యూటర్న్‌ క్రికెటర్లు.. | 2019 Rewind: Few Cricketers Who Took U Turn On Their Decisions | Sakshi
Sakshi News home page

యూటర్న్‌ క్రికెటర్లు.. అంపైర్లతో వాగ్వాదాలు

Published Tue, Dec 24 2019 3:27 PM | Last Updated on Wed, Jan 1 2020 1:22 PM

2019 Rewind:Few Cricketers Who Took U Turn On Their Decisions - Sakshi

2019లో పలువురు క్రికెటర్లు తమ నిర్ణయాలపై పునరాలోచనలో పడ్డారు. తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదనే భావించి కొందరు ముందస్తు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే, మరికొంతమంది ఆవేశంతో క్రికెట్‌కు  వీడ్కోలు  చెప్పి  ఆపై యూటర్న్‌  తీసుకున్నారు.  ఇలా క్రికెట్‌లో కొనసాగాలా.. వద్దా అనే డైలామాలో ఉన్న విదేశీ క్రికెటర్లలో వెస్టిండీస్‌ క్రికెటర్లు క్రిస్‌ గేల్‌, డ్వేన్‌ బ్రేవోలతో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌లు ఉండగా, భారత్‌ నుంచి అంబటి రాయుడు ఉన్నాడు.  ఇక అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ఎంఎస్‌ ధోని, కోహ్లిలు కూడా ఈ ఏడాది హాట్‌  టాపిక్‌గా నిలిచారు.

క్రిస్‌ గేల్‌
వన్డే వరల్డ్‌కప్‌  తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు  వీడ్కోలు చెబుతానంటూ ఆ మెగా టోర్నీ ఆరంభానికి  ముందే వెస్టిండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ ప్రకటించాడు.దాంతో అంతా గేల్‌ రిటైర్మెంట్‌ ఉంటుందనే అనుకున్నారు. కానీ మనోడు ఝలక్‌ ఇచ్చాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు విశ్రాంతి ప్రకటించడం లేదంటూ మరొకసారి వెల్లడించాడు. అదే సమయంలో తాను టెస్టుల్లో రీఎంట్రీ  ఇవ్వాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.  భారత్‌తో సిరీస్‌ తర్వాత తన రిటైర్మెంట్‌పై నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నాడు. అటు తర్వాత మళ్లీ  మరొకసారి మాట్లాడాడు. తనకు మరిన్ని సిరీస్‌లు ఆడితే ఫిట్‌నెస్‌పై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే వీడ్కోలు నిర్ణయాన్ని ఆలోచిస్తానన్నాడు.

డ్వేన్‌ బ్రేవో


అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి ఏడాదికి పైగా దాటిన తర్వాత వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో యూటర్న్‌ తీసుకున్నాడు. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించాడు. ప్రత్యేకంగా టీ20 సెలక్షన్స్‌కు తాను కూడా అందుబాటులో ఉంటానంటూ వెల్లడించాడు.  గతంలో తమ బోర్డు పెద్దల వ్యవహారం సరిగా లేని కారణంగానే తాను అప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగాల్సి వచ్చింది. ఇప్పుడు పాలన మారడంతో మనసు మార్చుఉన్నానని అన్నాడు.

విండీస్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలపై తిరుగుబాటు చేస్తూ వచ్చిన బ్రేవో తన రిటైర్మెంట్‌ను  2018 అక్టోబర్‌లో ప్రకటించాడు.   ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా విండీస్‌ రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితాలో బ్రేవోను చేర్చారు. కాకపోతే బ్రేవోకు ఆడే అవకాశం రాలేదు.  2012, 2016ల్లో విండీస్‌ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో బ్రేవో సభ్యుడు. 2016 సెప్టెంబర్‌లో విండీస్‌ జెర్సీలో బ్రేవో చివరిసారి కనిపించాడు.

ఏబీ డివిలియర్స్‌ రీఎంట్రీ!


గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ రీఎంట్రీ కోసం కసరత్తులు ముమ్మరం అయ్యాయి. వన్డే వరల్డ్‌కప్‌లో తాను  ఆడతానని సఫారీ క్రికెట్‌  బోర్డుకు విన్నవించినా చివరి నిమిషంలో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. అప్పుడు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ కూడా ఏబీ  రీఎంట్రీపై ఏమీ చేయలేకపోయాడు. కాగా, ప్రస్తుతం ఏబీ  రీ ఎంట్రీ కోసం కసరత్తులు ముమ్మరం చేశారు. దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంధి దశలో ఉన్న కారణంగా ఏబీ డివిలియర్స్‌ను తిరిగి జట్టులోకి తేవాలనే యత్నంలో  ఉన్నారు డుప్లెసిస్‌తో పాటు ఆ జట్టు కొత్త కోచ్‌ మార్క్‌ బౌచర్‌లు.   దాంతో డివిలియర్స్‌ రీఎంట్రీ షురూ అయ్యేలా కనబడుతోంది. తనకు ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌  ఆడాలని ఉందని ఏబీ మాటను దృష్టిలో పెట్టుకుని అతని కోసం  ఎదురుచూస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఏబీ తన అంతర్జాతీయ పునరాగమనంపై నిర్ణయాన్ని వెల్లడించవచ్చు.

అంబటి రాయుడు పునరాగమనం..
వన్డే వరల్డ్‌కప్‌కు తనను స్టాండ్‌ బై ఆటగాడిగా ఎంపిక చేసినా పిలుపు రాలేదనే కోపంతో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన భారత క్రికెటర్‌ అంబటి రాయుడు.  విజయ్‌ శంకర్‌ను నాలుగో స్థానానికి తీసుకున్నారు. దాంతో సహజంగానే అసంతృప్తి చెందిన రాయుడు ‘ప్రపంచ కప్‌ చూసేందుకు ఇప్పుడే 3డి అద్దాలు కొన్నాను’ అంటూ ట్వీట్‌ చేయడం వివాదం రేపింది. మున్ముందూ తనను ఎంపిక చేయకపోవచ్చని భావించిన రాయుడు మొత్తానికే గుడ్‌బై చెప్పేశాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్‌ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్‌ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. మళ్లీ అతను మనసు మార్చుకొని బ్యాట్‌ పట్టేందుకు సిద్ధమయ్యాడు.  ఈ క్రమంలోనే హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా కూడా రాయుడు ఎంపికయ్యాడు. కాగా, కొన్ని దేశవాళీ మ్యాచ్‌ల తర్వాత హెచ్‌సీఏలో రాజ్యమేలుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  తాను హైదరాబాద్‌ జట్టు నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో రాయుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.


ఫీల్డ్‌ అంపైర్‌తో  ధోని వాగ్వాదం


ఈ సీజన్‌ ఐపీఎల్‌లో  భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని వ్యవహరించిన తీరు అప్పట్లో దుమారం రేపింది. నిబంధనలకు విరుద్ధంగా..డగౌట్‌ నుంచి మైదానంలోకి వచ్చి అంపైర్‌తో వాగ్వాదానికి దిగడం ధోని సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో వేలెత్తి చూపే తొలి సంఘటనగా మిగిలింది. అంపైర్‌ ముందుగా నోబాల్‌ ఇచ్చి ఆ తర్వాత కాదనడం ధోనికి కోపం తెప్పించింది.  అది నోబా.. కాదా అనే విషయంలో స్పష్టత లేదు. చివరికి అంపైర్లు దాన్ని నోబ్‌ కాదని తేల్చారు. ఆ క్రమంలోనే స్టేడియంలోకి వెళ్లిన ధోని అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు.  ఫలితంగా నిబంధనలను అతిక్రమించిన ధోనిపై మ్యాచ్‌ రుసుములో 50 శాతం జరిమానాగా విధించారు.


వరల్డ్‌కప్‌లో కోహ్లి రెండుసార్లు ఆగ్రహం
ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా చెమటోడ్చి గెలిచింది. పసికూనలనుకున్న అఫ్గానిస్తాన్‌ క్రికెటర్లు .. కట్టుదిట్టంగా ఆడి కోహ్లి సేనకు చుక్కలు చూపించారు. చివరికి బౌలర్ల సత్తాతో ఆపసోపాలు పడి భారతజట్టు గెలిచినా.. ప్రశంసలు మాత్రం అఫ్గాన్‌కే దక్కాయి. అయితే ఆ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అంపైర్‌‌లతో కెప్టెన్ కోహ్లి వాగ్వాదానికి దిగాడు. షమీ బౌలింగ్‌లో హజ్రతుల్లాహ్ జజాయి ప్యాడ్‌ను తాకుతూ బాల్ వెళ్లింది. ఎల్బీడబ్ల్యూ కోసం కోహ్లి సేన అప్పీల్ చేసింది. అంపైర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో షమీ, ధోనిలతో మాట్లాడిన కోహ్లి.. డీఆర్ఎస్ కోరుతూ.. అంపైర్ల దగ్గరకు వెళ్లాడు.  వాళ్లతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడు. అటు తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం కోహ్లి.. ఫీల్డ్‌ అంపైర్లతో వాదానికి దిగాడు. ఒక ఎల్బీ విషయంలో థర్డ్‌ అంపైర్‌ బాల్‌ ట్రాకర్‌ను వినియోగించకపోవడాన్ని కోహ్లి ప్రశ్నించాడు.  థర్డ్‌ అంపైర్‌ అలా ఎందుకు చేశాడంటూ ఫీల్డ్‌ అంపైర్లతో వాగ్వాదం చేశాడు.

విండీస్‌తో తొలి వన్డేలో సైతం కోహ్లినే..
రవీంద్ర జడేజా రనౌట్‌ వివాదం కోహ్లికి ఆగ్రహం తెప్పించింది. జడేజా పరుగు తీసే క్రమంలో రోస్టన్‌ ఛేజ్‌ నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో వికెట్లను డైరక్ట్‌ త్రో గిరటేశాడు. అయితే దానిపై అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. ఆ సమయంలో జడేజా క్రీజ్‌లోకి వచ్చాడని భావించిన ఫీల్డ్‌ అంపైర్‌ షాన్‌ జార్జ్‌ అది నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే అది ఔట్‌గా రిప్లేలో తేలడంతో పొలార్డ్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దాంతో చేసేది లేక థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించాడు ఫీల్డ్‌ అంపైర్‌.  దాంతో థర్డ్‌ అంపైర్‌ పలు కోణాల్లో చెక్‌ చేసి అది ఔట్‌గా నిర్దారించడంతో జడేజా పెవిలియన్‌ చేరాడు. ఇలా చేయడంపై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ డగౌట్‌లోకి వచ్చేసి బౌండరీ లైన్‌ వద్ద మ్యాచ్‌ అధికారితో  వాదనకు దిగాడు. ఒకసారి నాటౌట్‌గా ఫీల్డ్‌ అంపైర్‌ ప్రకటించిన తర్వాత మళ్లీ థర్డ్‌ అంపైర్‌కు ఎలా రిఫర్‌ చేస్తారంటూ కోహ్లి వాదించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement