పీవీకే జగన్నాథరావు, డాక్టర్ పి. శ్రీదేవిలు కార్యరూపం దాల్చారు. పూతరేకులను తయారుచేసే యంత్రాన్ని రూపొందించారు. కరెంట్ ఆధారంగా పనిచేసే ఈ యంత్రంపై పూతరేకులను ఒకదాని తర్వాత ఒకటి వేగంగా తీయ్యొచ్చు. అదే పాత విధానంలో అయితే కుండకు పెట్టే మంట అటు ఎక్కువ కాకుండా, ఇటు తక్కువ కాకుండా చూసుకోవడంలో ఎక్కువ సమయం పడుతుంది. దీంతో యంత్రం రాకతో వాటి తయారీ మరింత సులభతరమైంది. నాలుగు పేటెంట్లు సాధించిన ఆర్‌ఏఆర్‌ఎస్ గతంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఉప్పుడు బియ్యం యంత్రానికి, ప్రాసెస్ పౌడర్ బెల్లానికి, మిషనరీ పౌడర్ బెల్లానికి మూడు పేటెంట్లు పొందారు. ఇప్పుడు తాజాగా పూతరేకుల తయారీ యంత్రానికి చెన్నైలో ఉన్న సౌత్ ఇండియా ఇంటెలెక్చువల్ సంస్థ ఈనెల 7న పేటెంట్ హక్కులను కల్పిస్తూ ఆర్‌ఏఆర్‌ఎస్‌కు అనుమతినిచ్చింది. రోజుకు 200 నుంచి 1,200కు పెరుగుదల సాధారణ విధానంతో రోజుకి గరిష్టంగా 200 వరకు పూతరేకులు తయారుచేస్తారు. పెట్టుబడిపోను రూ.650 వరకు మిగులుతోంది. ఈ నేపథ్యంలో.. ఆర్‌ఏఆర్‌ఎస్ వారు తయారుచేసిన యంత్రం ద్వారా అయితే రోజుకు గరిష్టంగా 1,200 వరకు తయారుచేయవచ్చు. పెట్టుబడి ఖర్చులు పోను..రూ.2వేల వరకు లాభం ఆర్జించవచ్చు. ఈ యంత్రం ఖరీదు దాదాపు రూ.35 వేలు. రుచిలో ఏమాత్రం తేడాలేదు ఆత్రేయపురంలో మా బృందం నెల రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించాం. పూతరేకుల తయారీ వివరాలను అడిగి తెలుసుకున్నాం. యంత్రం రూపొందించిన తర్వాత తయారుచేసిన పూతరేకులకు, సా«ధారణ పద్ధతుల్లో తయారుచేసిన పూతరేకులకు మధ్య రుచి వ్యత్యాసం కూడా పరిశీలించాం. రెండింటికీ ఒకే రుచి వచ్చాయి. – పీవీకే జగన్నాథరావు, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త -
‘పోస్ట్’లో పూతరేకులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు పోస్టల్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలు, చేనేత ఉత్పత్తుల పేరిట పోస్టల్ కవర్లు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆత్రేయపురం పూతరేకులు, ధర్మవరం చీరల ప్రత్యేకతను తెలియజేసే కవర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా వీటిని జాతీయంగా, అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంటోంది. ఆప్కో, లేపాక్షితో పాటు వివిధ ఆహార ఉత్పత్తుల సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఏపీ సర్కిల్ అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.సుధీర్‌బాబు తెలిపారు. ఆప్కోతో ఒప్పందం ద్వారా ఇప్పటికే ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ తదితర చేనేత ఉత్పత్తులను దేశవ్యాప్తంగా డెలివరీ చేస్తున్నామని చెప్పారు. బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు తదితర ఆహార ఉత్పత్తులను కూడా వేగంగా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ముందుగా ఆత్రేయపురం పూతరేకులను సమీప ప్రాంతాలకు డెలివరీ చేసేందుకు అవసరమైన జాగ్రత్తలను పరిశీలిస్తున్నామని తెలిపారు. వీటన్నిటి కోసం ఆన్లైన్ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నామని, గాంధీ జయంతి సందర్భంగా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మహనీయుల పేరిట పోస్టల్ కవర్లు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వివిధ రంగాల్లో సేవలందించిన మహనీయుల పేరిట ప్రత్యేక కవర్లను పోస్టల్ శాఖ విడుదల చేస్తోందని సుధీర్‌బాబు చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు(జీఐ) పొందిన 18 ఉత్పత్తులతో పాటు జీఐ కోసం దరఖాస్తు చేసుకున్న మరో 10 ఉత్పత్తులపై కూడా ప్రత్యేక తపాలా కవర్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 33 ప్రత్యేక కవర్లు విడుదల చేసినట్టు వివరించారు. రూ.20 నుంచి రూ.150 ధర ఉన్న ఈ కవర్లను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయన్నారు. దేశంలో ఇంత పెద్దఎత్తున ప్రత్యేక కవర్లను విడుదల చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని సుధీర్‌బాబు పేర్కొన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తుల పేరిట కూడా ప్రత్యేక కవర్లు విడుదల చేయడానికి పోస్టల్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. -
ఆత్రేయపురం పూతరేకులు