కొన్నేళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే ‘మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లి ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్ అనేంతా.. ఒకప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లి అని అందరూ చెప్పుకునేంతా.. మూడు పదుల వయసులోనే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడుగా అవతరించాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగాడు. ఈ పరుగుల మెషీన్. సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ అంతా ఒకవైపు.. విరాట్ కోహ్లి ఒక్కడే ఒక వైపు అనే మొత్తం ప్రపంచ క్రికెట్ చూసేంతగా రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా పాతిక శతకాలు బాదిన రికార్డూ అతడిదే. వన్డేల్లో సచిన్(49) తర్వాత అత్యధిక శతకాలు సాధించిన రెండో ఆటగాడు కోహ్లినే(43) . ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు సాధించాడు కోహ్లి.
టెస్టుల్లో కెప్టెన్‌గా తొలి మూడు ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన ఒకేఒక్కడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్ కోహ్లి. 2013లో జైపూర్‌లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో కోహ్లి 52 బంతుల్లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు సాయంతో సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో వేగంగా వెయ్యి, నాలుగువేలు, ఐదు వేలు, ఆరు వేలు, ఏడు వేలు, ఎనిమిది, తొమ్మిది వేల పరుగుల మైలురాళ్లను దాటిన భారత ఆటగాడూ కోహ్లినే. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఒక రికార్డును కోహ్లి తన పేరిట లిఖించుకున్నాడు. బంగ్లాపై రెండో టెస్టులో విజయంతో కోహ్లి వరుసగా ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా వరుసగా అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే ఎంఎస్ ధోని కెప్టెన్‌గా వరుసగా సాధించిన ఆరు టెస్టు విజయాల రికార్డు సవరించబడింది. దాదాపు ఆరేళ్లుగా ఎంఎస్ ధోని పేరిట ఉన్న రికార్డు బద్ధలైంది. టెస్టు ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఐదు వేల పరుగుల్ని వేగవంతంగా పూర్తి చేసిన రికార్డును కోహ్లి సాధించాడు.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో కోహ్లి ఈ ఫీట్ సాధించాడు.కెప్టెన్‌గా 86వ ఇన్నింగ్స్‌లో ఐదువేల పరుగుల్ని సాధించాడు. కెప్టెన్‌గా ఆసీస్ మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ 97 ఇన్నింగ్స్‌లతో ఉన్న రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఇలా వరుస పెట్టి రికార్డులు సాధిస్తున్న కోహ్లికి ఒకటి మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. అది ఐసీసీ నిర్వహించే ఒక మేజర్ ట్రోఫీ. ఇప్పటివరకూ కోహ్లి నేతృత్వంలో భారత్ జట్టు చాంపియన్స్ ట్రోఫీని కానీ, వన్డే వరల్డ్‌కప్ కానీ గెలవలేకపోయింది. 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్‌కు చేరినప్పటికీ దాన్ని అందుకోవడంలో విఫలమైంది. పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లి 5 పరుగులు చేసి విఫలమయ్యాడు. ఇక 2019లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో కోహ్లి సారథ్యంలోని టీమిండియా లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచినా ఆ మెగా ట్రోఫీని సాధించలేకపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ నాకౌట్ మ్యాచ్‌లో కోహ్లి 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దాంతో కోహ్లి మెగా టోర్నీలను సాధించడమే కాదు.. వాటిలో విఫలం అవుతుడానే అపవాదు కూడా ఉంది. దీన్ని కోహ్లి చెరిపివేసుకోవాలంటే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి దాన్ని సాధిస్తాడని భారత అభిమానులు ఆశగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment