భారీ దిగుమతి సుంకాల బెడద తప్పించుకునేందుకు, మేకిన్ ఇండియా నినాద ప్రయోజనాలను పొందేందుకు ఈ–కామర్స్ దిగ్గజాలు క్రమంగా భారత్‌లో తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటిదాకా సొంత బ్రాండ్స్ కోసం చైనా, మలేసియాపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్ కొన్నాళ్లుగా మేడిన్ ఇండియా ఉత్పత్తులవైపు మొగ్గుచూపుతోంది. దీంతో తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే దాదాపు 300 కేటగిరీల ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గించగలిగామని కంపెనీ వెల్లడించింది. ‘‘రెండేళ్ల క్రితం దాకా దాదాపు 100 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చైనా నుంచే వచ్చేవి. ప్రస్తుతం ఇది 50 శాతానికన్నా తక్కువకి పడిపోయింది. ఇక మా ఫర్నిచర్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టినప్పుడు మొత్తం శ్రేణిని మలేసియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇది 50 శాతం కన్నా తక్కువే ఉంది’’ అని ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ లేబుల్ బిజినెస్ విభాగం హెడ్ ఆదర్శ్ మీనన్ చెప్పారు.
ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం మార్‌క్యూ, పర్ఫెక్ట్ హోమ్స్, బిలియన్, స్మార్ట్ బై మొదలైన ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది. ఇవి కంపెనీ మొత్తం అమ్మకాల్లో 8 శాతం దాకా ఉంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్స్‌టైల్స్, ఆండ్రాయిడ్ టీవీలు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్స్, చిన్న స్థాయి ఉపకరణాలు మొదలైనవాటిని దేశీయంగా సోర్సింగ్ చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు 50–60 శాతం యాక్సెసరీలను కూడా భారత్ నుంచే సోర్సింగ్ చేస్తోంది. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజాలను భారత్‌లో తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
చిన్న వ్యాపారస్తుల నిరసనలు..
స్మార్ట్‌ఫోన్స్ దిగుమతులపై భారీగా సుంకాల వడ్డన ఉండటంతో యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఐఫోన్స్ తదితర ఖరీదైన ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఫాక్స్‌కాన్, విస్ట్రన్ వంటి సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. అమెజాన్ కూడా చాలా మటుకు ప్రైవేట్ లేబుల్స్‌ను భారత్‌లోనే రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. ఏసీలు, మొబైల్‌ఫోన్ యాక్సెసరీలు, నిత్యావసరాలు, గృహోపకరణాలు, ఆహారోత్పత్తులు తదితర ప్రైవేట్ లేబుల్స్ అమెజాన్‌కు ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ దాదాపు 150 ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తులు సేకరిస్తుండగా.. వీటిలో 100 ఫ్యాక్టరీలు భారత్‌కి చెందినవేనని సంస్థ ప్రైవేట్ లేబుల్ వ్యాపార విభాగం హెడ్ మీనన్ పేర్కొన్నా రు. అయితే, విలువపరంగా చైనా, మలేసియాతో పోలిస్తే భారత ఉత్పత్తుల వాటా ఎంత ఉంటోందనేది మాత్రం తెలపలేదు. ఇలా సొంత ప్రైవేట్ లేబుల్స్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రవేశపెడుతుండటాన్ని గత రెండేళ్లుగా చిన్న వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వీటితో పోటీపడేందుకు తాము అసంబద్ధ స్థాయిలో ధరలను తగ్గించుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెజాన్ వంటి సంస్థలు సొంత ప్రైవేట్ లేబుల్స్ ఏర్పాటు చేసుకోకుండా నియంత్రిస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్రం గతేడాది డిసెంబర్‌లో మార్చినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ వివరణనివ్వడంతో ప్రైవేట్ లేబుల్స్‌కు కొంత వెసులుబాటు లభిస్తోంది.
చిన్న సంస్థలకు తోడ్పాటు..
ధరలపరంగానో నాణ్యతపరంగానో చాలా వ్యత్యాసాలు ఉన్న ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే ప్రైవేటు లేబుల్స్‌ను ప్రవేశపెడుతున్నామని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్నాయి. మరోవైపు, వాల్‌మార్ట్‌కి చెందిన పలు ప్రైవేట్ లేబుల్స్ కూడా భారత్‌లో తయారవుతున్నాయని, ఇది తయారీ భాగస్వామ్య సంస్థలకు తోడ్పాటుగా ఉంటోందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్రైవేట్ బ్రాండ్స్ వ్యాపారం ద్వారా ఇటు దేశీ తయారీ సంస్థలు, ఉత్పత్తిదారులు .. ముఖ్యంగా లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల వృద్ధికి, నవకల్పనల ఆవిష్కరణలకు మరింత మద్దతు లభిస్తోందని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు తెలిపాయి.
ఈ–కామర్స్ @ మేడిన్ ఇండియా
Published Sat, Jun 22 2019 5:37 AM | Last Updated on Sat, Jun 22 2019 5:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment