చిన్న నగరాల నుంచీ ఆన్‌‘లైన్‌’ | Amazon house on wheels comes to Hyderabad | Sakshi
Sakshi News home page

చిన్న నగరాల నుంచీ ఆన్‌‘లైన్‌’

Published Sat, Oct 5 2019 5:20 AM | Last Updated on Sat, Oct 5 2019 5:20 AM

Amazon house on wheels comes to Hyderabad - Sakshi

నమూనా ఇంటి ముందు అరుణ్, షాలిని, కిషోర్‌ (కుడి)

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘నా చిన్నప్పుడు ఊర్లో వస్తువులు ఏవీ దొరికేవి కావు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవి కావు. వచ్చినా ఖరీదెక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ–కామర్స్‌ రాకతో ప్రపంచంలో లభించే ఏ వస్తువైనా ఆర్డరు చేయవచ్చు’ అని అమెజాన్‌ ఇండియా కేటగిరీ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ షాలిని పుచ్చలపల్లి అన్నారు. అమెజాన్‌ ఫెస్టివ్‌ యాత్రలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌ వచ్చిన ఆమె సాక్షి బిజినెస్‌ బ్యూరోతో మాట్లాడారు. పారదర్శక ధర కారణంగానే భారత్‌లో ఈ–కామర్స్‌ విజయవంతం అయిందన్నారు. దేశ జనాభాలో 10 శాతం మంది ఈ–కామర్స్‌ వేదికగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. ఒక ఉత్పాదనను విక్రయించేందుకు బెస్ట్‌ ప్రైస్‌తో విక్రేతలు పోటీపడతారని, ఇది కస్టమర్‌కు కలిసి వచ్చే అంశమని వివరించారు.

చిన్న నగరాల నుంచే..: కొత్తగా అమెజాన్‌కు జతకూడుతున్న కస్టమర్లలో 91 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే ఉన్నారని షాలిని వెల్లడించారు. ‘99.6% పిన్‌కోడ్స్‌కు చేరుకున్నామంటే ఈ–కామర్స్‌ పట్ల పెరిగిన అవగాహనే ఉదాహరణ. అమెజాన్‌ పోర్టల్‌లో 20 కోట్లకుపైగా ఉత్పత్తులు విక్రయిస్తున్నాం. రోజూ 2 లక్షల ప్రొడక్టులు జోడిస్తున్నాం. 5 లక్షల మంది సెల్లర్లున్నారు. ఆర్డర్లలో 40% ఒక రోజులోనే డెలివరీ చేస్తున్నాం. ప్రైమ్‌ కస్టమర్ల సంఖ్య 18 నెలల్లో రెండింతలైంది. కొనుగోలు నిర్ణయంపై కస్టమర్‌ రేటింగ్స్‌దే కీలక పాత్ర. నచ్చకపోయినా, నాసిరకంగా ఉన్నా ఉత్పాదనను 30 రోజుల్లో వెనక్కి ఇచ్చే అవకాశం ఉండడం వినియోగదార్లకున్న వెసులుబాటు’ అన్నారు.

ఆన్‌లైన్‌కు పెద్ద బ్రాండ్లు..: ఆఫ్‌లైన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న పెద్ద బ్రాండ్లను ఆన్‌లైన్‌కు తీసుకొచ్చామని అమెజాన్‌ ఫ్యాషన్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌ అరుణ్‌ సిర్దేశ్‌ముఖ్‌ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ బ్రాండ్లు కొన్ని ఉత్పాదనలను తొలిసారిగా అమెజాన్‌లో ప్రవేశపెట్టాయన్నారు. ఇవి రెండు రోజుల్లోనే తమ ఉత్పత్తులను డెలివరీ ఇస్తున్నాయని గుర్తు చేశారు. ఏడాదిలో కొత్తగా 1.20 లక్షల మంది సెల్లర్లు తోడయ్యారని కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కిషోర్‌ తోట పేర్కొన్నారు. కాగా, ఫెస్టివ్‌ యాత్రలో భాగంగా ట్రక్కులపై నిర్మించిన నమూనా ఇంటిని కంపెనీ ప్రదర్శించింది. అమెజాన్‌ పోర్టల్‌లో లభించే ఉత్పత్తులతో ఈ ఇల్లును అందంగా తీర్చిదిద్దారు.  

ఫస్ట్‌ సేల్‌ అదుర్స్‌.. : సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 వరకు నిర్వహించిన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ ఫస్ట్‌ సేల్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అని అమెజాన్‌ ప్రకటించింది. రిసెర్చ్‌ ఏజెన్సీ నీల్సన్‌ ప్రకారం.. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 మధ్య దేశంలో జరిగిన ఆన్‌లైన్‌ సేల్స్‌లో కస్టమర్లు, కొనుగోళ్ల పరంగా అమెజాన్‌ అధిక వాటా సొంతం చేసుకుంది. 500లకుపైగా సిటీస్‌ నుంచి 65,000ల కంటే ఎక్కువ సెల్లర్లకు ఆర్డర్లు లభించాయి. మిలియనీర్, క్రోర్‌పతి సెల్లర్స్‌ సంఖ్య 21,000 దాటింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో 15 రెట్లు, పెద్ద ఉపకరణాలు 8 రెట్ల వృద్ధి నమోదైంది. ఎకో డివైసెస్‌ 70 రెట్ల వృద్ధి సాధించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement