షమీ ‘సెంచరీ’.. రెండో క్రికెటర్‌గా కోహ్లి | 2019 Rewind: Best Moments Of Indian Cricket Against New Zealand | Sakshi
Sakshi News home page

షమీ ‘సెంచరీ’.. రెండో క్రికెటర్‌గా కోహ్లి

Published Tue, Dec 24 2019 2:52 PM | Last Updated on Wed, Jan 1 2020 1:23 PM

2019 Rewind: Best Moments Of Indian Cricket Against New Zealand - Sakshi

ఈ ఏడాది జనవరిలో ఆసీస్‌ పర్యటన ముగిసిన తర్వాత నేరుగా న్యూజిలాండ్‌కు పయనమైంది టీమిండియా. తొలుత జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-1తో సాధించిన టీమిండియా.. టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కివీస్‌కు కోల్పోయింది. జనవరి 23వ తేదీన కివీస్‌తో ఆరంభమైన వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది.తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో(డక్‌వర్త్‌ లూయిస్‌) పద్ధతిలో  టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు, మహ్మద్‌ షమీలు మూడు వికెట్లు సాధించి కివీస్‌ పతనాన్ని శాసించారు.అనంతరం టీమిండియా 34.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేధించింది.

ధావన్‌ అజేయంగా 75 పరుగులు, కోహ్లి 45 పరుగులు చేసిన విజయంలో కీలక పాత్ర పోషించారు.  ఇక రెండో వన్డేలో భారత జట్టు 324 పరుగులు చేసి 90 పరుగుల తేడాతో గెలుపును అందకుంది. రోహిత్‌ శర్మ(87), ధావన్‌(66), కోహ్లి( 43), అంబటి రాయుడు(47), ఎంఎస్‌ ధోని(48 నాటౌట్‌)లు భారత్‌ భారీ విజయానికి బాటలువేశారు.మూడో వన్డేలో కివీస్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి 243 పరుగులు చేసింది. రాస్‌ టేలర్‌ 93 పరుగులతో ఆకట్టుకున్నాడు.  భారత ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ 62 పరుగులు, కోహ్లి 60 పరుగులు, అంబటి రాయుడు 40 నాటౌట్‌, దినేశ్‌ కార్తీక్‌ 38 నాటౌట్‌లు భారత్‌ ఘన విజయంలో సహకరించారు. ఈ సిరీస్‌కు సంబంధించి వివరాలను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం.

ఏడో అత్యల్ప స్కోరు..
వరుసగా మూడు వన్డేలు గెలిచి సిరీస్‌ను ముందుగానే కైవసం చేసుకున్న టీమిండియా.. నాల్గో వన్డేలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసి 30. 5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. తద్వారా వన్డేల్లో ఏడో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి విశ్రాంతి ఇవ్వగా, రోహిత్‌ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ధావన్‌(13), హార్దిక్‌ పాండ్యా(16), కుల్దీప్‌ యాదవ్‌(15), చహల్‌(18)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. ట్రెంట్‌ బౌల్ట్‌ ఐదు వికెట్లతో భారత్‌ను గట్టి దెబ్బకొట్టాడు. అతనికి జతగా గ్రాండ్‌ హోమ్‌ మూడు వికెట్లు సాధించాడు.

మహ్మద్‌ షమీ ‘సెంచరీ’
ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో షమీ వికెట్ల సెంచరీ సాధించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌ను షమీ గట్టి దెబ్బతీశాడు. ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌(5), కొలిన్‌ మున్రో(8)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చి షమీ 100 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. తద్వార అంతర్జాతీయ వన్డేల్లో అతి వేగంగా 100 వికెట్లు సాధించిన తొలి భారత పేసర్‌గా నిలిచాడు. 56 వన్డేల్లో ఈ ఘనతను అందుకొని ఇర్ఫాన్‌ పఠాన్‌ (59 వన్డేలు ) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

రెండో క్రికెటర్‌గా కోహ్లి..
భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన వన్డేల పరంగా చూస్తే అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. రెండో వన్డేలో కోహ్లీ ఈ ఫీట్‌ను సాధించాడు.  ఇరు జట్ల మధ్య జరిగిన ఓవరాల్‌ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో కోహ్లి సాధించిన పరుగులు 1242. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు నాధన్‌ ఆస్టల్‌(1207) రికార్డును కోహ్లి సవరించాడు.  కాగా, ఇక్కడ సచిన్‌ టెండూల్కర్‌(1750) తొలి స్థానంలో ఉండగా, వీరేంద్ర సెహ్వాగ్‌(1157) నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.

నాల్గో ఓపెనింగ్‌ జోడిగా రోహిత్‌-ధావన్‌లు
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత ఓపెనింగ్‌ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు అరుదైన రికార్డును నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(87), శిఖర్ ధావన్ (66) జోడీ తొలి వికెట్‌కి 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఫలితంగా వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వన్డే ఫార్మాట్‌లో ధావన్‌-రోహిత్‌లకు ఇది 14వ సెంచరీ భాగస్వామ్యంగా నమోదైంది. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ జోడి నెలకొల్పిన రికార్డును రోహిత్‌-ధావన్‌ల జంట బ్రేక్‌ చేసింది.

వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడీలను పరిశీలిస్తే.. సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీల జంట 21 సెంచరీల భాగస్వామ్యం తొలిస్థానంలో ఉండగా, ఆడమ్ గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)ల జోడి 16 సెంచరీల భాగస్వామ్యంతో రెండో స్థానంలో ఉంది. ఇక గార్డెన్‌-హెన్స్‌(వెస్టిండీస్‌) జోడి 15 సెంచరీలతో మూడో స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని ధావన్‌-రోహిత్‌ల జోడి ఆక్రమించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement