సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా ఆరో ఏడాది కూడా టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. రాజకీయంగా ఆ పార్టీకి 2019 అన్ని రకాలుగా కలిసొచ్చింది. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను కుదేలు చేయడంతోపాటు స్థానిక సంస్థలను క్లీన్‌స్వీప్ చేసుకోవడం ద్వారా అధికార టీఆర్‌ఎస్ ఈ ఏడాది పూర్తిస్థాయి రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఓ ఎమ్మెల్సీ సీటు, మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం మినహా రాజకీయంగా ఈ ఏడాది అన్నీ ఒడిదుడుకులే ఎదురయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రం నుంచి నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవడం, ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డి ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీలో కాస్త జోష్ నింపాయి. అధికార టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా ఉంటున్న ఎంఐఎంకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కగా తెలంగాణ జన సమితి, లెఫ్ట్ పార్టీలు ఈ ఏడాది ఉనికి చాటుకునేందుకు తంటాలు పడ్డాయి.
32 జిల్లా పరిషత్‌లు గులాబీ ఖాతాలోకి...
ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో 12,732 గ్రామ పంచాయతీలు, 1.13 లక్షల వార్డులకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ పదవులను అధికార టీఆర్‌ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ‘కారు’ జోరు తగ్గింది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకుగాను తొమ్మిది చోట్లే టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. పార్టీ కీలక ఎంపీలైన కవిత, బోయినపల్లి వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, నగేశ్ ఓటమి పాలయ్యారు. మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు వరంగల్–నల్లగొండ–ఖమ్మం, కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ టీచర్ల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్ మద్దతుదారులు ఓటమిపాలయ్యారు. శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ) విజయం సాధించారు. ఎమ్మెల్యే కోటాలో నవీన్‌రావు శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది.
5,659 ఎంపీటీసీ స్థానాలకుగాను 3556, 534 జెడ్పీటీసీ స్థానాలకుగాను 445 చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండో పర్యాయం సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ 2019లో రెండు విడతల్లో కేబినెట్‌ను విస్తరించారు. ఫిబ్రవరిలో జరిగిన తొలి విడత విస్తరణలో ఈటెల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు చోటు దక్కింది. సెప్టెంబర్‌లో జరిగిన రెండో విడత మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు అవకాశం లభించింది. అక్టోబర్ 21న జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తొలిసారిగా ఈ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఖాతాలో చేరింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 13 మంది అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరగా సీఎల్పీని విలీనం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్ కోలుకోలేని దెబ్బతీసింది.
కుదేలవుతూ... కోలుకుంటూ కాంగ్రెస్ పయనం
అధికార టీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహాలకు కుదేలవుతూనే ఈ ఏడాది కాంగ్రెస్ పయనాన్ని కొనసాగించింది. పార్టీ నుంచి గెలిచిన 13 మంది ఎమ్మెల్యేలను చేజార్చుకొని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోవడం ఈ ఏడాది కాంగ్రెస్‌కు ఘోర పరాజయంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 3 ఎంపీ సీట్లతోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 30 శాతం స్థానాల్లో గెలిచినా ఒక్క జడ్పీ పీఠాన్ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఈ ఏడాది ఆసాంతంలో కాంగ్రెస్‌కు లభించిన పెద్ద ఊరట అంటే ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి గెలుపే.
గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఆయన గెలవడమే కాంగ్రెస్‌లో కొంత ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు పార్టీ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ ఈ ఏడాది మరణించడం పార్టీకి తీరని లోటుగా మారింది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వ్యాఖ్యలు చేసినా ఆ తర్వాత సర్దుకొని పార్టీతో కలసి పనిచేస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటాల విషయానికి వస్తే ఎప్పటిలాగే కాంగ్రెస్ తాబేలు యాత్ర చేసింది.
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఎంపీ రేవంత్‌రెడ్డి కొంత హడావుడి చేసినా ఆర్టీసీ సమ్మె, దిశ హత్య లాంటి కీలకాంశాల్లో తగిన రీతిలో స్పందించలేదనే భావన వ్యక్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులు, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన, అక్కడక్కడా యాత్రలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతల్లో ఇంకా సమన్వయ లేమి కనిపిస్తోంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఓటమితో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను మారుస్తారనే ప్రచారం జరిగినా 2019లో అది జరగలేదు. ఈ ఏడాది చివర్లో ఎన్నార్సీ అంశంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌కు 2020లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి.
పోరాటాలు చేస్తున్నారు కానీ...!
గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది తాము ప్రజల్లోకి వెళ్లామని బీజేపీ అంచనా వేసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం కమలదళంలో కొత్త ఉత్సాహం నింపింది. ఇదే జోష్‌తో రాష్ట్రంలో 11 లక్షలుగా ఉన్న పార్టీ సభ్యత్వాన్ని 30 లక్షలకు పెంచుకుంది. అయితే స్థానిక నేతల మధ్య సమన్వయం, వ్యూహాల అమలులో కొంత వెనుకబడింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిరం లాంటి అంశాలు తమకు మేలు చేశాయన్న అంచనాలో ఆ పార్టీ నేతలు ఉన్నా ప్రజల్లోకి వెళ్లడంలో ఈ ఏడాది స్ఫూర్తిదాయక పోరాటం చేసినట్టు కనిపించలేదు. పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ ఏడాదిలోనే హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులవగా మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన విద్యాసాగర్‌రావు మళ్లీ పార్టీ కార్యక్రమాల్లోకి వచ్చారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆ తరువాత ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా సహా 80 మందికిపైగా పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించడం, టీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్ చేరడం, టీ టీడీపీ నేతలు గరికపాటి రామ్మోహన్‌రావు, పెద్దిరెడ్డి, సురేశ్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి నేతలను చేర్చుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో కొంత పట్టు సాధించగలిగింది. అయితే ‘స్థానిక’ ఎన్నికల్లో కనీస స్థాయిలోనూ గెలవలేకపోవడంతో రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అంటున్న కమలనాథులకు కొత్త ఏడాది పద్మవ్యూహం లాగానే కనిపిస్తోంది.
విస్తరణ బాటలో ఎంఐఎం...
ఎంఐఎంకు ఈ ఏడాది అనుకోని అవకాశం లభించింది. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం కావడంతో అసెంబ్లీలో ఏడుగురు సభ్యుల బలంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈ హోదాతోనే ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల గెలవడం ద్వారా ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించుకుంది. తెలంగాణ జన సమితి, లెఫ్ట్ పార్టీలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఈ ఏడాది పరిమితమయ్యాయి. ప్రజాసమస్యలపై తమదైన స్థాయిలో ఉద్యమాలు చేస్తూ పార్టీ కార్యకలాపాలను కొనసాగించాయి. అయితే ఈ ఏడాది టీటీడీపీ దాదాపు కనుమరుగు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment