
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పళని పంచామృతానికి జీఐ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని జియోగ్రాఫిక్ ఇండెక్షన్ డిప్యూటీ రిజిస్ట్రార్ చిన్న రాజ్ చెప్పారు. దిండుగల్ జిల్లా పళనిలో దండాయుధపాణి స్వామిగా వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. పళని అంటే పంచామృతం. సహజ సిద్ధంగా ఐదు రకాల వస్తువులతో ఈ ప్రసాదం తయారు చేస్తారు. అరటి, బెల్లం, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన తేనె, కర్జూరం వంటి వాటితో సిద్ధం చేస్తున్న ఈ పంచామృతం కొనుగోలుకు భక్తులు బారులు తీరుతుంటారు. దీని విక్రయాలు, అన్ని రకాల హక్కులు పళని ఆలయ పాలక మండలికే అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధి చెందిన ఈ పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పించేందుకు తగ్గ చర్యలు చేపట్టి, సెంటర్ ఫుడ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రంలో అన్ని రకాల పరిశోధనలు చేశారు. ప్రక్రియలన్నీ ముగియడంతో పళని పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పిస్తూ బుధవారం సంబంధిత వర్గాలు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment