గడిచిన పదేళ్ల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ.. ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. మరెన్నో శిఖరాలను అందుకుంది. గొప్ప గొప్ప విజయాలను సాధించింది. తన మార్కెట్ వ్యాల్యూనూ అనూహ్యంగా పెంచుకుంది. ఇవాళ జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగానే కాదు.. ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇందుకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. తెలుగు సినిమాను అంతర్జాతీయంగా నిలబెట్టడంలో, టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరింపజేయడంలోనూ బాహుబలి సినిమాలది ప్రత్యేకమైన స్థానం. కానీ అంతకుముందు నుంచి టాలీవుడ్ సినిమాలు వడివడిగా ఎదుగుతూ ఎంతో పేరుప్రఖ్యాతలు పొందాయి. ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ దిశదిశలా వ్యాపించింది. ఇప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగానే క్రేజ్ నెలకొంది. అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో విస్తరించిన మార్కెట్‌ను అందిపుచ్చుకోవడం.. పెరిగిపోయిన అంచనాలకు దీటుగా సత్తా ఉన్న సినిమాలు నిర్మించడం తెలుగు చిత్రసీమకు కత్తిమీద సాములాంటిదే.
పెరిగిన బడ్జెట్.. అంచనాలు!
బాహుబలి ఇచ్చిన జోష్‌తో భారీ సినిమాలు తెరకెక్కించేందుకు ఇప్పుడు దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. ఒకప్పుడు 30, 40కోట్ల బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు వెనుకాముందు అయ్యేవారు. సినిమా హిట్టయినా అంత బడ్జెట్ తిరిగొస్తుందా? అన్న సందేహాలు వెంటాడేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిష్టాత్మక సినిమాల కోసం, క్రేజీ కాంబినేషన్ల కోసం వందల కోట్లు పెట్టేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు సాహసిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన సినిమాలే సాహో, సైరా, మహర్షి, వినయవిధేయ రామ. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు. ఇందులో సాహో, సైరాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు 200 కోట్లకుపైగా బడ్జెట్‌తో భారీ అంచనాలతో, కళ్లుచెదిరే విజువల్స్, స్టంట్లతో ఈ సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలకు టాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది.
అయితే, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఏమాత్రం కథ, కథనాలు ఏమాత్రం ప్రేక్షకుడి అంచనాలకు మించి లేకపోతే.. కథ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని ఈ ఏడాది వచ్చిన సినిమాలు నిరూపించాయి. బాహుబలి తర్వాత భారీ అంచనాలతో, దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటికీ.. అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. దర్శకుడు సినిమాలోని స్టంట్ల మీద పెట్టిన ఫోకస్‌లో కొంతమేరకైనా కథ, స్క్రీన్‌ప్లే మీద పెట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమోనని వినిపించింది. మొత్తానికి హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లో సాహో సినిమా భారీ పరాభవాన్నే ముటగట్టుకుంది. హిందీలో వందకోట్లకుపైగా వసూళ్లు రావడం, ప్రభాస్ స్టార్‌డమ్ కలిసిరావడంతో ఈ సినిమా నిర్మాతలకు కొంత ఊరటనిచ్చే విషయం. ఇక, చారిత్రక నేపథ్యంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరానరసింహారెడ్డి సినిమా కూడా అంచనాలకు దూరంగానే ఉండిపోయింది.రేనాటి సూరీడు, స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంచరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో హిట్టైనప్పటికీ.. అంచనాలను అందుకోలేకపోయింది. ఇతర భాషల్లో ఓ మోస్తరు వసూళ్లే రాబట్టింది. మహేశ్‌బాబు 25వ సినిమా మహర్షి కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే, ఈ సినిమా హిట్ అయినప్పటికీ.. ప్రిన్స్ మహేశ్ స్టామినాకు తగ్గట్టు వసూళ్లు రాబట్టంలో సక్సెస్ కాలేదు. ఇక, రాంచరణ్ హీరోగా తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. రంగస్థలం లాంటి పర్ఫార్మెన్స్ ఒరియంటెడ్ పాత్ర చేసిన చరణ్.. ఆ వెంటనే రోటిన్ ఫార్ములా సినిమాలో నటించడం.. ఫైట్లు, రక్తపాతంతో దర్శకుడు బోయపాటి శ్రీను ప్రేక్షకులను బెంబెలెత్తించడంతో ఈ సినిమా బోల్తా కొట్టింది.
మారిన బాక్సాఫీస్ సరళి!
తెలుగు చిత్రపరిశ్రమ మార్కెట్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశీయంగానూ పొరుగు రాష్ట్రాల్లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. అంతేకాదు ఓవర్సీస్‌లోనూ గణనీయంగా వసూళ్లు రాబట్టే సత్తా ఉన్నట్టు తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో సినిమా జయాపజయాల ప్రమాణాలూ మారిపోయాయి. ఒకప్పడు 50 రోజులు ఆడితే బొమ్మ హిట్టు అనేవారు. వందరోజులు ఆడితే సూపర్‌హిట్టు.. 175, 200 రోజులు ఆడితే బ్లాక్‌బస్టర్ హిట్టు, ఆల్‌టైమ్ హిట్టు అని కొనియాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడంతో 40రోజుల్లోనే కొత్త సినిమా ప్రేక్షకుల చెంతకు చెరిపోతోంది. టీవీల్లోనూ, ఇంకా వీలైతే యూట్యూబ్‌లోనూ వీలైనంత త్వరగా కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ ఎన్ని థియేటర్లలో విడుదలైంది.. ఏ స్థాయిలో ప్రారంభ వసూళ్లు సాధించింది.. ఎన్ని వారాలపాటు నిలకడగా వసూళ్లు రాబట్టగలిగిందనేని సినిమా విజయానికి ఇప్పుడు ప్రమాణంగా మారింది.
ప్రారంభ వసూళ్ల ఆధారంగా సినిమా జయాపజయాలు బేరిజు వేసే పరిస్థితి వచ్చింది. మొదటి మూడు రోజులు బంపర్ వసూళ్లు సాధిస్తే బొమ్మ హిట్టు, సూపర్‌హిట్టు ఖాతాలోకి వెళ్లిపోతోంది. మొదటి రెండు వారాల వసూళ్లు సినిమా విజయానికి ప్రాణపదంగా మారిపోయాయి. థియేటర్లలో లాంగ్‌రన్ అనేది చాలావరకు కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బాహుబలి, రంగస్థలం లాంటి బలమైన కథాచిత్రాలే చాలాకాలంపాటు ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొచ్చాయి. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎంత మంచి టాక్ వచ్చిన సినిమా అయినా, స్టార్ హీరో మూవీ అయినా మూడు, నాలుగు వారాలకు మించి థియేటర్లలో నిలబడని పరిస్థితి. మారిన పరిస్థితులకు అనుగుణంగా టాలీవుడ్ కూడా తన పద్ధతలను మార్చుకుంది. ప్రారంభ వసూళ్లపైనే ఇప్పుడు దర్శక నిర్మాతలు, సినీ తారలు ఫోకస్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున విడుదల చేసి మొదటి ఒకటిరెండు వారాల్లోనే దండిగా వసూళ్లు రాబడట్టంపై దృష్టి పెట్టారు. ఆన్‌లైన్‌లో వరుసగా ఫస్ట్‌లుక్, టీజర్లు, పాటలు, ట్రైలర్లు విడుదల చేస్తూ.. ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతూనే.. క్షేత్రస్థాయి పర్యటనలతో సినిమా విడుదలకు ముందే ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఈ పరిణామాలు కొంతమేరకు సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా సినిమాలోబలమైన కథకథనాలు, భావోద్వేగాలు, వినోదం ఉంటే.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకులు థియేటర్ వైపు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కథకథనాలు బాగుండి.. స్టార్ బలం లేకపోయినా, అంతగా ప్రచారం లేకపోయినా హిట్టు కొట్టవచ్చునని ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవురా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఎవరు, మల్లేశం వంటి సినిమాలు నిరూపించాయి.
మొత్తానికి కళ్లుచెరిరే స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ మాత్రమే సినిమాను ప్రేక్షకులకు చేరువచేయలేదని, ప్రేక్షకుడిని రంజింపజేసే కథ, స్క్రీన్‌ప్లే, బలమైన భావోద్వేగాలు ఉంటే తప్ప బొమ్మ హిట్టు కావడం అంత ఈజీ కాదని 2019 బాక్సాఫీస్ హిస్టరీ చాటుతోంది. మూస సినిమాలకు కాలం చెల్లిపోయిందని, రొటీన్ ఫార్మూలాలతో తెరకెక్కించే మసాలా సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దొరకడం కష్టమేనని తాజా పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, పెరిగిన మార్కెట్ అంచనాలకు దీటుగా.. మారిన ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని.. ఫ్రెష్ కంటెంట్‌నూ, క్రియేటివ్ కథలను అన్వేషించి తెరకెక్కించాల్సిన అవసరముందని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ సినిమా పేరిట ఇన్నాళ్లు అవలంబించిన రోటిన్, మూస ఫార్ములా చిత్రాలను పక్కనబెట్టి.. ఒరిజినాలిటీ ఉన్న కథలను, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో వినూత్నంగా తెరకెక్కిస్తే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం ఈజీ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి రాబోతున్న టాలీవుడ్ పందెకోళ్లు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. సరికొత్త కథాకథనాలతో కొత్త సంవత్సరంలో రాబోయే సినిమాలు ప్రేక్షకులను ఆదరిస్తాయని, నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయని ఆశిద్దాం.
- శ్రీకాంత్ కాంటేకర్
Comments
Please login to add a commentAdd a comment