గుణశేఖర్ చేసింది నిజంగా ఓ సాహసం : దాసరి నారాయణరావు
‘‘హిస్టారికల్ సినిమా చాలా డేంజరస్ జానర్. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ ఎంతో కష్టపడి తీశారు. అది మన చరిత్ర. ఆ తర్వాత నేను కృష్ణంరాజుతో ‘తాండ్ర పాపారాయు డు’ తీశా. అదీ ఆంధ్రుల చరిత్రే. 28 ఏళ్ల గ్యాప్ తర్వాత మన చరిత్రతో తీసిన ‘రుద్రమదేవి’ నిజంగా ఓ సాహసమే. నేనైతే ఇప్పట్లో ఈ సాహసం చేయలేను. కానీ గుణశేఖర్ చేశాడు’’ అని ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు అన్నారు. అనుష్క, అల్లు అర్జున్, రానా ముఖ్యతారలుగా స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మించిన ‘రుద్రమదేవి’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.
ఆదివారం రాత్రి ఈ చిత్రాన్ని చూసిన దాసరి నారాయణరావు సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి -‘‘అనుష్క లేకపోతే ఈ సినిమా లేదు అన్నంత బాగా చేసింది. సావిత్రి, జయసుధ, జయప్రద లాంటి నటీమణుల సరసన చేరిందని గట్టిగా చెప్పగలను. ఇక గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు. ఇలాంటి సినిమా గురించి చెప్పాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో ఉన్న సీనియర్స్‌కు ఉందని భావిస్తున్నా. ఇది తెలుగువారి కథ కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ చిత్రానికి పన్ను రాయితీ కల్పించాలని కోరుకుంటున్నా.
సినిమా బాగుంది... స్టాండ్ అయ్యే సమయానికి రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇది ఎంత వరకు సమంజసం? ఎందుకు పోటీ? ఎవరు బాగు పడటానికి? ఎవరు నాశనం కావడానికి? పెద్ద హీరోలకు పండగలు అవసరం లేదు. వాళ్ల సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఆ రోజే పండగ. ఈ సినిమాకు వేరే సినిమా లేకుండా గ్యాప్ ఇస్తే కచ్చితంగా చరిత్ర సృష్టిస్తుంది’’ అని అన్నారు.
గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘దాసరిగారి సినిమాలు చూస్తూ ఎదిగిన నాకు ఆయనతో ఈ వేదికను పంచుకోవడం ఆనందంగా ఉంది. విమర్శకుల మేధస్సును మెప్పించలేకపోయానేమో గానీ, ప్రేక్షకులు మాత్రం వాళ్ల మనసుల్లో నాకు గొప్ప చోటునిచ్చారు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా చూసి దాసరి గారు ఇచ్చిన ఇన్‌స్పిరేషన్ మర్చిపోలేను. ఇంత మంచి పాత్ర ఇచ్చిన గుణశేఖర్‌గారికి నా కృతజ్ఞతలు’’అని అనుష్క అన్నారు. ఈ సమావేశంలో రాగిణీ గుణ, నీలిమా గుణ, యుక్తాముఖి తదితరులు పాల్గొన్నారు.