సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ అన్‌లాక్ చేస్తున్న నేపథ్యంలో ఇ–కామర్స్ వ్యాపారం పుంజుకుంటోంది. షాపింగ్ కోసం బైటికెళ్లడాన్ని తగ్గించుకుంటూ ఆన్‌లైన్ మాధ్యమానికి వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుండటం ఇందుకు తోడ్పడుతోంది. ఇక, పెరుగుతున్న వ్యాపారంతో పాటు ఇ–కామర్స్ విభాగంలో కొత్తగా మరింత మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఇ–కామర్స్ వ్యాపారం దాదాపు 80 శాతం పెరిగింది. దాదాపు 10 కోట్లమంది క్రియాశీలంగా ఉండే వినియోగదారులతో ఇ–కామర్స్ రంగం అంతకంతకూ వృద్ధి చెందుతోందని నివేదిక పేర్కొంది. లాక్‌డౌన్ ముందటి పరిస్థితి కంటే కూడా ప్రస్తుతం ఇ–కామర్స్ వ్యాపారం ఎక్కువగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్ని రకాల వస్తువులను విక్రయించే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ–కామర్స్ సంస్థలే కాదు... కిరాణా సరుకులు, వ్యాయామ పరికరాలు వంటి ప్రత్యేక కేటగిరీ వస్తువులను విక్రయించే సంస్థల వ్యాపారం కూడా జోరందుకుంది. ఐఏఎంఏఐ నివేదిక ప్రకారం దేశంలో ఇ–కామర్స్ వ్యాపారం ఇలా ఉంది...
లాక్‌డౌన్ రోజుల్లో 80 శాతం వ్యాపారం డౌన్
దేశంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలులో ఉన్న ఏప్రిల్, మేలో ప్రభుత్వం కేవలం నిత్యావసర వస్తువుల విక్రయానికే అనుమతించింది. దాంతో ఇ–కామర్స్ వ్యాపారం దాదాపు 80 శాతం తగ్గిపోయింది. మార్చి చివరి వారం నుంచి జూన్ మొదటివారం వరకూ దేశీయంగా ఇ–కామర్స్ సంస్థలు దాదాపు రూ.7,520 కోట్ల వ్యాపారాన్ని కోల్పోయారని అంచనా.
ఉపాధికీ ఊతం..
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇతర రంగాల్లో ఉద్యోగాల్లో కోత విధిస్తుంటే ఇ–కామర్స్ రంగం కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా వినియోగదారులకు సకాలంలో సరఫరా చేసేందుకు ఇ–కామర్స్ సంస్థలు కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అమెజాన్ ఇండియా తమ పంపిణీ వ్యవస్థలో కొత్తగా 50వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అటు బిగ్ బాస్కెట్ ఇటీవల కొత్తగా 12వేలమంది సిబ్బందిని నియమించుకుంది. గ్రోఫర్స్ సంస్థ ఇప్పటికే కొత్తగా 2,500 మందిని రిక్రూట్ చేసుకోగా ...మరో 5వేలమంది ఉద్యోగులను త్వరలో తీసుకుంటామని చెప్పింది. అటు ఇ–కామ్ ఎక్స్‌ప్రెస్ సంస్థ ఇటీవల కొత్తగా 7,500 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది.
అన్‌లాక్‌తో జోరందుకున్న వ్యాపారం
మే మూడో వారం నుంచి లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తున్న ప్రభుత్వం జూన్ నుంచి మరింత వెసులుబాటు కల్పించడం ఇ–కామర్స్ సంస్థలకు అనుకూలంగా మారింది. ఇ–కామర్స్ సంస్థలు దేశంలోని దాదాపు 19వేల పిన్‌కోడ్ ప్రాంతాల్లో ప్రస్తుతం సరుకులు అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు 30లక్షల వరకు షిప్‌మెంట్‌లను డెలివరీ చేస్తున్నాయి. మరికొంతకాలం పాటు వినియోగదారులు షాపింగ్ కోసం ఎక్కువగా బయటకు వెళ్లే పరిస్థితి లేనందున రాబోయే రెండు నెలల్లో ఈ వ్యాపారం మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
సంస్థలవారీగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల విషయం చూస్తే.. అమెజాన్ ఇండియా పోర్టల్‌లో ప్రధానంగా ఉద్యోగుల ‘వర్క్ ఫ్రం హోం’, విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు సంబంధించిన వస్తువుల విక్రయం విపరీతంగా పెరిగింది. మొత్తం మీద అమెజాన్ వ్యాపారం 50 శాతం పెరిగింది. ఇక, మరో దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం 90 శాతం ఎగిసింది. ఈ పోర్టల్ ద్వారా వ్యాయామ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గృహ అలంకరణ వస్తువుల విక్రయాలు గణనీయంగా ఉంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment