ఈ ఏడాది టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్ పాత్రలో అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఓపెనర్‌గా దిగిన వరుస రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీల మోత మోగించి ఓపెనర్‌గా అరంగేట్రం టెస్టులోనే వరుసగా రెండు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన రికార్డును కూడా లిఖించాడు.దక్షిణాఫ్రికాపై ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో రెండుసార్లు 150కిపైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఫలితంగా ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్(16) ఇక భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. 2010-11 సీజన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో హర్భజన్ సింగ్ 14 సిక్సర్లు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించి ఆ ఫీట్ నమోదు చేసిన ఐదో భారత ఓపెనర్‌గా అరుదైన ఘనతకు నమోదు చేశాడు.
విండీస్‌తో రెండో వన్డేలో శతకం సాధించడం ద్వారా రోహిత్ శర్మ ఒక రికార్డును నమోదు చేశాడు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 22 ఏళ్లుగా శ్రీలంక ఓపెనర్ సనత్ జయసూర్య (1997లో 2387 పరుగులు) పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్ విండీస్‌పై మూడో మ్యాచ్‌లో అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది రోహిత్ మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 2442 పరుగులు సాధించాడు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఈ ఏడాది 28 వన్డేలు ఆడి 1490 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్ అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు సాధించిన రికార్డును రోహిత్ తిరగరాశాడు. 2018లో అంతర్జాతీయంగా 74 సిక్సర్లు సాధించిన రోహిత్.. ఈ ఏడాది 78 సిక్సర్లు కొట్టాడు.
ఆసీస్ రికార్డు బ్రేక్..
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా కొత్త రికార్డును లిఖించింది. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఆస్ట్రేలియాను వెనక్కినెట్టింది. స‍్వదేశీ వరుస టెస్టు సిరీస్ విజయాల్లో టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది. సఫారీలతో టెస్టు సిరీస్‌ను సాధించిన తర్వాత భారత్‌కు ఇది వరుసగా 11వ స్వదేశీ టెస్టు సిరీస్ విజయం. ఈ క్రమంలోనే ఆసీస్ రికార్డును టీమిండియా బద్ధలు కొట్టింది. 1994-95 సీజన్ మొదలు కొని 2000-01 సీజన్ వరకూ ఆసీస్ తమ దేశంలో సాధించిన వరుస టెస్టు సిరీస్ విజయాలు సంఖ్య 10. ఆపై 2004-09 సీజన్ మధ్యలో ఆసీస్ మరోసారి 10 వరుస స‍్వదేశీ టెస్టు సిరీస్ విజయాలు సాధించింది. అయితే ఆసీస్ పేరిట ఉన్న రికార్డును టీమిండియా తాజాగా బ్రేక్ చేసింది. 2012-13 సీజన్ నుంచి ఇప్పటివరకూ భారత్ వరుసగా 11 స్వదేశీ టెస్టు సిరీస్ విజయాల్ని నమోదు చేసింది. ఫలితంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా భారత్ వరుసగా 12వ స్వదేశీ టెస్టు సిరీస్ విజయాన్ని సాధించిందింది.
కోహ్లినే టాప్
ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్‌లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లి 928 రేటింగ్ పాయింట్లతో టెస్టుల్లో అగ్రస్థానంలో ఉండగా, 895 పాయింట్లతో వన్డేల్లో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి 2455 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు. ఫలితంగా వరుసగా నాల్గో ఏడాదిని కూడా టాప్‌లోనే ముగించాడు కోహ్లి. ఈ ఏడాది కోహ్లి సాధించిన సెంచరీలు ఏడు కాగా, అత్యధిక స్కోరు 254 నాటౌట్. ఇక భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులోనే శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు కోహ్లి. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెల్చుకున్న క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లి (57 సార్లు) ప్రస్తుతం జాక్వస్ కలిస్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. సచిన్ (76 సార్లు), జయసూర్య (58 సార్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
మయాంక్ డబుల్ మోత..
టెస్టు ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన ఏడాది వ్యవధిలోనే టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టులో ప్రత్యేక ముద్ర వేశాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై డబుల్ సెంచరీలు సాధించి ఓపెనర్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంకను సాధించాడు. ఇటీవల విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మయాంక్ 11వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా మయాంక్ నిలవడమే కాకుండా, బంగ్లాదేశ్‌తో టెస్టులో 243 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోరు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ద్విశతకం సాధించాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో ఓవరాల్‌గా 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ద్విశతకం చేశాడు. ఇది మయాంక్ దూకుడుకు నిదర్శనం.
కుల్దీప్ డబుల్ హ్యాట్రిక్..
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో హ్యాట్రిక్ సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్‌గా నయా రికార్డును లిఖించాడు. 2017లో కోల్‌కతాలో ఆసీస్‌తో జరిగిన వన్డేలో కుల్దీప్ హ్యాట్రిక్ సాధించగా, మరొకసారి హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన వారిలో చేతన్ శర్మ(1987లో న్యూజిలాండ్‌పై), కపిల్ దేవ్(1991లో శ్రీలంకపై), మహ్మద్ షమీ(2019లో అఫ్గానిస్తాన్‌పై)లు ఉన్నారు. వీరంతా ఒకేసారి హ్యాట్రిక్‌లు సాధిస్తే, కుల్దీప్ యాదవ్ మాత్రం రెండుసార్లు హ్యాట్రిక్‌లు సాధించడం విశేషం. ఇలా ఒకటికంటే ఎక్కువ సార్లు హ్యాట్రిక్‌లు సాధించిన వారిలో మలింగా(3సార్లు) తొలి స్థానంలో ఉండగా, రెండు సందర్భాల్లో హ్యాట్రిక్‌లు సాధించిన వారిలో వసీం అక్రమ్, సక్లయిన్ ముస్తాక్, చమిందా వాస్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
నాలుగో స్థానంలో భరోసా దొరికిందా?
చాలాకాలంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాలుగో స్థానం కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. అయితే దీనికి శ్రేయస్ అయ్యర్ ద్వారా సమాధానం దొరికినట్టే కనబడుతోంది. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత చాలాకాలం స్థానం కోల్పోయాడు. ఆడపా దడపా అవకాశాలు తప్పితే టీమిండియా జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదించుకోవడంలో విఫలం అయ్యాడు. కాగా, ఈ ఏడాది మాత్రం శ్రేయస్ అయ్యర్ నాల్గో స్థానంలో సరిపోతాననే సంకేతాలు ఇస్తున్నాడు. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో అయ్యర్ నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీలు సాధించాడు. ఒకవైపు నిలకడగా ఆడుతూనే అవసరమైన సందర్భాల్లో భారీ హిట్టింగ్‌కు దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు అయ్యర్. ,
Comments
Please login to add a commentAdd a comment