చూస్తుండగానే 2019 ముగిసిపోయింది. ఈ యేడు వైరల్ న్యూస్‌లు బాగానే క్లిక్ అయ్యాయి. పైగా అందులో మన తెలుగు వాళ్లు కూడా ఉండటం విశేషం. మొత్తంగా సోషల్ మీడియాలో వెలుగు వెలిగిన ఎనిమిది మంది గురించి తెలుసుకుందాం.
1. ఏడాది ప్రారంభంలో వచ్చిన ఈ వీడియోను చూసిన వారు నవ్వకుండా ఉండలేరు. అలా అని అక్కడేదో కామెడీ స్కిట్ చేయలేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిపిన్ సాహూ పారాగ్లైడింగ్ విన్యాసానికి పూనుకున్నాడు. అంతా సిద్ధం చేసుకుని గాల్లోకి ఎగిరాక ‘ఓరి దేవుడో, చచ్చిపోతాను బాబోయ్ దింపేయండి, నావల్ల కాదు’ అంటూ కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. ‘కావాలంటే డబ్బులు ఇస్తా, నన్ను కిందికి దింపేయండ్రా’ అని గగ్గోలు పెట్టాడు. విన్యాసం పూర్తి చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అతని భయాన్ని చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.
2. వైభవ్ వోరా జూలైలో చేసిన టిక్‌టాక్ వీడియోతో ఒక్కరోజులోనే స్టార్‌గా మారిపోయాడు. ఓ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం బ్యాగ్ కోసం ప్రచారం చేశాడు. కాలేజ్‌లో అందరినీ ఆకర్షించాలంటే మీరు ఈ బ్యాగ్ ధరించండి అంటూ మాటలతో ఆకట్టుకున్నాడు. బ్యాగ్ గురించి అతను ధారాళంగా చెప్పుకుపోవడమే కాక మెచ్యూర్ బ్యాగ్, స్పోర్ట్ బ్యాగ్‌లు వాడి అందరినీ ఇట్టే ఆకర్షించవచ్చు అని పేర్కొన్న ఈ వీడియోతో పాపులర్ అయిపోయాడు.
3. టిక్‌టాక్‌లో వచ్చే వీడియోలకు కొదవే ఉండదు. పాటలు, డ్యాన్సులు, క్రియేటివ్, జోకులు, కథలు చెప్పడం, కొత్త ఐడియాలు, వెర్రిపనులు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే భోజన ప్రియులు మాత్రం తమకు నచ్చిన వంటకాలను తింటూ వాటిని వీడియో చిత్రీకరించి టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తుంటారు. అందరికీ నోరూరించే ఈ వీడియోలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు కొంతమంది జనాలు. అలా ఉల్హస్ కమతే అనే వ్యక్తి భోజనం చేస్తూ మధ్యలో చికెన్ లెగ్ పీస్‌ను ఒక్క గుటకలో తినేస్తాడు. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన జనం ఆ వీడియోకు విశేషంగా ఆకర్షితులయ్యారు. అతని వీడియో పక్కన ఎన్నో డ్యూయెట్‌లు చేశారు కూడా!
4. జవాద్ బెందావుడ్. కోర్టు నుంచి సీరియస్‌గా బయటకు నడుచుకుంటూ వచ్చాడు. అతని కళ్లలో కోపం ఇట్టే తెలిసిపోతుంది. ఈ వీడియోలో పెద్ద విశేషమేమీ లేకపోయినా అతనికి గుర్తింపును తెచ్చిపెట్టింది. 2015 పారిస్ దాడుల్లో భాగమైన ఇద్దరు నిందితులకు జవాద్ తన ఇంట్లో ఆవాసం కల్పించాడు. దీంతో జవాద్ జైలుకు వెళ్లిరాక తప్పలేదు.
5. ఇండియా- పాకిస్తాన్ వరల్డ్‌కప్ సందర్భంగా పాక్ అభిమాని వార్తల్లో నిలిచాడు. పాక్ క్రికెటర్లు షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్ మ్యాచ్‌లపై విరుచుకుపడ్డాడు. వాళ్లు మ్యాచ్‌కు ముందురోజు బర్గర్, పిజ్జాలు తినడం వల్లే పాక్ ఓటమిపాలైందని విమర్శించాడు. ఇంకా అతనేమన్నాడో మీరే చూడండి.
6. ఫన్ బకెట్‌తో ఫేమస్ అయిన భార్గవ్, నిత్య ఇప్పటికీ తమదైన హాస్యంతో ఉనికిని చాటుకుంటున్నారు. వారి కామెడీకి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటారు. టిక్‌టాక్ పుణ్యమాని వీళ్లిద్దరూ ఈ యేడు సెన్సేషనల్ అయ్యారు. వీళ్ల వీడియోలు చూస్తే ‘ఓ మై గాడ్’ అనకుండా ఉండలేరు.
7. పాకిస్తాన్‌కు చెందిన రోజి ఖాన్ అనే వ్యక్తి కొత్తగా ఏమీ చేయలేదు. అయినా జనాలు అతని దగ్గరకు క్యూ కడతారు. ఎందుకంటే అతను ప్రముఖ అమెరికన్ నటుడు పీటర్ డింక్లేజ్ పోలికలతో ఉన్నాడు. ఈ పోలికే అతన్ని పాపులర్ చేసి పెట్టింది. చాలామంది అతని అసలు పేరు వదిలేసి పీటర్‌కు ప్రముఖ పాత్ర ‘టైరిన్ లాన్నిస్టర్’ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. ఆయన కనిపిస్తే సెల్ఫీలు కావాలని వెంటపడేవారు కూడా!
8. మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. టిక్‌టాక్ వచ్చిన తర్వాత దాదాపు ప్రతి ఒక్కరూ దీన్ని నమ్మక తప్పటంలేదు. ఎందరో హీరోహీరోయిన్లకు డూప్‌లు పుట్టుకొచ్చారు. ఆ తర్వాత జూనియర్ విరాట్ కోహ్లి కూడా టిక్‌టాక్‌లో కనిపించాడు. 4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న గౌరవ్ అరోరా అనే వ్యక్తి విరాట్ కోహ్లి పోలికలతో ఉండటంతో అతని క్రేజ్‌అమాంతం పెరిగిపోయింది.
ఈ ఏడాది అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన సోషల్‌మీడియా సెలబ్రిటీలు వీళ్లంతా. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో వీడియోలు, మరెంతమందో స్టార్లు నెట్టింట్లో మనకు తారసపడుతారు.
Comments
Please login to add a commentAdd a comment