బాలకృష్ణ, అల్లుఅర్జున్, రవితేజ, నాని, నాగశౌర్య, రామ్
2019... ప్రేక్షకులకు తెలుగు సినిమా చాలానే ఇచ్చింది. కొత్త దర్శకులు, హీరోలు, హీరోయిన్లను పరిచయం చేసింది. కొత్త తరహా చిత్రాలను తీసుకొచ్చింది. పనిలో పనిగా ప్రేక్షకుల ‘ఫేవరేట్ కాంబినేషన్’ని మళ్లీ సెట్ చేసింది. 2019లో ఇలా మళ్లీ సెట్ అయిన సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ సినిమాలు 2020లో విడుదలవుతాయి. ఇక ఈ ఫేవరెట్ హిట్ కాంబినేషన్ల గురించి తెలుసుకుందాం..
మాస్ కాంబినేషన్
ఆడియన్స్ మాస్ పల్స్ పట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రేక్షకులకు మాస్ కిక్ ఎక్కించే హీరో బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అది డబుల్‌మాసే. బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్‌లో ఆల్రెడీ వచ్చిన ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) చిత్రాల మాస్ సక్సెస్‌లే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో మరో మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ ఏడాది ముగిశాయి. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను
డబుల్ హ్యాట్రిక్
అల్లు అర్జున్‌ని (బన్నీ) ‘జులాయి’ (2012)గా చూపించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు త్రివిక్రమ్. ‘జులాయి’ వచ్చిన మూడేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా బన్నీతో త్రివిక్రమ్ చెప్పించిన కుటుంబ విలువల లెక్కలు ప్రేక్షకులకు బాగా కిక్ ఇచ్చాయి. దీంతో వీరిద్దరూ హాట్రిక్ హిట్ కోసం 2018లో ‘అల... వైకుంఠపురములో..’కి వెళ్లిపోయారు. ఈ చిత్రం జవనరి 12న విడుదల కానుంది. ఇక 2004లో దర్శకునిగా సుకుమార్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఆర్య’. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా విజయం ఇద్దరి కెరీర్‌కు మంచి మైలేజ్‌ని ఇచ్చింది. ‘ఆర్య’ సక్సెస్ క్రేజ్‌ను రిపీట్ చేయడానికి వీరిద్దరూ కలిసి ‘ఆర్య 2’ (2009) చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఈ ఏడాదిలో ప్రకటించారు. సో.. కొత్త ఏడాది అల్లు అర్జున్ అభిమానులకు డబుల్ ధమాకాయే.
సుకుమార్, అల్లు అర్జున్, త్రివిక్రమ్
హిట్ కోసం క్రాక్
దర్శకునిగా గోపీచంద్ మలినేని ఇప్పటివరకు ఐదు సినిమాలు తెరకెక్కిస్తే అందులో రెండు (‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013)) చిత్రాలు రవితేజ హీరోగా వచ్చినవే. తాజాగా గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్‌లో మూడో చిత్రంగా ‘క్రాక్ ’ తెరకెక్కుతోంది. డాన్ శీను, బలుపుతో హిట్ సాధించి, ఇప్పుడు మరో హిట్ కోసం వీరు చేస్తున్న ‘క్రాక్’ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
గోపీచంద్ మలినేని, రవితేజ
రూట్ మారింది
రామ్ కెరీర్‌లో ‘నేను..శైలజ...’ (2016) సూపర్‌హిట్ మూవీ. దీంతో ఈ సినిమా దర్శకుడు కిశోర్ తిరమలతో 2017లో ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా చేశారు రామ్. ఈ ఏడాది రామ్–కిశోర్ తిరుమల కలిసి ‘రెడ్’ అనే సినిమా చేస్తున్నారు. ‘నేను...శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల్లో రామ్‌ను లవర్ బాయ్‌గా చూపించిన కిశోర్ ఈసారి రూట్ మార్చి ‘రెడ్’ రామ్‌ను ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది.
రామ్–కిశోర్ తిరుమల
హీరో విలనయ్యాడు!
దాదాపు పదేళ్ల క్రితం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ అనే చిత్రం ప్రేక్షకులకు నాని అనే మంచి నటుడిని పరిచయం చేసింది. ఈ చిత్రం తర్వాత నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘జెంటిల్‌మన్’ (2016) కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇప్పుడు ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటిస్తున్న మూడో చిత్రం ‘వి’. ఇందులో సుధీర్‌బాబు మరో హీరో. ఈ సినిమాలో నానీది విలన్ రోల్. అలాగే నాని తొలిసారి విలన్ పాత్ర చేస్తున్న చిత్రం కూడా. అలా నానీని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటే ఇప్పుడు తనను విలన్‌గా చూపించబోతుండటం విశేషం. సమ్మోహనం(2018) తర్వాత సుధీర్‌బాబు, ఇంద్రగంటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం కూడా ఇదే.
ఇంద్రగంటి మోహనకృష్ణ , నాని
లవ్ కాంబినేషన్
‘ఊహలు గుసగుసలాడే...’(2014) చిత్రంతో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు నాగశౌర్య. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన అవసరాల శ్రీనివాసే ఈ సినిమాను తెరకెక్కించారు. రెండేళ్ల తర్వాత అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జ్యో అచ్యుతానంద’(2016) సినిమాలో ఒక హీరోగా నటించారు నాగశౌర్య. నారా రోహిత్ మరో హీరో. తాజాగా నాగశౌర్య–అవసరాల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’. వీరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా మరో లవ్‌స్టోరీ కావడం విశేషం.
అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య
ఈ థర్డ్ కాంబినేషన్సే కాకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013) సినిమా తర్వాత తమిళ హిట్ ‘అసురన్’ తెలుగు రీమేక్ కోసం హీరో వెంకటేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రెండోసారి సెట్టయ్యారు. ‘గౌతమ్‌నంద’ (2017) తర్వాత గోపీచంద్‌ని కబడ్డీ కోచ్‌గా మార్చి, ఆయనతో రెండో సినిమా తీస్తున్నారు సంపత్‌నంది. ‘నిన్నుకోరి’(2017) హిట్ కిక్‌తో ‘టక్‌జగదీష్’ కోసం మరోసారి కలిసి సెట్స్‌కు వెళ్లడానికి రెడీ అయ్యారు హీరో నాని, దర్శకుడు శివనిర్వాణ. ‘గూఢచారి’(2018)వంటì సూపర్‌హిట్ తర్వాత ‘మేజర్’కోసం మళ్లీ కలిశారు హీరో అడవి శేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్క. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ (2015) చిత్రంలో రానా ఓ కీలకపాత్ర చేశారు. ఇప్పుడు రానా–గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చే ఏడాది చివర్లో ‘హిరణ్యకశ్యప’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హిట్ దిశగా తమను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ డైరెక్షన్‌లో యాక్ట్ చేయడానికి మరికొందరు హీరోలు కూడా రెడీ అయ్యారు. మరికొందరు అవుతున్నారు.
ఇండియన్ సినిమా దృష్టంతా ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా పైనే ఉంది. ఈ సినిమాకు ముందు రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ చిత్రం సృష్టించిన ప్రభంజనం ప్రభావమే ఇందుకు ఓ కారణం. అలాగే ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలసి నటిస్తున్న చిత్రం కావడంతో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అయితే గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం 1 (2001), సింహాద్రి (2003), యమదొంగ (2007)’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రాజమౌళి–ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రం ఇది. అలాగే రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర (2009) అనే సూపర్‌హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రాజమౌళి–రామ్‌చరణ్ కాంబినేషన్ పరంగా రెండోది. ఇలా ఆల్రెడీ సోలోగా రాజమౌళితో హిట్ అందుకున్న ఎన్టీఆర్–రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో కలసి హిట్ అందుకోవడం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న పది భాషల్లో విడుదల కానుంది.
–ముసిమి శివాంజనేయులు.
Comments
Please login to add a commentAdd a comment