క్లిక్ చేస్తే ఇంటికే మందులు.. | Drugstores offer online pharmacists, customized pills, expedited | Sakshi
Sakshi News home page

క్లిక్ చేస్తే ఇంటికే మందులు..

Published Thu, Dec 4 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

క్లిక్ చేస్తే ఇంటికే మందులు..

క్లిక్ చేస్తే ఇంటికే మందులు..

⇒ ఆన్‌లైన్ బాటపట్టిన ఫార్మసీలు
⇒ అగ్రస్థానంలో అపోలో, మెడ్‌ప్లస్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తులు, ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు.. ఇవే కాదు ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఇప్పుడు మందులూ వచ్చి చేరాయి. క్లిక్ చేస్తే చాలు ఎంచక్కా ఇంటికే వచ్చి చేరుతున్నాయి. అదీ కొన్ని గంటల వ్యవధిలోనే. ఇంటర్నెట్ విస్తరణతో ఈ-కామర్స్ వ్యాపారం భారత్‌లో జోరు మీద ఉంది. ఏది కావాలన్నా అర చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో కస్టమర్లు ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఈ అంశమే ఫార్మసీ రిటైల్ కంపెనీలకు కలిసి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలే కాదు నిత్యావసర ఔషధాలనూ ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. ఇక్కడ మరో విశేషమేమంటే ఇతర కంపెనీల (సబ్‌స్టిట్యూట్) మందులూ, వాటి ధరలు తెలుసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి.
 
క్యాష్ ఆన్ డెలివరీ..
అపోలో ఫార్మసీ, మెడ్‌ప్లస్ మార్ట్, గార్డియన్ ఫార్మసీ ప్రస్తుతానికి ఈ-కామర్స్ బాట పట్టాయి. అపోలో, మెడ్‌ప్లస్‌లు ఒక అడుగు ముందుకేసి నిత్యావసర మందులనూ ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. ఈ-కామర్స్ కంపెనీల మాదిరిగానే క్యాష్ ఆన్ డెలివరీ (ఇంటి వద్దే చెల్లింపు) విధానాన్ని ఈ కంపెనీలు అనుసరిస్తున్నాయి. ఆర్డరు ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉత ్పత్తులను ఇంటికి చేరవేస్తున్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, వ్యక్తిగత సంరక్షణ, విటమిన్లు, సప్లిమెంట్లు, పిల్లల ఉత్పత్తులు.. ఇలా వేలాది రకాలు ఆన్‌లైన్‌లో కొలువుదీరాయి. ఆయుర్వేద, విదేశీ ఉత్పత్తులనూ ఇక్కడి కస్టమర్ల కోసం ఆఫర్ చేస్తున్నాయి. ప్రైవేట్ లేబుల్ ప్రొడక్టులూ విక్రయించుకునేందుకు ఫార్మసీలకు ఈ-కామర్స్ చక్కని వేదికగా నిలుస్తోంది.
 
పేరు నమోదు అయితేనే..: ఆన్‌లైన్‌లో మందులను ఆర్డరు ఇవ్వాలనుకుంటే ఫార్మసీల్లో ప్రత్యక్షంగా, లేదా వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లు తమ పేరు నమోదు చేసుకోవాలి. వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ (మందుల చీటీ) నకలును వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేయాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను సరఫరా చేయరు. కంపెనీని బట్టి రూ.500-600 ఆపై విలువ చేసే ఉత్పత్తులు ఆర్డరు చేస్తే ఎటువంటి అదనపు చార్జీ లేకుండా ఉచితంగా డెలివరీ చేస్తున్నాయి. అంతేకాదు డిస్కౌంట్లూ ఆఫర్ చేస్తున్నాయి. అపోలో ఫార్మసీ ద్వారా అయితే కనీసం రూ.200 విలువ చేసే మందులను ఆర్డరు చేయాలి. ఉత్పత్తుల విలువ రూ.600 దాటితే ఉచిత డెలివరీ. రూ.600 లోపు ఉంటే డెలివరీ చార్జీ రూ.55 చెల్లిం చాలి. డబ్బులు ముందుగా చెల్లిస్తే కస్టమర్ కోరిన ప్రదేశంలో డెలివరీ చేస్తోంది అపోలో ఫార్మసీ.
 
నచ్చిన బ్రాండ్..
నిత్యావసర మందులను భారత్‌లో ఆన్‌లైన్‌లో తొలుత పరిచయం చేసింది హైదరాబాద్‌కు చెందిన మెడ్‌ప్లస్. ఈ కంపెనీ మెడ్‌ప్లస్‌మార్ట్.కామ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయాలు చేపడుతోంది. స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల కోసం అప్లికేషన్(యాప్)ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌సైట్ ప్రత్యేకత ఏమంటే ప్రతి మందుకు సబ్‌స్టిట్యూట్(ప్రత్యామ్నాయ) మందులనూ తెరపై చూపిస్తుంది.

ఒక్కో ఔషధం ధర కంపెనీని(బ్రాండ్) బట్టి మారుతుంది. ధర, కస్టమర్  అడిగిన మందుకు, ఇతర బ్రాండ్ల మందులకుగల ధర వ్యత్యాసం, తయారు చేసిన కంపెనీ వివరాలూ పొందుపరిచింది. ఉదాహరణకు జీఎస్‌కే కంపెనీ తయారు చేసిన క్రోసిన్‌ను తీసుకుంటే అందులో ఉండే మందు ప్యారాసిటమాల్. ఇతర కంపెనీల ప్యారాసిటమాల్ మందులూ తెరపై ప్రత్యక్షమవుతాయి. తక్కువ ధరలో లభించే మంచి బ్రాండ్‌ను కస్టమర్ ఎంచుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement