ఈ–కామర్స్‌కు కరోనా జోష్‌..! | E-commerce firms witness 2X rise in orders, gear up for second Covid wave | Sakshi
Sakshi News home page

ఈ–కామర్స్‌కు కరోనా జోష్‌..!

Published Thu, Apr 15 2021 5:10 AM | Last Updated on Thu, Apr 15 2021 5:10 AM

E-commerce firms witness 2X rise in orders, gear up for second Covid wave - Sakshi

న్యూఢిల్లీ: కరోనా  మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో ఈ–కామర్స్‌ సంస్థల వ్యాపారం జోరందుకుంటోంది. కోవిడ్‌ కేసుల కట్టడికి కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం వంటి చర్యలతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లకు వచ్చే ఆర్డర్ల సంఖ్య సాధారణ పరిస్థితులతో పోలిస్తే దాదాపు రెట్టింపయిందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఎక్కువగా నిత్యావసరాలకు డిమాండ్‌ ఉంటోందని తెలిపాయి. కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయని వివరించాయి.  

సరఫరా పెంపునకు ఎఫ్‌ఎంసీజీల కసరత్తు
గతేడాది లాక్‌డౌన్‌ నేర్పిన పాఠాలతో ఐటీసీ, పార్లే ప్రోడక్ట్స్, మారికో, ఇమామి, సీజీ కార్ప్‌ గ్లోబల్‌ వంటి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఉత్పత్తుల సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తపడుతున్నాయి. ‘గతేడాది నేర్చుకున్న పాఠాలతో ఈసారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కొనగలుగుతున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలన్నది కంపెనీలు నేర్చుకున్నాయి. అలాగా ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకున్నాయి.

సరఫరాపరంగా ఇప్పుడు అన్ని వర్గాలకు మరింత స్పష్టత ఉంది‘ అని పార్లే ప్రోడక్ట్స్‌ సీనియర్‌ కేటగిరీ హెడ్‌ మయాంక్‌ షా తెలిపారు. అన్ని మాధ్యమాల ద్వారా ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉండేలా తగు చర్యలన్నీ తీసుకున్నట్లు ఐటీసీ ప్రతినిధి వివరించారు. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసేందుకు ఆరు మెట్రో నగరాల్లో ఐటీసీ ఈ–స్టోర్స్‌ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గతేడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలైనప్పుడు సఫోలా స్టోర్‌ అనే మా పోర్టల్‌ ద్వారా వినియోగదారులందరికీ మా ఉత్పత్తులు నేరుగా అందేలా కొన్ని చర్యలు అమలు చేశాం. మరిన్ని వినూత్న ప్రయోగాలు కొనసాగిస్తాం‘ అని మారికో వర్గాలు తెలిపాయి.

ఇబ్బందులూ ఉన్నాయ్‌..
సరఫరాకు ఆటంకాలు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నప్పటికీ ఇంకా కొన్ని అడ్డంకులు తప్పడం లేదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కార్మికుల కొరత కారణంగా ఫ్యాక్టరీలు పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయడం లేదని, కొత్తగా కరోనా కట్టడికి పలు ప్రాంతాల్లో విధిస్తున్న ఆంక్షల కారణంగా రవాణా వ్యయాలూ పెరుగుతున్నాయని సీజీ కార్ప్‌ గ్లోపల్‌ ఎండీ వరుణ్‌ చౌదరి తెలిపారు. ఈ నేపథ్యంలో తయారీని పెంచుకునేందుకు, సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేందుకు, ఆకస్మికంగా అవాంతరాలు ఎదురైనా నిల్వలకు సమస్య ఎదురవకుండా చూసుకునేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు చౌదరి చెప్పారు.  ‘గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (తొలి ఆరు నెలల్లో) ఆన్‌లైన్‌ అమ్మకాలు ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. ఆ తర్వాత మిగతా రెండు క్వార్టర్లలో ఆ జోరు కాస్త తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది‘ అని మయాంక్‌ షా తెలిపారు. అయితే, తయారీ నుంచి పంపిణీ దాకా వివిధ దశల్లో ఉన్న వారు కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రతికూల పరిణామాల బారిన పడకుండా చూసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఏకైక సవాలుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement