Telugu Hit Movies in 2019 | Low Budget Movies Hit At Box Office - Sakshi Telugu
Sakshi News home page

చిన్న సినిమా అదిరింది..

Dec 25 2019 5:00 PM | Updated on Dec 30 2019 3:36 PM

2019 Telugu Hit Movies List - Sakshi

సినిమా.. ప్రేక్షకుడు కాసేపు నవ్వుకోడానికి కొత్త అనుభూతిలో తేలడానికి, ప్రస్తుత రోజుల్లో అయితే టైంపాస్‌ కోసం థియేటర్‌కు వెళ్తున్నారు. అయితే ఎన్నో అంచనాలతో కొన్ని పెద్ద సినిమాలకు వెళ్తే ఆశలు అడియాశలే అవుతున్నాయి. దీంతో రొటీన్‌గా కాకుండా కొత్తగా ట్రై చేస్తున్న చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. పైగా పెద్ద హీరోలు పుష్కరానికోసారి చేసే సినిమా కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా మౌత్‌ టాక్‌తో క్రేజ్‌ తెచ్చుకున్న సినిమాలను ఆదరించడానికి థియేటర్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది చిత్రంగా.. పెద్ద సినిమాలు కొన్ని చతికిలపడగా చిన్న సినిమాలు ప్రశంసలు దక్కించుకున్నాయి.

సినిమా చిన్నది.. ఆదరణ పెద్దది

ఈ ఏడాది హిట్‌ అయిన సినిమాల పరంపరను గమనిస్తే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కథలో దమ్ముంటే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర నిలదొక్కుకోవచ్చని నిరూపించాయి. కాన్సెప్ట్‌ బేస్డ్‌గా వచ్చిన మల్లేశం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, మిస్‌ మ్యాచ్‌, ఫలక్‌నుమాదాస్‌, బ్రోచేవారెవరురా, కొబ్బరిమట్ట, కౌసల్య కృష్ణమూర్తి, రాజ్‌దూత్‌ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. కోట్లల్లో కలెక్షన్లు కొల్లగొట్టకపోయినా అందరిచేత అదుర్స్‌ అనిపించుకున్నాయి.

భయపెట్టించి వసూలు చేశాయి..
 

థ్రిల్‌ జానర్‌లో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. కళ్యాణ్‌ రామ్‌ ‘118’, అనసూయ ‘కథనం’, అడవి శేషు ‘ఎవరు’, నిఖిల్‌ ‘అర్జున్‌ సురవరం’ సినిమాలు బాగున్నాయి. హారర్‌ జానర్‌లో జెస్సీ, రాక్షసుడు, నిను వీడని నీడను నేనే, గేమ్‌ ఓవర్‌ కొత్త కథాకథనంతో ప్రేక్షకులకు భయపెట్టించి మరీ కలెక్షన్లు వసూలు చేశాయి. ఇక ‘కాంచన 3’ సినిమాకు తిరుగేలేదని భావించినప్పటికీ పేలవమైన కథ థియేటర్లలో పేలలేదంటూ విశ్లేషకులు బాహాటంగానే విమర్శించారు. ఇక ఎప్పటిలానే ఈసారి కూడా పెద్ద హీరోలు హారర్‌ జానర్‌ను టచ్‌ చేయడానికి కూడా ఆసక్తి చూపించలేదు.

బయోపిక్‌ల ట్రెండ్‌..


బాలీవుడ్‌తో పోలిస్తే బయోపిక్‌ సక్సెస్‌ రేటు టాలీవుడ్‌లో తక్కువగానే ఉంది. తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్‌ల సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం బయోపిక్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. స్వాతంత్ర్యోద్యమ నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డిలో మెగాస్టార్‌ చిరంజీవి నటన అద్భుతమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా సునాయాసంగా విజయ శంఖారావాన్ని పూరించింది. మహానాయకుడు దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవితకథ ఆధారంగా వచ్చిన ‘యాత్ర’ అందరి నోట కీర్తించబడింది.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితకథ వెండితెరపై పూర్తిస్థాయిలో ఆవిష్కరించలేదన్న వాదనలున్నాయి. బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ సినిమాలు పూర్తిగా కాకపోయినా నట సార్వభౌమ ఎన్టీ రామారావు జీవితాన్ని కాస్తైనా కళ్ల ముందుంచే ప్రయత్నం చేశాయి. వీటికి దీటుగా రాంగోపాల్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

పెద్ద సినిమాల హవా...

బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ సుమారు రూ.300కోట్ల బడ్జెట్‌తో సాహో సినిమా చేసి సాహసమే చేశాడని చెప్పుకోవాలి. తెలుగు వాళ్లకు ఈ సినిమా పెద్దగా నచ్చకపోయినా మిగతా భాషల్లో బాగానే ఆదరించడంతో కలెక్షన్ల పరంగా హిట్టయింది. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ‘మహర్షి’ చిత్రంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు.  

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, నాగచైతన్య ‘మజిలి’, నాని ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌లీడర్‌’, వరుణ్‌తేజ్‌ ‘గద్దలకొండ గణేశ్‌’(వాల్మీకి) కలెక్షన్లు కురిపించాయి. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా ‘ఓ బేబీ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


మల్టీస్టారర్‌ మూవీకి తిరుగే ఉండదన్న విషయం ఈ ఏడాది మరోసారి రుజువైంది. విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ ‘ఎఫ్‌ 2’ సినిమాతో 2019 సంవత్సరానికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. అదే విధంగా అదుర్స్‌ అనేలా కలెక్షన్లు రాబడుతున్న వెంకీ, నాగచైతన్యల ‘వెంకీమామ’ ఈ ఏడాదికి గుడ్‌బై చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement