సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ రంగంలో భారీ పెట్టుబడులతో దూసుకొస్తున్న విదేశీ కంపెనీలకు షాకిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కామర్స్ నిబంధనలను కఠినతరం చేస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో మార్పులను తీసుకొచ్చింది. ఈ నిర్ణయం దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మేజర్ వాటానుసొంతం చేసుకున్న వాల్‌మార్ట్‌కు, అమెరికా ఆన్‌లైన్ రీటైలర్ అమెజాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీలకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. అలాగే పండుగ సీజన్‌లో తక్కువ ధరకే వస్తువులను సొంతం చేసుకోవాలను కునే వినియోగదారుడికి భారీ నిరాశే.
చిన్న వ్యాపారస్తులనుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఆన్‌లైన్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి సవరించిన కొత్త విధానంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పుష్కలంగా నిధులున్న ఈ-కామర్స్ సంస్థల తీవ్ర పోటీ నుంచి దేశీ వ్యాపార సంస్థల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఈ నిబంధనలు రూపొందించినట్లు వివరించింది. తాజా నిబంధనలు ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నాయి.
నిబంధనలు
తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను ఈ-కామర్స్ సంస్థలు తమ సొంత పోర్టల్స్‌లో విక్రయించడం కుదరదు.
ధరను ప్రభావితం చేసేలా ఏ ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా తమ పోర్టల్స్‌లోనే విక్రయించేలా ఈ-కామర్స్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోకూడదు.
తమ షాపింగ్ పోర్టల్స్‌లో విక్రయించే విక్రేతలకు సర్వీసులు అందించడంలో ఈ-కామర్స్ సంస్థలు పక్షపాతం, వివక్ష చూపించకూడదు. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, అడ్వర్టైజ్‌మెంట్, మార్కెటింగ్, పేమెంట్స్, ఫైనాన్సింగ్ మొదలైన సర్వీసులు ఇందులో ఉంటాయి.
ఈ-కామర్స్ సంస్థకు చెందిన గ్రూప్ కంపెనీలు.. కొనుగోలుదారులకు అందించే క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్ల విషయంలో న్యాయబద్ధంగా, వివక్ష లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. తమ దగ్గరున్ననిల్వల్లో 25శాతం ఉత్పత్తులకు మించి విక్రయించరాదు.
నిబంధనలన్నింటినీ పాటిస్తున్నట్లుగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఆడిట్ సర్టిఫికెట్‌ను ఈ- కామర్స్ కంపెనీలు ఆ పై ఏడాది సెప్టెంబర్ 30లోగా రిజర్వ్ బ్యాంక్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రస్తుత విధానం ప్రకారం విక్రేత, కొనుగోలుదారుకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే మార్కెట్‌ప్లేస్ తరహా ఈ-కామర్స్ సంస్థల్లో మాత్రమే ప్రస్తుతం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఉన్నాయి. ఇలాంటి సంస్థలు తాము స్వయంగా కొనుగోళ్లు జరిపి, ఉత్పత్తులను నిల్వ చేసుకుని, విక్రయించడానికి లేదు. కొనుగోలుదారులకు ఈ-కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లిస్తూ తమ వ్యాపారాలను దెబ్బ తీస్తున్నాయంటూ దేశీ వ్యాపార సంస్థల నుంచి పెద్ద యెత్తున ఫిర్యాదులు రావడంతో ఈ-కామర్స్ సంస్థలను నియంత్రించే క్రమంలో కేంద్రం తాజా చర్యలు ప్రకటించింది. అయితే దీనిపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది.
పెట్టుబడులకు ప్రతికూలం
కొత్త నిబంధనలపై పరిశ్రమవర్గాలు మిశ్రమంగా స్పందించాయి. కొత్తగా మరింత మంది విక్రేతలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం వైపు ఆకర్షించే దిశగా పెడుతున్న పెట్టుబడులపై ఇవి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ-కామర్స్ రంగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వ్యాఖ్యానించారు. సర్క్యులర్‌ను పరిశీలిస్తున్నామని అమెజాన్ ఇండియా ప్రతినిధి వెల్లడించగా, స్పందించేందుకు ఫ్లిప్‌కార్ట్ నిరాకరించింది.
స్వాగతించిన సీఏఐటీ
తాజా నిబంధనలను ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ స్వాగతించింది. ఈ-కామర్స్ రంగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని, ఈ-కామర్స్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని కోరింది. "సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న విజయం ఇది. దీన్ని సక్రమంగా అమలు చేస్తే..ఈ-కామర్స్ కంపెనీలు పాటించే అనుచిత వ్యాపార విధానాలు, పోటీ లేకుండా చేసే ధరల విధానాలు, భారీ డిస్కౌంట్లు మొదలైనవి ఇకపై ఉండబోవు" అని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వ్యాఖ్యానించారు.
స్నాప్‌డీల్, ఫ్యూచర్స్ గ్రూపు హర్షం
అటు తాజా నిబంధనలపట్ల ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ హర్షం వ్యక్తం చేసింది. "మార్కెట్‌ప్లేస్‌లనేవి నిఖార్సయిన, స్వతంత్ర వెండార్ల కోసం ఉద్దేశించినవి. వీటిలో చాలా సంస్థలు చిన్న, మధ్యస్థాయి కోవకి చెందినవే. కొత్త మార్పులతో.. అందరికీ సమాన అవకాశాలు లభించగలవు" అని స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బెహల్ వ్యాఖ్యానించారు.
ఇదొక గేమ్ ఛేంజర్‌లాంటిదని ఫ్యూచర్ గ్రూప్ ఛైర్మన్ కిషోర్ బియానీ వ్యాఖ్యానించారు. ఈ విధానానికి ప్రతీ రీటైలర్ కట్టుబడి ఉండాలి.
వినియోగదారుడి ప్రయోజనాలకు నష్టం
అయితే తాజా నిబంధనలు అంతిమంగా వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని మరికొంతమంది వాదిస్తున్నారు. టెక్నోపాక్ వ్యవస్థాపకుడు ఫౌండర్ అరవింద్ సింఘాల్ మాట్లాడుతూ కొత్త విధానంలో అనేక పాయింట్లకు అర్థంలేదన్నారు. అసలు భారీ డిస్కౌంట్ అంటే ఏమిటీ? ప్రతి విక్రయదారుడికి సమాన అధికారులుంటాయా? వారి వారి వ్యూహాత్మక కారణాల ఆధారంగా ప్రతి సరఫరాదారుడు, కొనుగోలుదారిడి సంబంధాలు ఉంటాయి. ఇది చాలామంది వ్యాపార్తసులకు ప్రయోజనాలకు హానికరమైందని వ్యాఖ్యానించారు.
కాగా ‘ఈ–కామర్స్ వ్యాపార నిర్వహణ ఇటు రిటైలర్లకు, అటు వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నామని ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. .ఈ కామర్స్ వ్యాపారంలో ధరలు, డిస్కౌంట్ల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
.@Snapdeal welcomes updates to FDI policy on e-commerce. Marketplaces are meant for genuine, independent sellers, many of whom are MSMEs. These changes will enable a level playing field for all sellers, helping them leverage the reach of e-commerce. @rabhishek1982 @DIPPGOI https://t.co/tWojv3gXA7
— Kunal Bahl (@1kunalbahl) December 26, 2018
Comments
Please login to add a commentAdd a comment