రాజమహేంద్రవరం డెస్క్: ఆత్రేయపురం.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది పూతరేకు. ఈ పేరు వింటేనే నోరూరుతుంది. రుచిలో.. రూపంలో దీనికేదీ సాటి రాదు. ఆత్రేయపురంలో పుట్టి ఆ ప్రాంతానికి ఓ బ్రాండ్ ఇమేజిని తెచ్చిపెట్టింది అందుకే. వందేళ్లకు పైబడిన చరిత్రను సొంతం చేసుకున్న ఆత్రేయపురం పూతరేకులకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ఇచ్చేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
ఇందుకోసం విశాఖలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వ విద్యాలయం సహకారంతో సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ఇప్పటికే దరఖాస్తు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే మూడు నెలల్లోనే చెన్నైలోని జీఐ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఆత్రేయపురం పూతరేకులకు గుర్తింపు జారీ అవుతుంది. దీంతో ఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుంది.
పూతరేకులకు స్ఫూర్తి
పూర్వం మైసూరుకు చెందిన ఒక మహిళ ఆత్రేయపురం కోడలిగా వచ్చింది. అప్పట్లో అన్నం వారుస్తుండగా వచ్చిన గంజి కుండపై పడి, రేకుగా వచ్చింది. దానిని చూసి విస్తుపోయిన ఆమె సరదాగా పంచదారతో కలిపి తిని ముచ్చట పడింది. అలా ఆవిర్భవించిందే పూతరేకు.
తొలినాళ్లలో క్షత్రియ మహిళలు ఈ రేకు తయారు చేసి, పంచదార అద్దేవారు. కాలక్రమంలో ఇతర వర్గాల మహిళలు కూడా ఈ రేకు తయారీ నేర్చుకున్నారు. ఉపాధిగా మార్చుకున్నారు. ఒక్క ఆత్రేయపురంలోనే సుమారు 400 కుటుంబాలు పూతరేకుల తయారీపై ఆధారపడ్డాయి. ఇతర ప్రాంతాలతో కలుపుకొంటే రెండు వేల మందికి పైగా మహిళలు ఈ రేకుల తయారీలో ఆరితేరిపోయారు. మనం ఎక్కడ పూతరేకు తిన్నా ఆ రేకు ఆత్రేయపురానిదేనని ఘంటాపథంగా చెప్పొచ్చు.
కాలానుగుణంగా ఎన్ని సోకులో..
తొలినాళ్లలో ఒక్క పంచదారతోనే పూతరేకులు తయారు చేసేవారు. ఇవి తెల్లగా మెరిసిపోతూ.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేవి. కాలానుగుణంగా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇందులోనూ అనేక రకాలు వచ్చేశాయి. బెల్లంతో తయారు చేస్తున్నారు. మధుమేహ బాధితుల కోసం షుగర్ ఫ్రీగా అమ్ముతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి డ్రైఫూట్స్‌నూ కలుపుతున్నారు. అసలు రుచి మారినా.. కొత్త రుచితో ఉన్న పూతరేకులను ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. ఈ రుచులను ఆస్వాదిస్తున్నారు. స్వీట్స్ ప్రియులను ఆకట్టుకోవడానికి బోర్న్‌విటా, హార్లిక్స్ వంటివి చల్లుతూ కొత్త ఫ్లేవర్లు తయారు చేస్తున్నారు.
రేకుల వెనుక రెక్కల కష్టం
సాధారణంగా మనం స్వీట్‌స్టాల్‌లో పూ తరేకుల ప్యాకెట్ రేటు అడగ్గానే కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ రేకుల తయారీదారుల మాటలు వింటే వా రికి పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. గట్టిగా రోజంతా కష్టపడితే రూ.300 సంపాదిస్తున్నానని ఆత్రేయపురానికి చెందిన ఓ మహిళ చెప్పింది. మరికొందరు కూడా ఇదే తరహా ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు వ్యాపారులు వీరికి కొద్దోగొప్పో రుణం ఇచ్చి, తక్కువ కూలికే రేకులు తయారు చేయించుకుంటున్న వైనాలూ ఉంటున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా తయారీ మహిళల నోట తీపి మాటలు మాత్రం వినిపించకపోవడం కొంత బాధ కలుగుతుంది. వీరందరినీ ఒక తాటి మీదకు తీసుకువస్తే మార్కెట్‌నూ శాసించగలుగుతారు. ఒకే తరహా రేటూ పొందగలుగుతారు.
పూతరేకుల కబుర్లు
♦దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కోనసీమలో తయారైన పిండి వంటలతో పాటు ఆత్రేయపురం పూతరేకులను అప్పటి ప్రధాని వాజ్‌పేయ్‌కు రుచి చూపించారని ఇక్కడి ప్రజలు గర్వంగా చెబుతారు. ఆత్రేయపురం పూతరేకుల ఖ్యాతిని మరింత వ్యాప్తి చేసేలా తపాలా శాఖ గత ఏడాది ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.
♦రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ, భవానీ ల్యాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ) నేతృత్వంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కోసం 10 మీటర్ల పూతరేకు తయారు చేసింది. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంపాదించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. త్వరలో అధికారికంగా సర్టిఫికెట్ జారీ కానుంది.
♦చాలా సినిమాల్లో పూతరేకుల ప్రస్తావన కనిపిస్తుంది. దిగ్గజ బాలీవుడ్ నటుడు అమ్రీష్‌పురీకి అత్యంత ఇష్టమైన వాటిలో పేపర్ స్వీట్ (పూతరేకును ఆయన ముద్దుగా పిలుచుకునే పేరు) ఒకటని చెబుతారు.
ఏకతాటి మీదకు రావాలి
ఆత్రేయపురానికి విశిష్ట ఖ్యాతి ఆర్జించి పెడుతున్న పూతరేకుల తయారీలో మహిళలదే కీలక పాత్ర. ప్రస్తుతం అసంఘటితంగా ఉన్న వీరందరూ ఒకే తాటి పైకి రావాల్సిన అవసరముంది. నాణ్యత, మార్కెట్ విషయంలో ఏకాభిప్రాయానికి రావాలి. అప్పుడే వీరికి శ్రమకు తగ్గ ప్రతిఫలం వస్తుంది. తలోదారిలో తయారు చేసుకుంటూ పోతే మార్కెట్‌ను శాసించలేని పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో మార్పు రావాలి.
– గాదిరాజు ప్రసాదరాజు, ఆత్రేయపురం
ప్రోత్సాహం అందించాలి
చాలా కాలం నుంచి పూత రేకులు తయారు చేస్తున్నాం. మా ముందు తరాల నుంచీ ఇదే చేస్తున్నాం. పేద మహిళలు చాలా మంది రేకులు తయారు చేస్తున్నారు. సరైన కూలి కూడా రావడం లేదు. ఎంతో ఓపికగా చేయాల్సిన పని ఇది. బ్యాంకులు ముందుకొచ్చి రుణాలు మంజూరు చేయాలి. ప్రోత్సాహం అందించాలి.
– జి. నాగమణి, ఆత్రేయపురం
Comments
Please login to add a commentAdd a comment