మహేశ్‌బాబుకి నేనే ఫోన్ చేశా! | special chit chat with hero allu arjun | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబుకి నేనే ఫోన్ చేశా!

Published Thu, Oct 8 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

మహేశ్‌బాబుకి  నేనే ఫోన్ చేశా!

మహేశ్‌బాబుకి నేనే ఫోన్ చేశా!

రాబిన్‌హుడ్!
 
ఉన్నవాళ్లను దోచుకొని లేనివాళ్లకు పెట్టేవాడే రాబిన్‌హుడ్. అల్లు అర్జున్ అభిమానుల మనసు దోచుకోవడానికి గుణశేఖర్ అభిమానం గెలుచుకున్నాడు. ‘రుద్రమదేవి’లో రాబిన్‌హుడ్‌ను పోలిన గోన గన్నారెడ్డి పాత్రను పోషించిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...
 
నేనే గుణశేఖర్‌ను గోన గన్నారెడ్డి పాత్ర అడిగా...
పారితోషికం కూడా అడగకుండా చేశా...
చిరంజీవిగారి 150వ సినిమా మీద కంటే 151వ సినిమా మీదే నా దృష్టి ఎక్కువగా ఉంది.
రామ్‌చరణ్‌ను నాతో పోల్చితే అలా పోల్చాలి.
మా అబ్బాయిని బైక్ మీద తిప్పాలని ఉంటుంది. కాని ఆ  కోరిక తీరే వీలు లేదనే బాధ ఉంటుంది.
ఇవాళ్టి మమ్మీలు సూపర్ మమ్మీలు. పిల్లల్ని వాళ్లు బాగా చూసుకుంటున్నారు...
 ఇలాంటి విశేషాలెన్నో ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకం...

 
►మీ కెరీర్‌ని విశ్లేషిస్తే ‘గంగోత్రి’ అప్పుడు ‘హీరోగా పనికొస్తాడా?’ అనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మీ స్టయిల్స్‌ని ఇతరులు ఫాలో అవుతున్నారు...
అల్లు అర్జున్: ఇది ఒక్క రోజు ఎఫర్ట్ కాదు. చాలా ఎఫర్ట్ ఉంది. బేసిక్‌గా నేను కొంచెం వెస్ట్రన్ థింకింగ్ పర్సన్‌ని. నా సినిమాల్లో పాటలు, డ్యాన్సుల్లో ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. నాకు పనంటే ప్రేమ. ఎంత గొప్ప పని చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు.. చేసే పని గొప్పగా చెయ్యాలన్నది నా పట్టుదల. సింపుల్ ఎగ్జాంపుల్ రాజమౌళి. ఒక తెలుగు సినిమా డెరైక్టర్ అయ్యుండి ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఎదిగారంటే మామూలు విషయం కాదు. చేసే పనిని వంద శాతానికి మించి చేయడంవల్లే అది సాధించారు. చిరంజీవిగారు కూడా అలా పని చేయడంవల్లే ఈ స్థాయికి చేరుకున్నారు. ‘బాత్రూమ్ క్లీనర్’ అయినా వరల్డ్స్ బెస్ట్ అనిపించుకుంటే అతనంటే నాకు గౌరవం ఉంటుంది.

చిరంజీవి అభిమానులే మీక్కూడా ఫ్యాన్స్‌గా ఉంటున్నారా లేక మీకంటూ కొత్తవాళ్లని సంపాదించుకోగలిగారా?
 చిరంజీవిగారి ఫ్యాన్ బేస్ నాకు ఉపయోగపడింది. ఆ తర్వాత మేం ప్రూవ్ చేసుకుంటే కొత్త అభిమానులు ఏర్పడతారు. థియేటర్ దగ్గర సందడి చేసే అభిమానులే కాదు.. సెలైంట్‌గా సినిమా చూసి వెళ్లిపోయే.. అంటే.. ఇంట్లో దాదాపు టీవీకి పరిమితమైన వాళ్లల్లో కూడా నన్ను ఓన్ చేసుకున్నవాళ్లు ఉన్నారు. అలాంటి సెలైంట్ ఫ్యాన్స్ గురించి వెలుగులోకి రాదు. ఎలక్షన్స్‌లా అన్నమాట. ఎన్నికల హడావిడి భారీగా ఉంటుంది. జనాలు  సెలైంట్‌గా వచ్చి ఓటేసి వెళ్లిపోతారు (నవ్వుతూ).

చిరంజీవి 150వ సినిమా ఎలా ఉంటే బాగుంటుందనుకుంటున్నారు?
 హానెస్ట్‌గా చెప్పాలంటే 150వ సినిమా పై నాకంత క్యూరియాసిటీ లేదు. అదెలా ఉన్నా చూస్తారు. 151వ సినిమా మాత్రం ఎలా ఉండాలని ఆలోచిస్తున్నా. ఆ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌లో చేయాలనుకుంటున్నాం. సో ఎలాంటి కథ చేస్తే చూస్తారు? డ్యాన్సులు చేయాలా? ఫైట్స్ కూడా రెచ్చిపోయి చెయ్యాలా? వంటివన్నీ ఆలోచించి ఆ సినిమా చెయ్యాలి.

చిరంజీవిగారి అబ్బాయి రామ్‌చరణ్ కన్నా మీరు సక్సెస్‌ఫుల్ అని ఎవరైనా అంటే మీ రియాక్షన్ ఏంటి?
 చరణ్‌తో కంపేర్ చేయడం న్యాయం కాదు. నేను హీరో అయిన ఏడేళ్లకు తను హీరో అయ్యాడు. నా ‘పరుగు’ తర్వాత చరణ్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. మా ఇద్దర్నీ పక్క పక్కన చూసినప్పుడు కంపేర్ చేయాలనిపిస్తుందేమో. మా ఇద్దర్నీ నేనెలా పోల్చుతానంటే నా మొదటి సినిమా ‘గంగోత్రి’ని చరణ్ మొదటి సినిమా ‘చిరుత’నూ పోల్చుతాను. నాకన్నా బాగా చేశాడు. నా సెకండ్ మూవీ ‘ఆర్య’కన్నా తన సెకండ్ మూవీ ‘మగధీర’లో ఇంకా బాగా చేశాడు. నా ఏడో సినిమాతో తన ఏడో సినిమాని పోల్చితే తనే బాగా చేశాడు.

వరుణ్ తేజ్ నుంచి మీకెలాంటి పోటీ ఉంటుంది?
ఎవరికీ ఎవరూ పోటీ కాదు. ఎట్ ఎనీ పాయింట్ మనకు మనమే పోటీ. నా సినిమా బాగుంటే నాది చూస్తారు. ఒకవేళ వరుణ్ సినిమా బాగుంటే తనది చూస్తారు. ఇద్దరిదీ బాగా లేకపోతే చూడరు. సో.. ఇక్కడ ఎవరి సక్సెస్ వాళ్లదే. ఆ సక్సెస్ కోసం పోటీ పడాలి.

ఇతర హీరోలతో ఎలాంటి పోటీ ఉంటుంది?
డెఫినెట్‌గా మా మధ్య ప్రొఫెషనల్ రైవలరీ ఎక్కువగా ఉంటుంది. కానీ, పర్సనల్‌గా పోటీ పడం.
 
చిన్నవయసులో ఎక్కువ సక్సెస్ చూశాననీ, కెరీర్‌పరంగా, కుటుంబపరంగా సెటిల్ అయ్యానని అనుకుంటున్నారా?
 నేనలా చిన్నవాడిలా కనిపిస్తున్నాను కానీ, నాకు 32 ఏళ్లు. ఇది యంగ్ ఏజ్ కాదు (నవ్వుతూ).  32ఏళ్లు వచ్చేశాయ్. హీరో అయ్యి, పదేళ్లయ్యింది. ఇంకా రిమార్కబుల్‌గా ఏం చేయలేకపోయామే అనే డిప్రెషన్ ఉంది. ఇంకా ఏదైనా చేయాలనే తపన ఉంది.
 
‘సినిమా వాళ్లు’ అని కొంతమంది చిన్నచూపు చూస్తారు. ముందు తరంలో కొంత మంది గౌరవం తెచ్చారు. ఈ తరంలో మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, గోపీచంద్, మీరు.. ఇంకొంత మంది ప్రాపర్‌గా పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో గౌరవం పెరుగుతోంది. ఈ విషయంలో మీకెవరు ఇన్‌స్పిరేషన్?
 నాకు హీరోల భార్యల్లో మొదటి ఇన్‌స్పిరేషన్ అంటే చిరంజీవిగారి వైఫ్, మా అత్తయ్య సురేఖ. ఆ తర్వాత ఇన్‌స్పిరేషన్ వెంకటేశ్‌గారి భార్య.  రానా ద్వారా వెంకటేశ్‌గారి ఇంటికి వెళతాను కాబట్టి వాళ్లెలా ఉంటారో నాకు తెలుసు. ఆ ఫ్యామిలీస్‌లో ఉన్న మంచి క్వాలిటీస్‌ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను.

చిరంజీవి వైఫ్, వెంకటేశ్ వైఫ్ అప్పటి తరంవాళ్లు. మరి... ఈ తరం లేడీస్ గురించి?
 జనరలైజ్ చేసి చెప్పలేం. విలువలు ఉన్నవాళ్లు ఉన్నారు. అస్సలు వేల్యూస్ లేకుండా తిరిగేవాళ్లు ఉన్నారు. ఇప్పటి తరం లేడీస్ మోడర్న్‌గా ఉంటున్నారు కాబట్టి అప్పుడప్పుడూ మాత్రమే పిల్లలను చూసుకుంటారేమో అనుకునేవాణ్ణి. నా అభిప్రాయం తప్పు. నేను చూస్తున్న సొసైటీలో యంగ్ మదర్స్, మోడర్న్ మదర్స్ అందరూ సూపర్. పిల్లలను వాళ్లు పెంచే విధానం చూస్తుంటే హ్యాట్సాఫ్ అనాలనిపిస్తోంది.

►ఆడవాళ్లు ఎలా ఉంటే మీకిష్టం?
 బ్యాలెన్డ్స్‌గా ఉండాలి. గుడికి వెళ్లినప్పుడు అక్కడికి తగ్గట్టు, ఇంట్లో ఫంక్షన్‌కి అందుకు తగ్గట్టుగా, పార్టీలకు వెళ్లినప్పుడు దానికి సూట్ అయ్యేలా ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా వైఫ్ స్నేహ.

మీరు, మీ భార్య స్నేహ... ముందు పాప పుట్టాలనుకున్నారా? బాబు కావాలనుకున్నారా?
 నేను బాబే పుట్టాలనుకున్నాను. అదే జరిగినందుకు ఆనందంగా ఉంది. ఆ సంగతలా ఉంచితే ఎవరు పుట్టినా హెల్దీగా పుట్టాలని కోరుకున్నాను. ఎక్కడో మనసులో అబ్బాయి అయితే బాగుంటుందనుకున్నా.
 
ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నారు?

 ఇద్దరు పిల్లలు కావాలని ఉంది. బాబు ఉన్నాడు కాబట్టి ఈసారి పాప పుట్టాలనుకుంటున్నాను.

ఓ తండ్రిగా మీ అబ్బాయిని ఏ పార్కుకో, షాపింగ్‌కో తీసుకెళ్లాలని ఉంటుంది. ఓ స్టార్‌గా అది అంత ఈజీ కాదు కదా?
 అస్సలు ఈజీ కాదు. నాకైతే మా అబ్బాయిని బైక్ మీద తీసుకెళ్లాలని, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లాలని ఉంటుంది. కానీ కుదరదు. ఏ స్టార్ అయినా అలా పబ్లిక్‌లోకి రావడం కష్టమే. మా ఆవిడ అయితే చక్కగా మా అబ్బాయిని తీసుకుని షాపింగ్‌కి వెళుతుంది. నచ్చిన చోటుకి తీసుకెళ్లి ఆడిస్తుంటుంది. కానీ, నాకా అవకాశం లేదు. అందుకు బాధగానే ఉంటుంది.

ఏజ్ పెరిగిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఉందా?
 రాజకీయాల్లోకి రావాలని లేదు కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ ఉంది. పాలిటిక్స్ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంటాను.

ఓ 20 ఏళ్ల తర్వాత మీరెలా ఉంటారు?
 సినిమాలు చేస్తూనే ఉంటా. గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నా.

ఓకే.. ఇప్పుడు ‘రుద్రమదేవి’ విషయానికొద్దాం... సాధారణంగా డెరైక్టర్లు హీరోలను పాత్రలు చేయమని అప్రోచ్ అవుతుంటారు. కాని  గోన గన్నారెడ్డి కోసం గుణశేఖర్‌ని మీరే అప్రోచ్ అయ్యారట?
 నాకు ‘రుద్రమదేవి’ కథ తెలుసు. గుణశేఖర్‌ని కలిసిన సందర్భాల్లో ఈ కథ చెబుతుండేవారు. అది విన్నప్పుడు ఇలాంటి ‘బయో-ఎపిక్’ రాలేదు అనిపించేది. మొత్తం షూటింగ్ అంతా అయిపోయినా గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని తెలిసి నా అంతట నేనే చేస్తానన్నాను. కానీ నా కోసం పాత్రను కొంత మార్చమన్నాను. గుణశేఖర్ మన్నించారు. మంచి సినిమా తీయాలనే తపనతో ఉన్న ఆయనను సపోర్ట్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నా.

పారితోషికం కూడా అడగలేదట..?
 డబ్బులతో ముడిపెట్టుకుంటే కొన్ని చేయలేం. అప్పట్లో ఎన్టీఆర్, ఏయన్నార్ ఒకవైపు హీరోలుగా నటిస్తూనే మరోవైపు ఇలా సపోర్టింగ్ రోల్స్ చేసేవారు. ఎన్టీఆర్‌గారు తన రెండొందల చిత్రం- ‘కోడలు దిద్దిన కాపురం’లో సపోర్టింగ్ రోల్ లాంటిదే చేశారు. ఆయనే చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనిపించింది.

అసలు గోన గన్నారెడ్డి ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు.. మరి గెటప్ విషయంపై మీరెలా కసరత్తులు చేశారు?
 నిజమే. రిఫరెన్సెస్ ఏవీ లేవు. పైగా అది నా కోసం రాసిన పాత్ర కాదు. వేరే ఏజ్ గ్రూప్ హీరో కోసం రాసినది. నేనేమో యంగ్. అందుకని నేను చేస్తానన్న తర్వాత నాకు తగ్గట్టు మార్చారు. ఆ కాలంలో ఎలాంటి దుస్తులు వాడేవాళ్లు అని మా అంతట మేం రిసెర్చ్ చేశాం. ఇందులో నాది రాబిన్ హుడ్ తరహా పాత్ర. బేసిక్‌గా దొంగ అంటే నలుపు రంగు దుస్తులు వేసుకుంటారు కాబట్టి నేనూ అవే వాడాను. అలాగే గోన గన్నారెడ్డి కొంత రాయలసీమ, ఎక్కువ తెలంగాణ అని తెలిసింది. అందుకే ఈ పాత్ర తెలంగాణ మాట్లాడితే బాగుంటుందనుకున్నాం. ఓ పదిహేను రోజులు ప్రాక్టీస్ చేశా.

ఆ రోజుల్లో మగవాళ్లకు కూడా పొడవాటి జుత్తు ఉండేది. మరి.. మీ గోన గన్నారెడ్డి గెటప్ చూస్తుంటే, కురచ జుత్తుతో కనిపిస్తున్నారు?
 అప్పట్లో అందరికీ పొడవాటి జుత్తు ఉన్నా నా పాత్ర మాత్రం కురచ జుత్తుతోనే ఉంటుంది. దానికి క్లారిఫికేషన్ ఇచ్చాం. పొడవాటి జుత్తు ఉన్నవాళ్లని ‘బుర్ర శుకం’ అనేసి ట్యాగ్ చేసేవాళ్లట ఆ రోజుల్లో. గోన గన్నారెడ్డి లాంటి వాడు ఎదురు తిరిగి జట్టు కత్తిరించుకుని ఉంటాడని  ఊహించుకుని ఇలాంటి అంశాలు జోడించాం.

ఇది హీరో సినిమా కాదు. హీరోయిన్ సినిమా. విలన్లను తుదముట్టించే పాత్ర ఇందులో అనుష్కదే. దీనిపై ఏం ఆలోచించారు?
 (నవ్వుతూ) బేసిక్‌గా నాకు ఆడవాళ్లంటే చాలా గౌరవం. వాళ్లను గౌరవించే చిత్రం ఇది. స్త్రీ ఎందుకు రాజ్యాలను ఏలకూడదు? ఏలితే తప్పేంటి? అలాంటి వీర వనిత మీద తీస్తున్న సినిమాలో కీలక పాత్ర చేయాలనిపించింది. ఇలాంటి పాత్ర చేయడం అవసరమా... అని నన్ను వెనక్కి లాగడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ పాత్రకు నప్పుతాడా? అని అనుకున్నవాళ్లూ,  సినిమా వస్తుందో? రాదో అన్నవాళ్లూ ఉన్నారు. కానీ, గుణశేఖర్ ఎన్ని కష్టాలు పడైనా విడుదల చేస్తారనే నమ్మకంతో చేశా.

అనుష్క గురించి?
 అనుష్క లేకపోతే ఈ సినిమా లేదు. ఒక అమ్మాయిని నమ్మి 60- 70 కోట్లు ఖర్చుపెట్టడమా? అనే ప్రశ్న ఎవరినైనా వెనక్కి లాగే పాయింటే. కానీ అప్పట్లో శ్యాంప్రసాద్‌రెడ్డిగారు ‘అమ్మోరు’ తీశారు. ఆ తర్వాత అనుష్కతో ‘అరుంధతి’ తీశారు. తను నిరూపించుకుంది. ‘రుద్రమదేవి’గా తనే యాప్ట్ అని అందరూ అంగీకరిస్తారు.

‘బాహుబలి’తో పోల్చే చాన్స్ ఉందేమో?
 కంపేర్ చేయకూడదు. ‘రుద్రమదేవి’, బాహుబలి అంత పెద్ద సినిమా కాదు. అందుకని బాహుబలితో పోల్చకుండా ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. బాహుబలి విజువల్ ప్రెజెంటేషన్ మూవీ. రుద్రమదేవి స్టోరీ ఓరియంటెడ్ మూవీ.

హిందీ రంగంపై దృష్టి పెట్టడంలేదా?
 పెట్టాలంటే ఇక్కడి నా పదేళ్ల కెరీర్‌ని వదిలేసి అక్కడికెళ్లాలి. అది సాధ్యం కాదు. తమిళ్ చిత్రం, ద్విభాషా చిత్రాలు చేయాలని ఉంది.

మల్టీస్టారర్స్ గురించి?
 కథ కుదిరితే రెడీ. కథ కుదిరినప్పుడు ఒక హిందీ హీరో, ఒక తెలుగు హీరో కలిసి చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. వాళ్ల వాళ్ల భాషల్లో ఆ హీరోలకు క్రేజ్ ఉంటుంది కాబట్టి సినిమా రెండు భాషల వాళ్లకీ రీచ్ అవుతుంది.

హీరోగా కొనసాగడమేనా? నిర్మాణ రంగంలోకి వస్తారా?
 నాన్నగారు సినిమాలు నిర్మిస్తున్నారు. ‘100 పర్సంట్ లవ్’ కథ నాకు నచ్చింది. నాన్నగారికీ నచ్చడంతో ఇద్దరం కలిసి నిర్మించాం. అలా నాన్నగారికి కొన్ని ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పెడుతుంటా. ఇకపై సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. మనం బతికేసి వెళ్లిపోతే చాలదు. కొన్ని మంచి ఉదాహరణలు వదిలేసి వెళ్లాలన్నది నా లక్ష్యం.

►మహేశ్‌బాబుకి  నేనే ఫోన్ చేశా!
 ‘శ్రీమంతుడు సినిమా చూసి హీరోల్లో ఎవరైనా మీకు ఫోన్ చేసి అభినందించారా’ అని ఓ ఇంటర్వ్యూలో మహేశ్‌బాబుని అడిగితే ‘రామ్‌చరణ్ తప్ప ఎవరూ చేయలేదు’ అన్నారు. ఈ విషయం గురించి మీరేమంటారు? అని అడిగితే - ‘ప్రభాస్, రానా వంటి హీరోలతో నాకు పరిచయం ఉంది కానీ మహేశ్‌తో పెద్దగా పరిచయం లేదు. ‘శ్రీమంతుడు’ గురించి నేను వేరే వాళ్ల దగ్గర అభినందించాను. నాకు మహేశ్‌తో పరిచయం లేదు కాబట్టి తనతో చెప్పమని అన్నాను. వాళ్లు చెప్పలేదు. రాంచరణ్ తప్ప ఎవరూ చేయలేదనే మాట వినగానే, మహేశ్‌కి ఫోన్ చేసి ‘సారీ.. నేనే ఫోన్ చేసి ఉండాల్సింది. మీతో పెద్దగా పరిచయం లేదు కాబట్టి ఫోన్ చేయలేదు. నాకు సినిమా నచ్చింది. చాలా బాగా చేశారు’ అన్నాను. ఆయన కూడా ‘ఇట్స్ ఓకే’ అంటూ బాగా మాట్లాడారు’’ అని చెప్పారు.
 
మన తెలుగులో పరభాషల క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువయ్యారు.. ఆ విషయం గురించి ఏమంటారు?
మన తెలుగులో మంచి నటులు ఉన్నారు కానీ, గొప్ప నటులు లేరు. అందుకే ఇతర భాషలవాళ్లను తీసుకోవాల్సి వస్తోంది. ఫిజిక్ వైజ్‌గా తీసుకున్నా కూడా హిందీ నుంచి వస్తున్నవాళ్లకీ, ఇక్కడివాళ్లకీ చాలా తేడా ఉంది. ‘మేం ఉండగా వేరే భాషలవాళ్లు ఎందుకు?’ అని మనవాళ్లు అనుకోవడంలో న్యాయం ఉంది. నా సినిమాల్లో నేనెక్కువగా తెలుగు వాళ్లనే తీసుకోవాలనుకుంటాను. కానీ ఒక్కోసారి పాత్రకు అనుగుణంగా ఇతర భాషలవాళ్లని తీసుకోక తప్పడంలేదు.

 - డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement