2019 సిల్వర్ స్క్రీన్ కొంతమంది స్టార్స్‌ని మిస్ చేసింది. అభిమానులను నిరాశపరిచింది. ఒకప్పుడంటే ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి లేక రెండు. అంతే.. ఆ ఒక్క దర్శనం కోసం అభిమానులు ఎదురు చూపులు చూస్తుంటారు. కానీ ఈ ఏడాది కొందరు హీరోలు అసలు ఒక సినిమాలో కూడా కనిపించలేదు. మిస్ అయిన లిస్ట్‌లో హీరోయిన్లు కూడా ఉన్నారు.
అయితే అభిమానులకు చిన్న ఊరట ఇస్తూ.. కొందరు ‘గెస్ట్’ రోల్స్‌లో కనిపించారు. కానీ రెండున్నర గంటలసేపు చూసినంత తృప్తి ఇలా వచ్చి అలా వెళ్లే అతిథి పాత్రలు చూసినప్పుడు దక్కదు కదా. మరి.. ఈ ఏడాది మిస్ అయిన ‘మిస్సింగ్ స్టార్స్’ ఎవరు? వచ్చే ఏడాదిని కూడా మిస్సవుతారా?.. తెలుసుకుందాం.
రెండోసారి మిస్
తెలుగు సినిమా ప్రతిష్టను దేశవ్యాప్తంగా పెంచిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా రెండు భాగాలను తెరకెక్కించడానికి దర్శకుడు రాజమౌళికి ఐదేళ్ల సమయం పట్టింది. ఆ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే ప్రభాస్ తెరపై కనిపించారు. అయితే ‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో తమ హీరోను చూసిన తర్వాత ‘ఇలాంటి సినిమాకి ఇంత టైమ్ అవసరమే’ అనుకున్నారు ఫ్యాన్స్. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఎనీ్టఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిరి్మస్తున్న చిత్రం ఇది.
1920 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ చిత్రానికి కాస్త సమయం పడుతుంది. అలా ఈ ఏడాది తెరపై ఎనీ్టఆర్‌ను చూసుకునే చాన్స్ ఆయన ఫ్యాన్స్‌కు లేకుండా పోయింది. 2009లో ఎనీ్టఆర్ ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. మళ్లీ మిస్సయిన ఇయర్ ఇదే. గత ఏడాది దసరాకి ‘అరవింద సమేత వీరరాఘవ’లో కనిపించిన తర్వాత సెప్టెంబర్ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రం వచ్చే జూలై 30న రిలీజ్ కానుంది.
గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది
‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్..’ అని మురళీ శర్మ అంటే, ‘ఇవ్వలా.. వచి్చంది’ అని అల్లు అర్జున్ బదులు చెబుతారు. ఇది అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అల..వైకుంఠపురములో’ టీజర్‌లోని సీన్. ఈ డైలాగ్ మాదిరిగానే ఈ ఏడాది వెండితెరకు అల్లు అర్జున్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. 2018లో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటించిన అల్లు అర్జున్ కథల ఎంపికకు ఎక్కువ టైమ్ తీసుకున్నారు. అయితే వరుసగా మూడు సినిమాలను ప్రకటించి రన్నింగ్ ట్రాక్‌లోనే ఉన్నానని చెప్పకనే చెప్పారు. ‘అల..వైకుంఠపురములో’ జనవరి 12న రిలీజ్ కానుంది. నెక్ట్స్ సుకుమార్ దర్శకత్వంలో హీరోగా, ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమాలు చేయబోతున్నారు.
అనుకోని గాయం.. చేసింది దూరం
అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘భీష్మ’గా నితిన్ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయాల్సింది. కానీ నితిన్ గాయపడటం వల్ల వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇలా అనుకోని గాయం నితిన్‌ను హీరోగా ఈ ఏడాది వెండితెరకు దూరం చేసింది. కానీ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణే’లో అతిథిగా నితిన్ కనిపించారు. చంద్రశేఖర్ ఏలేటి, వెంకీ అట్లూరి (‘రంగ్ దే’ టైటిల్), కృష్ణచైతన్య దర్శకత్వాల్లో నితిన్ తర్వాతి చిత్రాలు తెరకెక్కనున్నాయి.
రానా... రాలేదు
‘అరణ్య’, ‘1945’, ‘భుజ్: దిఫ్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాల చిత్రీకరణలతో ఈ ఏడాది బిజీ బిజీగా గడిపారు రానా. ఈ ఏడాది హీరోగా తెలుగు వెండితెరపైకి రాలేదు రానా. నిజానికి ‘అరణ్య’ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. అయితే ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ సినిమాలో రానా కొద్దిసేపు కనిపించిన సంగతి తెలిసిందే. ‘హౌస్‌ఫుల్ 4’తో హిందీ తెరపైనా కనిపించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ‘హిరణ్యకశ్యప’, ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్ .. నటుడిగా రానా నెక్ట్స్ ప్రాజెక్ట్స్. శ్రీలంక ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌కు రానా ఓ నిర్మాత. ఇలా హీరోగా, నిర్మాతగా రానా వచ్చే ఏడాది హల్‌చల్ చేస్తారు.
వితో వస్తాడు
ప్రస్తుతం ‘వి’ సినిమాలో పోలీసాఫీసర్‌గా చేస్తున్న సుధీర్‌బాబు ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించలేదు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని మరో హీరో. ‘వి’ చిత్రం వచ్చే ఏడాది మే 25న విడుదల కానుంది. ఇది కాకుండా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పుల్లెల గోపీచంద్ బయోపిక్‌తో పాటు ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటారు సుదీర్.సినిమాల్లో గ్యాప్ అనేది సహజం. మహా మహా స్టార్లకు కూడా గ్యాప్‌లు వచి్చన సందర్భాలున్నాయి. సో.. ఈ ఏడాది తమ అభిమాన తారలను వెండితెరపై చూసుకోలేకపోయామని ప్రేక్షకులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఏడాదిని మిస్సయినవారందరూ షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నవారే. కాబట్టి వచ్చే ఏడాది వీరి సందడి కాస్త ఎక్కువగానే ఉండొచ్చని ఊహించవచ్చు.
– ముసిమి శివాంజనేయులు
►గత ఏడాది కథానాయికగా ‘భాగమతి’లో కనిపించిన అనుష్క ఈ ఏడాది ‘నిశ్శబ్దం’ చిత్రంలో వెండితెరపై కనిపించాల్సింది. కానీ ఈ ఏడాది చివర్లో విడుదల కావాల్సిన ‘నిశ్శబ్దం’ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది. దీంతో చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో అనుష్క అతిథి పాత్రలో కనిపించారు కదా అని అనుష్క ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి వచి్చంది. ‘మహానటి’ కీర్తీ సురేష్ ఈ ఏడాది ‘మిస్ ఇండియా, గుడ్‌లుక్ సఖి’ అనే రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు తమిళంలో ‘పెంగ్విన్’, మలయాళంలో ‘అరేబియన్ కడలింటే సింగమ్’, హిందీలో ‘మైదాన్’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ 168వ సినిమాకి ఇటీవల సైన్ చేశారు. ఈ ఏడాది ‘మన్మథుడు 2’లో అతిథిగా కనిపించడం మినహా కీర్తీ వేరే సిరిమాల్లో కనిపించలేదు. అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ వచ్చే ఏడాది విడుదలవుతాయి కాబట్టి 2020లో కీర్తీ పలు మార్లు దర్శనమిస్తారు.
ఇక ‘ఎన్టీఆర్: కథానాయకుడు’లో అతిథిగా నటించి, హాలీవుడ్ మూవీ ‘ఫ్రోజెన్ 2’ తెలుగు వెర్షన్‌కు తన గొంతును వినిపించిన నిత్యామీనన్ హీరోయిన్‌గా ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించలేదు. నిత్యా నటించిన ‘ప్రాణ’ ఈ ఏడాది తెలుగులో విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ‘దేవుడు చేసిన మనుషులు’ (2012) చిత్రంలో హీరోయిన్‌గా నటించిన తర్వాత దాదాపు ఆరేళ్లు హిందీ చిత్రాలు చేస్తూ గత ఏడాది ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాతో తెలుగు తెరపైకి కమ్ బ్యాక్ ఇచ్చారు ఇలియానా. ఆ తర్వాత మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ‘కాటమ రాయుడు’ (2017) తర్వాత శ్రుతీహాసన్ తెలుగు తెరకు దాదాపు రెండేళ్లు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు రవితేజ ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్ ట్రాక్‌లోకి వచ్చారు శ్రుతీ. 2017లో ‘కేశవ’లో నటించిన రీతూ వర్మ. ఇటీవలే నాని ‘టక్ జగదీ’లో ఒక హీరోయిన్‌గా నటించే చాన్స్ దక్కించుకున్నారు.
దాదాపు రెండేళ్లు వెండితెరకు దూరమయ్యారు మంచు మనోజ్. ఇటీవలే మనోజ్ ఎమ్‌ఎమ్ ఆర్ట్స్ అనే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మనోజ్ తర్వాతి చిత్రం ఈ నిర్మాణ సంస్థలోనే తెరకెక్కుతుందని ఊహించవచ్చు. మనోజ్ హీరోగా నటించిన ‘ఒక్కడు మిగిలాడు’ 2017లో విడుదలైంది. దాదాపు రెండేళ్లుగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని సాయిరామ్ శంకర్ ఇటీవలే తన కొత్త చిత్రం ‘రీసౌండ్’కు కొబ్బరికాయ కొట్టారు. 2018లో ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ మూవీ కెమెరా ముందుకు రాలేదు. ప్రస్తుతానికి సినిమాలేవీ కమిట్ అయిన దాఖలాలు కూడా లేవు. అయితే హిందీ ‘పింక్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment