Pharmacies
-
క్లిక్ చేస్తే ఇంటికే మందులు..
⇒ ఆన్లైన్ బాటపట్టిన ఫార్మసీలు ⇒ అగ్రస్థానంలో అపోలో, మెడ్‌ప్లస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తులు, ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు.. ఇవే కాదు ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఇప్పుడు మందులూ వచ్చి చేరాయి. క్లిక్ చేస్తే చాలు ఎంచక్కా ఇంటికే వచ్చి చేరుతున్నాయి. అదీ కొన్ని గంటల వ్యవధిలోనే. ఇంటర్నెట్ విస్తరణతో ఈ-కామర్స్ వ్యాపారం భారత్‌లో జోరు మీద ఉంది. ఏది కావాలన్నా అర చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో కస్టమర్లు ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఈ అంశమే ఫార్మసీ రిటైల్ కంపెనీలకు కలిసి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలే కాదు నిత్యావసర ఔషధాలనూ ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. ఇక్కడ మరో విశేషమేమంటే ఇతర కంపెనీల (సబ్‌స్టిట్యూట్) మందులూ, వాటి ధరలు తెలుసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. క్యాష్ ఆన్ డెలివరీ.. అపోలో ఫార్మసీ, మెడ్‌ప్లస్ మార్ట్, గార్డియన్ ఫార్మసీ ప్రస్తుతానికి ఈ-కామర్స్ బాట పట్టాయి. అపోలో, మెడ్ప్లస్లు ఒక అడుగు ముందుకేసి నిత్యావసర మందులనూ ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. ఈ-కామర్స్ కంపెనీల మాదిరిగానే క్యాష్ ఆన్ డెలివరీ (ఇంటి వద్దే చెల్లింపు) విధానాన్ని ఈ కంపెనీలు అనుసరిస్తున్నాయి. ఆర్డరు ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉత ్పత్తులను ఇంటికి చేరవేస్తున్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, వ్యక్తిగత సంరక్షణ, విటమిన్లు, సప్లిమెంట్లు, పిల్లల ఉత్పత్తులు.. ఇలా వేలాది రకాలు ఆన్లైన్లో కొలువుదీరాయి. ఆయుర్వేద, విదేశీ ఉత్పత్తులనూ ఇక్కడి కస్టమర్ల కోసం ఆఫర్ చేస్తున్నాయి. ప్రైవేట్ లేబుల్ ప్రొడక్టులూ విక్రయించుకునేందుకు ఫార్మసీలకు ఈ-కామర్స్ చక్కని వేదికగా నిలుస్తోంది. పేరు నమోదు అయితేనే..: ఆన్లైన్లో మందులను ఆర్డరు ఇవ్వాలనుకుంటే ఫార్మసీల్లో ప్రత్యక్షంగా, లేదా వెబ్సైట్ ద్వారా కస్టమర్లు తమ పేరు నమోదు చేసుకోవాలి. వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ (మందుల చీటీ) నకలును వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేయాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను సరఫరా చేయరు. కంపెనీని బట్టి రూ.500-600 ఆపై విలువ చేసే ఉత్పత్తులు ఆర్డరు చేస్తే ఎటువంటి అదనపు చార్జీ లేకుండా ఉచితంగా డెలివరీ చేస్తున్నాయి. అంతేకాదు డిస్కౌంట్లూ ఆఫర్ చేస్తున్నాయి. అపోలో ఫార్మసీ ద్వారా అయితే కనీసం రూ.200 విలువ చేసే మందులను ఆర్డరు చేయాలి. ఉత్పత్తుల విలువ రూ.600 దాటితే ఉచిత డెలివరీ. రూ.600 లోపు ఉంటే డెలివరీ చార్జీ రూ.55 చెల్లిం చాలి. డబ్బులు ముందుగా చెల్లిస్తే కస్టమర్ కోరిన ప్రదేశంలో డెలివరీ చేస్తోంది అపోలో ఫార్మసీ. నచ్చిన బ్రాండ్.. నిత్యావసర మందులను భారత్‌లో ఆన్లైన్లో తొలుత పరిచయం చేసింది హైదరాబాద్‌కు చెందిన మెడ్‌ప్లస్. ఈ కంపెనీ మెడ్‌ప్లస్‌మార్ట్.కామ్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విక్రయాలు చేపడుతోంది. స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల కోసం అప్లికేషన్(యాప్)ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వెబ్సైట్ ప్రత్యేకత ఏమంటే ప్రతి మందుకు సబ్‌స్టిట్యూట్(ప్రత్యామ్నాయ) మందులనూ తెరపై చూపిస్తుంది. ఒక్కో ఔషధం ధర కంపెనీని(బ్రాండ్) బట్టి మారుతుంది. ధర, కస్టమర్ అడిగిన మందుకు, ఇతర బ్రాండ్ల మందులకుగల ధర వ్యత్యాసం, తయారు చేసిన కంపెనీ వివరాలూ పొందుపరిచింది. ఉదాహరణకు జీఎస్కే కంపెనీ తయారు చేసిన క్రోసిన్ను తీసుకుంటే అందులో ఉండే మందు ప్యారాసిటమాల్. ఇతర కంపెనీల ప్యారాసిటమాల్ మందులూ తెరపై ప్రత్యక్షమవుతాయి. తక్కువ ధరలో లభించే మంచి బ్రాండ్‌ను కస్టమర్ ఎంచుకోవచ్చు. -
మందుల దుకాణం.. అక్రమార్కుల మకాం!
ఇష్టారాజ్యంగాషాపుల నిర్వహణ ఫార్మాసిస్టులు లేనిదుకాణాలే ఎక్కువ మందుల చీటీ లేకుండానే విక్రయాలు కొరవడిన పర్యవేక్షణ సంగారెడ్డి క్రైం: జిల్లాలో మందుల దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా తయారైంది. డబ్బే పరమావధిగా అక్రమార్కులు మందుల దుకాణాల్లో తిష్టవేస్తున్నారు. ఏ మాత్రం అవగాహన లేనివారు మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దుకాణం నిర్వహించే వ్యక్తి ఫార్మాసిస్టు అయి ఉండాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. అంతేగాక.. కనీసం ఇంటర్మీడియెట్ స్థాయి వరకు చదివిన వారైనా ఉండకపోవడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే మందుల దుకాణాదారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ ధ్రువీకరించిన మందుల చీటీ ఉంటేనే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి చీటీ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 3,800 మెడికల్ దుకాణాలున్నాయి. ఇందులో 30 హోల్‌సేల్ కాగా, ఆస్పత్రులకు అనుసంధానమైనవి వెయ్యి, గ్రామాల్లో 900 దుకాణాలు ఉన్నాయి. దాదాపు 80 శాతం వరకు ఫార్మాసిస్టులు లేని దుకాణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఎక్కడైనా ఆస్పత్రి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారంటే దానికి అనుసంధానంగా మందుల దుకాణం పెట్టడానికి పోటీ విపరీతంగా ఉంటుంది. ఇటీవల జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కొత్తగా ఏర్పాటు చేసిన కొన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మందుల దుకాణం మేం పెడతామంటే...మేం పెడతామని అనేక మంది లక్షల రూపాయలు గుడ్‌విల్‌గా ఇచ్చేందుకు సైతం పోటీగా ముందుకు వచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. చివరకు ఆయా ఆస్పత్రి వర్గాలే సొంతంగా మెడికల్ షాపులను నెలకొల్పాయి. అయితే విడిగా నిర్వహిస్తున్న మందుల దుకాణాల్లో ఫార్మాసిస్టే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. దుకాణం నిర్వహిస్తున్న సమయాల్లో ఆయన పర్యవేక్షణలోనే మందుల విక్రయాలు జరగాలి. కానీ అనేక రిటైల్ దుకాణాల్లో ఫార్మాసిస్టు అందుబాటులో ఉండటం లేదు. పట్టణాల్లోనే ఫార్మాసిస్టు లేకుండా విక్రయాలు కొనసాగుతుంటే ఇక గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. గ్రామాల్లో ఎలాంటి ఫార్మాసిస్టు ధ్రువపత్రం లేకుండానే మందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇతరుల సర్టిఫికెట్లను అద్దెకు తెచ్చుకుని దుకాణాలను నడుపుతున్నారు. ఎంబీబీఎస్ వైద్యులు సిఫార్సు చేసిన మందుల చీటీ ఆధారంగానే జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న రోగాలకు సైతం మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చిన్న పిల్లలు వెళ్లి అడిగినా మందు బిళ్లలు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే డాక్టర్ సూచన మేరకు ఎవరికైనా ఇచ్చే మందులకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలి. కానీ బిల్లు కావాలంటే నిర్వాహకులు అదనంగా పది శాతం డబ్బులు వసూలు చేస్తున్నారు. కానరాని తనిఖీలు జిల్లావ్యాప్తంగా మందుల దుకాణాల నిర్వహణపై జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. కానీ ఆయన ఏనాడూ ఏ ఒక్క మందుల దుకాణంలో కూడా తనిఖీ చేసిన సందర్భాలు లేవు. హైదరాబాద్ నగరం నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించే ఆయన ఎప్పుడు వస్తారో? ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు. మందుల దుకాణాల ఇష్టారాజ్యంపై సంబంధిత జిల్లా అధికారుల చర్యలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మందుల దుకాణాలకు లెసైన్సులు ఉన్నా యా? సర్టిఫికెట్ ఉన్న ఫార్మాసిస్టే దుకాణం నిర్వహిస్తున్నారా? మందులు ఇచ్చే వారి కి అనుభవం ఉందా? లేదా? అనే విషయాలపై ఎన్నడూ తనిఖీలు నిర్వహిం చిన పాపాన పోలేదు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు మందుల దుకాణాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంై తెనా ఉందని పలువురు కోరుతున్నారు.