Rudramadevi
-
రాణి రుద్రమదేవి @ 1289
తెనాలి: కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి జీవిత అంశాలను గుంటూరు జిల్లాలోని మూడు శాసనాలు బహిర్గతం చేస్తున్నాయి. ఇటీవల వెలుగుచూసిన ప్రస్తుత పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెం కొండపై గల శాసనం.. ఆమె మరణకాలంపై గల సందేహాలను తీరుస్తోంది. విజయవాడ కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్వేషణలో అక్కడి పురాతన బౌద్ధస్థావరం బహిర్గతమైంది. అక్కడి ఆయక స్తంభంపై చెక్కిన శాసనంలో గల రాణి రుద్రమదేవి వివరాలను తెలంగాణ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ వెలుగులోకి తెచ్చారు. సూర్యాపేట జిల్లాలోని చందుపట్లలోని శాసనంపై గల కాలాన్నే నిజమైన మరణ తేదీగా ఎక్కువమంది భావిస్తారు. పుట్లగూడెం కొండపై వెలుగుచూసిన తాజా శాసనం ఆ కాలాన్ని బలపరిచేలా ఉందని హరగోపాల్ వెల్లడి చేశారు. క్రీ.శ 1289 డిసెంబర్ 15న వేసిన ఈ శాసనంలో రుద్రమదేవి మరణం తర్వాత, కొండపై గల ఆలయానికి భూమిని దానమిచ్చినట్టుంది. చందుపట్లలోని సోమనాథ దేవాలయ శాసనం(1289 నవంబర్ 25)లో రుద్రమదేవికి శివలోక ప్రాప్తి కోరుతూ దేవాలయానికి భూమిని దానం ఇచ్చినట్టుంది. రుద్రమదేవి మరణించాక, దశ దిన కర్మ జరిగేలోపు.. అంటే అందులోని తేదీకి దాదాపుగా పక్షం రోజుల ముందు ఆమె మృతిచెంది ఉంటారని చరిత్రకారుల అంచనా. గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర్లోని ఈపూరులో నాగమయ్యస్వామి ఆలయంగా వ్యవహరించే గోపాలస్వామి ఆలయం ఎదుట గల స్తంభంపై 1289 నవంబర్ 28న చెక్కిన శాసనంలో రుద్రమదేవితో పాటు అంగరక్షకుడు బొల్నాయినికి పుణ్యంగా స్వామికి భూమిని సమర్పించినట్టుంది. ఈ రెండు శాసనాల్లో రాణి రుద్రమదేవితోపాటు ఆమె సైన్యాధిపతి మల్లికార్జుననాయుడు, అంగరక్షకుడు బొల్నాయినికి కూడా శివప్రాప్తి కోరారు. అంటే ముగ్గురూ ఒకేసారి మరణించారని చరిత్రకారులు చెబుతారు. చనిపోయే నాటికి ఆమె వయసు 80 ఏళ్లు! అంబదేవుడి తిరుగుబాటును అణిచివేసే యుద్ధంలో రుద్రమదేవి మరణించినట్టు చరిత్ర కథనం. చందుపట్ల, ఈపూరు శాసనాలు 1289 నవంబర్ 25, 28 తేదీల్లో వేయించినవి. అప్పటికి కొద్దిరోజుల ముందే ఆమె చనిపోయారు. పుట్లగూడెం కొండపై శాసనాన్ని అదే ఏడాది డిసెంబర్ 15న చెక్కారు. అంటే అప్పటికే రుద్రమదేవి జీవించి లేరని స్పష్టమైందని హరగోపాల్ వెల్లడించారు. చనిపోయేనాటికి ఆమె వయసు 80 ఉండొచ్చని ప్రముఖ చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి అంచనా. 1289లో రుద్రమదేవి మరణించినందున ఆమె జన్మ సంవత్సరం 1209 అయివుండొచ్చు. తన 52 ఏళ్ల వయసులో రుద్రమదేవి పట్టాభిషిక్తులయ్యారని వెల్లడవుతోంది. రుద్రమదేవికి చెందిన కీలక శాసనాలు మూడూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉండటం విశేషం. -
ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి!
♦ ‘రుద్రమదేవి’ తర్వాత ‘హిరణ్య కశ్యప’ సినిమా స్క్రిప్్ట, ప్రీ ప్రొడక్షన్‌పై ఐదేళ్లు వర్క్ చేశాను. షూటింగ్ ఆరంభించే టైమ్‌లో కోవిడ్ వచ్చింది. దీంతో అప్పుడు మాతో కలిసి ఉన్న ఓ హాలీవుడ్ సంస్థ మరో వర్క్‌పై ఫోకస్ పెట్టింది. ఈ కారణంగా ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టాం. ♦లాక్డౌన్ టైమ్‌లో కొన్ని పురాణాలు, ఇతిహాసాల కలయికలో ఓ ప్రేమకథ చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాకు నచ్చింది. దాన్ని సోషలైజ్ చేయటమెందుకు.. అలాగే తీస్తే బెటర్ కదా అని ‘శాకుంతలం’ మొదలుపెట్టాను. సాధారణంగా శకుంతల అనగానే శృంగార శకుంతల గుర్తుకొచ్చేలా ఇప్పటివరకూ చూపించారు. కానీ, ఆమెలో అంతర్గతంగా చాలా శక్తి, ఆత్మాభిమానం ఉంటుందని ‘అభిజ్ఞాన శాకుంతలం’లో కాళిదాసు ప్రస్తావించారు. నేను కూడా శకుంతల లోని రెండో కోణంతో కథ అల్లుకుని, ‘శాకుంతలం’ తీశాను. ♦ తన ఆత్మాభిమానం కోసం అప్పట్లో రాజు, రాజ్యాలను శకుంతల లెక్క చేయకుండా పోరాడి నిలబడింది. పెళ్లి కాకుండా తల్లి కావటం అనేది అప్పట్లో పెద్ద నేరం. అలాంటి పరిస్థితులను ఆమె ఎలా ఎదురొడ్డి నిలబడిందనేది ఈ చిత్రకథాంశం. ♦ సమంత చాలా మంచి నటి. అందుకే శకుంతల పాత్రలో రొమాంటిక్ యాంగిల్‌ను సెకండ్రీ చేశా. నటనకు ప్రాధాన్యం ఉండేలా చూపించాను. నేను, అరుణ బిక్షుగారు, సమంతగారు కలిసి మాట్లాడుకుని శకుంతల పాత్రను డిజైన్ చేశాం. సమంత కొత్త హీరోయిన్లా అరుణ బిక్షుగారి వద్ద శిక్షణ తీసుకుని నటించింది. ♦ ‘శాకుంతలం’లో దుర్వాస మహామునిగా మోహన్‌బాబుగారు నటించారు. ఆ పాత్రని ఆయన తప్ప మరొకరు చేయలేరు. ఆయన ఒప్పుకోకుంటే ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఆలోచనలో పడేవాణ్ణి. ♦ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోలు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్‌ది అతిథి పాత్ర అయినా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్రలో చాలా కోణాలుంటాయి. ఆ పాత్రని తెలుగు హీరోలు చేస్తారనే నమ్మకం నాకు కలగలేదు. అడిగి లేదనిపించుకోవటం ఇష్టం లేక వారిని సంప్రదించలేదు. దేవ్ మోహన్ ‘శాకుంతలం’ పూర్తయ్యే వరకు మరో సినిమా చేయనన్నాడు. అతనికి శిక్షణ ఇప్పించి దుష్యంతుడి పాత్ర చేయించుకున్నాను. -
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే రుద్రమదేవి కన్నుమూత
సాక్షి, నల్లగొండ: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి (65) ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జిల్లా కేంద్రంలోని స్వగృహంలో మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. తిప్పర్తి మండలం సిలార్మియాగూడెం గ్రామానికి చెందిన రుద్రమదేవి అదే మండలం (ప్రస్తుతం మాడుగులపల్లి) చెర్వుపల్లి గ్రామానికి చెందిన గడ్డం రంగారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాగా 1981లో కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా ఘనవిజయం సాధించారు. 18ఏళ్లకు ఎన్నికల్లో పోటీచేసి మొదటి ఓటును తనకే వేసుకున్న చరిత్ర రుద్రమదేవిది. రుద్రమదేవి 1981 నుంచి 99 వరకు కౌన్సిలర్‌గా, నల్లగొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఎమ్మెల్యేగా గెలుపొంది నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లు, కరెంట్, ఇతర అభివృద్ధి పనులు చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో రుద్రమదేవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరినప్పటీ ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంలోనే ఆమె భర్త గడ్డం రంగారెడ్డి కొన్నాళ్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందించారు. నివాళులర్పించిన జానా, కంచర్ల మాజీ ఎమ్మెల్యే రుద్రమదేవి మృతదేహానికి పట్టణంలోని రామగిరిలో ఆమె స్వగృహంలో మాజీమంత్రి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ, కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి ఆమె పార్ధివదేహంపై పూల మాలలు వేసి నివాళులరి్పంచారు. వారు రుద్రమదేవి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్, మార్కెట్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. రాజకీయాల్లో తనదైన ముద్ర : ఎంపీ కోమటిరెడ్డి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మృతికి మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. -
కాకతీయ సప్తాహాం.. ఓ కొత్త కోణం
కాకతీయులకు ఏడు అంకెపై మక్కువ ఎక్కువ. కాకతీయుల చరిత్ర, వారి జీవనశైలి, ఆనాటి పాలన పద్దతులు తదితర అంశాలను పరిశీలిస్తే అంతర్లీనంగా అన్నింటా ఏడు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. గుండయ నుంచి రుద్రమమీదుగా ప్రతాప రుద్రుడి వరకు కాకతీయులు ఏడుకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చారనే అంశాలపై కచ్చితమైన వివరణ, సమాధానాలు లభించలేదు. కానీ ఏడుకు ప్రత్యేక స్థానం అయితే లభించింది. అందుకు అద్దం పట్టే ఉదాహరణలను కోకొల్లలుగా చూపించవచ్చు. మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి. కాకతీయ శిల్ప కళావైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కాకతీయ శిలా తోరణ ద్వారాల్లోని మధ్య భాగంలో తామర మొగ్గల లాంటి నిర్మాణాలు ఏడు ఉన్నాయి . కాకతీయ కళాతోరణ పరిణామ క్రమంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న తోరణాలు ఏడు. అవి 1. అనుమకొండ కోట ప్రవేశ ద్వారాలు 2.కొలనుపాక తోరణం 3. వెల్దుర్తి తోరణం 4. ఐనవోలు దేవాలయ తోరణాలు 5. నందికంది తోరణం 6. రామగుండం తోరణం 7. వరంగల్ కీర్తి తోరణం ఏడు కోటలు కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు నగరం చుట్టూ ఏడు కోటలు ఉండేవి. అందుకే ఓరుగల్లు కోటకు సప్త ప్రకార పరివేష్టిత నగరమని ఏకామ్రనాథుడు రాసిన 'ప్రతాపరుద్రచరిత్ర' పేర్కొంది. ఈ ఏడు కోటలు ఇలా ఉన్నాయి. 1 .మట్టి కోట 2. పుట్ట కోట 3. కంప కోట 4. కంచు కోట 5. గవని కోట 6. రాతి కోట 7. కత్తికోట ఇందులో ప్రస్తుతం రాతి కోట, మట్టి కోట దాదాపు పూర్తిగా కనపడుతుండగా పుట్ట కోట వరంగల్ నగర పరిసర ప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతుంది. గిరి దుర్గాలు రాజ్యం సరిహద్దుల్లో గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో పటిష్ఠమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న కాకతీయులు అక్కడ ఉన్న కొండలపై సైనిక స్థావరాలుగా ఏడు గిరి దుర్గాలను నిర్మాణం చేసుకున్నారు . అవి 1. ప్రతాపగిరి కోట 2. గొంతెమ్మ గుట్ట 3. కాపురం గుట్టలు 4. నందిగామ కోట 5. మల్లూరు గుట్ట 6. రాజుపేట గుట్టలు 7. ధర్వాజల గుట్టగా ఉన్నాయి. ఇలా ఏడు గిరి దుర్గాలను ఏర్పాటు చేయడంలో మాత్రమే కాకుండా ఆ కోటల నిర్మాణంలో కూడా ఏడు సంఖ్య ఉండడం విశేషం. ఇక్కడా ఏడుకే ప్రాధాన్యం ప్రతాపగిరి కోటకు ఏడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మల్లూరు కోట గోడ ఏడు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దర్వాజల గుట్ట మీద ఏడు దర్వాజలు ఉన్నాయి. ప్రముఖ కాకతీయ ఆలయాలన్ని ఏడు రాతి పలకల వరుసల వేదికపై నిర్మాణం చేయబడ్డాయి. హన్మకొండలోని ప్రముఖ జైన కేంద్రమైన అగ్గలయ్య గుట్ట మీదనున్న జైన తీర్ధంకరుల శిల్పాల సంఖ్య ఏడు. వరంగల్ కోటలోని ప్రసిద్ద శంభుని గుడి ప్రాంగణంలో ఉన్న మంటపం ఏడు స్తంభాలతో నిర్మాణం జరిగింది. పాలనలో కాకతీయులు వారి నిర్మాణాలల్లో మాత్రమే కాకుండా పాలనా విధానంలో కూడా ఏడు సంఖ్యను ఉపయోగించారు. వారి పాలనా కాలంలో ప్రజా సంక్షేమంకోసంగాను సప్త సంతానాల కల్పన కోసం కృషిచేశారు. సప్త సంతానాలు: 1. స్వసంతానం 2. వన ప్రతిష్ఠ 3. దేవాలయ నిర్మాణం 4. అగ్రహార నిర్మాణం. 5. ప్రబంధ రచన 6. ఖజానా అభివృద్ధి 7. తటాక నిర్మాణం. సప్త మాతృకలు శైవ మతాన్ని ఎక్కువగా అవలంబించిన కాకతీయ పాలకులు పరాశక్తి స్వరూపమైన అమ్మవార్లను కూడా ఆరాధించారు . ఆ అమ్మవార్లు ఏడుగురు ఉండడం విశేషం. సప్తమాతృకలు : 1.బ్రహ్మాణి 2. మహేశ్వరి 3. కౌమారి 4. వైష్ణవి 5. వారాహి 6. నారసిమ్హి 7. ఐంద్రీలుగా పూజించారు. సరస్సుల్లోనూ ఇలా పై అంశాలన్నింటిని పరిశీలించి చూస్తే కాకతీయ పాలకులు ఏడు అనే సంఖ్యను ప్రామాణికంగా తీసుకున్నారని తెలుస్తోంది. కాకతీయులు తవ్వించిన ప్రముఖ సరస్సులు 1. రామప్ప 2. పాఖాల 3. గణపసముద్రం 4. లక్నవరం 5. బయ్యారం 6. ఉదయ సముద్రం 7. రంగ సముద్రం. ఏడు బావులు నీటి పారుదల రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన కాకతీయ పాలకులు ఓరుగల్లు రాతి కోట పరిధిలో 7 మెట్ల బావులను నిర్మాణం చేశారు. శృంగార బావి 2. మెట్ల బావి 3. ఈసన్న బావి 4. అక్కా చెల్లెళ్ళ బావి 5. సవతుల బావి 6. కోడి కూతల బావి 7. గడియారం బావి. కోటలో ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి పొందిన ఓరుగల్లు రాతి కోట నుండి మధ్య కోట భాగంలో ప్రస్తుతం కాకతీయ కాలం నాటి ఏడు చారిత్రక కట్టడాలు ఉండడం విశేషం. శివాలయం 2. విష్ణు ఆలయం 3. వెంకటేశ్వర ఆలయం 4. కొండ మసీదు 5. నేల శంభుని అలయం 6.అశ్వ శాల 7. వీరభద్ర ఆలయం కాకతీయులు- కొండపాక సిద్దిపేట జిల్లాలో ఒక మండల కేంద్రం కొండపాక. జిల్లా కేంద్రం సిద్దిపేటకు 17 కి.మీ. దూరంలో ఉంటుంది. కొండ పక్క ఉండటంతో దీన్ని ‘కొండపక్క’ అని పిలిచేవారని, అదే క్రమంగా ‘కొండపాక’గా స్థిరపడిందని తెలుస్తోంది. కొండపాకలోని రుద్రేశ్వరాలయం ప్రాచీనమైంది. సుమారు ఎనిమిది శతాబ్దాల క్రితం కాకతీయ రుద్రదేవుడి కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కాకతీయుల కాలంలో ఇది సైనికుల విడిది ప్రదేశంగా ఉండేదట. ఏడు సంఖ్యతో కొండపాకకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఏడు గ్రామాలు కలిసి ఇది ఏర్పడింది. ఏడు చెరువులు, ఏడు ఆంజనేయస్వామి ఆలయాలు, ఏడు పోచమ్మ గుళ్లు, ఊరి చుట్టూ ఏడు గుట్టలు, గ్రామం మధ్యలో ఏడు నాభి శిలలు నెలకొల్పారు. ఊరికి పశ్చిమంగా రాముని గుట్టలు అనే కొండల వరుస ఉంది. వీటిలో ఒకదాని మీద రామాలయం నిర్మించారు. పశ్చిమ చాళుక్యులు,కాకతీయులకు చెందిన శాసనాలు ఇక్కడి శివాలయ స్తంభాల మీద కనిపిస్తాయి. - ఖమ్మం జిల్లా జూలూరుపాడు ప్రాంతంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పోలారం చెరువుకు అనుసంధానంగా ఏడు చెరువులు, కుంటలను గొలుసుకట్టుగా నిర్మించారు. - 1296లో నిర్మాణం చేయబడ్డ మెదక్ కోట ఏడు ప్రవేశ ద్వారాలతో నిర్మాణం చేయబడడం గమనార్హం . - వరంగల్ రురల్ జిల్లాలోని కోగిల్వాయి సమీపంలోని చారిత్రిక చంద్రగిరి గుట్టల్లో కాకతీయ కోట ఆనవాళ్లతో పాటు ఏడు నీటి గుండాల నిర్మాణం జరిగింది. - హిడింబాశ్రమంగా పేరుగాంచిన మెట్టు గుట్టపై సైతం ఏడూ గుండాలు ఉండడం విశేషం. - కాకతి రుద్రదేవుడు ప్రస్తుత సిద్ధిపేట జిల్లాలోని వెల్డుర్తిలో స్వయంగా ప్రతిష్టాపన చేసాడని చెప్పబడే గొనె మైసమ్మకి ( దేవతల చెరువు సమీపంలోని ఆలయంలో ఉన్న అమ్మవారు ) ఏడు సంవత్సరాలకొకసారి ఏడు రోజుల పాటు జాతర నిర్వహించడం తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ. కాకతీయుల కాలంలో వాణిజ్య రంగంలో 7 రకాల నాణేలు చలామణిలో ఉండేవి. ఇలా కాకతీయుల కాలంలో ఏడుకు ప్రత్యేక స్థానం దక్కిందనే భావనకు మద్దతుగా అనేక ఉదాహారణలు చరిత్రలో కనిపిస్తున్నాయి. వరహాలు : వరహా ముద్ర కలిగిన బంగారు నాణేలు. గద్యానం : వరహా మాడ : వరహా లో సగం రూక : మాడలో పదవ భాగం పణం : వెండినాణెం (1, 1/2, 1/4, 1/8 విలువ కలిగినవి) చిన్నం : వరహాలో 8 వ భాగం తార : అతి చిన్న నాణెం -
రుద్రమ దేవి ధైర్యసాహసాలతో...
కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రాణి రుద్రమదేవి ధైర్య సాహసాలను బుల్లి›తెరపై ఆవిషరించేందుకు సిద్ధమైంది స్టార్ మా ఛానెల్. బుల్లి తెరపై మునుపెన్నడూ లేని ప్రమాణాలతో ‘రుద్రమదేవి’ కథను సీరియల్ రూపంలో తీసుకొస్తున్నారు. ‘‘ఈ రుద్రమదేవి కథా కాలాన్ని యథాతథంగా తెర మీదకు తీసుకు వచ్చేందుకు వందల మంది కృషి చేశాం. ఇది మన తెలుగు కథ. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కథ’’ అని స్టార్ మా బృందం పేర్కొంది. ‘రుద్రమదేవి’ సీరియల్ జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు స్టార్ మా చానెల్లో ప్రసారం కానుంది. -
‘రుద్రమదేవి’ రైటర్ ఆత్మహత్యాయత్నం
రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు మాటలు రాసిన రచయిత రాజసింహా ముంబైలోని తన రూంలో ఆత్మహత్యాయత్నం చేశారు. కొంతకాలంగా అవకాశాలు లేక రాజసింహా డిప్రెషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజసింహా, ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో అవకాశాలు తగ్గాయి. శంకర్‌దాదా ఎంబీబీయస్, బొమ్మరిల్లు, జుమ్మందినాధం, అనగనగా ఓ ధీరుడు, రుద్రమదేవి సినిమాలకు రాజసింహా రచయితగా పనిచేశారు. సంబరం, నీ స్నేహం, టక్కరిదొంగ లాంటి సినిమాల్లో నటుడిగానూ కనిపించారు. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన పలు చిత్రాలకు సెకండ్‌యూనిట్ దర్శకుడిగా పనిచేశారు. -
రుద్రమదేవి రికార్డు బద్దలు కొట్టిన భాగమతి
టాలీవుడ్ దేవసేన అనుష్క నటించిన భాగమతి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదైలనప్పటి నుంచి భారీగా వసూళ్లను రాబడుతోంది. తొలిరోజునే పాజిటాక్ తెచ్చుకున్న ‘భాగమతి’ అన్ని ఏరియాల్లో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటివారం లోనే సుమారు రూ.20 కోట్లు వసూలు చేసి నిర్మాతకు భారీ లాభాలనే ముట్టచెప్పింది. గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రమదేవి’ అమెరికాలో 9.71 లక్షల డాలర్లను వసూలు చేసింది. తాజాగా ‘భాగమతి’ ఆరికార్డును చెరిపేసింది. ఇప్పటికే 9.80 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకున్న భాగమతి మిలియన్ మార్క్‌కు అతి సమీపంలో ఉంది. దక్షిణాదిన హీరోయిన్ ప్రధాన పాత్రలో రూపొందించిన సినిమాకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. భారీ కలెక్షన్లతో తన పేరుతో ఉన్న రికార్డును తానే తిరగరాసింది. మొత్తానికి చాలా మంది టాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డును అనుష్క అందుకుంది. -
రుద్రమదేవికి ‘నంది’ రావాల్సింది
సాక్షి, హైదరాబాద్: సంస్కృతి, విలువలు, మానవీయతకు అద్దంపట్టిన చిత్రాలకు గతంలో నంది అవార్డులు ఇచ్చేవారని ప్రముఖ సినీ దర్శక నటుడు ఆర్.నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. కానీ, ఇప్పుడు అవార్డులు అంటే, ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారాయని అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ సినిమాను వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్లో చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి హరీశ్ రావును కోరేందుకు గురువారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆ సినిమాలో నారాయణమూర్తి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈసారి అవార్డుల్లో రుద్రమదేవి సినిమాకు నంది అవార్డు రావాల్సింది. రుద్రమదేవి లాంటి మహనీయురాలి జీవితాన్ని సెల్యులాయిడ్కు ఎక్కించడం అంత తేలిక కాదు. అలాంటి సినిమాను గుర్తించాల్సింది. బాహుబలి సినిమా సాంకేతికంగా, వాణిజ్యపరంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అందుకు ఆ సినీమా దర్శకుడు రాజమౌళికి సెల్యూట్. కానీ, బాహుబలికి జాతీయ ఉత్తమ అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయింది. ఆ సినిమా చరిత్ర కాదు, సందేశాత్మకం కాదు. అది పూర్తిగా కమర్షియల్ సినిమా. ఇప్పుడు కమర్షియల్ సినిమాలకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది’అని నారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఏపీ సీఎంకి రుద్రమదేవి డైరెక్టర్ సూటి ప్రశ్న
హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో 'రుద్రమదేవి' చిత్రానికి ఏ ఒక్క కేటగిరీలోనూ అవార్డు దక్కకపోవడంపై ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ మండిపడ్డారు. ఈ విషయంపై స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'ప్రశ్నించడం తప్పా?...' అంటూ ఆయన చేసిన ట్వీట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలు ప్రశ్నలు సంధించారు. చారిత్రాత్మక చిత్రం ''రుద్రమదేవి''కి వినోదపు పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదు...? మరో చారిత్రాత్మక చిత్రం ''గౌతమిపుత్ర శాతకర్ణి''కి మినహాయింపు ఎందుకిచ్చారని గుణశేఖర్ ప్రశ్నించారు. మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ''రుద్రమదేవి'', మూడు ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఏదో ఒక దానికి ఎంపిక కాలేకపోయిందని, కనీసం జ్యూరీ గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయిందని మండిపడ్డారు. ప్రశ్నించడం తప్పా..? Is it Wrong to Question ? pic.twitter.com/SBdbz7y0CO — Gunasekhar (@Gunasekhar1) November 15, 2017 -
కత్తి పట్టిన హీరోయిన్..
-
కత్తి పట్టిన హీరోయిన్..
చెన్నై: ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ కత్తి చేత పట్టారు. ఇప్పటి వరకూ హీరోలతో డ్యూయెట్లు పాడడం, అందాలు ఆరబోయడం వరకే పరిమితం అనుకున్న వారికి తాజాగా తన కత్తిలాంటి నటనతో బదులు చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. యుద్ధభూమిలో వీరవిహారం చేసే వీరనారిగా కనిపించనున్నారు. పోరు భూమిలో పోరాడి గెలవాలంటే కత్తి చేతపట్టాలి. కత్తి ఝళిపించటానికి మాత్రం కచ్చితంగా శిక్షణ అవసరం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అదే చేస్తున్నారు. అదీ ఆషామాషీగా కాదు. ఒక కత్తిసాము నిపుణుడి వద్ద లండన్‌లో శిక్షణ పొందుతున్నారు. ఇదంతా తాను నటించనున్న భారీ చారిత్రక కథా చిత్రం కోసమే. శ్రుతిహాసన్ సుందర్.సి దర్శకత్వంలో ‘సంఘమిత్ర’ అనే చిత్రంలో యువరాణిగా నటించునున్న విషయం తెలిసిందే. జయం రవి, ఆర్య కథానాయకులుగా నటించనున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. ఇందులో పాత్రకు న్యాయం చేయడానికి నటి శ్రుతిహాసన్ చాలానే శ్రమిస్తున్నారు. లండన్‌లో కత్తి సాములో శిక్షణ పొందుతున్నారు. ఈ అందాలభామ కత్తి విన్యాసాలు సంఘమిత్ర చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయన్న మాట. ఆ మధ్య రుద్రమదేవి చిత్రం కోసం నటి అనుష్క కత్తిసాము కోసం కసరత్తులు చేసి వెండితెరపై అలరించారు. తాజాగా నటి శ్రుతి అలా కత్తి చేత పట్టి రణభూమిలో కదం తొక్కనున్నారన్నమాట. కాగా, ప్రస్తుతం తన తండ్రితో కలిసి శభాష్‌నాయుడు చిత్రంతో పాటు, ఒక హిందీ చిత్రాన్ని శ్రుతి పూర్తి చేయాల్సి ఉందని తెలుస్తోంది. -
వినోద పన్నుపై వివరణ ఇవ్వండి
నిర్మాతలు గుణశేఖర్, రాజీవ్‌రెడ్డి, నటుడు బాలకృష్ణలకు హైకోర్టు నోటీసులు సాక్షి, హైదరాబాద్: వినోద పన్ను మినహాయింపు ప్రయోజనాలు సినీ ప్రేక్షకులకు అందడంలేదని, ఆ ప్రయోజనాలు వారికి వర్తింప చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, రుద్రమదేవి సినిమా నిర్మాత గుణశేఖర్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నిర్మాత రాజీవ్‌రెడ్డితో పాటు నటుడు నందమూరి బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాల నుంచి పొందిన వినోదపన్ను మినహాయింపు ప్రయోజనాలను నిర్మాతలే అనుభవిస్తున్నారని ఆ ప్రయోజనాలు ప్రేక్షకులకు కూడా వర్తింప చేయడానికి నిర్మాతల నుంచి ఆ మొత్తాలను రాబట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కార్యదర్శి ఎం.వేణుగోపాలరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
వాళ్ల సినిమాలకు క్షణాల్లో పన్ను మాఫీ... మరి మాకు..?
ఉమ్మడి రాష్ట్రంలోనన్నా మంత్రులు తెలంగాణ వాళ్ళ ఆవేదనను వినేవాళ్ళు. ఒక సందర్భంలో మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి డి.కే అరుణను కలసి ‘తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్’ ఆమోదం కోసం దరఖాస్తు పెడితే అప్ప టికప్పుడే పచ్చ సిరాతో సంతకం పెట్టి కమిషనర్‌కి ఫార్వర్డ్ చేసిన తీరు గుర్తుకు వస్తున్నది. రాష్ట్ర విభజన సందర్భంలో ఆగిన ఆ ఫైలు ఇప్పటిదాకా అలాగే ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డ్డాక పరిస్థితి ఊహకందని విధంగా తయారైంది. సీఎంతో సహా ఇతర మంత్రులు కూడా తెలంగాణ వాళ్ళు తీసిన సినిమాలకంటే సీమాంధ్ర నిర్మా తల సినిమాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. మోజు పడి భారీ బడ్జెట్ సినిమాల వేడు కలకు హాజరు అవుతున్నారు. మరో వైపున తెలంగాణ నిర్మాతలకు సీఎం అపాయింట్మెంటే దొరకదు! అదే ‘రుద్రమదేవి’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలకు అప్పటికప్పుడే క్షణాలలో పన్ను మాఫీ చేయమని హుకుం జారీ అయిపోయింది. ఆ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సిని మాలే. వీటికి ప్రోత్సాహకాలు ఇవ్వడం అవసరమా? ఒక చరిత్ర గాంచిన గొప్ప పేరు పెట్టి సినిమా తీస్తే సరిపోతుందా? వక్రీకరణలు, అసభ్య దృశ్యాలు, అస హజ సన్నివేశాలు, ఎబ్బెట్టు డైలాగులు ఉన్నాయా అని చూడకుండానే జీఓలు పాస్ చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నచ్చిన వారికి నచ్చిన విధంగా, నచ్చ నివారిని దగ్గరకు రానీయకుండా చేయ డం సబబేనా! వేరుపడ్డాక కూడా తెలం గాణ బిడ్డలపట్ల వివక్ష చూపితే ఎలా? ఎన్నో తక్కువ బడ్జెట్ సినిమాలు , తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాలు, తెలంగాణ చరి త్రను, పోరాటాలను తెరకెక్కించిన సినిమాలు అతికష్టంతో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు థియేటర్లు దొర కక, ఒకవేళ అరకొర థియేటర్లు దొరి కినా, భారీ అద్దెలు పన్నులు కట్టలేక, నిలబడలేక చితికిపోయిన సినిమాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటికి పన్నుమాఫీ చేసి ఆదుకుంటే, అది నిజమైన ప్రోత్సా హకం అనబడేది. మేము ప్రొసీజర్ ప్రకా రంగా దాఖలుచేసినా మా ఫైల్ అంగుళం కూడా జరగదు, అదే కొందరికి అప్పటి కప్పుడే ఉత్తర్వులు జారీ అయిపోతు న్నాయి. ఎదిగే దశలో ఉన్నవారిపట్ల మెడలు తిప్పుకొని, ఇప్పటికే ఎదిగిపోయిన వారితో మితిమీరిన అలాయ్ బలాయ్ తీసుకుని, వేదికలు పంచుకుంటున్నారు. రెండేళ్లుగా సీఎం కేసీఆర్‌కి తెలంగాణ చిత్రపరిశ్రమ సమస్యలు దఫదఫాలుగా విడమర్చి చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. క్షణాలలో పన్ను మినహా యింపు కొరకు జీవో జారీ చేసినట్లుగా, తెలంగాణ భూమిపుత్రుల కోసం ఒక ప్రత్యేక సినిమా పాలసీని రూపొందించ మని కోరుకుంటున్నాం! - సయ్యద్ రఫీ, సినీదర్శకుడు, తెలంగాణ చిత్ర పరిశ్రమ -
ఆస్కార్ ఎంట్రీ బరిలో రుద్రమదేవి
ఆస్కార్ అవార్డ్ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో పోటీపడేందుకు మన భారతీయ సినిమా ఎంపిక ప్రక్రియ మొదలైంది. మన దేశం తరఫున ఎంట్రీగా ఏ సినిమాను పంపాలనే దానికి పలు భాషా చిత్రాలను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది. తెలుగు నుంచి పోటీ పడే అరుదైన అవకాశాన్ని ‘రుద్రమదేవి’ దక్కించుకుంది.‘‘తెలుగువారి చరిత్రకు, రుద్రమదేవి చరిత్రకు ఉన్న గొప్పతనమే ఈ సినిమాను ఈ స్థాయి దాకా తీసుకెళ్లింది’’ అని ఈ సందర్భంగా చిత్రదర్శక-నిర్మాత గుణశేఖర్ పేర్కొన్నారు. భారతీయ భాషల్లో ఎంపిక చేసిన ఇలాంటి కొన్ని చిత్రాలను పరిశీలించి ఫైనల్‌గా మన దేశం తరఫున ఎంట్రీగా ఒక చిత్రాన్ని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ అవార్డు కమిటీకి పంపిస్తుంది. -
ఆ డైలాగ్ కేసీఆర్‌దే- అల్లు అర్జున్
కేసీఆర్ డైలాగ్‌నే వాడేసుకున్నానంటున్నాడు అల్లు అర్జున్. సినిమా సినిమాకి ఆసక్తికరమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఈ యువ హీరో. అర్జున్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రలు ఒక ఎత్తైతే.. 'రుద్రమదేవి'లో పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర మరో ఎత్తు. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అభినయం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పలువురి ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రలో అల్లు అర్జున్ ఊతపదం 'గమ్మునుండవయ్' అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ డైలాగ్ కేసీఆర్‌దేనంటూ అల్లు అర్జున్ ఇటీవల ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. గోన గన్నారెడ్డి పాత్ర చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తెలంగాణ యాసను పూర్తిగా ఒంటబట్టించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశానన్నాడు అల్లు అర్జున్. ఆ క్రమంలోనే రాష్ట్ర విభజనకు ముందు సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలను పదే పదే చూసేవాడట. ఆయన ఎక్కువగా 'గమ్మునుండవయ్య' అనే మాట వాడుతుండటం గమనించాడు. ఈ మాట అయితే ప్రేక్షకులు సులువుగా కనెక్ట్ అవుతారని డిసైడ్ అయ్యాడట. సినిమా విడుదలయ్యాక నిజంగానే అందరూ ఆ పాత్ర తీరుకు, ఆ మాటకు ఫిదా అయిపోయారు. 'ఆ డైలాగ్‌కి కేసీఆరే నాకు ఇన్స్పిరేషన్' అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు గోనగన్నారెడ్డి. రూపాయి పారితోషికం తీసుకోకుండా రుద్రమదేవిలో నటించానని చెప్పిన అల్లు అర్జున్, ఆ పాత్ర జీవితంలో మర్చిపోలేనిదంటూ మరోసారి గుర్తుచేసుకున్నాడు. -
వంద కోట్ల క్లబ్లో ‘రుద్రమదేవి’
షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్లో దర్శకుడు గుణశేఖర్ హన్మకొండ : కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత చరిత్రను తీసినందుకు గర్వంగా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆనాడు కాకతీయ మహారాణి నడయాడిన నేలపైనుంచి ప్రసంగిస్తున్నందుకు ఉద్విగ్నంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆడిటోరియం చప్పట్లు, ఈలలతో హోరెత్తి పోయింది. రుద్రమాదేవి, తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.... ఓరుగల్లు అనగానే ఓకే అన్నా.. ఇంటర్నేషన్ షార్ట్ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఆహ్వనం వచ్చిందని నాకు చెప్పగానే ఎక్కడా అని అడిగాను .‘ వరంగల్ ’.. అని చెప్పగానే వెంటనే ఓకే అన్నా. మూడు నెలలుగా ఎప్పుడెప్పుడు వరంగల్ వద్దామా అని ఎదురు చూస్తున్నా? నిర్వాహకులకు నేను ఫోన్ చేసి మరీ కార్యక్రమం కోసం వాకాబు చేశాను. రుద్రమాదేవి నడిచిన ఈ నేలలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ మరెన్నో ఫెస్టివల్స్‌కి నాంది కావాలి. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ తరహాలో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరగాలి. రికార్డు కలెక్షన్లు ఎంతో వ్యయప్రయాసల కోర్చి నేను రుద్రమదేవి చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాను. మొత్తం రూ.70 కోట్ల వ్యయమైంది. కానీ అంతర్జాతీయంగా తెలుగు, తమిళ్, మళయాలం, హిందీల్లో కలిపి ఈ చిత్రం వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. యూఎస్ఏలో మహేశ్, పవన్ కళ్యాణ్ చిత్రాల తరహాలో వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. రుద్రమదేవి చిత్రం వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరినందుకు నేను గర్వపడటం లేదు. నాకు సన్మానాలు, సత్కారాలన్నా ఇష్టం లేదు. కానీ రుద్రమాదేవి వంటి చిత్రాన్ని నిర్మించాను, దర్శకత్వం వహించాను అని చెప్పుకునేందుకు గర్విస్తా. రుద్రమదేవి కోసం మాట్లాడేందుకు నేను ఇక్కడికొచ్చా. ఎందరో తెలుసుకుంటున్నారు రుద్రమదేవి సినిమా తీస్తున్నాని తెలియగానే కథ గురించి తెలుసుకున్న తమిళ్, మళయాలం, హిందీ వాళ్లు ఆశ్చర్యపోయారు. రుద్రమదేవి కోసం మా వాళ్లకు తెలియాలి అంటూ డబ్బింగ్ హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత గూగుల్‌లో రుద్రమాదేవి, కాకతీయ కింగ్డమ్, ఓరుగల్లు కోసం వెతుకుతున్నవారి సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన జాబితాలో రుద్రమదేవి మూడో స్థానంలో నిలిచింది. కేసీఆర్‌కు అభినందనలు ఏ ప్రాంతం వాడన్నది చూడకుండా రుద్రమదేవి సినిమా తీశానని చెప్పగానే నా భుజం తట్టి వినోదపన్ను రాయితీ ఇచ్చి ప్రోత్సహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చరి త్ర అంటే రేపటి దారిని చూపించే నిన్నటి వెలుగు. ఆనాడు చెరువుల ప్రాముఖ్యతను గుర్తించిన రుద్రమదేవి ఎన్నో చెరువులను తవ్వించారు. ఆ నాటి చరిత్రను గౌరవిస్తూ చెరువుల పునరుద్ధరణ పథకానికి మిషన్ కాకతీయ అని సీఎం కేసీఆర్ గారు పేరు పెట్టారు. ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. స్మార్ట్ఫోన్లు, డిజిటల్ కాలంలో కూడా ఎనిమిది వందల ఏళ్ల కిత్రం కాకతీయులు అవలంభించిన పద్ధతి నేటి ప్రభుత్వాలకు స్ఫూర్తిని ఇచ్చిందంటే.. మాటలు కాదు. పవర్ ఫుల్ మీడియా సినిమా అనేది పవర్ఫుల్ మీడియా. సినిమా రంగంలోకి ప్రవేశించేందుకు షార్ట్‌ఫిల్మ్ మేకింగ్ అనేది మంచి ఫ్లాట్‌ఫాం. ఎంతోమంది షార్ట్ఫిలిమ్ల ద్వారానే ఎదిగి పెద్ద దర్శకులు అయ్యారు. మా కాలంలో దర్శకుడు కావాలంటే నిర్మాత, హీరోలకు కథలు చెప్పి, ఒప్పించి, మెప్పించాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటల్ కెమోరాతో పనితనం చూపించి దర్శక అవకాశం పొందవచ్చు. ఇటీవల కాలంలో ఈ పద్ధతిలో ఎంతోమంది టాలీవుడ్లో దర్శకులయ్యారు. ఇంకా ఎంతో ఉంది రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు అనే ఒక సామెత ఉంది. అదే విధంగా ఓరుగల్లు నగరం కూడా ఒక్క రోజులో నిర్మించబడలేదు. రుద్రమదేవితో పాటు ఎందరో రాజులు ఉన్నారు. వీరందరి చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇటలీకి చెందిన మార్క్పోలో చెప్పే వరకు మనకు రుద్రమదేవి గురించి ఎక్కువగా తెలియదు. మన చరిత్రను మనం తెలుసుకోవాలి. అందుకోసం ప్రయత్నాలు జరగాలి. ప్రపంచ వ్యాప్తంగా ఓరుగల్లుకు ప్రాచుర్యం రావాలి. అందుకే నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. తప్పకుండా ‘ప్రతాపరుద్ర - ది లాస్ట్ ఎంపరర్’ సినిమా నిర్మిస్తాను. మళ్లీ మళ్లీ వరంగల్‌కు వస్తాను. -
నేటి నుంచి అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం
మూడు రోజుల పాటు నిర్వహణ హాజరుకానున్న సినీ ప్రముఖులు హన్మకొండ కల్చరల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ లఘు చిత్రోత్సవానికి ఓరుగల్లు వేదిక కానుంది. శుక్రవారం నుంచి జరగనున్న చిత్రోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోయంలో చిత్ర ప్రదర్శనలు ఉంటాయని ఫిల్మ్ ఫెస్టివల్ చైర్మన్ కె.నాగేశ్వరరావు తెలి పారు. కాకతీయుల కీర్తి పతాకను దేశవిదేశాల లో ఎగురవేసిన ప్రముఖ దర్శకుడు, రుద్రమదేవి చిత్ర నిర్మాత, దర్శకుడు గుణశేఖర్‌ను, సినీ రచయిత తోట ప్రసాద్‌ను మంత్రి అజ్మీరా చం దూలాల్ సన్మానించనున్నారు. శనివారం జరిగే రెండో రోజు కార్యక్రమాలకు మంత్రి హరీష్రా వు హాజరవుతారని నాగేశ్వర్రావు తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న చిత్రోత్సవం లో వివిధ దేశాల దర్శకులే కాకుండా స్థానిక యువత నిర్మించిన లఘు చిత్రాలను ప్రదర్శించనున్నామని తెలిపారు. -
రాజరికపు జ్ఞాపకం... అనుభూతుల సంతకం
న్యూ ఇయర్ పార్టీ మూడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దానిని ఈ వీకెండ్ దాకా సిటీ కంటిన్యూ చేస్తోంది. ఉర్రూతలూగించిన నైట్‌పార్టీకి తోడుగా ప్రశాంతతను, రొటీన్‌కు భిన్నమైన ఆనందాన్ని పొందేందుకు వీకెంట్ టూర్ చేయాల్సిందే. ఇలా ఆలోచించేవారికి సిటీకి అతి చేరువలో ఉన్న భువనగిరి కోట ఒక చక్కని గమ్యం. - ఓ మధు గిరులు కోటలకు ఆవాసాలుగా మారిన తార్కాణాలెన్నో... గోల్కొండ, చంద్రగిరి, భువనగిరి ఆ కోవలోకి వచ్చే కోటలే... 12 వ శతాబ్దంలో కట్టిన ఈ కోట నేటికి రాచఠీవి కోల్పోకుండా తన దర్పాన్ని చూపిస్తుంది. సిటీకి దగ్గరగా... రొటీన్‌కు దూరంగా... నల్లగొండ జిల్లాలో సిటీకి 48 కి.మీ దూరంలో ఉన్న ఈ కోట సిటిజనులకు చక్కటి వీకెండ్ స్పాట్. ఈ కోట నిర్మాణ కౌశలం నేటికి ఆకట్టుకుంటోంది. చాళుక్య త్రిభువనమల్ల విక్రమాదిత్య ఈ కోటను నిర్మించాడని ఆయన పేరు మీదనే ఈ కోటకు త్రిభువనగిరి అని పిలిచేవారని చరిత్ర. తర్వాత కాలంలో ఇది భువనగిరికోటగా స్థిరపడింది. విశేషాలెన్నో... మత్తగజంలా కనిపించే శిలపై నిర్మించిన ఈ కోట మనను దూరం నుంచే ఆహ్వానిస్తున్నట్లుంటుంది. అంతటి నునుపైన శిలపై కోట ఎలా నిర్మించారో అర్థం కాదు. మొత్తం 50 ఎకరాలలో, 500 అడుగుల ఎత్తున్న ఏకశిల చూస్తే ప్రకృతి విచిత్రమే అనిపిస్తుంది. ఈ శిలకు రెండు వైపులా ద్వారాలున్నాయి. మెట్ల ద్వారా లేదా ట్రెక్కింగ్ చేస్తూ కోటకు చేరుకోవాల్సి ఉంటుంది. నేల మాలిగలు, ఆయుధాలు దాచే రహస్య స్థావరాలు, శత్రువులను తప్పు దోవ పట్టించే మార్గాలు, లోతైన కందకం ఇలా కోటలో విశేషాలు అనేకం. ఆవరణలో 2 తటాకాలు, కొన్ని లోతైన బావులు ఉన్నాయి. వాన నీటిని నిలువ చేసేందుకు ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్లో తామర తుండ్లు వికసించటం నేటికి చూడవచ్చు. భువనగిరి నుంచి గోల్కొండకు రహస్య మార్గం ఉండేదని అంటారు. రుద్రమదేవి, ఆమె మనవడు ప్రతాపరుద్రుడి కాలంలో ఎంతో వైభవంగా వెలిగింది ఈ కోట. ఎన్నోసార్లు శత్రువుల దాడులకు లోనయినా, దుర్భేద్యంగా నిలిచిన భువనగిరి కోట 15 వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ల చేతికి చిక్కింది. వారి ఫిరంగులు, గన్‌పౌడర్ దాడులకు తలొగ్గాల్సి వచ్చింది. వారి ఏలికలో ఇస్లామిక్ శైలిలో కోటకు కొన్ని మార్పులు జరిగాయి. ఆ తర్వాత 18 శతాబ్దం నుంచి ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా ఉన్న ఈ కోట నేడు దాదాపు శిథిలావస్థకు చేరింది. అయినప్పటికీ ఈ కోట ఆర్కిటెక్చర్ ఆధునికులను ఆశ్యర్యపరుస్తుంది. కోట పై భాగానికి చేరి భువనగిరి నగరాన్ని వీక్షిస్తుంటే, గతం మిగిల్చిన జ్ఞాపకాల నుంచి బయటపడి కొత్త ఏడాదిలోకి ప్రయాణం మొదలు పెట్టడానికి కావలసిన బలాన్ని, ఉత్తేజాన్ని అక్కడి గాలి మనకు అందిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడికి చేరువలోనే యాదగిరి గుట్ట, సురేంద్రపురి మ్యూజియం ఉన్నాయి. -
ఆ సినిమా చూసి సిగ్గుపడ్డా!
దాసరి నారాయణరావు ‘‘కేవీ రెడ్డి, బీయన్ రెడ్డి అవార్డులు ఇవ్వడం కొంత కాలం ఆపేయమని ఓ సందర్భంలో నిర్వాహకులకు సూచించాను. ఎందుకంటే మన దగ్గర డెరైక్టర్లు ఉన్నారు గానీ గొప్ప సినిమాలు తీస్తున్నవాళ్లు అరుదుగానే ఉన్నారు. వారిలో గుణశేఖర్ ఒకరు. అతనికి ఈ అవార్డు ఇవ్వడం ఎంతో సమంజసం’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి పేరు మీద యువకళావాహిని ఇస్తున్న ‘జగదేక దర్శకుడు కేవీ రెడ్డి’ అవార్డును దాసరి నారాయణరావు చేతుల మీదుగా గుణశేఖర్ అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో దాసరి మాట్లాడుతూ- ‘‘గుణశేఖర్ గొప్ప క్రియేటర్. అతను తీసిన ‘సొగసు చూడ తర మా’ సినిమా చూసి సిగ్గుపడ్డా. అంత గొప్పగా తీశాడు. రాజీపడడం తనకు తెలియదు. అతను అనుకున్న దారిలో సక్సెస్ అవుతూ వచ్చాడు. అతని జీవితం ఒక ఎత్తయితే, ‘రుద్రమదేవి’ మరొక ఎత్తు. గుణశేఖర్ ఇంకా గొప్ప సినిమాలు తీయాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ‘‘దర్శకుడు కేవీ రెడ్డిగారి ప్రభావం ఈ తరం దర్శకుల మీద చాలా ఉంది. దర్శకులు నిర్మాతలుగా మారితే వారి అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తీస్తారని దాసరిగారు తన ‘శివరంజని’ చిత్రం ద్వారా నిరూపించారు. అలాంటి ద ర్శకుని చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో దాసరిగారి మీద అవార్డు స్థాపిస్తే కచ్చితంగా దాని కోసం పోటీపడతాను’’ అని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు రమేశ్‌ప్రసాద్, అశ్వినీదత్, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, హరనాథ్‌రావు, దివాకర్‌బాబు, తోటప్రసాద్, సంగీత దర్శకుడు మణిశర్మ, వ్యాపారవేత్త సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
బాహుబలి-రుద్రమదేవి పెళ్లిసందడి
రావులపాలెం : బాహుబలి, రుద్రమదేవి ఈమధ్య విజయం సాధించిన తెలుగు సినిమాల పేర్లు. వీరిద్దరికీ కల్యాణం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో బుధవారం ఒక కిట్టీ పార్టీ ఈ వినూత్న వివాహతంతుకు వేదికైంది. పచ్చిపులుసు అన్నపూర్ణ తదితరులు 22 మంది మహిళలు టీన్స్కిట్టీ పేరుతో సంఘంగా ఏర్పడి నెలకోసారి వేర్వేరు ప్రాంతాల్లో కిట్టీ పార్టీలు నిర్వహిస్తున్నారు. బుధవారం పచ్చిపులుసు అన్నపూర్ణ, నాగరాజు తమ నివాసంలో కిట్టీ పార్టీ ఏర్పాటు చేశారు. దీనిని వినూత్నంగా జరపాలని అనుకున్నారు. బాహుబలిని వరుడుగా, రుద్రమదేవిని వధువుగా పేర్కొంటూ శుభలేఖలు వేసి, కిట్టీ పార్టీలో వివాహవేడుక జరిపారు. వరుడు వధువుగా ఇద్దరు మహిళలు సంప్రదాయ అలంకరణతో పాల్గొనగా, రెండు బొమ్మలకు అదే వేషధారణ చేసి కల్యాణం జరిపించారు. పానకాల కావిడి, మెహందీ, ఉంగరాలు మార్చుకోవడం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను వేడుకగా నిర్వహించారు. -
ఆ వీరమరణానికి 726 ఏళ్లు
* రుద్రమదేవి చందుపట్లలోనే మరణించిందంటున్న స్థానిక శిలాశాసనం * అంబదేవుడితో పోరాడుతూ నవంబర్ 27న కన్నుమూసిన ధీర వనిత * కాకతీయ మహా సామ్రాజ్ఞి.. ధీరత్వానికి సిసలైన ప్రతిరూపం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాయగజకేసరి బిరుదాంకితురాలు.. కాకతీయ మహా సామ్రాజ్ఞి.. ధీరత్వానికి సిసలైన ప్రతిరూపమైన రాణి రుద్రమ వీరమరణం చెంది నేటికి సరిగ్గా 726 సంవత్సరాలు. క్రీ.శ.1289వ సంవత్సరం నవంబర్ 27న, 80 ఏళ్ల వయసులో కాయస్థ అంబదేవుడితో నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల వద్ద జరిగిన యుద్ధంలో ఆమె వీరమరణం పొందినట్టు అక్కడ లభించిన త్రిపురాంతక శిలా శాసనం చెబుతోంది. వృద్ధాప్యంలో ఉన్న మహిళను చంపానన్న అపకీర్తి రాకుండా ఉండేందుకే అంబదేవుడు అప్పట్లో రుద్రమ మరణాన్ని ధ్రువీకరించలేదని చరిత్ర చెబుతోంది. కానీ చందుపట్ల శాసనం మ్రాతం ‘శాసనకాలము శక సం:1211, మార్గశిర శుద్ధ ద్వాదశి, అనగా క్రీ.శ..1289 నవంబర్ 27న రుద్రమదేవి శివలోకానికి వెళ్లిన’ట్టు చెబుతోంది. రుద్రమ సేవకుడు పువ్వుల ముమ్ముడి వేయించిన ఈ శాసనం నాలుగడుగుల నాపరాయి గద్దెపై ఉంది. రుద్రమ 1296 దాకా జీవించే ఉన్నట్టు కొందరు చరిత్రకారులు చెప్పినా, చందుపట్ల శాసనం ప్రకారం 1289లోనే ఆమె మరణించారు. రుద్రమకు చాళుక్య వీరభద్రుడితో వివాహం జరిగినా పిల్లలు లేకపోవడంతో ముమ్మడాంబ, రుయ్యాంబ అనే అమ్మాయిలను దత్తత తీసుకుని, మనవడైన ప్రతాపరుద్రునికి ఓరుగల్లు పగ్గాలు అప్పజెప్పారు. చందుపట్లలో మరిన్ని ఆనవాళ్లు.. త్రిపురాంతక శాసనంతో పాటు చందుపట్లలో ఆనేక ఆనవాళ్లు కాకతీయ రాజ వారసత్వ చరిత్రను చెపుతున్నాయి. ఇక్కడి నాపరాతి బండలపై కొలువై ఉన్న అనేక విగ్రహాలు కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి నిలువుటద్దాలుగా నిలుస్తున్నాయి. రామప్ప ఆలయంలో ఉన్న ఓ విగ్రహం గణపతి ప్రతిమను పోలి ఉంది. దానికి ఎదురుగా ఉన్న మరో రాయిపై గుర్రంపై స్వారీ చేస్తున్న ఓ మహిళ విగ్రహం రాణీ రుద్రమనే అన్న భావన కలిగిస్తోంది. జనగామలో రుద్రమ విగ్రహం జనగామ: వరంగల్ జిల్లా జనగామ మండలంలో రుద్రమదేవి విగ్రహం వెలుగుచూసింది. సిద్దెంకి, ఎల్లంల, పెంబర్తి గ్రామాల శివారులోని అయ్యలకాడ అని పిలిచే ప్రాం తంలో గురువారం ఈ విగ్రహం బయటపడింది. ఈ రాతి విగ్రహం ఆమె కూర్చున్నట్టు ఉంది. ఒక చేతిలో కత్తి, మొలతాడుకు మరో చిన్న ఖడ్గం ఉన్నాయి. విగ్రహానికి ఎడమవైపు స్త్రీ పరిచారిక ఉండగా, కుడివైపున ఏనుగు తొండం కలిగి సవారీకి సిద్ధంగా ఉన్న గుర్రం, దానికింద సింహం ఉన్నాయి. జనగామకు చెందిన పురావస్తు నిపుణుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో ఈవిగ్రహం వెలుగుచూసింది. విగ్రహం ఆధారాలను బట్టి అది రుద్రమదేవిదని భావిస్తున్నారు. 1289 నవంబర్ 27న రుద్రమదేవి మరణిం చినట్లుగా చందుపట్ల శాసనం చెబుతోంది. అయితే రుద్రమదేవి, తన సేనాధిపతి మల్లికార్జున నాయకుడు ప్రస్తుత ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామంలో మరణించి ఉండవచ్చని, చందుపట్లలో కాదని ప్రఖ్యాత శాసన పరిశోధకులు డాక్టర్ పి.వి.పరబ్రహ్మశాస్త్రి తెలిపినట్లు రత్నాకర్‌రెడ్డి చెప్పారు. రుద్రమదేవి మరణించిన 11 రోజుల తర్వాత సేనాధిపతి మల్లికార్జుని కుమారుడు చందుపట్లలో శాససం వేశారు. దీన్ని బట్టి చూస్తే నవంబర్ 27 కాకుండా, అదే నెల17న వారు మరణించి ఉండవచ్చని పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయ పడినట్లు రత్నాకర్‌రెడ్డి తెలిపారు. -
సో స్వీట్!
2015 అనుష్కదే అంటే అతిశయోక్తి కాదు. ‘బాహుబలి, రుద్రమదేవి’ చిత్రాల్లో వీర వనితగా ఆమె కనబరిచిన అభినయం ‘భేష్’ అని ప్రేక్షకులు కితాబులిచ్చేశారు. ఏక కాలంలో రెండు భారీ చిత్రాలు చేయడం ఓ విశేషమైతే, అందులో ఒకటి లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం మరో విశేషం. ఈ రెండు చిత్రాలతో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అంటే అనుష్కే చేయాలి అన్నట్లు చాలామంది ఫిక్సయ్యారు. ఇక, ఈ నెల 27న మరో డిఫరెంట్ మూవీ ‘సైజ్ జీరో’తో తెరపై మెరవనున్నారు అనుష్క. కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో పీవీపీ పతాకంపై పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. యు ట్యూబ్‌లో పది లక్షల మంది వీక్షించారంటే మాటలు కాదు. దాన్నిబట్టి... ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఇది ఇలా ఉంటే... నేడు అనుష్క పుట్టినరోజు. ఈ బర్త్‌డే ఆమెకు ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే, పదేళ్లుగా అనుష్క చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆమె చేసిన ‘బాహుబలి, రుద్రమదేవి’ చిత్రాలు మరో ఎత్తు అనే చెప్పాలి. నటిగానే కాదు... మంచి మనిషిగా కూడా అనుష్కకు చాలా పేరు ఉంది. ఆమె ముద్దు పేరు స్వీటీ. ఆ పేరుకి తగ్గట్టుగానే అనుష్క సో స్వీట్ అని పరిశ్రమవర్గాలు అంటుంటాయి. హ్యాపీ బర్త్‌డే ‘స్వీటీ’! -
సినీ హీరో పేరిట ఓటుకు దరఖాస్తు
పోచమ్మమైదాన్(వరంగల్) : ఇటీవల విడుదలైన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించిన విషయం విదితమే. ఈ మేరకు చరిత్రతో పాటు సినిమాలోనూ రాణి రుద్రమదేవికి అండగా నిలిచే ఆయనకు కాకతీయుల రాజధాని అయిన వరంగల్‌లో ఓటు హక్కు ఉండాలని అనుకున్నారో ఏమో కానీ... గుర్తు తెలియని వ్యక్తులు ఆ దిశగా ముందడుగు వేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో భాగమైన తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కోసం అల్లు అర్జున్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ‘అల్లు అర్జున్, తండ్రి అల్లు అరవింద్, ఇంటి నంబర్ 16-10-1452. ఖిలా వరంగల్’ చిరునామాపై దరఖాస్తు రాగా.. వరంగల్ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది గురువారం చేపట్టిన పరిశీలనలో ఈ దరఖాస్తును చూసి కంగుతినడం అధికారుల వంతైంది. ఈ మేరకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వాకాటి కరుణకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించగా.. మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
తెలుగు స్టార్ హీరోలకు ఝలక్ ఇచ్చిన అనుష్క
-
హృదయ రాణులు
గ్లామర్ పాయింట్ సినిమా అంటేనే కల్పన అంటారు. కానీ కల్పిత కథలకే కాదు, యదార్థ గాథలకూ అక్కడ చోటుంది. అందుకే చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోయిన కొన్ని సంఘటనలను, కొందరు మహామహుల జీవితాలను తెరకెక్కించే ప్రయత్నం అడపా దడపా చేస్తుంటారు దర్శకులు. అలాంటి చారిత్రాత్మక చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మలు వీరు... ఐశ్వర్యారాయ్ అందానికే అందం ఐశ్వర్యారాయ్. ఆమె అందం మరింత ఇనుమడించింది ‘జోథా’ పాత్రలో. అక్బర్ హృదయరాణిగా ‘జోథాఅక్బర్’లో రాజసాన్ని ఒలికించిందామె. సాహిత్యం ఆధారంగా తెరకెక్కిన ఉమ్రావ్‌జాన్, దేవదాస్ వంటి చిత్రాల్లో తన నటనతో మెస్మరైజ్ చేసిన ఐష్.... ఈ హిస్టారికల్ ఫిల్మ్‌తో నటిగా మరో మెట్టు ఎదిగిందని చెప్పాలి. కరీనా కపూర్ గ్లామరస్ హీరోయిన్గా బాలీవుడ్లో కరీనా స్థానం ప్రత్యేకమైనది. ‘అశోకా’ చిత్రంలో అయితే ఓ గ్లామరస్ క్వీన్‌గా చేసింది. సామ్రాట్ అశోకగా షారుఖ్ ఖాన్ నటించిన ఆ చిత్రంలో కళింగ సామ్రాజ్యపు యువరాణి కరువాకిగా వైవిధ్య భరిత పాత్ర చేసింది కరీనా. ‘రాత్ కా నషా’ అని పాడుతూ సామ్రాట్ అశోక మనసుతో పాటు తన అభిమానుల హృదయాలనూ దోచేసింది. అనుష్క అనుష్క రూటే సెపరేటు. గ్లామర్ పాత్రలతో మొదలెట్టి, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల నాయికగా మారిపోయింది. ‘అరుంధతి’ చూశాక... తనలో ఇంత ప్రతిభ ఉందా అంటూ ఆశ్చర్యపోయా రంతా. ఆమె అద్భుత నటనకు, చూపు తిప్పుకోనివ్వని హావభావాలకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఇప్పుడు అంతకంటే పవర్‌ఫుల్‌గా కనిపించింది ‘రుద్రమదేవి’లో. కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి గురించి పాఠాల్లో చదువుకున్నా... వెండితెరపై ఆమెను ఒక పాత్రగా చూడటం, అందులోనూ ఆ పాత్రలో అనుష్క కనిపించడం అన్నది ఓ గొప్ప అనుభూతి అంటున్నారు ఆమె ఫ్యాన్స్. దీపికా పదుకొనె ఫీల్డ్‌లో అడగుపెట్టిన కొత్తలో దీపికను చూసి... ఓ గ్లామర్ డాల్‌గా మిగిలిపోతుందేమో అనుకున్నా రంతా. ‘ఓం శాంతి ఓం’ లాంటి సినిమా ద్వారా ఓ బరువైన పాత్రతో పరిచయమైనా... ఆ తర్వాత మామూలు ప్రేమకథా చిత్రాలు చేసుకుంటూ పోవడమే దానికి కారణం. కానీ ఉండేకొద్దీ తన స్టయిల్‌ను మార్చింది దీపిక. డిఫరెంట్‌గా ఉండే పాత్రలే ఎంచుకోవడం మొదలెట్టింది. ఆ క్రమంలోనే ఇప్పుడు మరాఠా రాజుల కాలం నాటి కథతో వస్తోన్న ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలో ‘మస్తానీ’గా మెరవబోతోంది. -
నా ప్రతాపరుద్రుడుకు మంచి నిర్మాత దొరికాడు : గుణశేఖర్
‘రుద్రమదేవి’ చిత్రం తెలుగువారు మరోసారి గర్వంగా తలెత్తుకునేలా చేసిందని యూనిట్ సభ్యులు సంతోషం వెలిబుచ్చారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘రుద్రమదేవి’ సక్సెస్‌మీట్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే... ప్రకాశ్‌రాజ్: తెలుగు సినిమా కీర్తిని ఎక్కడికో తీసుకెళ్లిన గుణశేఖర్‌కి హ్యాట్సాఫ్. గోనగన్నారెడ్డి పాత్రకు అల్లు అర్జున్ కరెక్ట్ ఛాయిస్. కృష్ణంరాజు: 28 ఏళ్ల క్రితం మేం ‘తాండ్ర పాపారాయుడు’ తీశాం. అలా ఇంకెవరూ తీయలేరనుకున్నాం. గుణశేఖర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. గోనగన్నారెడ్డి పాత్ర చేయాలని ఎన్టీఆర్, నేనూ అనుకున్నాం. చివరికి అదృష్టం అల్లు అర్జున్‌కు దక్కింది. అల్లు అర్జున్: ఈ సినిమాకు నిజమైన హీరో అనుష్క. నా కష్టం 30 రోజులే. కానీ ఆమె కష్టం మూడేళ్లు. అనుష్క లేకపోతే ఈ ‘రుద్రమదేవి’ లేదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి: గుణ టీమ్ మహాయుద్ధం చేసింది. ఆ యుద్ధ విజయమే ఈ దసరా. మూడు దశాబ్దాలు సాగిన పోరాటాన్ని మూడు గంటల్లో ఎలా చూపిస్తారో అనుకున్నా. ఇక నుంచి గుణశేఖర్‌ని ‘సాహస గుణశేఖర్’ అని పిలవాలి. అనుష్క: ఈ సినమా కోసం టీమ్‌తో పాటు గుణశేఖర్‌గారి కుటుంబం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. రచయిత తోటప్రసాద్గారు లొకే షన్లో రోజూ నాతో పాటు ఉండి డైలాగులు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇలా అందరి కష్టానికి మంచి ఫలితం దక్కింది. ఇది నాకు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ కింద లెక్క. పరుచూరి వెంకటేశ్వరరావు: తెలంగాణాలో పన్ను రాయితీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి మా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పన్ను రాయితీ ఇస్తారనే ఆశిస్తున్నాం. తోట ప్రసాద్: 84 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ హిస్టారికల్ ఫిల్మ్ ఇదే. 2002 నుంచి ఈ కథకు సంబంధించి గుణశేఖర్‌గారితో ట్రావెల్ అవుతున్నా. ‘దిల్’ రాజు: 2009లో ‘అరుంధతి’, ‘మగధీర’ వచ్చి అందర్నీ అబ్బురపరిచాయి. 2015లో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వచ్చి తెలుగు సినిమా తలెత్తుకునేలా చేశాయి. గుణశేఖర్ ‘ప్రతాపరుద్రుడు’ కథ రెడీ చేస్తే... నేను నిర్మిస్తాను. గుణశేఖర్: మొత్తానికి ‘ప్రతాపరుద్రుడు’ సినిమాకు మంచి నిర్మాత దొరికాడు. ఈ సినిమా విషయంలో అందరూ నాకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. అల్లు అర్జున్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే అనుష్కకు కూడా. నాలాంటి ఒక సామాన్యుడు ఇలాంటి సినిమా తీయడమా? (అంటూ ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు). -
హిస్టరీ. హిజ్ స్టోరీ. హర్ స్టోరీ!
కొత్త సినిమాలు గురూ! హిస్టరీ అంటే చరిత్ర హిస్ స్టోరీ అంటే గుణశేఖర్ చెప్పిన చరిత్ర హర్ స్టోరీ అంటే రుద్రమ్మ చరిత్ర.పాళ్లు అటూఇటూ అయినా... అన్నీ కలగలిసి. అందరినీ అలరించే సినిమా స్టోరీ. రుద్రమదేవిలో ఒక సన్నివేశం ఉంటుంది. అప్పటి వరకూ రాజ్య ప్రజలు యువరాజు రుద్రదేవుణ్ణి చూడలేదు. చక్రవర్తి గణపతిదేవుడికి పుత్రోదయం అయ్యిందనీ పేరు రుద్రదేవుడనీ అతడు యుద్ధవిద్యలలో రణతంత్రాలలో రాటు దేలి రాజ్యపాలనకు సిద్ధంగా ఉన్నాడని వినడమే తప్ప ఎవరూ కళ్లతో చూసిన పాపాన పోలేదు. సందర్భం వస్తుంది. రాజవేడుకలలో భాగంగా మత్త గజాన్ని లోబరుచుకునే వీరుడి కోసం ప్రకటన వెలువడుతుంది. ఎవరూ ముందు రారు. వచ్చినవాడు ఓడి వెనుదిరుగుతాడు. అప్పుడు ప్రజలు అడుగుతారు- రుద్రదేవుణ్ణి ప్రవేశపెట్టండి... మత్తగజం పొగరణచి అతడి శౌర్యాన్ని ప్రదర్శించమనండి... కోరినట్టుగానే రుద్ర దేవుడు ప్రత్యక్షమవుతాడు. అందమైన తలపాగా, గిరిజాల జుట్టు, దారుఢ్యమెన శరీరాన్ని బిగించి కట్టిన వస్త్రాలు... మీసాలొక్కటే లేవు. రుద్రదేవుడు క్షణాల్లో మత్తగజాన్ని ఎదుర్కొంటాడు. కుంభస్థలంపై పిడికిళ్లతో మోది మోకాళ్ల మీద సాగిల పడేలా చేస్తాడు. ప్రజలందరూ హర్షధ్వానాలు చేస్తారు. వయసులో ఉన్న ఆడపిల్లలు, రాచకన్నెలు అతడి ఒక్క చూపు కోసం, కరస్పర్శ కోసం తహతహలాడిపోతుంటారు. అది చూసి చక్రవర్తి గణపతిదేవుడు ఉప్పొంగిపోతూ ‘రుద్రదేవుడికి పెళ్లి వయసు వచ్చింది. ఈ ఆడపిల్లల వరుస చూస్తుంటే ఎందరు యువరాణులు వలచనున్నారో... వారి కోసం ఎన్ని అంతఃపురాలు కట్టించాలో’ అంటాడు. అది విని మంత్రి శివదేవయ్య ప్రశ్నార్థకంగా చక్రవర్తి వైపు చూస్తాడు. చక్రవర్తి ఒక్క క్షణం పాటు సర్దుకొని వాస్తవంలోకి వస్తాడు. ఎందుకంటే రుద్రదేవుడు పురుషుడు కాదు... స్త్రీ కదా. రుద్రమదేవి కదా. థియేటర్లో ఉన్న ప్రేక్షకులు కూడా ఒక క్షణం రుద్రదేవుడు స్త్రీ అన్న సంగతి మర్చిపోతారు. ఒక వీరుడు పోరాడుతున్నట్టే. ఒక సబల, ధీరురాలు చేయదగ్గ పోరాటం అది. రుద్రమదేవిలో ఇలాంటి మలుపులు... కాకతీయ రాజ్యానికే పరిమితమైన విలక్షణ చారిత్రక వాస్తవాలు ఉన్నాయి. కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టడం ఎప్పుడూ సులువు కాదు. గణపతి దేవుడు తన పాలనా కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతడి వారసురాలిగా ప్రకటితమైనప్పటికీ రాచకిరీట ధారణ కోసం చాలా కాలం వేచి చూడవలసిన అగత్యం పట్టిన రుద్రమదేవి కూడా తన హయాంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయితే ఉన్న పరిస్థితుల నుంచి బయట పడటానికి పుట్టింది ఆడశిశువు అయితే మగబిడ్డగా ప్రకటన చేయడం మగబిడ్డగానే పెంచడం చివరకు ఇంకో ఆడపిల్లకు ఇచ్చి పెళ్లి చేసేవరకూ వెళ్లడం ఈ చరిత్రలో ఉన్న విలక్షణత. దర్శకుడు గుణశేఖర్ ఈ ఒక్క అంశం దగ్గరే కథ మొత్తం అల్లుకున్నాడు. ఈ రహస్యాన్ని కాపాడుకోవడం కథ. ఈ రహస్యాన్ని కాపాడుకుంటూ అసంతృప్తితో ఉన్న రక్త సంబంధీకులను, అధికారం కోసం చూస్తున్న సామంతులని, బయటి శత్రువులని ఎదుర్కొంటూ వచ్చి ప్రథమ శత్రువైన దేవగిరి ప్రభువు మహదేవ నాయకుణ్ణి ఓడించడంతో సినిమా ముగుస్తుంది. మలుపుతిప్పే సన్నివేశం... రుద్రదేవుడికి తాను ఆడపిల్లననే సంగతే తెలియదు. తెలియకుండా పెంచుతారు. కాని ఒకసారి స్నేహితులతో దొంగ చాటుగా వ్యాహ్యాళికి వెళతాడు. అక్కడ ఒక స్త్రీ శిల్పం ఉంటుంది. సాటి స్నేహితుడు ఆ స్త్రీ శిల్పంలోని అందచందాలను వర్ణిస్తాడు. వక్షం, నాభి, నడుము, ఊరువులు.... ఒక్కొక్కటీ వర్ణిస్తుంటే రుద్రదేవుడికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇలా ఉంటే స్త్రీనా? ఇవన్నీ తనలో ఉన్నాయే.... దడదడలాడే గుండెలతో అంతఃపురానికి పరిగెడుతుంది. అద్దం ముందు నిలబడి ఒక్క పెట్టున పై వస్త్రాన్ని తొలగించి చూసుకుంటుంది. స్త్రీ. తనే స్త్రీ. ఎదుగుతున్న ఆడపిల్ల. ఆందోళనతో నిలదీస్తూ తల్లిని కావలించుకుంటుంది. కాని ఏ ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారో తెలుసుకుని తిరిగి ప్రజల కోసం మగవాడి అవతారంలోకి మారిపోతుంది. ఆ సందర్భంలో అంతవరకూ అబ్బాయిగా ఉన్న రుద్రదేవుడు చక్కటి ఆడపిల్ల వేషధారణలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. అలాగే ‘కౌముది ఉత్సవం’ పేరిట స్త్రీలు జరుపుకునే సరసవేడుకలో రుద్రదేవుడు తన సహజమైన స్త్రీ అంశతో ఉన్మత్తతతో రాచరిక ఆహార్యంలో కనిపించే సన్నివేశం కూడా దర్శకుడి రసాత్మకతకు, పాత్రధారి అయిన అనుష్క సౌందర్యానికి ఒక నిదర్శనం. సినిమాటిక్ స్వేచ్ఛ... చరిత్రలో అనేకం జరుగుతాయి. కొన్నింటిని ప్రజలు మరుగున పడేస్తారు. కొన్ని జరగకపోయినా జరిగినట్టుగా తమ సంతోషం కోసం చెప్పుకుంటారు. సినిమాలో సినిమా కథే ఉంటుంది. ఆ మేరకు దర్శకుడు, రచయితలు అవసరమైన స్వేచ్ఛ తీసుకున్నారు. రుద్రమదేవికి చాళుక్య వీరభద్రుడి(రాణా)కి కొన్ని ప్రేమ సన్నివేశాలు కల్పించారు. నిజ చరిత్రలో రుద్రమదేవికి తోడుగా నిలిచిన ప్రసాదాదిత్య పాత్రను (అజయ్) చివరి వరకూ కొనసాగించినా గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) పాత్రను పూర్తి స్వేచ్ఛతో మలుచుకున్నారు. నిజ చరిత్ర ఏదైనా ఇందులో మాత్రం గోన గన్నారెడ్డి అండర్ కవర్ ఆఫీసర్. పైకి గజదొంగలా తిరుగుతూ రుద్రమదేవికి శత్రువులా కనిపిస్తూ కాకతీయ రాజ్యానికి శత్రువులైన వారందరినీ చంపే రాజ విధేయుడు. సెకండాఫ్ గ్రాఫ్ రుద్రమదేవి పాత్ర ఆది నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రుద్రమదేవి స్త్రీ అయిన కారణాన ఆమెకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన పని లేదు అని సామంతులు, ప్రజలు అభిప్రాయ పడుతున్నప్పుడు ఆమె పడిన సంఘర్షణ, ఆ సందర్భంలో మంత్రి పాత్రధారి ప్రకాష్‌రాజ్ వాదన ఆకట్టుకుంటాయి. క్లయిమాక్స్‌లో శత్రువులపై దాడి చేసి తన బలగాలతో ఆమె విజృంభించి పోరాడుతూ ఉన్నప్పుడు గోన గన్నారెడ్డి పాత్రధారి అల్లు అర్జున్ జత పడటం సగటు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.ద్వితీయార్ధం ప్రారంభమైన పదిహేను ఇరవై నిమిషాలకే రుద్రమదేవి పట్టాభిషిక్తురాలై సామంతులను శత్రువులను అణచే ప్రక్రియకు పూనుకుని ఉంటే ఆ క్యారెక్టర్ గ్రాఫ్ మరింత పెరిగి ఉండేదా అనే ఆలోచన వచ్చే అవకాశం ఉంది. ఎవరికెన్ని మార్కులు ఇది దర్శకుడు గుణశేఖర్ కల. తెలుగువారి సామ్రాజ్ఞి రుద్రమదేవి కథను సినిమాగా తీయాలనే ఆలోచన వచ్చినందుకే అతడు అభినందనీయుడు. నిర్మాణ పరంగా, మార్కెట్ పరంగా ఎన్నో ఎక్కుచిక్కులు ఉంటాయని తెలిసి కూడా పట్టుదల వీడకుండా సినిమా తీసినందుకు మరోసారి అభినందనీయుడు. సాంకేతికంగా నిర్మాణపరంగా మరిన్ని వనరులు, మద్దతు దొరికి ఉంటే ఇంకా బాగా తీసి ఉండేవాడని అనిపిస్తుంది. ‘బాహుబలి’లో అనుష్క అందాన్ని చూసే అవకాశం ప్రేక్షకులకు కలగలేదు. కాని ‘రుద్రమదేవి’లో మాత్రం ఒకవైపు మగటిమిని ప్రదర్శిస్తూనే మరోవైపు అత్యంత సున్నితత్వాన్ని, సౌందర్యాన్ని చూపించడంలో అనుష్క రాణించింది. రానా వీరుడుగా తన ముద్ర వేస్తాడు. ఇక గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ అందర్నీ ఆకట్టుకుంటాడు. తెలంగాణ యాస మాట్లాడుతూ అందులో ఒక రకమైన వ్యంగ్యం, హాస్యం కలగలిపి సినిమాకో రిలీఫ్‌లా నిలిచాడు. తక్కిన సంభాషణలు ఎలా ఉన్నా ఈ ఒక్క పాత్ర కోసం రాసిన సంభాషణలు బ్రహ్మాండం. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ ముందు వరుసలో ఉంటుంది. ఇళయరాజా ఆర్.ఆర్తో ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఇది స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్. త్రీడీ ప్రింట్లో చూడటం మంచి అనుభూతి. ముక్తాయింపు ఇది తెలుగువారి చరిత్ర ఆధారంగా తీసిన సినిమా. అందరూ చూడటానికి వీలుగా తీసిన సినిమా. ఇంకొన్ని పదార్థాలు పెడితే బాగుండనిపించవచ్చు. కాని వేసిన విస్తరి సంతృప్తి కలిగించే ప్రయత్నం చేస్తుంది. కర్పూరం సంగతి ఏమోగాని లవంగం గుచ్చిన తాంబూలం గ్యారంటీ. లండన్‌లోని ‘ది ఏంజెల్ స్టూడియో’లో ప్రపంచ ప్రసిద్ధ ఫిల్హార్మోనియా ఆర్కెస్ట్రాతో ‘రుద్రమదేవి’ నేపథ్య సంగీతాన్ని రికార్డ్ చేశారు ఇళయరాజా. హాలీవుడ్ ఫిల్మ్ ‘టైటానిక్’ నేపథ్య సంగీతం కూడా ఈ స్టూడియోలోనే రికార్డయింది. చెన్నైకి చెందిన ఎన్.ఎ.సి. వాళ్ళు ప్రత్యేకంగా డిజైన్ చేసిన అసలైన బంగారు నగల్ని ‘రుద్రమదేవి’ షూటింగ్లో వాడారు. ఆ నగల విలువ దాదాపు రూ. 5,00,00,000 మేకింగ్ ముచ్చట్లు సర్వసాధారణంగా సినిమాను 2డిలో చిత్రీకరించి, 3డిలోకి మారుస్తుంటారు. కానీ, ‘రుద్రమదేవి’ని పూర్తిగా 3డీలోనే తీయడం విశేషం. భారతదేశంలోనే మొట్టమొదటి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్ ఇది. ఈ 3డి చిత్రీకరణ కోసం హాలీవుడ్ స్టీరియోగ్రాఫర్లు, లాస్ ఏంజెల్స్ నుంచి టెక్నీషియన్లు ఇండియాకు వచ్చి పనిచేశారు. గతంలో ‘ట్రాన్స్ఫార్మర్- ఏజ్ ఆఫ్ ఎక్స్టిన్క్షన్’, ‘డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్’, ‘ది ఎమేజింగ్ స్పైడర్‌మ్యాన్’ లాంటి హాలీవుడ్ చిత్రాలకు లీడ్ స్టీరియోగ్రాఫర్‌గా పనిచేసిన మార్కస్ లాంక్సింజర్ ‘రుద్రమదేవి’ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. చారిత్రకంగా పక్కాగా ఉండడం కోసం ఢిల్లీ మ్యూజియమ్‌లోని చారిత్రక ఆధారాలను పరిశీలించి మరీ ఈ సినిమాలోని రుద్రమదేవి, గణపతిదేవుల కిరీటాలను డిజైన్ చేశారు.‘లగాన్’ సినిమాలో కథాకథనానికి అమితాబ్ బచ్చన్ నేపథ్య గళమందిస్తే, ఇప్పుడీ ‘రుద్రమదేవి’కి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ కథలో కీలకమైన బందిపోటు గోన గన్నారెడ్డి పాత్రను హీరో మహేశ్‌బాబు, చిన్న ఎన్టీయార్ లాంటి వాళ్ళు చేస్తారని మొదట్లో ప్రచారమైంది. చివరకు ‘వరుడు’ సినిమా షూటింగ్ టైమ్ నుంచే ‘రుద్రమదేవి’ స్క్రిప్ట్, ఈ పాత్ర గురించి తెలిసిన అల్లు అర్జున్ అన్కండిషనల్గా ఆ పాత్ర చేయడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు. రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడిగా ఈ సినిమాలో రానా 30 సార్లకు పైగా కాస్ట్యూమ్స్ మార్పులున్నాయి. దాదాపుగా ప్రతిరోజూ ఒక కొత్త కాస్ట్యూమ్స్‌లో ఆయన షూట్ చేసేవారట! ‘బాహుబలి’ షూటింగ్లో రానాకు గాయమవడంతో,‘రుద్రమదేవి’ దర్శక - నిర్మాతలు ఏకంగా ఒక షెడ్యూల్ మొత్తం వాయిదా వేశారు. ఈ సినిమాలో బాల నటులు కూడా పలువురు ఉన్నారు. ముఖ్యంగా, పలువురు సినీ ప్రముఖుల వారసులు ఈ బాల పాత్రలు పోషించడం విశేషం హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ 16 ఏళ్ళ చాళుక్య వీరభద్రుడిగా, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సహిదేవ్ 12 ఏళ్ళ గోన గన్నారెడ్డిగా నటించారు. ఇక, 9 ఏళ్ళ బాల రుద్రమదేవిగా హీరో శ్రీకాంత్ కూతురు మేధ తెరపైకి వచ్చింది. ఇంకా 14 ఏళ్ళ వయసు రుద్రమదేవిగా ఉల్క, 9 ఏళ్ళ మహదేవుడిగా యశ్వంత్ చేశారు. ఇంకోసారి చూస్తా... ఈ సినిమా ఓ అద్భుతం. నేను టూడీలో చూద్దామనుకుంటే మావాళ్ల బలవంతం మీద త్రీడీలో చూడాల్సివచ్చింది. మళ్లీ ఇంకోసారి చూస్తా. తెలుగు చరిత్రకు ఆమె మహారాణి. తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇస్తే బాగుంటుందేమో. - ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 80 కోట్లు. భారతదేశంలో ఇప్పటి వరకు తయారైన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ సినిమా ఇదే. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు రెండు వేల స్క్రీన్స్‌లో ‘రుద్రమదేవి’ సినిమా విడుదలైంది. ఈ నెల 16న తమిళంలో విడుదల కానుంది. ఒక్క త్రీడీ కన్వెర్షన్ కోసమే దాదాపు రూ. 12 కోట్లు వెచ్చించారని సమాచారం. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమైన కారణంగా మరో 10 కోట్ల రూపాయల భారం నిర్మాతలపై పడిందని బోగట్టా. షూటింగ్ డేస్: 195 గ్రాఫిక్ వర్క్: మూడేళ్లు - సాక్షి ఫ్యామిలీ -
రుద్రమదేవి’కి వినోదపన్ను మినహాయింపు
సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు... దర్శకుడు గుణశేఖర్‌కు ప్రశంసలు హైదరాబాద్: కాకతీయుల చరిత్ర, రాణీ రుద్రమదేవి జీవిత విశేషాలతో కూడిన అంశంతో నిర్మించిన రుద్రమదేవి చిత్రానికి వినోద పన్ను నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులివ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు తగిన ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చిత్ర నిర్మాత దిల్ రాజు, చిత్ర దర్శకుడు గుణశేఖర్, ఆయన కుటుంబసభ్యులు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. రుద్రమదేవి సినిమాను చూడాల్సిందిగా కేసీఆర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రుద్రమదేవి గొప్పతనాన్ని చిత్రీకరించినందుకు గుణశేఖర్‌ను సీఎం అభినందించారు. ఇలాంటి మరెన్నో చిత్రాలు నిర్మించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర చరిత్ర, ఇక్కడి రాజవంశీయుల గొప్పతనానికి సంబంధించిన కథాంశాన్ని ఎంచుకోవడం పట్ల దర్శక నిర్మాతను అభినందించారు. ఇలాంటి చిత్రాలను ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. -
ఏపీలోనూ పన్ను మినహాయించాలి: రాజమౌళి
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయించడం పట్ల బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. చరిత్రను తెరకెక్కించడానికి చాలాకాలంగా ఎంతో కష్టపడ్డ గుణశేఖర్ కు ఇది చాలా శుభవార్త అంటూ ట్వీట్ చేశారు. రుద్రమదేవి మన తెలుగు నేలకే రాణి అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చిత్రంపై పన్ను మినహాయించాలని ఆయన కోరారు. అలాగే 'రుద్రమదేవి' చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు జక్కన్న. కాగా చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్ తో పాటు, నిర్మాత దిల్ రాజు గురువారం కేసీఆర్ ను కలిసిన నేపథ్యంలో 'రుద్రమదేవి' చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చినందుకు ఈ సినిమాలో నటించిన హీరో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. రుద్రమదేవి సినిమా శుక్రవారమే విడుదల అవుతోందని, మొట్టమొదటి రియల్ 3డిలో తీసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. Just heard that #Rudhramadevi has been made tax free in Telangana. Fantastic news for Gunasekhar garu who has been swimming against the — rajamouli ss (@ssrajamouli) October 8, 2015 current for such a long time to bring this epic to film. Rudramadevi is a queen for all Telugu land.I think even the govt of AP should and — rajamouli ss (@ssrajamouli) October 8, 2015 will exempt this film from tax. All the best to everyone involved in Rudramadevi.. — rajamouli ss (@ssrajamouli) October 8, 2015 Rudramadevi movie Releasing Tomorrow ! The First Real 3D movie. Hope you all like the Movie and my New attempt ! — Allu Arjun (@alluarjun) October 8, 2015 I Thank the Hon.CM of Telangana State KCR garu for being Generous by exempting the Entertainment Tax for Rudramadevi Movie — Allu Arjun (@alluarjun) October 8, 2015 -
మహేశ్‌బాబుకి నేనే ఫోన్ చేశా!
రాబిన్‌హుడ్! ఉన్నవాళ్లను దోచుకొని లేనివాళ్లకు పెట్టేవాడే రాబిన్‌హుడ్. అల్లు అర్జున్ అభిమానుల మనసు దోచుకోవడానికి గుణశేఖర్ అభిమానం గెలుచుకున్నాడు. ‘రుద్రమదేవి’లో రాబిన్హుడ్ను పోలిన గోన గన్నారెడ్డి పాత్రను పోషించిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... ►నేనే గుణశేఖర్‌ను గోన గన్నారెడ్డి పాత్ర అడిగా... ►పారితోషికం కూడా అడగకుండా చేశా... ►చిరంజీవిగారి 150వ సినిమా మీద కంటే 151వ సినిమా మీదే నా దృష్టి ఎక్కువగా ఉంది. ►రామ్‌చరణ్‌ను నాతో పోల్చితే అలా పోల్చాలి. ►మా అబ్బాయిని బైక్ మీద తిప్పాలని ఉంటుంది. కాని ఆ కోరిక తీరే వీలు లేదనే బాధ ఉంటుంది. ►ఇవాళ్టి మమ్మీలు సూపర్ మమ్మీలు. పిల్లల్ని వాళ్లు బాగా చూసుకుంటున్నారు... ఇలాంటి విశేషాలెన్నో ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకం... ►మీ కెరీర్‌ని విశ్లేషిస్తే ‘గంగోత్రి’ అప్పుడు ‘హీరోగా పనికొస్తాడా?’ అనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మీ స్టయిల్స్‌ని ఇతరులు ఫాలో అవుతున్నారు... అల్లు అర్జున్: ఇది ఒక్క రోజు ఎఫర్ట్ కాదు. చాలా ఎఫర్ట్ ఉంది. బేసిక్‌గా నేను కొంచెం వెస్ట్రన్ థింకింగ్ పర్సన్‌ని. నా సినిమాల్లో పాటలు, డ్యాన్సుల్లో ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. నాకు పనంటే ప్రేమ. ఎంత గొప్ప పని చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు.. చేసే పని గొప్పగా చెయ్యాలన్నది నా పట్టుదల. సింపుల్ ఎగ్జాంపుల్ రాజమౌళి. ఒక తెలుగు సినిమా డెరైక్టర్ అయ్యుండి ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఎదిగారంటే మామూలు విషయం కాదు. చేసే పనిని వంద శాతానికి మించి చేయడంవల్లే అది సాధించారు. చిరంజీవిగారు కూడా అలా పని చేయడంవల్లే ఈ స్థాయికి చేరుకున్నారు. ‘బాత్రూమ్ క్లీనర్’ అయినా వరల్డ్స్ బెస్ట్ అనిపించుకుంటే అతనంటే నాకు గౌరవం ఉంటుంది. ►చిరంజీవి అభిమానులే మీక్కూడా ఫ్యాన్స్‌గా ఉంటున్నారా లేక మీకంటూ కొత్తవాళ్లని సంపాదించుకోగలిగారా? చిరంజీవిగారి ఫ్యాన్ బేస్ నాకు ఉపయోగపడింది. ఆ తర్వాత మేం ప్రూవ్ చేసుకుంటే కొత్త అభిమానులు ఏర్పడతారు. థియేటర్ దగ్గర సందడి చేసే అభిమానులే కాదు.. సెలైంట్‌గా సినిమా చూసి వెళ్లిపోయే.. అంటే.. ఇంట్లో దాదాపు టీవీకి పరిమితమైన వాళ్లల్లో కూడా నన్ను ఓన్ చేసుకున్నవాళ్లు ఉన్నారు. అలాంటి సెలైంట్ ఫ్యాన్స్ గురించి వెలుగులోకి రాదు. ఎలక్షన్స్‌లా అన్నమాట. ఎన్నికల హడావిడి భారీగా ఉంటుంది. జనాలు సెలైంట్‌గా వచ్చి ఓటేసి వెళ్లిపోతారు (నవ్వుతూ). ►చిరంజీవి 150వ సినిమా ఎలా ఉంటే బాగుంటుందనుకుంటున్నారు? హానెస్ట్‌గా చెప్పాలంటే 150వ సినిమా పై నాకంత క్యూరియాసిటీ లేదు. అదెలా ఉన్నా చూస్తారు. 151వ సినిమా మాత్రం ఎలా ఉండాలని ఆలోచిస్తున్నా. ఆ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌లో చేయాలనుకుంటున్నాం. సో ఎలాంటి కథ చేస్తే చూస్తారు? డ్యాన్సులు చేయాలా? ఫైట్స్ కూడా రెచ్చిపోయి చెయ్యాలా? వంటివన్నీ ఆలోచించి ఆ సినిమా చెయ్యాలి. ►చిరంజీవిగారి అబ్బాయి రామ్‌చరణ్ కన్నా మీరు సక్సెస్ఫుల్ అని ఎవరైనా అంటే మీ రియాక్షన్ ఏంటి? చరణ్‌తో కంపేర్ చేయడం న్యాయం కాదు. నేను హీరో అయిన ఏడేళ్లకు తను హీరో అయ్యాడు. నా ‘పరుగు’ తర్వాత చరణ్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. మా ఇద్దర్నీ పక్క పక్కన చూసినప్పుడు కంపేర్ చేయాలనిపిస్తుందేమో. మా ఇద్దర్నీ నేనెలా పోల్చుతానంటే నా మొదటి సినిమా ‘గంగోత్రి’ని చరణ్ మొదటి సినిమా ‘చిరుత’నూ పోల్చుతాను. నాకన్నా బాగా చేశాడు. నా సెకండ్ మూవీ ‘ఆర్య’కన్నా తన సెకండ్ మూవీ ‘మగధీర’లో ఇంకా బాగా చేశాడు. నా ఏడో సినిమాతో తన ఏడో సినిమాని పోల్చితే తనే బాగా చేశాడు. ►వరుణ్ తేజ్ నుంచి మీకెలాంటి పోటీ ఉంటుంది? ఎవరికీ ఎవరూ పోటీ కాదు. ఎట్ ఎనీ పాయింట్ మనకు మనమే పోటీ. నా సినిమా బాగుంటే నాది చూస్తారు. ఒకవేళ వరుణ్ సినిమా బాగుంటే తనది చూస్తారు. ఇద్దరిదీ బాగా లేకపోతే చూడరు. సో.. ఇక్కడ ఎవరి సక్సెస్ వాళ్లదే. ఆ సక్సెస్ కోసం పోటీ పడాలి. ►ఇతర హీరోలతో ఎలాంటి పోటీ ఉంటుంది? డెఫినెట్‌గా మా మధ్య ప్రొఫెషనల్ రైవలరీ ఎక్కువగా ఉంటుంది. కానీ, పర్సనల్‌గా పోటీ పడం. ►చిన్నవయసులో ఎక్కువ సక్సెస్ చూశాననీ, కెరీర్‌పరంగా, కుటుంబపరంగా సెటిల్ అయ్యానని అనుకుంటున్నారా? నేనలా చిన్నవాడిలా కనిపిస్తున్నాను కానీ, నాకు 32 ఏళ్లు. ఇది యంగ్ ఏజ్ కాదు (నవ్వుతూ). 32ఏళ్లు వచ్చేశాయ్. హీరో అయ్యి, పదేళ్లయ్యింది. ఇంకా రిమార్కబుల్‌గా ఏం చేయలేకపోయామే అనే డిప్రెషన్ ఉంది. ఇంకా ఏదైనా చేయాలనే తపన ఉంది. ►‘సినిమా వాళ్లు’ అని కొంతమంది చిన్నచూపు చూస్తారు. ముందు తరంలో కొంత మంది గౌరవం తెచ్చారు. ఈ తరంలో మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, గోపీచంద్, మీరు.. ఇంకొంత మంది ప్రాపర్‌గా పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో గౌరవం పెరుగుతోంది. ఈ విషయంలో మీకెవరు ఇన్స్పిరేషన్? నాకు హీరోల భార్యల్లో మొదటి ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవిగారి వైఫ్, మా అత్తయ్య సురేఖ. ఆ తర్వాత ఇన్స్పిరేషన్ వెంకటేశ్‌గారి భార్య. రానా ద్వారా వెంకటేశ్‌గారి ఇంటికి వెళతాను కాబట్టి వాళ్లెలా ఉంటారో నాకు తెలుసు. ఆ ఫ్యామిలీస్‌లో ఉన్న మంచి క్వాలిటీస్‌ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. ►చిరంజీవి వైఫ్, వెంకటేశ్ వైఫ్ అప్పటి తరంవాళ్లు. మరి... ఈ తరం లేడీస్ గురించి? జనరలైజ్ చేసి చెప్పలేం. విలువలు ఉన్నవాళ్లు ఉన్నారు. అస్సలు వేల్యూస్ లేకుండా తిరిగేవాళ్లు ఉన్నారు. ఇప్పటి తరం లేడీస్ మోడర్న్‌గా ఉంటున్నారు కాబట్టి అప్పుడప్పుడూ మాత్రమే పిల్లలను చూసుకుంటారేమో అనుకునేవాణ్ణి. నా అభిప్రాయం తప్పు. నేను చూస్తున్న సొసైటీలో యంగ్ మదర్స్, మోడర్న్ మదర్స్ అందరూ సూపర్. పిల్లలను వాళ్లు పెంచే విధానం చూస్తుంటే హ్యాట్సాఫ్ అనాలనిపిస్తోంది. ►ఆడవాళ్లు ఎలా ఉంటే మీకిష్టం? బ్యాలెన్డ్స్‌గా ఉండాలి. గుడికి వెళ్లినప్పుడు అక్కడికి తగ్గట్టు, ఇంట్లో ఫంక్షన్‌కి అందుకు తగ్గట్టుగా, పార్టీలకు వెళ్లినప్పుడు దానికి సూట్ అయ్యేలా ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా వైఫ్ స్నేహ. ►మీరు, మీ భార్య స్నేహ... ముందు పాప పుట్టాలనుకున్నారా? బాబు కావాలనుకున్నారా? నేను బాబే పుట్టాలనుకున్నాను. అదే జరిగినందుకు ఆనందంగా ఉంది. ఆ సంగతలా ఉంచితే ఎవరు పుట్టినా హెల్దీగా పుట్టాలని కోరుకున్నాను. ఎక్కడో మనసులో అబ్బాయి అయితే బాగుంటుందనుకున్నా. ►ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నారు? ఇద్దరు పిల్లలు కావాలని ఉంది. బాబు ఉన్నాడు కాబట్టి ఈసారి పాప పుట్టాలనుకుంటున్నాను. ►ఓ తండ్రిగా మీ అబ్బాయిని ఏ పార్కుకో, షాపింగ్‌కో తీసుకెళ్లాలని ఉంటుంది. ఓ స్టార్‌గా అది అంత ఈజీ కాదు కదా? అస్సలు ఈజీ కాదు. నాకైతే మా అబ్బాయిని బైక్ మీద తీసుకెళ్లాలని, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లాలని ఉంటుంది. కానీ కుదరదు. ఏ స్టార్ అయినా అలా పబ్లిక్‌లోకి రావడం కష్టమే. మా ఆవిడ అయితే చక్కగా మా అబ్బాయిని తీసుకుని షాపింగ్‌కి వెళుతుంది. నచ్చిన చోటుకి తీసుకెళ్లి ఆడిస్తుంటుంది. కానీ, నాకా అవకాశం లేదు. అందుకు బాధగానే ఉంటుంది. ►ఏజ్ పెరిగిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఉందా? రాజకీయాల్లోకి రావాలని లేదు కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ ఉంది. పాలిటిక్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటాను. ►ఓ 20 ఏళ్ల తర్వాత మీరెలా ఉంటారు? సినిమాలు చేస్తూనే ఉంటా. గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నా. ►ఓకే.. ఇప్పుడు ‘రుద్రమదేవి’ విషయానికొద్దాం... సాధారణంగా డెరైక్టర్లు హీరోలను పాత్రలు చేయమని అప్రోచ్ అవుతుంటారు. కాని గోన గన్నారెడ్డి కోసం గుణశేఖర్‌ని మీరే అప్రోచ్ అయ్యారట? నాకు ‘రుద్రమదేవి’ కథ తెలుసు. గుణశేఖర్‌ని కలిసిన సందర్భాల్లో ఈ కథ చెబుతుండేవారు. అది విన్నప్పుడు ఇలాంటి ‘బయో-ఎపిక్’ రాలేదు అనిపించేది. మొత్తం షూటింగ్ అంతా అయిపోయినా గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని తెలిసి నా అంతట నేనే చేస్తానన్నాను. కానీ నా కోసం పాత్రను కొంత మార్చమన్నాను. గుణశేఖర్ మన్నించారు. మంచి సినిమా తీయాలనే తపనతో ఉన్న ఆయనను సపోర్ట్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నా. ►పారితోషికం కూడా అడగలేదట..? డబ్బులతో ముడిపెట్టుకుంటే కొన్ని చేయలేం. అప్పట్లో ఎన్టీఆర్, ఏయన్నార్ ఒకవైపు హీరోలుగా నటిస్తూనే మరోవైపు ఇలా సపోర్టింగ్ రోల్స్ చేసేవారు. ఎన్టీఆర్‌గారు తన రెండొందల చిత్రం- ‘కోడలు దిద్దిన కాపురం’లో సపోర్టింగ్ రోల్ లాంటిదే చేశారు. ఆయనే చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనిపించింది. ►అసలు గోన గన్నారెడ్డి ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు.. మరి గెటప్ విషయంపై మీరెలా కసరత్తులు చేశారు? నిజమే. రిఫరెన్సెస్ ఏవీ లేవు. పైగా అది నా కోసం రాసిన పాత్ర కాదు. వేరే ఏజ్ గ్రూప్ హీరో కోసం రాసినది. నేనేమో యంగ్. అందుకని నేను చేస్తానన్న తర్వాత నాకు తగ్గట్టు మార్చారు. ఆ కాలంలో ఎలాంటి దుస్తులు వాడేవాళ్లు అని మా అంతట మేం రిసెర్చ్ చేశాం. ఇందులో నాది రాబిన్ హుడ్ తరహా పాత్ర. బేసిక్‌గా దొంగ అంటే నలుపు రంగు దుస్తులు వేసుకుంటారు కాబట్టి నేనూ అవే వాడాను. అలాగే గోన గన్నారెడ్డి కొంత రాయలసీమ, ఎక్కువ తెలంగాణ అని తెలిసింది. అందుకే ఈ పాత్ర తెలంగాణ మాట్లాడితే బాగుంటుందనుకున్నాం. ఓ పదిహేను రోజులు ప్రాక్టీస్ చేశా. ►ఆ రోజుల్లో మగవాళ్లకు కూడా పొడవాటి జుత్తు ఉండేది. మరి.. మీ గోన గన్నారెడ్డి గెటప్ చూస్తుంటే, కురచ జుత్తుతో కనిపిస్తున్నారు? అప్పట్లో అందరికీ పొడవాటి జుత్తు ఉన్నా నా పాత్ర మాత్రం కురచ జుత్తుతోనే ఉంటుంది. దానికి క్లారిఫికేషన్ ఇచ్చాం. పొడవాటి జుత్తు ఉన్నవాళ్లని ‘బుర్ర శుకం’ అనేసి ట్యాగ్ చేసేవాళ్లట ఆ రోజుల్లో. గోన గన్నారెడ్డి లాంటి వాడు ఎదురు తిరిగి జట్టు కత్తిరించుకుని ఉంటాడని ఊహించుకుని ఇలాంటి అంశాలు జోడించాం. ►ఇది హీరో సినిమా కాదు. హీరోయిన్ సినిమా. విలన్లను తుదముట్టించే పాత్ర ఇందులో అనుష్కదే. దీనిపై ఏం ఆలోచించారు? (నవ్వుతూ) బేసిక్‌గా నాకు ఆడవాళ్లంటే చాలా గౌరవం. వాళ్లను గౌరవించే చిత్రం ఇది. స్త్రీ ఎందుకు రాజ్యాలను ఏలకూడదు? ఏలితే తప్పేంటి? అలాంటి వీర వనిత మీద తీస్తున్న సినిమాలో కీలక పాత్ర చేయాలనిపించింది. ఇలాంటి పాత్ర చేయడం అవసరమా... అని నన్ను వెనక్కి లాగడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ పాత్రకు నప్పుతాడా? అని అనుకున్నవాళ్లూ, సినిమా వస్తుందో? రాదో అన్నవాళ్లూ ఉన్నారు. కానీ, గుణశేఖర్ ఎన్ని కష్టాలు పడైనా విడుదల చేస్తారనే నమ్మకంతో చేశా. ►అనుష్క గురించి? అనుష్క లేకపోతే ఈ సినిమా లేదు. ఒక అమ్మాయిని నమ్మి 60- 70 కోట్లు ఖర్చుపెట్టడమా? అనే ప్రశ్న ఎవరినైనా వెనక్కి లాగే పాయింటే. కానీ అప్పట్లో శ్యాంప్రసాద్రెడ్డిగారు ‘అమ్మోరు’ తీశారు. ఆ తర్వాత అనుష్కతో ‘అరుంధతి’ తీశారు. తను నిరూపించుకుంది. ‘రుద్రమదేవి’గా తనే యాప్ట్ అని అందరూ అంగీకరిస్తారు. ►‘బాహుబలి’తో పోల్చే చాన్స్ ఉందేమో? కంపేర్ చేయకూడదు. ‘రుద్రమదేవి’, బాహుబలి అంత పెద్ద సినిమా కాదు. అందుకని బాహుబలితో పోల్చకుండా ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. బాహుబలి విజువల్ ప్రెజెంటేషన్ మూవీ. రుద్రమదేవి స్టోరీ ఓరియంటెడ్ మూవీ. ►హిందీ రంగంపై దృష్టి పెట్టడంలేదా? పెట్టాలంటే ఇక్కడి నా పదేళ్ల కెరీర్‌ని వదిలేసి అక్కడికెళ్లాలి. అది సాధ్యం కాదు. తమిళ్ చిత్రం, ద్విభాషా చిత్రాలు చేయాలని ఉంది. ► మల్టీస్టారర్స్ గురించి? కథ కుదిరితే రెడీ. కథ కుదిరినప్పుడు ఒక హిందీ హీరో, ఒక తెలుగు హీరో కలిసి చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. వాళ్ల వాళ్ల భాషల్లో ఆ హీరోలకు క్రేజ్ ఉంటుంది కాబట్టి సినిమా రెండు భాషల వాళ్లకీ రీచ్ అవుతుంది. ►హీరోగా కొనసాగడమేనా? నిర్మాణ రంగంలోకి వస్తారా? నాన్నగారు సినిమాలు నిర్మిస్తున్నారు. ‘100 పర్సంట్ లవ్’ కథ నాకు నచ్చింది. నాన్నగారికీ నచ్చడంతో ఇద్దరం కలిసి నిర్మించాం. అలా నాన్నగారికి కొన్ని ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పెడుతుంటా. ఇకపై సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. మనం బతికేసి వెళ్లిపోతే చాలదు. కొన్ని మంచి ఉదాహరణలు వదిలేసి వెళ్లాలన్నది నా లక్ష్యం. ►మహేశ్‌బాబుకి నేనే ఫోన్ చేశా! ‘శ్రీమంతుడు సినిమా చూసి హీరోల్లో ఎవరైనా మీకు ఫోన్ చేసి అభినందించారా’ అని ఓ ఇంటర్వ్యూలో మహేశ్‌బాబుని అడిగితే ‘రామ్‌చరణ్ తప్ప ఎవరూ చేయలేదు’ అన్నారు. ఈ విషయం గురించి మీరేమంటారు? అని అడిగితే - ‘ప్రభాస్, రానా వంటి హీరోలతో నాకు పరిచయం ఉంది కానీ మహేశ్‌తో పెద్దగా పరిచయం లేదు. ‘శ్రీమంతుడు’ గురించి నేను వేరే వాళ్ల దగ్గర అభినందించాను. నాకు మహేశ్‌తో పరిచయం లేదు కాబట్టి తనతో చెప్పమని అన్నాను. వాళ్లు చెప్పలేదు. రాంచరణ్ తప్ప ఎవరూ చేయలేదనే మాట వినగానే, మహేశ్‌కి ఫోన్ చేసి ‘సారీ.. నేనే ఫోన్ చేసి ఉండాల్సింది. మీతో పెద్దగా పరిచయం లేదు కాబట్టి ఫోన్ చేయలేదు. నాకు సినిమా నచ్చింది. చాలా బాగా చేశారు’ అన్నాను. ఆయన కూడా ‘ఇట్స్ ఓకే’ అంటూ బాగా మాట్లాడారు’’ అని చెప్పారు. ►మన తెలుగులో పరభాషల క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువయ్యారు.. ఆ విషయం గురించి ఏమంటారు? మన తెలుగులో మంచి నటులు ఉన్నారు కానీ, గొప్ప నటులు లేరు. అందుకే ఇతర భాషలవాళ్లను తీసుకోవాల్సి వస్తోంది. ఫిజిక్ వైజ్‌గా తీసుకున్నా కూడా హిందీ నుంచి వస్తున్నవాళ్లకీ, ఇక్కడివాళ్లకీ చాలా తేడా ఉంది. ‘మేం ఉండగా వేరే భాషలవాళ్లు ఎందుకు?’ అని మనవాళ్లు అనుకోవడంలో న్యాయం ఉంది. నా సినిమాల్లో నేనెక్కువగా తెలుగు వాళ్లనే తీసుకోవాలనుకుంటాను. కానీ ఒక్కోసారి పాత్రకు అనుగుణంగా ఇతర భాషలవాళ్లని తీసుకోక తప్పడంలేదు. - డి.జి. భవాని -
శ్రీవారి సేవలో ‘రుద్రమదేవి’
-
వీరనారి రుద్రమ!
-
శ్రీవారి సేవలో ‘రుద్రమదేవి’
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని బుధవారం ఉదయం ‘రుద్రమదేవి’ చిత్ర బృందం దర్శించుకుంది. చిత్ర దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ అనుష్కలతో పాటు పలువురు యూనిట్ సభ్యులు వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 9 న రుద్రమదేవి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సినిమా మొదటి కాపీని శ్రీవారి పాదాల ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీస్పులు తీసుకున్నట్టు వారు తెలిపారు. హీరోయిన్ అనుష్కను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. -
రుద్రమ ప్రతాపం
-
’ఆ జ్యువెలరీ విలువ ఐదు కోట్లు’
-
'చరిత్రను వక్రీకరించలేదు.. గ్రాఫిక్స్‌ను నమ్ముకోలేదు'
హైదరాబాద్: రుద్రమదేవి సినిమాలో తాను ఎవరి చరిత్రను వక్రీకరించలేదని దర్శకుడు గుణ శేఖర్ అన్నారు. కేవలం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ నమ్ముకుని చేసుకొని సినిమా తీయలేదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రుద్రమదేవి సినిమా అక్టోబర్ 9న విడుదలవుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. సినిమా మూడుసార్లు సెన్సార్‌కు వెళ్లిందనే వార్తలు పూర్తిగా అబద్ధం అని చెప్పారు. కేవలం ఒకసారి మాత్రమే రుద్రమదేవి సినిమా సెన్సార్ అయిందని చెప్పారు. ఇప్పటి వరకు పలుమార్లు రుద్రమదేవి చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు భాషల్లో రుద్రమదేవి విడుదలవుతుంది. తెలుగు, తమిళం, హిందీతోపాటు కన్నడ భాషల్లో కూడా రుద్రమదేవి విడుదల కానుంది. -
అక్టోబర్ 9నే రుద్రమదేవి
తెలుగు సినిమా చరిత్రలో మరొక ప్రతిష్ఠాత్మక ప్రయత్నం జనం ముందుకు రావడానికి అన్ని విధాలా రంగం సిద్ధమైంది. మన తెలుగు జాతి చరిత్రకు అద్దం పట్టే కాకతీయ సామ్రాజ్య విజయగాథ ‘రుద్రమదేవి’ సరిగ్గా మరో 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అలరించనుంది. దర్శక - నిర్మాత గుణశేఖర్ దాదాపు మూడేళ్ళుగా చేస్తున్న ఈ భారీ చిత్రం అక్టోబర్ 9న రిలీజవడం కన్ఫర్మ అయింది. అటు 3డీలో, ఇటు రెగ్యులర్ 2డీలో - రెండు రూపాల్లోనూ ఈ చారిత్రక కథా స్వప్నం దేశవిదేశాల్లో తెరపై కనిపించనుంది. అగ్ర కథానాయిక అనుష్క ప్రాణం పెట్టి, ప్రధాన పాత్ర పోషించగా, గుణశేఖర్ తన సర్వశక్తులూ ఒడ్డి చేసిన వెండితెర యజ్ఞం - ‘రుద్రమదేవి’ గురించే ఇప్పుడందరి డిస్కషన్. నాలుగు భాషల్లో... అదే డేట్లో... ఈ సినిమా రిలీజ్ టైవ్‌ు గురించి ఇటీవల వ్యక్తమవుతున్న అనుమా నాలు, అసత్య ప్రచారాల నేపథ్యంలో అసలు నిజం కనుగొనేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. వివిధ వర్గాలతో మాట్లాడింది. ‘‘సంక్లిష్టమైన 3డీ టెక్నాలజీ సినిమా కావడం, తెరపై అడుగడుగుకీ ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా నిర్మాణంలోనూ, నిర్మాణానంతర కార్యక్రమా ల్లోనూ ఈ భారీ చిత్రం ఆలస్యమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో గతంలో కొన్నిసార్లు రిలీజ్ వాయిదా పడింది. దాంతో, రిలీజ్ డేట్ గురించి కొందరు అనుమానంగా మాట్లాడుతున్నారు. కానీ, సినిమా వర్క్ మొత్తం పూర్తయిపోయింది. ఇప్పటికే సెన్సార్ కూడా అయిపోయింది. అక్టోబర్ 9న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ‘రుద్రమదేవి’ రిలీజ్ అవుతోంది’’ అని చిత్ర యూనిట్ వర్గాలు ‘సాక్షి’కి స్పష్టం చేశాయి. ప్యాచ్ వర్‌కకీ... ఫారిన్ మ్యుజీషియన్ ఆంతరంగిక వర్గాల ప్రకారం - ఈ సినిమాకు వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఇప్పటికే వచ్చేశాయి. వాటన్నిటి 3డీ కన్వర్షన్ శరవేగంతో జరిగిపోతోంది. తెరపై దృశ్యాల్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చే ‘డిజిటల్ ఇంటర్మీడియట్’ (డి.ఐ) వర్కతో ముంబయ్‌లో సినిమాకు మెరుగులు దిద్దుతున్నారు. విశేషం ఏమిటంటే, ఈ సెల్యులాయిడ్ శిల్పాన్ని ఆడియన్సకు కన్నుల పండుగగా మలచడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ గుణశేఖర్ వదిలి పెట్టడం లేదు. ఈ చిత్రం రీరికార్డింగ్‌ను విదేశాల్లో జరిపారు. ఇటీవలే ఈ చిత్రంలో ఒకటి రెండు చోట్ల రీరికార్డింగ్‌లో కొత్తగా ప్యాచ్‌వర్‌క చేస్తే బాగుంటుందని ఆయన, సంగీత దర్శకుడు ఇళయరాజా భావించారు. అంతే, ఖర్చుకు వెనుకాడకుండా హంగేరీ నుంచి డజను మంది మ్యుజీషి యన్‌సను మళ్ళీ ప్రత్యేకంగా ఇండియాకు పిలిపించారు. వాళ్ళతో నాలు గైదు రోజుల పాటు శ్రమించి, ఆ దృశ్యాలకు కొత్త సొబగులు కూర్చారు. సక్సెస్ఫుల్... చారిత్రక ఫార్ములా అల్లు అర్జున్ (గోన గన్నారెడ్డి), రానా (రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడు) లాంటి ఎందరో స్టార్స నటించిన ఈ చిత్రానికి చాలానే ప్రత్యేకతలున్నాయి. దాదాపు రూ. 70 కోట్ల పైగా ఖర్చుతో రూపొందిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం ఇది. మలయాళ, తమిళ, కన్నడ, మరాఠా నేలల దాకా తెలుగువారి అధికారాన్ని విస్తరించి, మన ఖ్యాతిని దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చేసిన కాకతీయ సామ్రాజ్యపు కథకు తొలిసారిగా వెండితెర రూపం ఇది. ఎన్టీఆర్ ‘సమ్రాట్ అశోక’ (1992) తరువాత 23 ఏళ్ళకు తెలుగులో భారీ తారాగణంతో వస్తున్న చారిత్రక కథా చిత్రం కూడా ఇదే. గతంలో తెలుగులో వచ్చిన ‘పల్నాటి యుద్ధం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరసు’, ‘అల్లూరి సీతారామరాజు’ లాంటి చారిత్రక కథాచిత్రాల్లో నూటికి 95 శాతం హిట్లే. ఆ కోవలోనే ఈ సినిమానూ పకడ్బందీగా తీర్చిదిద్దారు. టాప్ క్లాస్ టెక్నీషియన్ల శ్రమ టెక్నికల్ అంశాల్లో కూడా ఈ సినిమా వెనుక చాలా శ్రమే ఉంది. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డీ ఫిల్మ్. ఈ 3డీ చిత్ర నిర్మాణం కోసం గుణశేఖర్ ఏకంగా విదేశాలకు వెళ్ళి, ప్రత్యేకంగా 3డీ ఫిల్మ్ మేకింగ్ కోర్స కూడా చేసి వచ్చారు. ఇన్నేళ్ళ తన అనుభవాన్ని ఈ సినిమా కోసం వినియోగించారు. చిన్నప్పుడు చదివిన వీరనారి ‘రుద్రమదేవి’ కథను తెరకెక్కించాలన్న గుణశేఖర్ చిరకాల స్వప్నాన్ని నిజం చేయడానికి కృషి చేసిన ఇళయరాజా (మ్యూజిక్), తోట తరణి (ఆర్ట డెరైక్టర్), శ్రీకర్ ప్రసాద్ (ఎడిటింగ్), ‘జోధా అక్బర్’ ఫేవ్‌ు నీతా లుల్లా (కాస్ట్యూవ్‌ు్స) అందరూ జాతీయ అవార్డు విజేతలైన సినీ సాంకేతిక నిపుణులే కావడం మరో విశేషం. చారిత్రక కథతో చేస్తున్న ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధం లాంటి ఎమోషన్లూ చాలా ఉన్నాయి. ఇన్ని విశేషాలున్న ఈ చిత్రం కోసం... లెటజ్ వెయిట్ ఫర్... అక్టోబర్ 9. -
అనుష్క వర్సెస్ అనుష్క
అనుష్కతో అనుష్క ఢీకుంటున్నారు. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? అంతే మరి ఆ అందాల భామకు ఆమే పోటీ అవుతున్నారు. ఇంకా అర్థం కావడం లేదా?ఈ యోగా సుందరి నటించిన రెండు భారీ చిత్రాలు ఒకే రోజు తెరపై సందడి చేయనున్నాయి. అనుష్క టైటిల్ రోల్లో నటించిన బ్రహ్మాండ చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి అక్టోబర్ 9వ తేదీన విడుదల కానుంది. గుణశేఖర్ సృష్టికర్త అయిన ఈ చిత్రంలో అల్లుఅర్జున్, రాణా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం అనుష్క పలు సాహసాలు చేశారు. కాగా ఆమె నటించిన మరో చిత్రం ఇంజి ఇడుప్పళగి. ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రకాశ్ కోవెలముడి దర్శకత్వం వహించారు. పీవీపీ సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 9వ తేదీనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించడం విశేషం. ఇందులో అనుష్క పాత్ర కీలకంగా నిలవనుంది. ఈ పాత్ర కోసం అనుష్క సుమారు 20 కిలోల బరువు పెరిగి నటించారు. మరో విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు తమిళం, తెలుగు భాషల్లో రూపొందడం. ఇంజి ఇడుప్పళగి తెలుగులో జీరో సైజ్ పేరుతో విడుదల కానుంది. అలా అనుష్క వర్సెస్ అనుష్క డీకొంటున్నారన్న మాట. -
అపజయాలను మరిచిపోను
జీవితంలో ఎదురైన అపజయాలను ఎప్పటికీ మరచిపోను అంటున్నారు నటి అనుష్క. చిత్రపరిశ్రమలో అనుష్క పేరు వినడం మొదలై దశకం దాటింది. ఈ యోగా టీచర్ నట జీవితం పదేళ్లు పూర్తి చేసుకుంది. అనుష్కను ఆదిలో అపజయాలే పలకరించాయి.అసలు ఈ ఫీల్డ్‌లోనే వద్దు తిరిగెళ్లిపోదాం అనే నిర్ణయాన్ని తీసుకున్నారట. అయితే ఆమెకు ఇక్కడే భవిష్యత్ ఉండడం వల్లో లేక సినీ ప్రేక్షకుల అదృష్టమో విధి అనుష్కను నటిగా నిలబెట్టింది. ఈ బ్యూటీ యోగా టీచర్‌గానే మిగిలిపోతే అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి లాంటి చారిత్రక చిత్రాలు రావడానికి ఆస్కారం ఉండేది కాదేమో. ఇవాళ చారిత్రక కథా చిత్రం అంటే ముందుగా గుర్తుకు వచ్చే నటి అనుష్కనే అనడం సబబే. గ్లామర్ పాత్రలకు సరిరారు నాకెవ్వరూ అన్నంతగా అలరించిన అనుష్క ఈ స్థాయికి అంత సులభంగా చేరుకోలేదు.తన పదేళ్ల సినీ జీవిత పయనాన్ని ఎలా విశ్లేషించుకున్నారన్నది క్లుప్తంగా అనుష్క మాటల్లోనే చూద్దాం. ‘2005లో నటిగా నా పయనం మొదలైంది. అయితే నాకంటూ ఒక స్థాయిని సంపాదించుకోవడానికి సుమారు ఐదేళ్లు పట్టింది. 2009లో నటించిన అరుంధతి నా సినీ జీవితంలో మైలు రాయిగా నిలిచిపోయింది. అంతకు ముందు చాలా అపజయాలను ఎదుర్కొన్నాను. సాధారణంగా విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం చేస్తుంటాం. అయితే అది సరైన పని కాదు. జయాపజయాలను సమంగా స్వీకరించే పరిపక్వతను పెంపొందించుకోవాలి. విజయాలు గౌరవాన్ని, అపజయాలు అనుభవాలను పెంచుతాయి. అపజయాలే విజయానికి మార్గం అవుతాయి. పరాజయాలతో నేను చాలా నేర్చుకున్నాను. నా జీవితంలో ఎదురైన అపజయాలను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే అవి మళ్లీ పొరపాట్లు చేయకుండా హెచ్చరిస్తుంటాయని అంటున్నారు అనుష్క’ పలు సాహసోపేత విన్యాసాలు చేసిన చారిత్రక కథా చిత్రం రుద్రమదేవి విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరం నటీమణులెవ్వరూ నటించడానికి సాహసం చేయలేని ఇంజిఇడుప్పళగి చిత్రంలోనూ నటిస్తున్నా రు. ఈ చిత్రం కోసం అనుష్క 20 కే జీల వరకూ బరువు పెరిగిన విషయం విదితమే. -
స్వీటీ... వెరైటీ పాత్రల బ్యూటీ
ఈ దీపావళి లోపల రెండు నెలల్లో ఒకటికి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు రానున్నాయి. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన ‘రుద్రమదేవి’ జీవితం చూపే తెలుగు జాతి చరిత్ర ఒకటైతే, ఆడపిల్లంటే అందంగా - నాజూగ్గా - నడుము సన్నంగా ఉండాలనే ఆధునిక తెలుగు సమాజపు అర్థం పర్థం లేని బ్యూటీ డెఫినిషన్ ‘సైజ్ జీరో’ను ప్రశ్నించే కాంటెంపరరీ కథ మరొకటి. చిత్రంగా అటు ‘రుద్రమదేవి’గా, ఇటు ‘సైజ్ జీరో’ కోసం శ్రమించాల్సి వచ్చిన అమ్మాయిగా అలరించనున్నది ఒకే హీరోయిన్! ... ‘స్వీటీ’ అనుష్క. ఇలాంటి వెరైటీ కథలు తీయడం ఒక రకంగా ఇవాళ్టి మార్కెట్ ట్రెండ్‌లో సాహసమే. ఆ సాహసానికి సిద్ధపడడం గుణశేఖర్ (‘రుద్రమదేవి’), కోవెలమూడి ప్రకాశ్ (‘సైజ్‌జీరో’) లాంటి దర్శక, నిర్మాతల తీరని సృజనాత్మక దాహానికి ప్రతీక. ఇలాంటి తీసేవాళ్ళు ఒకరిద్దరున్నా చేసేవాళ్ళెవరన్నది ప్రశ్న. కోట్ల సంపాదనతో తృప్తి పడకుండా కలకాలం చెప్పుకొనే కొన్ని సినిమాలైనా కెరీర్లో మిగిలిపోవాలని భావించడంతో అనుష్క ఆ గట్స్ తనకున్నాయని నిరూపించుకుంది. మొన్నటికి మొన్న ‘బాహుబలి... ది బిగినింగ్’లో దేవసేనగా ముసలి క్యారెక్టర్లో కనిపించి, ఇప్పుడిలా 3డీలో ‘రుద్రమదేవి’గా కత్తి పట్టుకొని, ‘సైజ్ జీరో’లో అమాయకత్వం నిండిన అందమైన భారీకాయంతో ఐస్‌క్రీమ్ పట్టుకొని అనుష్క వైవిధ్యంగా కనిపిస్తున్నారు. ఇలా మూడు వేర్వేరు తరహా పాత్రలతో ఈ ఏడాది మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన ఈ కన్నడ కస్తూరి ఈ అక్టోబర్, నవంబర్లలో ‘రుద్రమదేవి’, ‘సైజ్‌జీరో’ ఎప్పుడెప్పుడు రిలీజవుతాయా అని ఎదురుచూస్తున్నారు. పడిన కష్టానికి తగ్గ ప్రశంసలు, బాక్సాఫీస్ రిజల్ట్ రావాలని విఘ్నేశ్వరుడికి మొక్కుకుంటున్నారు. -
రుద్రమ్మగా జేజమ్మ
-
రుద్రమదేవికి సీక్వెల్... ప్రతాపరుద్రుడు?
*** మన కాకతీయుల కథకు సంపూర్ణ ఆవిష్కరణ ప్రయత్నం *** ‘రుద్రమదేవి’లోనే సీక్వెల్‌కు లీడ్ సీన్స్ *** ‘ప్రతాపరుద్రుడు’గా చేసే హీరో ఎవరు? టైటిల్... ఆల్రెడీ ఓ.కె ‘రుద్రమదేవి’(‘ది వారియర్ క్వీన్’అనేది ట్యాగ్‌లైన్) చిత్రాన్ని నిర్మిస్తున్న గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పైనే ‘ప్రతాపరుద్రుడు’ (‘ది లాస్ట్ ఎంపరర్’ అనేది ట్యాగ్‌లైన్) అనే టైటిల్ ఫిల్మ్‌చాంబర్‌లో ఇటీవలే రిజిస్టర్ అయింది. టైటిల్‌కు ఆమోదం రావడంతోనే చిత్రయూనిట్ ఆ టైటిల్ లోగోను డిజైన్ చేయించి, సిద్ధం చేస్తోంది. ఇవన్నీ ‘రుద్రమదేవి’ సీక్వెల్ వార్తలకు బలం చేకూరుతున్నాయి. మన తెలుగువారి ఘన చరిత్రకూ, సంస్కృతికీ తెలుగు సినిమా మళ్ళీ పెద్ద పీట వేయనుందా? ఎన్టీయార్, ఏయన్నార్ల హయాంలో విరివిగా సాగి, ఆ తరువాత వెనకపట్టు పట్టిన ఈ విశిష్టమైన సెల్యులాయిడ్ కృషి ఇప్పుడు మళ్ళీ తెలుగు తెరపై ఊపందుకుంటోందా? హిస్టారికల్ ఫిల్మ్స్ తీయడానికి ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలుగువారి పౌరుషాన్నీ, ప్రతాపాన్నీ తమిళ, మలయాళ, కన్నడ, మరాఠా సీమల దాకా విస్తరించి, సువిశాల తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకతీయుల ఘనచరిత్రకు ఉదాహరణగా తాజాగా ‘రుద్రమదేవి’ సినిమా తయారైంది. దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో చేసిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రయత్నం సరిగ్గా నెల రోజుల్లో సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బాహుబలి’ ఘనవిజయం తరువాత ఈ చారిత్రక కథాచిత్రం పట్ల సినీప్రియులతో పాటు వ్యాపారవర్గాల్లోనూ ఆసక్తి, అంచనా ఇంకా పెరిగాయి. స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ బిజీ! ఈ నేపథ్యంలో గుణశేఖర్ సైతం దాదాపు 300 ఏళ్ళు మన దక్షిణాపథంలో అధిక ప్రాంతాన్ని పరిపాలించిన మన కాకతీయుల చరిత్రను సంపూర్ణంగా ఆవిష్కరించడానికి ‘రుద్రమదేవి’కి సీక్వెల్‌తో సిద్ధమవుతున్నట్లు కృష్ణానగర్ కబురు. రుద్రమదేవి అనంతరం ఆమె మనుమడు (కూతురి కొడుకు) - తిరుగులేని చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు హయాంలో కొనసాగిన కాకతీయ సామ్రాజ్య చరిత్రను ఈ సీక్వెల్లో చెబుతారు. వరంగల్ కోటను స్వాధీనం చేసుకోవడానికి ఏడుసార్లు దండెత్తి వచ్చిన ఢిల్లీ సుల్తానులతో వీరోచిత పోరాటం చేసిన మహాయోధుడు ప్రతాపరుద్రుడు. తమిళసీమలోని మదురై, కేరళ దాకా జయించిన చక్రవర్తి అతను. జీవితంలో బోలెడన్ని ఎమోషన్లు, సెంటిమెంట్, యాక్షన్ పార్ట్ ఉన్న ఈ కాకతీయ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి కథ కోసం ఇప్పటికే గుణశేఖర్ టీమ్ రీసెర్చ్ చేసింది. కథాంశం, టైటిల్ పాత్ర తీరుతెన్నులు, ప్రధాన ఘట్టాలతో ఇప్పటికే బేసిక్ స్క్రిప్ట్ తయారైంది. ఇప్పుడు పూర్తి నిడివి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆసక్తి చూపుతున్న అగ్ర హీరోలు! అనుష్క టైటిల్ రోల్ చేస్తున్న ‘రుద్రమదేవి’లో కృష్ణంరాజు, ప్రకాశ్‌రాజ్ సహా దాదాపు 40 మంది దాకా పేరున్న, సుపరిచిత ఆర్టిస్టులు పాత్రలు ధరిస్తున్నారు. ఇంత భారీ తారాగణంతో, సుమారు రూ. 70 కోట్ల ఖర్చుతో, హీరోయిన్ ఓరియెంటెడ్ కథగా ‘రుద్రమదేవి’ని గుణశేఖర్ త్రీడీలో అందిస్తున్నారు. రుద్రమదేవే స్వయంగా పట్టాభిషేకం చేసిన ఆమె మనుమడు ‘ప్రతాపరుద్రుడు’ హీరో ఓరియెంటెడ్ కథ. పైగా, యాక్షన్ పార్ట్, యుద్ధం సీన్లు కూడా ఎక్కువగా ఉండే ఎమోషనల్ స్టోరీ. తెరకెక్కించడానికి మరింత భారీ వ్యయమయ్యే ఆ స్క్రిప్ట్‌లో టైటిల్‌రోల్ ఏ హీరో చేస్తారన్నది కూడా ఆసక్తికరమైన విషయమే. ‘రుద్రమదేవి’ కథలోని కొన్ని పాత్రలు, సన్నివేశాలు ‘ప్రతాపరుద్రుడు’ కథలో కూడా కొనసాగుతాయి. కాబట్టి, అనుష్క సహా పలువురు మళ్ళీ సీక్వెల్లో కూడా ఉంటారని ఊహించవచ్చు. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడిగా దగ్గుబాటి రానా నటించేశారు. కాబట్టి, సీక్వెల్లో టైటిల్ రోల్ ఎవరిదన్నది ఇప్పుడు కృష్ణానగర్‌లో హాట్‌టాపిక్. మహేశ్‌బాబు, చిన్న ఎన్టీయార్, రామ్‌చరణ్ లాంటి యువ హీరోలలో ఒకరు ‘ప్రతాపరుద్రుడు’గా చేస్తారని ఒక టాక్. కాగా, కెరీర్లో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిపోయే ఈ పాత్ర కోసం 150వ సినిమా మైలురాయి దగ్గరున్న చిరంజీవి, నూరో సినిమా చేయనున్న బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు మొగ్గినా ఆశ్చర్యపోనక్కర లేదని మరో వాదన. మొత్తానికి, పలువురు హీరోలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి రాబోయే రోజుల్లో మరిన్ని ఊహాగానాలు పెరగడం ఖాయం. ఫస్ట్ పార్ట్‌లోనే... సెకండ్ పార్ట్‌కు లీడ్! ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యకలాపాల్లో ‘రుద్రమదేవి’ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. నాలుగేళ్ళ పాటు ఢిల్లీ గద్దెనెక్కిన రజియా సుల్తానా మొదలు ఆధునిక కాలంలోని ఇందిరా గాంధీ దాకా భారతదేశంలో మరే పాలకురాలూ పాలించనంతగా దాదాపు 40 ఏళ్ళు సామ్రాజ్యాన్ని నడిపిన వీరనారి ‘రుద్రమదేవి’. తండ్రితో అనుబంధం, భర్తతో ప్రేమావేశం, కూతురితో పేగుబంధం, మనుమడితో కర్తవ్యపాశం - ఇలా రకరకాల షేడ్స్ ఉన్న పాత్ర తన కెరీర్లో మరపురానిదని అనుష్క చెప్పారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళాల్లో, హిందీలో కూడా ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘రుద్రమదేవి’ సినిమా చివరలో రాబోయే సీక్వెల్‌కు తగ్గట్లు పసివాడైన ప్రతాపరుద్రుడి సీన్లు కూడా ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ సీన్స్ ద్వారా సీక్వెల్ ‘ప్రతాపరుద్రుడు... ది లాస్ట్ ఎంపరర్’కు శ్రీకారం చుట్టినట్లవుతుంది. చిన్నప్పటి ప్రతాపరుద్రుడి పాత్రకు కూడా ప్రముఖ హీరోల వారసుడైన బాల నటుడొకరు కనిపించే సూచనలున్నాయి. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియడానికి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే! తెరపై చరిత్ర హిట్టే! మొత్తానికి, చిన్నప్పుడు చదివిన పాఠం స్ఫూర్తితో, 2002 నాటి నుంచి గుణశేఖర్ మనసులో తిరుగుతున్న ‘రుద్రమదేవి’ ఆలోచన ఇన్నాళ్ళకు ఇలా తెరపైకి ఎక్కిన క్రమం ఆసక్తికరమే. పెద్ద ఎన్టీయార్ ‘సమ్రాట్ అశోక’ (1992) తరువాత దాదాపు ఇరవై మూడేళ్ళకు తెలుగులో వస్తున్న భారీ స్టార్‌క్యాస్ట్ హిస్టారికల్ ఫిల్మ్ ఇదే. గతంలో తెలుగు తెరపై వచ్చిన ‘పల్నాటి యుద్ధం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరసు’, ‘అల్లూరి సీతారామరాజు’ లాంటి చారిత్రక కథాచిత్రాల్లో నూటికి 95 శాతం హిట్లే. ఆ కోవలోనే ‘రుద్రమదేవి’ని ఆదరిస్తే, గుణశేఖర్ బృందం మూడేళ్ళపాటు రాత్రింబగళ్ళు చేసిన సృజనాత్మక కృషికి గుర్తింపు దక్కినట్లే! మన తెలుగు జాతి చరిత్ర అయిన ‘రుద్రమదేవి’తో పాటు ‘ప్రతాపరుద్రుడు’ కథ కూడా భావితరాలకు సిల్వర్‌స్క్రీన్ పాఠ్యాంశంగా కలకాలం నిలిచే ఛాన్స్ కచ్చితంగా వచ్చినట్లే!! -
కత్తి లాంటి హీరోయిన్లు
సినిమా ఫీల్డ్‌లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఒక ఫ్యాక్షన్ సినిమా హిట్టవ్వగానే... వరుస పెట్టి అందరూ ఫ్యాక్షన్ సినిమాలే చేసేశారు. కొన్నాళ్లు సీక్వెల్స్ హవా నడిచింది. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే - కథానాయికల కత్తి యుద్ధాలు, బాణాల ఫైటింగులు. పూలూ పళ్లు పట్టుకోవాల్సిన ఈ సుకుమార సౌందర్యరాశులు కత్తి పట్టుకుని వెండితెర బరిలో చెలరేగిపోతున్నారు. గ్లామరస్ క్యారె క్టర్స్కే కాదు... వీరోచిత పాత్రలకూ పనికొస్తామని నిరూపించుకునే పని మీద ఉన్నారు హీరోయిన్లు. ఆ వీర వనితలపై ఓ స్పెషల్ లుక్... అనుష్క కత్తికి రెండు వైపులా పదునే! ‘అరుంధతి’ చిత్రంతో తనలో పవర్ ఫుల్ నటి ఉన్న విషయాన్ని నిరూపించు కున్న అనుష్క ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల ద్వారా తన వీరత్వాన్ని చాటుకోవడా నికి రెడీ అయిపోయారు. ఈ రెండు చిత్రాల కోసం కత్తి సాము, గుర్రపు స్వారీ నేర్చుకు న్నారు. నటనే కదా అని లైట్ తీసుకోకుండా ఐదారు నెలలు శిక్షణ కూడా తీసుకున్నారామె. వీర వనితలా కనిపించాలంటే ఇవి నేర్చుకుంటే చాలా? ఆహార్యం కూడా అందుకు అనుగుణంగా ఉండాలి కదా? అందుకే, ఓ ప్రత్యేకమైన డైట్‌ను ఫాలో అయ్యారు. ‘బాహుబలి’ తొలి భాగంలో అనుష్క కనిపించిందే చాలా తక్కువ సేపు. యుద్ధాలు చేయలేదు. రెండో భాగంలో ఆమె కరవాల నైపుణ్యాన్ని తిలకించవచ్చునట. ఇక, వీర వనిత ‘రుద్రమదేవి’గా కూడా అనుష్క కత్తి ఝళిపించిన వైనం మామూలుగా లేదట. ఆ విన్యాసాలు సెప్టెంబర్ 4 నుంచి తెరపై చూడవచ్చు. సుసాధ్యాల తమన్నా లేత తమలపాకులా ఉండే తమన్నా కత్తి యుద్ధాలు చేయగలుగు తారా? ‘ఊహూ’ అని చాలామంది అంటారు. కానీ, తమన్నా తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు. అందుకే ‘బాహుబలి’ కోసం ప్రత్యేకంగా యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. కత్తి తిప్పడం అంత సులువు కాదంటున్నారు తమన్నా. అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఈ బ్యూటీకి ఇష్టం. అందుకే, కత్తి తిప్పడం నేర్చుకున్నారు. డోంట్ కేర్ హన్సిక పాత్ర డిమాండ్ చేస్తే, ఏదైనా చేయడానికి హన్సిక వెనకాడరు. అందుకు తాజా నిదర్శనం తమిళ ‘పులి’ చిత్రం. ఈ చిత్రంలో సీనియర్ నటి శ్రీదేవి కూతురిగా హన్సిక నటించారు. ఆమెది యువరాణి పాత్ర. అందుకోసం కోసం హన్సిక కత్తి యుద్ధం నేర్చుకున్నారు. ట్రైనింగ్ అప్పుడు ఆమెకు చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయి. అయినా, డోంట్ కేర్ అనుకున్నారు. త్వరలోనే తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ‘పులి’లో హన్సిక కత్తి తిప్పిన వైనం చూడ్డానికి రెండు కళ్లూ చాలవట. సవాల్ చేపట్టిన దీపికా పదుకొనె ‘బాజీరావ్ మస్తానీ’ కోసం దీపికా పదుకొనె గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం నేర్చుకున్నారు. ఇందులో ఆమె పోరాట యోధురాలి పాత్రలో కనిపించ నున్నారు. ఇప్పటివరకూ ఏ పాత్రకూ పడనంత శ్రమ ఈ పాత్రకు పడ్డానని దీపిక అంటున్నారు. గుర్రపు స్వారీ సరదాగా అనిపించిందట కానీ, కత్తి యుద్ధం కఠినంగా అనిపించిందన్నారు. ఒకవైపు ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటూ మరోవైపు ట్రైనింగ్ తీసుకున్నారట. అది చాలా కష్టమనిపించిం దని, రోజుకి 12 నుంచి 15 గంటలు పని చేయాల్సి వస్తోందని దీపిక అంటున్నారు. ఏది ఏమైనా నటిగా ఇది తనకు సవాల్ లాంటి పాత్ర కాబట్టే, ఎంత రిస్క్ అయినా తీసుకోవడా నికి వెనకాడటం లేదట. కత్రినా... కత్తిలాంటి ఫైటింగ్ కత్రినా కైఫ్‌ని అభిమానులు కత్రినా ‘నైఫ్’ అని ముద్దుగా పిలుచుకుంటుం టారు. తేలికగా సాగే గ్లామరస్ క్యారెక్టర్లు ఎక్కువగా చేయడంతో పాటు అడపాదడపా శక్తిమంతమైన పాత్రల్లో కనిపిస్తారు కత్రినా. ప్రస్తుతం ఆమె ‘ఫితూర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం కత్రినా గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. కత్తి యుద్ధం కూడా కొంత నేర్చుకున్నారట. గుర్రపు స్వారీ చాలా కష్టమైందని తన సన్నిహితుల దగ్గర పేర్కొన్నారట కత్రినా. పాపం ఈ చిత్రం కోసం గుర్రపు స్వారీ సీన్లో నటిస్తున్నప్పుడు కింద కూడా పడ్డారు. అయినా ఏం ఫీల్ కాలేదు. ఈ తరహా చిత్రాలు చేసే అవ కాశం అరుదుగా వస్తుంది కాబట్టి, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవాలని ఫిక్స్ అయ్యారు. -
సెప్టెంబర్ 4న 'రుద్రమదేవి' విడుదల
-
రుద్రమదేవికి ఆకర్షణ ఆ ముగ్గురే
-
రుద్రమదేవి రిలీజ్ ఎప్పుడు..?
-
రుద్రమదేవికి సాయం చేస్తున్నమహేష్..?
-
రుద్రమడాడీ
ఫాదర్స్ డే ప్రత్యేకం తండ్రిగా... ఎంతో ప్రేమిస్తాడు! నాన్నగా... ‘నాన్నలు’ అని పిల్చుకుంటాడు! డాడీగా... వాళ్లని డైనమిక్‌గా మలుస్తాడు! ఫాదర్‌గా... బెస్ట్ ఫ్రెండ్‌లా ఉంటాడు! ఇంటి పెద్దగా... బాధ్యతను నేర్పిస్తాడు! అన్నలా... అడిగింది కొనిస్తాడు! డ్ రైవర్గా... స్కూల్లో దించుతాడు! ఇన్ని గుణాలున్న శేఖరుడు ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ! రాత్రి 7.30 గంటలు. హైదరాబాద్‌లో చిరుజల్లులు... అప్పటికే చీకటి, రోడ్ల మీద ట్రాఫిక్. కమ్ముకొస్తున్న వాటిని చీల్చుకుంటూ ‘గుణ మీడియా వర్క్స్’ ఆఫీసుకి చేరాం. దేశంలో తొలి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్ ‘రుద్రమదేవి’ దర్శకుడు గుణశేఖర్ పెద్దమ్మాయి నీలిమ (21) హాలులో ఉంది. చుట్టూ ‘రుద్రమదేవి’ మినియేచర్ సెట్స్, ఆర్ట్ వర్క్స్, చరిత్ర పుస్తకాలు. సెవన్త్ గ్రేడ్ చదువుతున్న చిన్నమ్మాయి యుక్తాముఖి (12) స్కూలులో లేటవడంతో ఇంకా రాలేదు. ముందుగా పెద్దమ్మాయితో, తర్వాత చిన్నమ్మాయితో భేటీ... ‘రుద్రమదేవి’కి సహనిర్మాతలైన ఆ పిల్లలిద్దరూ క్రియేటర్ గుణశేఖర్లోని కుటుంబ కోణంపై ఫోకస్ లైట్ వేశారు. చివరలో గుణశేఖర్, ఆయన శ్రీమతి రాగిణి వచ్చి మాతో కలిశారు. నలుగురితో విడివిడిగా మాట్లాడిన ఈ కలివిడి కబుర్లు... వారు మీడియాకిచ్చిన తొలి ‘ఫ్యామిలీ’ గ్రూప్ ఫోటో సాక్షిగా ఇవీ... వెరీ గుడ్ హ్యూమన్‌బీయింగ్! - నీలిమ (గుణశేఖర్ పెద్దమ్మాయి) గుణశేఖర్ గారు అందరికీ పెద్ద డెరైక్టర్ కానీ, మాకు మాత్రం లవబుల్ డాడ్! ఇంట్లో ఎప్పుడూ ఆయన ఒక ఫాదర్ లానే తప్ప, సినిమా మనిషిలా ఉండరు. మా ఇంట్లో సినిమా వాతావరణమూ ఉండదు. మేమెప్పుడూ షూటింగ్‌లకూ, సినిమా ఫంక్షన్లకూ వెళ్ళేదీ లేదు. ‘రుద్రమదేవి’ప్రాజెక్ట్‌కే ఆ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. పక్కా ఫ్యామిలీ మ్యాన్! సెట్స్‌లో నాన్న సీరియస్‌గా ఉంటారు. కానీ, చాలామందికి తెలియనిదేమిటంటే, ఆయనకు మంచి సెన్సాఫ్ హ్యూమరుంది. నాన్న ఎంత ఫ్యామిలీ మ్యానంటే... సినిమాకెళ్ళినా, షికారుకెళ్ళినా అమ్మ, నేను, చెల్లెలు - నలుగురం కలిసి వెళ్ళాల్సిందే. ఆయనొక్కరూ వెళ్ళరు. ఇంట్లో హోమ్ థియేటర్లో కూడా అందరం కలిసి, సినిమాలు చూడాల్సిందే! నాన్న పార్టీలకు వెళ్ళే రకం కాదు. ఆయన ధ్యాసంతా సినిమా మీదే! షూటింగ్ పని ముగించుకొని ఇంటికి వచ్చేశాక, ఉన్న కాసేపూ మాతోనే గడుపుతారు. వర్క్‌లో ఎంత టెన్షన్ ఉన్నా, మాతో గడిపే టైమ్ ఆయనకు రిలీఫ్. వీలున్నప్పుడల్లా మమ్మల్ని స్కూలు దగ్గర దింపడం, తేవడం ఆయనకు బాగా ఇష్టం. పుస్తకాలు, పేపర్లు చదవమంటారు! నాకు పెయింటింగంటే ఇష్టం. నా హాబీని నాన్న ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే, ఈ వయసులో ఉండే పిల్లలందరి లానే నాకూ రకరకాల ఇంట్రెస్ట్‌లు. ఒక దాని నుంచి మరో దాని మీదకు ఫోకస్ మారిపోతుంటుంది. అది నాన్న అర్థం చేసుకొని, ప్రతి రంగంలోని పాజిటివ్‌లు, నెగిటివ్‌లు వివరించి చెబుతుంటారు. ఈ మధ్యే బి.ఏ- మాస్ కమ్యూనికేషన్ చదివిన నాకు మంచి జర్నలిస్ట్‌ను కావాలని కోరిక. చరిత్ర, పాతకాలపు వస్తువులంటే నాకిష్టమని, లండన్‌కు పంపి, అక్కడ హయ్యర్ స్టడీస్ చేయిం చాలని నాన్న అనుకుంటున్నారు. ఇక్కడ ‘రుద్రమదేవి’ కోసం ‘గుణ టీవ్ు వర్క్స’ క్రియేటివ్ హెడ్‌గా డిజిటల్ పబ్లిసిటీతో పాటు కాస్ట్యూమ్స్, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ - ఇలా చాలా శాఖల్లో పనిచేశా. ఇదంతా ఇంటర్న్‌షిప్‌లా పనికొచ్చింది. నా చదువునూ, ఈ అనుభవాన్నీ కలిపి, భవిష్యత్తులో సినీ మీడియమ్‌లోకి వస్తానేమో చెప్పలేను. తెలుగు భాషన్నా, చరిత్రన్నా, పుస్తకాలన్నా నాన్నకి ఇష్టం. మా ఇంట్లో పురాణేతిహాసాలు సహా బోలెడన్ని బుక్సున్నాయి. రోజూ బోలెడన్ని పేపర్లు, మ్యాగజైన్స్ ఇంటికి వస్తాయి. మనిషి ఎదగాలంటే పుస్తకాలు చదవాలనీ, తెలుగు బాగా నేర్చుకోవాలనీ చెబుతుంటారు. ఆయన నేర్పిన విలువలు అవి! డెరైక్టర్‌గా నాన్న గొప్పే కానీ, అంతకు మించి వెరీగుడ్ హ్యూమన్‌బీయింగ్! ఆయన నిస్వార్థం, తోటివాళ్ళ బాగోగుల్ని పట్టించుకోవడం నాకు నచ్చుతాయి. ‘తోటివాళ్ళ పట్ల దయగా ఉండాలి. లేనిదాని కోసం ఆరాటం కన్నా ఉన్నదాని పట్ల తృప్తి ముఖ్యం’ - మా ఇద్దరికీ ఆయన నేర్పిన విలువలు అవి. అందుకే, ఇతరులతో పోల్చుకోం. కంఫర్టబుల్‌గా బతకడానికి ఉందని హ్యాపీగా ఉంటాం. ‘రుద్రమదేవి’ కోసం నాన్న 70 కోట్ల డబ్బే కాదు... నాలుగేళ్ళ జీవితం ఇన్వెస్ట్ చేశారు. మా పెదనాన్నైతే ఈ సినిమా ప్రొడక్షన్ చూడడం కోసం వైజాగ్ దగ్గర నుంచి వచ్చి, ఇక్కడే ఉండిపోయారు. ప్రతి సినిమాకుండే కష్టాలే ఈ సినిమాకూ వచ్చాయి. ఇంత పెద్ద సినిమాను పూర్తి చేసి, విజయవంతంగా రిలీజ్ చేయడమే మా ఫస్ట్ సక్సెస్. ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చడమే కాకుండా, డబ్బులు పెట్టినవాళ్ళకు లాభాలూ తెస్తుందనే నమ్మకం మాకుంది. దేవుడి దయ వల్ల మాకు ఉండడానికీ, తినడానికీ ఉంది. ‘రుద్రమదేవి’ లాంటి మరిన్ని మంచి సినిమాలు తీసే సత్తా మా నాన్నకుంది. అంతకన్నా ఇంకేం కావాలి! వాట్ నెక్స్ట్అంటారు! - యుక్తాముఖి (గుణశేఖర్ చిన్నమ్మాయి) అక్కయ్య మా అమ్మకు బాగా దగ్గరైతే, నేను నాన్నకు చాలా క్లోజ్. నాన్నకీ, నాకూ ఫిజికల్‌గానే కాదు... చాలా విషయాల్లో పోలికలున్నాయి. మేమిద్దరం టెక్ శావీ! నాన్నకూ, నాకూ గ్యాడ్జెట్ల పిచ్చి! కొత్త కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏంటో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడమంటే - మా ఇద్దరికీ చాలా ఇష్టం. ‘మ్యాడ్ సైంటిస్ట్స్’ లాగా ఇద్దరం కలసి వాటి గురించి దాదాపు రిసెర్చ్ చేసినంత పని చేస్తాం. నాకు ‘యాపిల్’ కంపెనీ గ్యాడ్జెట్స్ అంటే పిచ్చి. ‘యాపిల్’ ప్రొడక్ట్స్ ఏవి వచ్చినా, అడగగానే నాన్న కొనిస్తారు. సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ సినిమాలు చూస్తున్నప్పుడు అవి ఎలా తీశారు, వాడిన టెక్నికేంటి, గ్రాఫిక్సెలా చేశారు లాంటి కబుర్లన్నీ నాన్న చెబుతుంటే, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాన్న తీసిన ‘రామాయణం’ నాకు చాలా ఇష్టం. గమ్మత్తేమిటంటే, ఇప్పటి దాకా నాన్న సినిమాలేవీ రిలీజ్‌కు ముందు మేమెప్పుడూ చూడలేదు. నాన్నా చూపించలేదు. ప్రివ్యూలు వేయడం, చూపించడం లాంటివి ఆయన ఎప్పుడూ చేయలేదు. అండర్ ప్రొడక్షన్లో ఉండగా ‘రుద్రమదేవి’ మాత్రం కొంత చూశాం. ఇంట్లో కామ్..! సెట్లో సీరియస్! అసలు చిన్నప్పుడు స్కూల్లో నాన్-డీటైల్డ్ పాఠంగా చదువుకొన్న ‘రుద్రమదేవి’ కథంటే నాన్నకి చాలా ఇష్టం. మాకెప్పుడూ ఆమె జీవితాన్ని కథలు, కథలుగా చెబుతుంటారు. ఆమె కథను దేశమంతటికీ చెప్పాలని ఆయన డ్రీమ్. అందుకోసమే ఇన్నేళ్ళూ కష్టపడ్డారు. ‘రుద్రమదేవి’కి ప్రెజెంటర్‌గా అమ్మ అంతా దగ్గరుండి చూసుకొంది. అలా నాన్న, అమ్మ, అక్క - అంతా సెట్స్‌లోనే ఉంటారు కాబట్టి, నేనూ స్కూలయ్యాక సెట్స్కెళ్ళేదాన్ని. ఇంటి దగ్గర చాలా కామ్‌గా ఉండే, నాన్న గారు సెట్స్‌లో డిఫరెంట్‌గా అనిపిస్తారు. పని మీదే ఫోకస్డ్గా ఉండడం వల్ల, అది జరగనప్పుడు కోపమూ ఎక్కువే చూపిస్తారు. ఆయన పాలసీ అదే! నాన్న సినిమాకు పేరొచ్చి, హిట్టయితే, మేమంతా హ్యాపీ. కంగ్రాచ్యులేట్ చేస్తుంటాం. ఒకవేళ ఎప్పుడైనా చిన్న తేడా వచ్చినా, ఆయన దాని గురించే ఆలోచిస్తూ కూర్చోరు. ‘డోంట్ పుట్ యువర్ ఫోకస్ ఆన్ ది ఫెయిల్యూర్. నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద ఫోకస్ పెట్టాలి. దేవుడు మనకిచ్చిన దాని గురించి సంతోషపడాలి’ అని నాన్న గారు చెబుతుంటారు. ఆయన ఫాలో అయ్యే పాలసీ అదే! ప్రతి డిసెంబర్ 31వ తేదీ రాత్రి మా ఫ్యామిలీ మొత్తం ఇంట్లో డిన్నర్ చేసి, లాంగ్ డ్రైవ్‌కి వెళతాం. న్యూ ఇయర్‌కి సంతోషంగా వెల్కమ్ చెబుతాం. పిల్లల మీద ఎలాంటి రిస్ట్రిక్షన్లూ పెట్టకుండా, తగినంత ఫ్రీడమ్ ఇచ్చి, ఫ్రెండ్ లాగా ఉంటారు కాబట్టే ఐ లవ్ మై డాడ్ సోమచ్! కొన్నిసార్లు వాళ్ళే నా ఫాదర్! - దర్శకుడు గుణశేఖర్ అమ్మానాన్నకు ఎనిమిదిమంది పిల్లల్లో నేను ఏడోవాణ్ణి. నాకు మాత్రం ఇద్దరే పిల్లలు. మా అమ్మాయిలిద్దరి భావాలు, వాడే గ్యాడ్జెట్లు మోడరన్. అదే సమయంలో మన సంస్కృతిని మర్చిపోరు. వాళ్ళ అమ్మతో కలసి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇప్పటికీ మా ఆవిడనీ, నన్నూ ‘అమ్మా, నాన్నా’ అనే పిలుస్తారు. ఎంత ఎదిగినా, మూలాల్ని మర్చిపోని మా పిల్లల్ని చూసి, అందుకే గర్విస్తుంటా. ♦ మా పిల్లలు, మేము అంతా హోమ్ బర్డ్స్. దేశదేశాల టూర్‌కు వెళ్ళినా నాలుగు రోజులు కాగానే, మా చిన్నమ్మాయి ఇంటికి వెళదామంటుంది. మా పెద్దమ్మాయైతే, మాకు దూరంగా ఉండడం ఇష్టం లేక డిగ్రీ చదువుకు లండన్‌కు వెళ్ళలేదు. అంత బలమైన కుటుంబబంధం మాది! ♦ పిల్లలకు మార్కులే జీవితం కాదు. మార్కుల కన్నా వాళ్ళ ఐ.క్యూ. ఎలా ఉందనేది ముఖ్యం. నేను అదే చూస్తా. మా పిల్లలిద్దరూ మంచి విమర్శకులు. అలా మా ఇంట్లోనే ఇద్దరు క్వాలిటీ కంట్రోలర్లున్నారు. (నవ్వు...) ♦ మా ఆవిడ, పిల్లలే నా బలం. నైతికంగా వాళ్ళ అండ లేనిదే ‘రుద్రమదేవి’ ప్రాజెక్ట్‌ను కలలోనైనా ఊహించలేను. మా పెద్దమ్మాయి నీలిమకి అవగాహన చేసుకొనే వయసు, అభిరుచి ఉన్నాయి. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఆలోచనల్ని ఎప్పటికప్పుడు తనతో పంచుకొనేవాణ్ణి. ♦ మేమంతా ఏదో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నట్లు ఉండం. అందుకే, ఒక్కోసారి నా పిల్లలే నాకు తండ్రి కూడా అవుతుంటారు. ఈ ‘రుద్రమదేవి’ జర్నీలో నేనెప్పుడైనా కొద్దిగా డల్ అయితే, ‘చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ఫిల్మ్ తీస్తున్నాం’ అని ఉత్సాహపరిచేవారు. ఏ తండ్రికైనా, క్రియేటర్కైనా ఇంట్లో అంతటి సపోర్ట్ ఉంటే, అంతకు మించి ఇంకేం కావాలి! మా ఇద్దరమ్మాయిలతో పాటు నన్ను కూడా అమ్మ లాగా చూసుకొనే రాగిణి నా శ్రీమతి కావడం అదృష్టం! పిల్లల పెంపకంలో నేను 50 శాతమే ఫాదర్‌ని. మిగిలిన 50 శాతం వాళ్ళకు నాన్న మా ఆవిడే! ఆయన నేర్పిన సూత్రం అదే! - శ్రీమతి రాగిణీ గుణ (గుణశేఖర్ భార్య) పిల్లలకు తల్లితండ్రులే రోల్‌మోడల్స్! వాళ్ళు మనల్నీ, మన అలవాట్లు, ప్రవర్తననే చూసి పెరుగుతారు. పిల్లల్ని పెంచడమంటే వాళ్ళకు కావాల్సినవి సమకూర్చడమే కాదు. మంచీ చెడు వివరంగా చెప్పడం, వాళ్ళతో గడపడం! ఆ విషయంలో తండ్రిగా ఆయన (గుణశేఖర్)కు పదికి పది మార్కులు వేస్తా. డిసిప్లిన్ నేర్పుతూనే, పిల్లలతో ఫ్రెండ్‌లా కలిసిపోతారు. ఫలానా డిగ్రీ చదవండి, ఫలానా ఉద్యోగం చేయండి అంటూ పిల్లలపై ఒత్తిడి పెట్టడం ఆయనకు కానీ, నాకు కానీ అస్సలు ఇష్టం ఉండదు. ‘మనసుకు నచ్చింది చదవండి, నచ్చిన పని చేయండి. అది టీచర్ ఉద్యోగం కావచ్చు, ఇంటి నిర్వహణ చూసుకొనే గృహిణి కావచ్చు... ఏది చేసినా దానిలో హండ్రెడ్ పర్సెంట్ పెడితే, మానసిక సంతృప్తి, దానితో పాటు విజయం వస్తాయి’ అని చెబుతుంటాం. పిల్లలకు ఆయన నేర్పిన విజయసూత్రం అదే! - రెంటాల జయదేవ ఫొటోలు: శివ మల్లాల -
రుద్రమదేవి విడుదల వాయిదా
హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రుద్రమదేవి చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని భావించారు. అయితే గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తికానందున ఆలస్యమైంది. దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఫేస్బుక్లో ఈ మేరకు వెల్లడించారు. అత్యుత్తమ గ్రాఫిక్స్ అందించేందుకు వందలాదిమంది టెక్నిషియన్లు పనిచేస్తున్నారని, నిర్ణీత సమయానికి చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యంకాదని తెలిపారు. కాగా ఎప్పుడు విడుదల చేస్తామన్న విషయాన్ని గుణశేఖర్ తెలియజేయలేదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మరో భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి వచ్చే నెల 10న విడుదల కానుంది. ఇక మహేహ్ బాబు చిత్రం 'శ్రీమంతుడు' ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రుద్రమదేవి చిత్రాన్ని ఆగస్టులో లేదా ఆ తర్వాత విడుదల చేసే అవకాశముందని సమాచారం. రుద్రమదేవిగా అనుష్క నటించగా, ఇతర ముఖ్య పాత్రలను యువ హీరోలు అల్లు అర్జున్, రానా పోషించారు. -
రుద్రమదేవికి హెల్ప్ చేస్తున్న మెగా హీరోలు
-
రుద్రమకు మెగా వాయిస్
చిరంజీవి వెండితెరపై కనిపించి, చాలా ఏళ్లయ్యింది. ఎప్పుడెప్పుడు కనిపిస్తారా? అని ఎదురు చూస్తున్న అభిమానులను ఇటీవలే తన 150వ చిత్రం ప్రకటించి, ఆనందింపజేశారు చిరంజీవి. ఈ చిత్రం ద్వారా ఆయన తెరపై కనిపించడానికి కొంచెం సమయం పడుతుంది. ఈలోపు వినిపించనున్నారు. అర్థం కావడంలేదు కదూ.. అనుష్క టైటిల్ రోల్లో రాగిణి గుణ సమర్పణలో స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ రూపొందించిన చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చారిత్రాత్మక చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ- ‘‘అడగ్గానే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చిరంజీవిగారు అంగీకరించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చిరంజీవిగారు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో మరింత హైప్ వచ్చింది’’ అన్నారు. -
బాహుబలి కంటే ముందే వస్తున్న రుద్రమదేవి
-
రుద్రమ రె‘ఢీ’
బాక్సాఫీస్ రణరంగానికి ‘రుద్రమదేవి’ సిద్ధమయ్యారు. ‘బాహుబలి’ చిత్రం కన్నా మరి కాస్త ముందుగా ఈ రుద్రమ రంగంలోకి దూకనున్నారు. అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రల్లో గుణా టీమ్‌వర్క్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన రీ-రికార్డింగ్ కార్యక్రమాలు సంగీత దర్శకుడు ఇళయరాజా నేతృత్వంలో 25 రోజుల పాటు లండన్‌లో జరిగాయి. గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది.గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటన ఈ చిత్రానికే హెలైట్ . లండన్‌లో రీ-రికార్డింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ‘రుద్రమదేవి’ కావడం విశేషం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ట్: తోట తర ణి, కెమెరా: అజయ్ విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సమర్పణ: శ్రీమతి రాగిణి గుణ. -
బాక్సింగ్ శిక్షణలో ఎమి
సహజత్వం కోసం కొన్ని చిత్రాలకు హీరోలతో పాటు హీరోయిన్లు సాహసాలు చేయాల్సి ఉంటుంది. అందుకు తగిన శిక్షణ కూడా అవసరమవుతుంది. రుద్రమదేవి చిత్రం కోసం నటి అనుష్క కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి విద్యల్లో శిక్షణ తీసుకున్నారు. తాజాగా ఎమి జాక్సన్ కూడా అదేబాటలో పయనిస్తున్నారు. ఐ చిత్రంలో అందాల ఆరబోతతో పాటు అభినయంతో శహభాష్ అనిపించుకున్న ఎమిజాక్సన్ ఇప్పుడు కల్సా నృత్యం, బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నారట. ఈమె హిందీలో నటించిన తొలి చిత్రం ఏక్ దివానా తా నిరాశ పరిచింది. చిన్న గ్యాప్ తీసుకుని అక్కడ మరో ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆమెకు ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా అవకాశం కల్పించారు. అక్షయ్‌కుమార్ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న కింగ్ ఈస్ బ్లింగ్ చిత్రంలో ఎమిజాక్సన్ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. దీనికోసం కల్సా నృత్యం, బాక్సింగ్‌లో శిక్షణ పొందాలని షరతులు విధించారట. ఈ మేరకు ఎమి ఆ రెండు కళల్లో కసరత్తు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే మొదట ఈ పాత్ర కోసం కీర్తి సనోన్ను ఎంపిక చేసుకున్నారటా. ఆ పాత్రకు ఆమె నప్పకపోవడంతో ఆ అదృష్టం ఎమిని వరించినట్టు సమాచారం. -
చరిత్రను చెక్కుతున్న రాజమౌళి, గుణశేఖర్
రెండు సినిమాలు - ఇద్దరు డైరెక్టర్లు - వెండి తెర కోసం శిల్పాలు చెక్కుతున్నారు - చరిత్రను వెండి తెరకెక్కిస్తున్నారు - 250 కోట్ల బడ్జెట్ - మూడేళ్ల శ్రమ... ఆ సినిమాలు ఏమిటో, ఆ దర్శకులు ఎవరో ఇప్పటికే మీకు అర్దమైపోయి ఉంటుంది. దర్శకులు రాజమౌళి - గుణశేఖర్. ఇద్దరూ దర్శక దిగ్గజాలే. ఆ చిత్రాలు ఒకటి బాహుబలి - రెండు రుద్రమదేవి. ఈ దర్శకులు చరిత్ర సృష్టిస్తారా? ఈ చిత్రాలు రికార్డులను బద్దలు కొడతాయా? ఇదే ప్రస్తుతం టాలీవుడ్డే కాదు, భారత చలన చిత్ర పరిశ్రమ టాక్. మూడేళ్లుగా వినిపిస్తున్న సినిమా తెరమీదికి రాకపోతే ఏం జరుగుతుంది. సాధారణంగా ప్రేక్షకులు దాని గురించి మర్చిపోతారు లేదా ఆ సినిమా గురించి అంచనాలైనా తగ్గించుకుంటారు. కానీ కొన్ని సినిమాల విషయంలో అది నిజం కాదు. కొంతమంది డైరెక్టర్లు సినిమా గురించి ప్రకటించిన తరువాత అది రిలీజ్ కావడానికి ఎంత సమయం పట్టినా అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉంటారు. రోజు రోజుకీ ఆ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉంటాయి. అలాంటి జాబితాలో టాలీవుడ్లో ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఉన్నాయి. జక్కన్న చెక్కుతున్న బాహుబలి చిత్రంలో ప్రభాస్, అనుష్క, రాణా, సత్యరాజ్, తమన్నా వంటి నటీనటులు నటిస్తున్నారు. మూడేళ్లుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికీ ఫ్రెష్ టాక్ ఉండేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇదే కోవలో ప్రేక్షకులు అలుపు లేకుండా ఎదురు చూస్తున్న రెండో చిత్రం రుద్రమదేవి. అనుష్క టైటిల్ రోల్‌తో, గోన గన్నారెడ్డిగా బన్నీ ప్రత్యేక పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంపై కూడా ఎప్పటికప్పుడు అంచనాలు తగ్గకుండా నిలబెట్టుకుంటూ వస్తున్నారు డైరెక్టర్ గుణశేఖర్. ఈ రెండు చిత్రాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కంటే, కాస్త ఆలస్యం అయినా కచ్చితంగా ఇండస్ట్రీ చరిత్రలో నిలిచిపోయేలా రావాలని కోరుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. డైరెక్టర్లు, నటీనటులు వాళ్ల శ్రమను నమ్ముకున్నట్టే, అభిమానులు, ప్రేక్షకులు ఆ దర్శకుల ప్రతిభను నమ్మి ఎదురుచూస్తున్నారు. రాజమౌళిని ఇండస్ట్రీలో అందరూ జక్కన్న అంటారు. అతను సినిమాను శిల్పంలా అంత శ్రద్ధగా చెక్కుతారని అలా పిలుచుకుంటారు. ఆ పేరుకు తగ్గట్టే జక్కన్న భారీ చిత్రానికి తెరతీసి మూడేళ్లుగా చెక్కుతున్నారు. ఆ శిల్పాన్ని చూడ్డానికి ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ ఎదురుచూపుల్లో ఉత్సాహం తగ్గకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక టీజర్ వదులుతూనే ఉన్నారు. రాజమౌళి అంటే అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ ఒక స్థాయి ఇమేజ్ ఉంది. అది హీరోలకు కూడా అసూయ కలిగించే స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే, అతను ఈగను కూడా హీరోను చేశారు. హిట్ కొట్టి చూపించారు. అలాంటి దర్శకుడు ఎత్తుకున్న భారీ ప్రాజెక్టే బాహుబలి. షూటింగ్ ఏడాది పూర్తి చేసుకున్నప్పుడే కాదు, సినిమాకు పనిచేస్తున్న ప్రధాన నటులు, టెక్నీషియన్స్ లో ఎవరి పుట్టినరోజు వచ్చినా వదిలిపెట్టలేదు జక్కన్న. ఆ సెలబ్రేషన్స్ వీడియోలను కూడా సినిమాకు ఒక ప్రమోషన్లా ఉపయోగించుకుంటూ బాహుబలిని వార్తల్లో ఉంచడంలో ఇప్పటివరకు సక్సెస్ అవుతూనే వచ్చారు. కథ దర్శకుని సృష్టే అయినందున అతను ఎలాగూ నమ్ముతారు. కానీ, ఒక డైరెక్టర్ కథను నమ్మి ఒక కథానాయకుడు మూడేళ్ల కాలాన్ని కాల్షీట్గా ఇచ్చేయడమంటే మాటలు కాదు. ప్రభాస్ అదే చేశాడు. ఒక సూపర్ హిట్ తర్వాత సినిమా లేకపోయినా, తను నమ్మిన కథ కోసం వారియర్‌గా మారిపోయాడు. రాజమౌళి కథ తయారు చేస్తే, ఆ కథకు నటుల్ని కూడా తానే తయారు చేసుకుంటాడు. సినిమాకు సరిపోయేవాళ్లను వెతుక్కోవడం ఒక పద్ధతి. వెతుక్కున్న వాళ్లను సరిపోయేలా తయారుచేసుకోవడం రెండో పద్ధతి. జక్కన్న స్టైల్ రోండోది. అతను ఈగను ఎంచుకుని కూడా హీరోగా తయారుచేసుకున్న డైరెక్టర్. అందుకే 100 కోట్ల రూపాయలు దాటి బడ్జెట్ పెడుతున్న సినిమాకు, అంతకు మించిన ఎక్సర్సైజ్ చేశారు. ప్రతి నటుడిని తనకు కావాల్సిన శిల్పంలా చెక్కుకున్నారు. ఒక సినిమా కోసం ఏళ్ల తరబడి కలిసి పనిచేయడం అనేది హాలీవుడ్లో మామూలే. కానీ, టాలీవుడ్‌కి కూడా అలాంటి అనుభవం ఇచ్చిన ప్రాజెక్ట్ బాహుబలి. అందుకే షూటింగ్ లొకేషన్లో టీమ్ మధ్య జరిగిన ప్రతి వేడుకనూ స్పెషల్‌గా ప్రేక్షకుల కోసం రిలీజ్ చేస్తూ వచ్చారు జక్కన్న. ఒక సినిమాకు ఇంత ఖర్చు పెట్టడమే కాదు, ఇంత కాలం తీయడం కూడా తెలుగులో ఇదే ప్రథమం. అయినా సరే, బాహుబలి గురించి వచ్చిన వార్తలు - విడుదలైన ట్రైలర్లు చూసిన ప్రేక్షకులు ఎప్పుడూ తమ అంచనాలు మాత్రం తగ్గించుకోలేదు. కారణం, రాజమౌళి మీద నమ్మకం. దర్శకుడిగా ఇప్పటివరకూ ఓటమి తెలియకుండా సాగిన అతని ప్రయాణం. ఇక గుణశేఖర్ ఒక్కడు సినిమాతో బాక్సాఫీస్ లెక్కలు మార్చారు. బాల రామాయాణాన్ని తెరపైకి తెచ్చి తరింపజేశారు. ఆ గుణశేఖర్ ఇప్పుడు ఓ కలగన్నారు. తెలుగు తెరపై చరిత్ర సృష్టించాలని చారిత్రక కలగన్నారు. ఆ కల ఖరీదు 80 కోట్ల రూపాయలు. దాని పేరు రుద్రమదేవి. కాకతీయ వీరనారి సాహసాలు వెండితెరపై చూపించాలని, అతిపెద్ద సాహసం చేస్తున్నారు. కాకతీయ సామ్రాజ్య చారిత్రక సత్యాల్నిరుద్రమదేవి సాహస కృత్యాల్ని, రికార్డ్ చేస్తున్నారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, ఆనాటి కాలాన్నితన చూపులో బంధించి మనకందించబోతున్నారు. అందుకోసం కఠోర శ్రమ - చరిత్రను తిరగదోడి సినిమాగా మలిచారు. కళ్లు మిరుమిట్లు గొలిపే సెట్లు, అబ్బురపరిచే ఫైట్లు - రుద్రమదేవికి స్పెషల్ ఎసెట్స్. అనుష్కలో రుద్రమదేవి రాజసం ఉట్టిపడుతోంది. బన్నీలో గోన గన్నారెడ్డి సాహసం సాక్షాత్కరిస్తోంది. అతి త్వరలోనే రుద్రమదేవి తెరమీదికి రాబోతోంది. ఉన్నదంతా ఊడ్చిపెట్టి రుద్రమదేవిని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా అటూ ఇటూ అయితే ఇక గుణశేఖర్‌కు ఏమీ ఉండదన్న వార్తలు వస్తున్నాయి. వాటిని కీడు ఎంచి మేలు ఎంచే వారి ఆశీర్వచనాలే అని గుణశేఖర్ అంటున్నారు. భారీ సినిమా అంటే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు. అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. రుద్రమదేవిపై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. అదే స్థాయిలో సినిమా కూడా ఉంటుందని ఊహిస్తున్నారు. అనుష్కకు తమిళనాడులో కూడా మార్కెట్ ఉంది. అల్లూ అర్జున్‌కు మల్లూవుడ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. కథ చారిత్రకమైనదైనందున భాషాపరమైన ఎల్లలు ఉండవు. ఇవే రుద్రమదేవికి కలిసొచ్చే అంశాలని గుణశేఖర్ ఆశిస్తున్నారు. తెలుగు తెరపై అతిపెద్ద చారిత్రక చిత్రం ఇది. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం. ఫస్ట్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీ. కేవలం రీ రికార్డింగ్కే 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మొట్ట మొదటి సినిమా. ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. అన్నీంటికీ మించి గుణశేఖర్ ధైర్యం ఉంది. టాలీవుడ్లో ఏ బిగ్ ప్రొడ్యూసర్ చెయ్యని సాహసం ఇది. హిస్టరీని రికార్డ్ చేసి రికార్డులు కొల్లగొట్టిన చిత్రాలు తెలుగలో తక్కువే. రుద్రమదేవి వీరగాథ తెలుగు ప్రజలకు విధితమే. అయితే, రుద్రమ వీర రసాన్ని బుల్లితెరపై చూశాంగానీ, బిగ్ స్కీన్ పై ఇంతవరకూ చూసింది లేదు. ఆ విజువల్ వండర్ని గుణశేఖర్ చూపించబోతున్నారు. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఎన్నో స్కెచ్ లు వేశారు. కాకతీయ సామ్రాజ్యాన్ని, అప్పటి ఆభరణాల్నీ, కోటల్నీ తరణీ రమణీయంగా రూపొందించారు. ప్రభాస్ - అనుష్క యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తెరమీద కనిపించి మూడేళ్లయింది. ఒక హీరోకి ఇది చాలా పెద్ద గ్యాప్. అది కూడా మిర్చిలాంటి ఒక సూపర్ హిట్ కొట్టిన తర్వాత సినిమా లేదు. తనను ఛత్రపతిగా చూపించి మాస్ ఇమేజ్ తెచ్చిన రాజమౌళికి కెరీర్ రాసిచ్చినంత పనిచేశానే ప్రభాస్. అడిగినంత బరువు పెరిగాడు. నచ్చినంత కండలు తిప్పాడు. జక్కన్న ప్రాజెక్టు ఇంత క్రేజీగా మారడానికి సగం కారణం కూడా ప్రభాసే. జేజమ్మగా అనుష్క ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అదే ఆమెకు చరిత్రాత్మక పాత్రలు దక్కేలా చేసింది. అనుష్కకు కూడా తెలుగులో మిర్చి తర్వాత సినిమా లేదు. ఒక పక్క బాహుబలిలో హీరోయిన్గా, మరో పక్క రుద్రమదేవిలో టైటిల్ రోల్ చేస్తూ ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మునిగిపోయింది. అందరికీ ఒక టెన్షన్ అయితే, అనుష్కకు డబుల్ ధమాకా. రాజమౌళి - గుణశేఖర్ ఈగ సినిమా జులై 5, 2012 లో రిలీజైంది. రాజమౌళి సినిమా రాక దాదాపు మూడు సంవత్సరాలు. జక్కన్న మార్క్ సినిమా కోసం అతని స్టాంప్‌ను తెరమీద చూడటం కోసం తెలుగు ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మగధీర, ఈగ ఈ రెండు ప్రయోగాల తర్వాత అంతకు మించిన ప్రయోగం రాజమౌళి చేస్తున్నారు. రుద్రమదేవి కోసం గుణశేఖర్ పట్టువదలని విక్రమార్కుడయ్యారు. నిద్రహారాలు మాని తన స్వప్నాన్ని నిజం చేసుకుంటున్నారు. తన లాస్ట్ మూవీ నిప్పు రిలీజై 3 సంవత్సాలు దాటింది. ఇంతకాలం గుణశేఖర్ గడియారాన్ని చూసుకోలేదు. ప్రతి ఘడియా రుద్రమదేవి గురించే ఆలోచించారు. దాని కోసమే శ్రమించారు. తన గత సినిమాలు ఓ ఎత్తైతే, రుద్రమదేవి మరో ఎత్తు. నిజానికి బాహుబలి బలమెంతో, రుద్రమదేవి పవరెంతో ఈ సమ్మర్‌కే తేలిపోవాలి. కానీ, ఎంత కష్టపడి పనిచేసినా ఈ చిత్రాలు వేసవి మిస్సయ్యాయి. త్వరలో రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ హిస్టారికల్ విజువల్ వండర్స్ ప్రేక్షకుల ఎదురుచూపులకు ఎంత ప్రతిఫలమిస్తాయో చూడాలి. -
ఆ హీరోయిన్ల నుంచి...ఎంతో నేర్చుకున్నా!
బుధవారం మధ్యాహ్నం 3 గంటల వేళ... హైదరాబాద్‌లో సూర్య ప్రతాపంతో వీధులు వేడెక్కి ఉన్నాయి. ఉదయం నుంచి పుట్టినరోజు హంగామా... ‘ట్విట్టర్’ రంగప్రవేశపు ఆర్భాటం... ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా రిలీజు హడావిడి... వీటన్నిటి మధ్య హీరో అల్లు అర్జున్‌కు క్షణం తీరిక లేదు. ‘గీతా ఆర్ట్స్’ కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో వేచి ఉన్న అభిమానులను ఆత్మీయంగా పలకరిస్తూ, తరువాతి చిత్రాల తాలూకు కథల గురించి ఇద్దరు ప్రముఖ దర్శకులతో చర్చకు సిద్ధమవుతూనే, సినిమా రిలీజు వేడి... పత్రికల్లోని వార్తల వాడిని తట్టుకుంటూ, వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారీ స్టైలిష్ స్టార్. మనసు పెట్టి చేసిన భారీ బడ్జెట్ చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మొదలు ‘రుద్రమదేవి’లో ముఖ్య పాత్ర, సినిమాతో నేర్చుకున్న అంశాల దాకా అనేక విష యాలపై మనసులోని మాటలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు... ‘అత్తారింటికి దారేది-2’ అంటూ ‘సన్నాఫ్..’పై వ్యాఖ్య వినిపిస్తోంది. ఇంటర్నెట్లో ఏవేవో రాస్తుంటారు. దానికీ, దీనికీ పోలికే లేదు. ‘అత్తారింటికి’లానే ఇదీ సకుటుంబ వినోద తరహా చిత్రం కావడంతో పోలిక తెస్తున్నారు. మంచి కథ కుదిరింది. చేశాం. అంతే. మరి, సన్నాఫ్ సత్యమూర్తికీ, సన్నాఫ్ అరవింద్‌కీ పోలికలు, తేడాలు? సన్నాఫ్ సత్యమూర్తికీ, సన్నాఫ్ అల్లు అరవింద్‌కీ పెద్ద తేడా లేదు. నిజం చెప్పాలంటే, ‘ఖుషి’ సూపర్‌హిట్ తర్వాత పవన్‌కల్యాణ్ గారిని కలిసినప్పుడు ‘నువ్వేంటో నీ సినిమా అదే’ అని నాతో అన్నారు. అప్పటికి నా ‘ఆర్య’ సినిమా వచ్చింది. నాకూ, దానికీ పోలిక లేదే అనుకున్నా. తరువాత నాకు అర్థమైంది ఏమిటంటే, మన భావోద్వేగాలు, ఆలోచన లకు తగ్గ కథలనే మనం ఏరుకుంటామని. ‘ఆర్య’ కథకు నా వయసు, ‘రేసుగుర్రం’ కథకు మా ఇంట్లోని అన్నదమ్ముల బంధం, ఇప్పుడీ సినిమాకు నాన్నతో కొడుకు అనుబంధం లాంటివి కనెక్టయ్యాయి. ఇందులో కొంత మా ఇంట్లోనే చిత్రీకరించాం. త్రివిక్రమ్ అడగగానే, తాముండే గ్రౌండ్ ఫ్లోర్‌లోనే షూటింగ్‌కు నాన్న గారు ఒప్పుకున్నారు. మీ గత చిత్రాల్లో కన్నా ఈ సారి బాగా స్టైల్ పెంచినట్లున్నారు! (నవ్వేస్తూ...) ఇటీవల వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో...’ సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. ‘రేసు గుర్రం’లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ముగ్గురు హీరోయిన్లున్నారు. అప్పుడు ‘ఇద్దరమ్మాయిలతో...’ అయితే, ఇప్పుడు ‘ముగ్గురమ్మాయిలతో’నా? (నవ్వేస్తూ...) ఏకకాలంలో ముగ్గురమ్మాయిలతో షూటింగ్ లేదు. ఉండి ఉంటే, ఆ షాట్ ఎప్పటికీ తెమలదేమో! (మళ్ళీ నవ్వేస్తూ...) జోక్‌గా అలా అంటున్నాను కానీ, ఇప్పుడొస్తున్న యువ కథానాయికలు చాలా ప్రొఫెషనల్. నిజానికి, ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు ఎక్కువ కనిపిస్తారు. వారితో పోలిస్తే, అదా శర్మ కనిపించేది తక్కువే. ఈ ముగ్గురు హీరోయిన్ల ప్రత్యేకత ఏమిటో? సినిమాలో ముగ్గురివీ ముఖ్యపాత్రలే. నిజజీవితంలో ఈ ముగ్గురు హీరోయిన్లకూ ఎవరి వ్యక్తిత్వం వారికుంది. సమంతలో ఒక విలక్షణ లక్షణం ఉంది. ఆమె ఇటు ఎంతో అందంగా కనిపిస్తూనే, అటు మంచి అభినయం పండించగలదు. ఇక, నిత్యామీనన్లోని అద్భుతమైన గుణం ఏమిటంటే, తనకు ఇవ్వజూపిన పాత్ర బాగుందా, లేదా అని మాత్రమే ఆలోచిస్తుంది. అంతేతప్ప, తనదే సినిమాకు ప్రధాన పాత్ర కావాలనీ, అలా మెయిన్ క్యారెక్టర్ కాకపోతే తన ఇమేజ్ పోతుందనీ భయపడదు. వెనుకాడదు. ఇక, అదాశర్మ ప్రతిభావంతురాలు. ఈ చిన్న వయసులోనే ఎంతో అద్భుతంగా అవతలివాళ్ళను అనుకరిస్తుంది. అంత మిమిక్రీ చేయగల అమ్మాయిని తొలిసారి చూశా. వీళ్ళతో వర్క వల్ల ఎంతో నేర్చుకున్నా. నిజంగానా? ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారేమిటి? నా దగ్గర పనిచేసేవాళ్ళను నేను బాగా చూసుకుంటూ ఉంటా. కానీ, సమంతను చూశాక, మన దగ్గర పనిచేసే సిబ్బందిని తనంత బాగా చూసుకోవాలని నేర్చుకున్నా. నిత్యా మీనన్‌ను చూశాక ఏ విషయంలోనైనా తగినంత మేరకు సరైన భయం పెట్టుకోవాలే తప్ప, అనవసరపు భయం పెట్టుకోకూడదని అర్థం చేసుకున్నా. ఉదాహరణకు, ఒక స్టెప్ వేయాలంటే నేర్చుకోకుండా కెమేరా ముందుకు వెళితే భయపడాలి. అది సరైన భయమే. కానీ, అంతా నేర్చుకొని వెళ్ళాక, సరిగ్గా చేస్తానో, లేదో అనే భయం అనవసరం. ఆత్మవిశ్వాసంతో వెళ్ళి, నేర్చుకున్నది అద్భుతంగా చేసేయడమే! ఇక, చాలా చిన్న వయసు అమ్మాయైన అదాశర్మను చూశాక, ఏ విషయంలో అయినా సరే వేగంగా నిర్ణయం తీసుకొనే ఆ వయసులోని లక్షణాన్ని ఎప్పటికీ వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. కొన్నేళ్ళ క్రితం దాకా నేనూ అలాగే ఉండేవాణ్ణి. త్రివిక్రమ్ పనితీరు ఎలా అనిపించింది? త్రివిక్రమ్ తో సినిమా అంటే చాలు నేను ఒప్పేసుకుంటా. ఆ తరువాతే స్క్రిప్టు వింటా. మా కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘జులాయి’ సమయంలోనే ఆ మాట చెప్పా. దానికే, ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. సెట్స్‌లో ఆయన ఎక్కువగా ఏదీ చెప్పరు. కాకపోతే, షూటింగ్‌కు వెళ్ళడానికి ముందే కథ, పాత్రల గురించి మాట్లాడతారు. ఆ పాత్రను అలా చేయాలి, ఇలా చేయాలని బాగా మాట్లాడుకుంటాం. సెట్స్ మీద పైకి కనపడని హోవ్ువర్క ఆయనది. ప్రపంచ సినిమా మీద ఆయనకున్న జ్ఞానం అపారం. ‘జులాయి’తో పోలిస్తే, ఇప్పుడు నేను, ఆయన ఎదిగాం. మునుపటి కన్నా ఆయనలో వేగం, పరిణతీ పెరిగాయి. దర్శకత్వంలో అది స్పష్టంగా అర్థమైంది. ఇంతకీ, దర్శకుణ్ణి ఎంచుకొనేటప్పుడు మీరు చూసేది? ఆ దర్శకుడి మైండ్‌సెట్. అది చాలా ముఖ్యం. అతను మనతో సినిమా తీస్తున్నది డబ్బు కోసమా, ఖాళీ లేకుండా చూసుకోవడానికా, మరో దానికా అన్నది చూస్తాను. సరైన మైండ్‌సెట్‌తో వస్తే ఓ.కె.చెప్పేస్తా. నిజం చెప్పాలంటే, దర్శకులు రెండు రకాలు. మన నుంచి రాబట్టుకొనేవారు ఒక రకం. మనకు ఎంతో ఇన్పుట్స్ ఇచ్చేవారు రెండో రకం. త్రివిక్రవ్‌ు రెండో రకం దర్శకుడు. ‘జులాయి’కి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. అప్పటి నుంచి నటుడిగా క్రమంగా ఒక్కో పొరనూ చీల్చుకుంటూ, బాగా బయటకు వస్తున్నా. ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ చేశారనీ...? (మధ్యలోనే అందుకుంటూ) అదేమీ లేదు. ‘ఆర్య-2’, ‘వరుడు’, ‘వేదం’ చిత్రాల్లో నేను గతంలో చేశా. కానీ, దానివల్ల యువతరానికే దగ్గరవుతాను తప్ప, పిల్లలకూ, కుటుంబ ప్రేక్షకులకూ దూరమవుతున్నా. వెరసి, ఈ లిప్‌లాక్‌ల వల్ల వచ్చే లాభం కన్నా, కలిగే నష్టం ఎక్కువగా ఉంది. కథకు నిజంగా అవసరమైతే అవి చేయడం పెద్ద విషయం కాదు. అలా కానప్పుడు అనవసరమని లిప్‌లాక్‌లకు దూరంగా ఉండదలిచా. ఇంతకీ ఈ సినిమా ద్వారా మీరు పొందిందేమిటి? పోగొట్టుకున్నదేంటి? కొద్దిగా బరువైతే పెరిగాను. (నవ్వులు...). వస్త్రధారణతో సహా అనేక అంశాల్లో కొన్ని అనవసర భయాలు, ఆందోళనలు, అలవాట్లు వదిలేశాను. పెద్ద హీరో అయ్యుండీ ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా చేస్తున్నారే? ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటివి తెలుగు సినిమా ప్రమాణా లనూ, వాణిజ్య పరిమాణాన్నీ - రెంటినీ పెంచుతాయి. శంకర్ లాంటి వారు అలా చేయబట్టే, తమిళంలో వంద కోట్ల పెట్టుబడితో సినిమాలు తీయగలుగుతున్నారు. మనం కూడా ఇతర భాషా పరిశ్రమల మార్కెట్‌ను కూడా సంపాదించాలి. అందుకు మనకు ‘మగధీర’, ‘ఈగ’ లాంటివి దోవ చూపాయి. రానున్న ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ అలాంటివే. అవి బాగా ఆడాలి. అందుకే, నా వంతుగా గోన గన్నారెడ్డి పాత్ర చేశా. ఎవరెవర్నో దాటి ఆ పాత్ర మీకొచ్చినట్లుంది? దర్శక - నిర్మాత గుణశేఖర్‌తో నా కాంబినేషన్లో ‘వరుడు’ చిత్రం ఫ్లాపైనా, ఆయనపై నాకు అపారమైన గౌరవం ఉంది. ‘వరుడు’ ఆడలేదంటే దానికి కారణం - మా పొరపాటే తప్ప, నిర్లక్ష్యం కాదు. ‘రుద్రమదేవి’ 3-డి సినిమా. మన చరిత్రను చెప్పే సినిమా. అలాంటి 3డి చిత్రాలు ఆడితే, తెలుగు సినిమా సైజ్ కనీసం మరో 40 శాతం పెరుగుతుంది. ‘రుద్రమదేవి’ కథలో కీలకమైన గోన గన్నారెడ్డి పాత్ర ఎవరైనా పెద్ద హీరో చేస్తే బాగుంటుందనీ, అదనపు మార్కెట్ వస్తుందనీ ఆగింది. అది తెలిసి, నేనే ఆయనను సంప్రతించాను. నాకు తగ్గట్లు పాత్రను మలచగలనేమో ఆలోచించి చెబుతానన్నారు. కొద్దిరోజులాగి, అప్పుడు సరేనన్నారు. నేనూ ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేశా. ‘నేను తెలుగు భాష లెక్క... అక్కడా ఉంటా, ఇక్కడా ఉంటా’ అని దాన్లో డైలాగ్. మీ ఉద్దేశం రెండు రాష్ట్రాలనా? అటు అడవిలోనూ, ఇటు కోటలోనూ అని కథా పరంగా అర్థం. (నవ్వేస్తూ...) రెండు తెలుగు రాష్ట్రాలనీ అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులంతా నాకు కావాల్సినవాళ్ళే! మలయాళంలో డబ్బింగ్‌తో మీరు 3 రాష్ట్రాల్లో ఉన్నారు... మనం, మన సినిమా ఒక మెట్టు ఎక్కడమంటే అదే! ‘సన్నాఫ్...’ మలయాళ డబ్బింగ్ కూడా రెండు వారాల్లో రిలీజవుతోంది. నాకు నేరు మలయాళ చిత్రాలూ చేయాలని ఉంది. సరైన కథ, దర్శకుడొస్తే చేస్తా. హిందీలోనూ అంతే. ‘ఏబీసీడీ’లో చిన్న పాత్రకు అడిగారు కానీ చేయనన్నా. ‘సన్నాఫ్..’ ఆడియోలో చిరంజీవిని దాసరి ప్రస్తావిం చకపోవడం అనేక వ్యాఖ్యలకు తావిచ్చింది? సహజంగానే బయట విమర్శలు వస్తాయి కదండీ! ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత పవన్ కల్యాణ్ ప్రత్యేక స్టయిల్ తెచ్చారని ఆయన అన్నారు. కొన్నిసార్లు వేదికపై కొన్ని పేర్లు చెప్పడం మర్చిపోతుంటాం. ఒకసారి ఆడియో వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పడం నేనే మర్చిపోయా. దాసరి గారు అలాగే మర్చిపోయి ఉండవచ్చు. అది కావాలని జరిగిందో, అనుకోకుండా జరిగిందో నాకు తెలియదు. ఏమైనా, దాసరిగారు మా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన్ని మేము గౌరవించాలి. అంతే! దానికి వచ్చిన విమర్శల వల్లనేనా మీరు వరంగల్‌లో ‘రుద్రమదేవి’ ఆడియోలో చిరంజీవి పేరు తెచ్చి, ఆ చెట్టు నీడన పెరిగామన్నారు? అవును. కచ్చితంగా అందుకే అన్నాను. ఆ మాట నిజమే కదా! తకాలానికి ట్విట్టర్లో ఖాతా తెరవడమెలా ఉంది? అభిమానులకు దగ్గరవడం ఆనందంగా ఉంది. కానీ, రావడమే చాలా ఆలస్యమైంది. మా తమ్ముడు అల్లు శిరీష్ నన్ను మొదటి నుంచి బలవంతం చేస్తున్నా ఇవాళ్టికి కుదిరింది. చాలామందిలా మీ ట్విట్టర్‌ను వేరెవరో హ్యాండిల్ చేస్తారా? నా విషయాలు, ఫోటోలు పంచుకోవడానికి ట్విట్టర్ వేదిక. నా పేరు మీద వచ్చేది కాబట్టి, స్వయంగా నేనే చూసుకుంటా. మీ అబ్బాయి అయాన్‌కు ఈ మధ్యే ఏడాది నిండింది కదా. తండ్రి బాధ్యతల్లో ఎలా ఉన్నారు? పిల్లవాడు పుట్టాక సహజంగానే నాలో కొంత మార్పు వచ్చింది. మా వాడి మొదటి పుట్టినరోజుకని ఈ మధ్యే సింగపూర్‌కు కుటుంబ సమేతంగా వెళ్ళాం. అక్కడే సరదాగా గడిపి, వచ్చాం. మీ తదుపరి చిత్రం ఏమిటి? దర్శకుడు బోయపాటి శ్రీనుతోనేనా? చర్చల్లో ఉన్నాం. కొలిక్కిరాగానే తక్షణ చిత్రమేంటో చెబుతా. త్రివిక్రమ్‌లో మీకు బాగా నచ్చిన విషయం? ‘నేను అనుకున్నది, చెప్పినది, రాసినదే జరగాలి’ అంటూ దాన్నే పట్టుకొని కూర్చొనే రకం కాదాయన. అవతలివాళ్ళు చెప్పింది వింటారు. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తారు. అవసరమైతే తాను అప్పటి దాకా అనుకున్నది మార్చేసుకుంటారు. ఆ ఓపెన్ మైండ్ ఆయనలోని గొప్ప లక్షణం. అది నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఆయనలోని విద్వత్తును నటీనటులందరూ ఎంతో గౌరవిస్తారు. -
రుద్రమదేవి ఆడియో రిలీజ్ హైలెట్స్
-
అందుకే కడియం రుద్రమదేవి ఫంక్షన్‌కు వెళ్లారు
హైదరాబాద్: రుద్రమదేవి చిత్ర ఆడియో విడుదలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని నన్ను కోరారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు తెలిపారు. అయితే తమ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఇంటర్వెల్ సమయంలో ప్రదర్శిస్తే... డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమానికి హాజరవుతారని వారికి హామీ ఇచ్చానని... తన ప్రతిపాదనకు వారు అంగీకరించారని... ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రుద్రమదేవి ఆడియో ఫంక్షన్‌కు హాజరయ్యారని వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు విలేకర్లతో మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిఒక్క సభ్యుడికి సభలో మాట్లాడే అవకాశం కల్పించామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సమావేశాలు పొడిగించాలని తమను ఏ పార్టీకి చెందిన వారు అడగలేదన్నారు. -
ఈ చిత్రానికి మేమందరం రాళ్లెత్తిన కూలీలం : గుణశేఖర్
‘‘చిన్నతనం నుంచి కాకతీయ రాజుల చరిత్రపై ఆసక్తి చూపించేవాణ్ణి. ‘రుద్రమదేవి’ చిత్ర నిర్మాణం నా లక్ష్యం. అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా నా ఒక్కడి ప్రతిభే కాదు. మొత్తం టీమ్ అంతా కష్టపడ్డాం. ‘రుద్రమదేవి’ అనే సినిమాకి రాళ్లెత్తిన కూలీలం మేం. తెలుగు ప్రజలందరూ ఈ చిత్రానికి భారీ విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అని గుణశేఖర్ అన్నారు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ రూపొందించిన చిత్రం ‘రుద్రమదేవి’. టైటిల్ రోల్లో అనుష్క నటించిన ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రునిగా రానా నటించారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను వరంగల్‌లో ఆవిష్కరించారు. ఈ వేడుకలో ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ - ‘‘కాకతీయుల చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడం గర్వంగా ఉంది. గుణశేఖర్ చారిత్రక నేపథ్యం గల సినిమాలు మరిన్ని తీయాలి. నాటి రుద్రమదేవి ఎలా ఉండేవారో తెలియదు కానీ, అలనాటి రుద్రమదేవిగా అనుష్క భువి నుంచి దివికి దిగి వచ్చినట్లుగా ఉన్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రం ఓ మంచి ప్రయత్నమనీ, ఘనవిజయం సాధించాలనీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిధర్‌రావు ఆకాంక్షించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ - ‘‘నాకు ఆడవాళ్లంటే అభిమానం. అందుకే ఈ చిత్రం చేశా. ఈ చిత్రానికి అనుష్కే హీరో. ఆమె చేయకపోతే ఈ సినిమా లేదు. కొంతమంది ధనార్జనే ధ్యేయంగా సినిమాలు తీస్తారు. కానీ, గుణశేఖర్ ఎంతో మమకారంగా తీస్తారు. ఆయన కోసమే ఈ సినిమా ఆడాలి. తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటే ఇలాంటి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఇక, చరిత్ర గురించి చెప్పాలి. చిరంజీవిగారు ఎండనకా వాననకా కష్టపడితే, ఆ నీడలో పైకొచ్చినవాళ్లం. అందుకే, నా మటుకు నాకు ఆయన తర్వాతే ఎవరైనా’’ అంటూ ‘నేనూ ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. తెలుగు భాష లెక్క’ అని ‘రుద్రమదేవి’లోని డైలాగ్ చెప్పి, ప్రేక్షకులను అలరించారు. కాకతీయులకే కీర్తి తీసుకొచ్చిన రాణి రుద్రమదేవి పాత్రలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అనుష్క అన్నారు. ఇంకా ఈ వేడుకలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణంరాజు, పరుచూరి గోపాలకృష్ణ, ‘దిల్’ రాజు, హంసానందిని తదితరులు పాల్గొన్నారు. నిత్యామీనన్, కేథరిన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, ఆర్ట్: తోట తరణి, కెమెరా: అజయ్ విన్సెంట్, సహనిర్మాతలు: నీలిమ, యుక్తా ముఖి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామ్‌గోపాల్. - సాక్షి ప్రతినిధి, వరంగల్ -
రుద్రమదేవికి ఇళయరాజ సంగీత సొబగులు
వెండితెర అద్భుత దృశ్యకావ్యం రుద్రమదేవికి సంగీత జ్ఞాని ఇళయరాజ పాశ్చాత్య సంగీత కళాకారులతో సంగీత సొబగులు అద్దుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న చారిత్రక కథా చిత్రం రుద్రమదేవి. ప్రముఖ నటులు అల్లుఅర్జున్, రాణా, కృష్ణంరాజు వంటి వారు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో నటిస్తున్న అనుష్క చుట్టూనే తిరిగే కథా చిత్రం రుద్రమదేవి. ఈ చిత్రంలో ఆమె వీర సాహస కృత్యాలు, కత్తిసాము, గుర్రపు స్వారి వంటి విన్యాసాలు చూడవచ్చు. వీరనారి రుద్రమదేవి పాత్రలో అనుష్క విజృంభించారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దీనికి 3డీ ఫార్మెట్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. వందకోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇళయరాజ హాలీవుడ్ సంగీత కళాకారులతో సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రంలోని పాటలన్నీ ఆధునిక బాణిలో ఉంటాయంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. చిత్రంలో అనుష్కతో పాటు నిత్యామీనన్, క్యాథరిన్ ట్రెసా అందాలొలికించనున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ ఏప్రిల్‌లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. -
రేపు ‘రుద్రమదేవి’ ఆడియో ఫంక్షన్
వరంగల్ కోటలో ఏర్పాట్లు పరిశీలించిన దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ ఖిలా వరంగల్ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాకతీయుల ఘన చరిత్ర, రుద్రమాదేవి పౌరుషాన్ని తెలుగుజాతి గర్వించే స్థాయిలో రుద్రమదేవి చిత్రం ద్వారా చాటిచెబుతామని ఆ సినిమా దర్శక, నిర్మాత గుణశేఖర్ అన్నారు. రుద్రమదేవి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ వరంగల్ మధ్యకోటలో ఆదివారం నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఖిలావరంగల్ కోటను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖిలావరంగల్ మధ్యకోట ఖుష్‌మహల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆదివారం సాయంత్రం 7 గంటలకు రుద్రమదేవి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ భారీ సెట్టింగ్‌ల మధ్య నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చిత్రం మొత్తం యూనిట్ సభ్యులతోపాటు సినీ హీరోరుు న్ ఆనుష్క రానున్నారని తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఈ సినిమాలో ముఖ్యంగా ఆరు పాటలు ఉంటాయని... మూడు పాటలను ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో శనివారం రిలీజ్ చేయనున్నామని, మిగిలిన మూడు పాటలు కోటలో విడుదల చేయనున్నట్లు వివరించారు. సాంకేతిక నిపుణులతో రూ.70కోట్ల భారీ బడ్జెట్‌తో రుద్రమదేవి సినిమా తీసినట్లు చెప్పారు. తాను 8వ తరగతిలో చదువు కున్న రుద్రమదేవి పాఠ్యాంశాన్ని సినిమాగా తీయాలనే సంకల్పంతోనే ఈ చిత్రాన్ని నిర్మించానన్నారు. తాను నమ్ముకున్న కథను తానే తీయాలని ప్రయత్నించి.. విజయం సాధించానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు అద్భుతంగా ఉన్నాయని వివరించారు. కాకతీయ చక్రవర్తుల శౌర్య పరాక్రమాలు, నాటి పాలన తీరును ఇందులో వివ రించినట్లు తెలిపారు. రుద్రమదేవి పుట్టుక నుంచి యుద్ధంలో వీరమరణం పొందే వరకు స్టిరియో క్రోమ్ త్రీడి రూపంలో చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. వరంగల్ డీఎస్సీ సురేంద్రనాథ్, మిల్స్కాలని సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పది దాటేసిన అనుష్క
నటి అనుష్క పదేళ్ల ప్రాయాన్ని దాటేసి పదకొండవయేట అడుగు పెట్టారు. ఏమిటీ ఆశ్చర్యంగా ఉందా? లేక నమ్మశక్యంగా లేదా? నమ్మాలండీ బాబూ. ఎందుకంటే ఇక్కడ చెప్పేది అనుష్క అసలు వయసు గురించి కాదు. ఆమె సినిమా వయసు గురించండీ. అందానికే కాదు అభినయానికీ నిలువెత్తు అద్దం అనుష్క. ప్రస్తుతం మంచి చరిష్మా ఉన్న పాత్రలు, చారిత్రాత్మక పాత్రలు చేయాలన్నా ముందుగా గుర్తొచ్చే నటి అనుష్కనే. అరుంధతి చిత్రంతోనే ఆమె నటిగా తనేమిటో నిరూపించుకున్నారు. మధ్యలో కొన్ని గ్లామర్ పాత్రలు చేసినా, తాజాగా రుద్రమదేవి, బాహుబలి వంటి భారీ చారిత్రాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ముఖ్యంగా రుద్రమదేవి చిత్రంలో కత్తిసాము, గుర్రపుస్వారి అంటూ యుద్ధభూమిలో కదం తొక్కే సాహస కృత్యాలు ప్రేక్షకుల్ని అబ్బుర పరుస్తాయంటున్నారు. టాలీవుడ్లో 2005లో సూపర్ అనే చిత్రం ద్వారా రంగప్రవేశం చేసి ఈయోగా సుందరి ఆ చిత్రంలో అందాలు బాగానే ఆరబోశారు. కోలీవుడ్‌లో రెండు అనే చిత్రంతో దిగుమతి అయ్యారు. ఆ చిత్రంలో అయితే ఈత దుస్తులతో దుమ్మురేపారు. ఇలా గ్లామర్‌తోనూ, పర్‌ఫార్మెన్స్‌తోను,అశేష అభిమానుల్ని పొందిన అనుష్క గురువారం నాటికి నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్నారు. ఈసందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలను తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
రుద్రమ్మదేవి ట్రయిలర్ విడుదల!
-
ఇదో అద్భుతం!
వీర వనిత రుద్రమదేవి పాత్ర చేయాలంటే అందుకు తగ్గ ఆహార్యం ఉండాలి. దక్షిణాదిన ఆ ఆహార్యం ఉన్న తార ఎవరు? అంటే ఎవరైనా అనుష్క పేరే చెబుతారు. రుద్రమదేవిగా అనుష్క ఎంత బాగున్నారో ఈ పాత్రకు సంబంధించిన లుక్ తెలియజేసింది. ఇక.. ఆ వీరవనితలా అనుష్క అలవోకగా కత్తి తిప్పుతూ శత్రువులను అంతం చేస్తే ఎలా ఉంటుంది? అనే ఊహాలకు తెరదించుతూ చిత్రదర్శక, నిర్మాత గుణశేఖర్ ప్రచార చిత్రం రూపంలో చిన్న శాంపిల్ చూపించారు. ఈ త్రీడీ ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. గుణ టీమ్ వర్క్స్‌పై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడుగా రానా కీలక పాత్రలు పోషించారు. ‘‘ఈ చిత్రంలో నటించడం అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నా. ఈ చిత్రం ఓ అద్భుతం’’ అని అనుష్క అన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ - ‘‘దేశంలోనే మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రంగా రూపొందించాం. ఎంతో కష్టపడి ప్రేక్షకులకు నచ్చే చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఫొటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, మాటలు: పరుచూరి బ్రదర్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్. -
రుద్రమ్మదేవి 3డి ట్రయిలర్ ప్రీమియర్ షో!
-
ఊపిరై...
నేడు ప్రపంచ వివాహ దినోత్సవం ప్రేమ అనే తాడుకి అనురాగమనే పసుపు పూసి... నమ్మకం, భరోసా అనే సూత్రాలను జతచేసి కట్టేదే తాళి. అది రెండు మనసులను పెనవేస్తుంది. రెండు జీవితాలను ముడి పెడుతుంది. పెళ్లి అన్న రెండక్షరాల సాక్షిగా... జన్మజన్మలకూ తెగిపోని బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. కష్టాలను కలసికట్టుగా అధిగమించడం నేర్పుతుంది. సమస్యల్లో సైతం ఒకరి చెంత ఒకరు నిలిచేలా చేస్తుంది. ఈ మాటలన్నీ అక్షర సత్యాలనడానికి సాక్ష్యం... సినీ రచయిత తోట ప్రసాద్, గీతల కాపురం. ప్రపంచంలోని ప్రతి విషయం గురించీ అనర్గళంగా మాట్లాడేంత జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రసాద్. ప్రపంచమంటే తన భర్తే అనుకునే అతి సాధారణ ఇల్లాలు గీత. వీరి ఇరవై ఆరేళ్ల ఆదర్శ దాంపత్యం గురించి ఈ ‘ప్రపంచ వివాహ దినోత్సవం’ రోజున చెప్పుకుని తీరాలి. ...::: సమీర నేలపూడి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి. ఐసీయూకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉంది ఒకావిడ. ముఖం నిండా దిగులు ముసురుకుని ఉంది. కళ్ల నిండా భయం కమ్ము కుని ఉంది. ఐసీయూలోంచి బయటకు వచ్చిన డాక్టర్ని చూస్తూనే లేచి నిలబడింది. కంగారుగా వెళ్లి ‘మావారు ఎలా ఉన్నారు’ అని అడిగింది. ‘హోప్స్ లేవమ్మా’ అనేసి డాక్టర్ వెళ్లిపోతుంటే నిశ్చేష్టురాలయ్యింది. ఎలా స్పందించాలో తెలియక, తాను విన్నది నిజమో కాదో అర్థం కాక కొయ్యబారిపోయింది. ఏ భార్యకైనా అంతటి కఠోర నిజాన్ని తట్టుకోవడం ఎలా సాధ్యపడుతుంది? కానీ గీత తట్టుకున్నారు. మృత్యు ఒడికి చేరువైన భర్తను కష్టపడి బతికించు కున్నారు. నాటి సంగతులు అడిగితే గీత కళ్లనుంచి అశ్రువులు జలజలా రాలిపడ్డాయి. ప్రతి కన్నీటి బొట్టు లోనూ భర్త మీద ప్రేమ కనిపించింది. ఆ ప్రేమే తనకు మళ్లీ ఊపిరి పోసిందంటారు ప్రసాద్. తమ సహచర్యం, ఇన్నేళ్లూ కలిసి సాగించిన జీవనయానం గురించిన విషయాలను నెమరు వేసుకున్నారు ఆ దంపతులిద్దరూ. సాహిత్యమే కలిపింది ‘143’ చిత్రానికి కథా సహకారాన్ని అందించిన తోట ప్రసాద్... ‘కంత్రి’, ‘బిల్లా’, ‘శక్తి’, ‘రామయ్యా వస్తావయ్యా’ తదితర సినిమాలకు స్క్రిప్ట్ అసోసియేట్‌గా పని చేశారు. ‘కుర్రాడు’, ‘వరుడు’, ‘ఆరెంజ్’, ‘పంచాక్షరి’ వంటి చలనచిత్రాలకు మాటలు అందించారు. ప్రస్తుతం ‘రుద్రమదేవి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రాలకు పని చేస్తోన్న ప్రసాద్‌కి... రచన అనే కళ పుట్టుకతోనే అబ్బింది. ఎదిగేకొద్దీ ఆ కళను తన తోనే అట్టిపెట్టుకున్నారు. ఇంటర్మీడియెట్‌కి వచ్చేసరికి ‘విపంచి’ పేరుతో ఆయన చేసే రచనలు అచ్చవడం మొదలయ్యింది. అప్పుడు ఆయనకు తెలియదు... తనలో ఉన్న ఆ కళ, తన జీవితానికే కళ తెస్తుందని! సాహిత్యాన్ని ప్రేమించే గీతని ప్రసాద్ రచనలు ఆకర్షించాయి. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లారు ఆయన్ని కలవడానికి. నాటి పరి చయంతో స్నేహితుల య్యారు. ఆయన తన ఆలోచనలు పంచుకునేవారు. ఆమె తన అభిప్రాయాలు వెల్లడించేవారు. మౌనంగా, డిగ్నిఫైడ్‌గా ఉండే ప్రసాద్‌ని గీత ఇష్ట పడ్డారు. కేరింగ్‌గా, కూల్‌గా ఉండే గీత మీద ప్రసాద్ మనసుపడ్డారు. అంతలో ప్రసాద్ రచనలు చదివిన దర్శకుడు ‘విజయ’ బాపినీడు చిరంజీవితో తాను చేయబోయే సినిమాకి స్క్రిప్టు వర్కు చేయ డానికి మద్రాస్ ఆహ్వా నించారు. ప్రసాద్ వెళ్లారు. కానీ ఎక్కడో భయం. సినిమాల్లోకి వెళ్లిపోతే తనకు గీతను ఇవ్వడానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించరేమోనన్న సంశయం. దాంతో సినిమాలు వద్దనుకుని విజయవాడ వెళ్లి జర్నలిస్టుగా చేరారు. తర్వాత పెద్దల అనుమతితో తన ప్రియసఖిని వివాహమాడారు. ‘గీత... నా అదృష్టరేఖ’ ప్రసాద్‌కి పిల్లలంటే ప్రాణం. ఆయనకు శ్రావ్యను కానుకగా ఇచ్చారు గీత. అయితే ఆమెకు బీపీ, డయా బెటిస్ రావడంతో మరో బిడ్డను కనే ప్రయత్నం చేయ వద్దని హెచ్చరించారు వైద్యులు. కానీ మరో బిడ్డ ఉంటే బాగుండన్న ఆశ ప్రసాద్ మనసులో బలంగా ఉండేది. తోబుట్టువులు లేకుండా తాను ఒంటరిగా ఉన్నట్టుగా తన కూతురు ఉండ కూడదనుకునే వారు. అది తెలుసు కున్న గీత మరో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడ్డారు. ప్రాణానికి ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించినా... తన భర్త మనసులోని చిరు ఆశను తీర్చడం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనుకున్నారు. మనోజ్ఞను ఆయన చేతుల్లో పెట్టారు. ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడు తుందన్న మాటను నిజం చేసి చూపించారు. అందుకే ప్రసాద్ అంటారు తన జీవితంలో తనకు దొరికిన అతి పెద్ద అదృష్టం గీత అని! ప్రేమ గెలిచిన క్షణం రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘ఆరెంజ్’ సినిమాకి పని చేస్తున్నప్పుడు ఓరోజు... ప్రసాద్ కాళ్లు నీరు పట్టి ఉండటం గమనించారు గీత. ఏమైంది అని అడిగితే పట్టించుకోలేదు ప్రసాద్. పట్టుబట్టి ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లిన గీతకు ఊహించని షాక్ తగిలింది. ప్రసాద్ రెండు కిడ్నీలూ పాడైపోయాయని, ఒకట్రెండు రోజుల కంటే ఎక్కువ బతకరని చెప్పేశారు డాక్టర్లు. ఒక్కసారిగా అంతా శూన్యమైపోయినట్టనిపించింది గీతకి. ధైర్యం చెప్పడానికి, సహాయ పడటానికి పెద్దలెవరూ లేరు. పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. దాంతో ఒంటరి పోరాటం మొదలు పెట్టారు. భర్తను బతికించు కోవాలని తపించారు. ఆయనకు కిడ్నీ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. బీపీ, షుగర్ ఉండటం వల్ల వీలు కాదని డాక్టర్లు అనడంతో తెలిసినవాళ్ళ నుంచి మూత్ర పిండదానం కోసం ఎంతో శ్రమపడ్డారు. ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించారు. రెండేళ్ల పాటు రేయింబ వళ్లూ నిద్రాహారాలు మాని సేవలు చేశారు. చివరికి ఆమె ప్రేమ గెల్చింది. మృత్యువు ఓడిపోయింది. అవన్నీ గుర్తుచేస్తే ప్రసాద్ కళ్లు చెమరుస్తాయి. ‘‘నన్ను బతికించుకోవడానికి దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని ఆరాటపడేది తను. తమిళనాడులోని రాయవెల్లూరు దగ్గర ఏదో ఊళ్లో యునానీ మందు ఇస్తారు, బాగా పని చేస్తుందని ఎవరో చెబితే, ఒక్కతే అక్కడికి వెళ్లిపోయి మందు తీసుకొచ్చేసింది. కిడ్నీ ఇవ్వడానికీ సిద్ధపడిపోయింది. డయాలసిస్ చేయించి ఇంటికి తీసుకు రాగానే ఒక్కోసారి ఆయాసం వచ్చేసేది. దాంతో నన్ను తీసుకుని మళ్లీ హాస్పిటల్‌కి పరుగెత్తేది. కూకట్‌పల్లిలోని మా ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపొలో ఆస్పత్రికి నన్ను తిప్పుతూనే ఉండేది. బ్యాంక్ బ్యాలెన్సులు అయిపోయాయి. నగలన్నీ అమ్మేసింది. చివరకు ఆపరేషన్‌కు కాదు కదా, డయాలసిస్ చేయడానికి మూడు వేలు కూడా లేని పరిస్థితి వచ్చేసింది. అయినా ఎలాగోలా నన్ను బతికించుకోవాలని ఆరాటపడింది. అదృష్టంకొద్దీ సినీ పరిశ్రమలోని వారంతా కలసి మమ్మల్ని ఆదుకున్నారు. లేదంటే ఇంకా ఎంత కష్టమైనా పడేది. ఏం చేసయినా నన్ను బతికించుకునేది. తన ప్రేమ గురించి తెలుసు కనుకనే నేనిక బతకనని తెలియగానే నా కళ్ల ముందు తనే మెదిలింది. తనకు నేను తప్ప మరేమీ తెలియదు. తన కోసమైనా నన్ను బతికించమని దేవుడిని వేడుకున్నాను’’ అంటారు చెమ్మగిల్లిన కళ్లతో. ఒకప్పుడు యముడితో పోరాడి సతీ సావిత్రి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పుడు గీత చేసింది కూడా అంతకంటే తక్కువేమీ కాదు. దుఃఖాన్ని దిగమింగుకుని, బాధను గుండెల్లోనే అణచుకుని గుంభనంగా, గంభీరంగా తన పని తాను చేసుకుపోయారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ భర్తను మెల్లమెల్లగా మృత్యు వాకిటి నుంచి వెనక్కి తెచ్చుకున్నారు. అందుకే ‘తను నాకు భార్య కాదు, అమ్మ’ అంటారు ప్రసాద్. భార్య తల్లిలా మారినప్పుడు, భర్త బిడ్డలాగా ఆమె అనురాగంలో ఒదిగిపోయి నప్పుడు... ఆ దాంపత్యం ఆదర్శ దాంపత్యం అవుతుంది. వివాహ బంధానికి విలువ మరింత పెరుగుతుంది. అందుకు ఒక సాక్ష్యం... ఈ ఇద్దరు! భార్యాభర్తల మధ్య ఇష్టం ఉండాలి. భాగస్వామిని మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు, తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇష్టపడగలుగుతాం. నేను ఇంట్లో ఏమీ పట్టించుకోను. ఇంటికి సంబంధించి ఏ విషయమూ తెలియదు నాకసలు. కానీ తను నన్ను విసుక్కోదు. ‘ఎందుకు పట్టించుకోవు’ అని అడగదు. ఎందుకంటే తనకి నేనంటే ఇష్టం. అందుకే నేను ఎలా ఉన్నా ఆమెకు కోపం రాదు. అలా ఇష్టాన్ని పెంచుకోకపోవడం వల్లే ఇప్పుడు చాలామంది జంటల మధ్య మనఃస్పర్థలు వస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు నిందించుకుని విడాకుల వరకూ వెళ్లిపోతున్నారు. ఒక్కసారి మీ భార్యని/భర్తని నిష్కల్మషంగా ఇష్టపడి చూడండి. తనని వదిలిపెట్టాలన్న ఆలోచన మీ మనసులోకి రానే రాదు. - తోట ప్రసాద్, సినీ రచయిత -
రామప్పలో... రుద్రమదేవి
వరంగల్: రామప్ప దేవాలయంలో శనివారం ఉదయం నుంచి రుద్రమదేవి చిత్ర కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అనుష్క, రానా, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, సుమన్, జయప్రకాశ్ రెడ్డిలతో పాటు అల్లు అర్జున్, నిత్యామీనన్‌లు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 'ఒక్కడు'లాంటి బ్లాక్ బస్టర్ చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ అంతటి స్థాయి ఘనవిజయాన్ని సొంతం చేసుకోలేదు. టాలీవుడ్లో క్రియేటివ్ డెరైక్టర్‌గా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ 'రుద్రమదేవి' చిత్రంతో మళ్లీ పూర్వ వైభం కోసం ప్రయత్నిస్తున్నాడు. దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా గుణశేఖర్ ఈ సినిమాకు వ్యవహరించడం విశేషం. దాదాపు రూ.85 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. -
సినీ దర్శకుడు గుణశేఖర్‌పై చెక్‌బౌన్స్ కేసు
సాక్షి, హైదరాబాద్: రుద్రమదేవి సినిమా దర్శక నిర్మాత గుణశేఖర్‌పై సినీనటుడు సుమన్ చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సుమన్ గురువారం నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది. రుద్రమదేవి సినిమాలో నటించినందుకు ప్రతిఫలం (రెమ్యూనరేషన్)లో భాగంగా గుణశేఖర్ రూ. 5 లక్షల చెక్కు ఇచ్చారని, ఆయన బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కు బౌన్స్ అయిందని సుమన్ పేర్కొన్నారు. దీనిపై వివరణ కోరినా గుణశేఖర్ స్పందించకపోవడంతో.. కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. -
వేసవికే ‘రుద్రమదేవి’ : గుణశేఖర్
ఇంద్రకీలాద్రి : ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం గుణశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించిన రుద్రమదేవి చిత్రం విజయం సాధించాలని దుర్గమ్మను కోరుకున్నానన్నారు. తొలుత సంక్రాంతికి విడుదల చేయూలను కున్నామని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వేసవికి వారుుదా వేశామన్నారు. మరో రూ.1.90 లక్షల బకాయిల వసూలు ఇంద్రకీలాద్రి దిగువన కొబ్బరికాయలు, పూజా సామాగ్రితో పాటు స్పాట్ ఫొటోలు తీసే వారి నుంచి దేవస్థానానికి రావాల్సిన బకాయిలను శుక్రవారం వసూలు చేశారు. మొత్తం రూ.1.90లక్షల వసూలైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
ఒళ్లంతా బంగారమే!
‘రుద్రమదేవి’ చిత్రంలో ఓ ఎపిసోడ్లో అనుష్క గెటప్ ఇది. ఇందులో ఆమె ఒళ్లంతా బంగారమే. అదీ... మేలిమి బంగారం. ఆ నగల విలువే 5 కోట్ల రూపాయలు. ‘జోథా అక్బర్’ అనే హిందీ సినిమా తర్వాత నిజమైన బంగారు ఆభరణాలు వాడిన చారిత్రక చిత్రం ఇదే. స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
ధీరోదాత్తుడు
కాకతీయ చరిత్రలో ‘నిడవర్ద్యపురం’(నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రునిది కీలక భూమిక. ధీరోదాత్తుడే కాక, అద్భుతమైన కళాభిమాని చాళుక్య వీరభద్రుడు. రాణీరుద్రమతో తనది పవిత్రమైన బంధం. అనుష్క ప్రధాన పాత్రధారిణిగా, గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రుద్రమదేవి’ చిత్రంలో చాళుక్య వీరభద్రునిగా దగ్గుబాటి రానా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా చాళుక్య వీరభద్రునిగా రానా ఫస్ట్‌లుక్‌ను శనివారం మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘రానా శారీరక భాషకు తగ్గ పాత్ర ఇది. ఇందులో అన్ని రసాలనూ రానా అద్భుతంగా పలికించాడు. ముఖ్యంగా అనుష్క, రానాల మధ్య ప్రణయ సన్నివేశాలు చిత్రానికి హైలైట్. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఇళయరాజా, కెమేరా: అజయ్ విన్సెంట్, కళ: తోట తరణి, కూర్పు: శ్రీకర ప్రసాద్, పాటలు: సిరివెన్నెల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్, సమర్పణ: రాగిణీ గుణ. -
లక్నవరం చెరువును ఎవరు తవ్వించారు?
మొదటి బేతరాజు రాజ్యస్థాపనతో (క్రీ.శ.1000) ప్రారంభమైన కాకతీయుల పాలనకు క్రీ.శ. 1199లో మహాదేవరాజు మరణంతో తెరపడే పరిస్థితులు ఎదురయ్యాయి. దేవగిరి యాదవరాజు జైతుగీకి బందీ కావడం వల్ల కాకతీయ రాజు గణపతిదేవుడు పాలనను కొనసాగించలేకపోయాడు. ఇతడు దాదాపు 12 ఏళ్ల పాటు దేవగిరిలోనే బందీగా ఉన్నాడు. రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని ఈ సంక్షోభం నుంచి రక్షించాడు. అందువల్ల ఇతడికి ‘కాకతీయ రాజ్య ప్రతిష్ఠాపనాచార్య’ అనే బిరుదు వచ్చింది. ఇతడు రేచర్ల రెడ్డి కుటుంబానికి చెందినవాడు. మహాదేవుడి దగ్గర సేనాధిపతిగా చేశాడు. రాజ్యాధికారానికి ఏ మాత్రం ఆశపడకుండా గణపతిదేవుడికి సేనాధిపతిగా ఉండి కాకతీయుల రాజ్యాన్ని గట్టెక్కించాడు. గణపతిదేవుడి నడవడికను గమనించిన జైతుగీ అతడిని విడుదల చేసి కాకతీయ రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు. ఈ వివరాలు యాదవరాజైన రామచంద్రదేవుడి ‘దేవగిరి శాసనం’ ద్వారా తెలుస్తున్నాయి. కాకతీయులు గణపతిదేవుడు (క్రీ.శ. 1199-1263): ఇతడు కాకతీయులందరిలో సుప్రసిద్ధుడు. రేచర్ల రుద్రుడు నిలిపిన రాజ్యాన్ని విధేయత, విశ్వసనీయతతో గణపతిదేవుడు నలుదిక్కులా విస్తరించాడు. అప్పటికే చాలామంది కాకతీయుల సామంతరాజులు రాజ్య సంక్షోభాన్ని ఆసరా చేసుకొని స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. మల్యాల చౌడ సేనాని నాయకత్వంలో కాకతీయులు దివిసీమను ఆక్రమించారు. దివిసీమ రాజు పిన్నచోడుడు. అతడి కుమార్తెలు నారాంబ, పేరాంబను గణపతిదేవుడు వివాహం చేసుకున్నాడు. పిన్నచోడుడి కుమారుడైన ‘జాయపసేనాని’ని ‘గజసాహిణి’గా నియమించాడు. జాయాపసేనాని ‘నృత్తరత్నావళి’ అనే గ్రంథాన్ని రచించాడు. ‘పేరిణి’ నృత్య రూపాల గురించి ఈ గ్రంథంలో తెలిపాడు. మల్యాల చౌడ సేనానిని ‘చాముండరాయుడి’గా కూడా పిలుస్తారు. ఇతడి నాయకత్వంలోనే కాకతీయ సైన్యం వెలనాడును పాలిస్తున్న పృథ్వీశ్వరుడిని ఓడించింది. వెలనాటి వంశం పూర్తిగా అంతరించింది. చోళ రాజైన మొదటి మనుమసిద్ధి కుమారుడు తిక్కభూపాలుడు. నెల్లూరును పాలిస్తున్న నల్లసిద్ధి, తమ్ముసిద్ధిపై దాడి చేసిన గణపతిదేవుడు వారిని తొలగించి తిక్కభూపాలుడిని (తిక్కసిద్ధి) సింహాసనం అధిష్టింపజేశాడు. దీనికి ప్రతిఫలంగా తిక్కసిద్ధి కాకతీయులకు ‘పాకనాటి’ని బహుమానంగా ఇచ్చాడు. కాకతీయ సేనాని ‘గంగసాహిణి’ని ఇక్కడ అధిపతిగా నియమించారు. తిక్కభూపాలుడు మరణించిన తర్వాత (క్రీ.శ. 1248) అతడి కుమారుడైన రెండో మనుమసిద్ధి పాలనలోకి వచ్చాడు. చోళరాజు మూడో రాజరాజు, కర్ణాటక రాజు వీర సోమేశ్వరుడి సహకారంతో విజయగండ గోపాలుడనే రాజు రెండో మనుమసిద్ధిపై దాడిచేశాడు. ఈ దాడిలో మనుమసిద్ధికి సామంత ప్రభువులుగా ఉన్న అక్కన, బయ్యన తిరుగుబాటు చేసి విజయగండ గోపాలుడికి సహాయం చేశారు. ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో ఒకరైన తిక్కన రెండో మనుమసిద్ధి ఆస్థానంలోనే ఉండేవారు. ఈయన మనుమసిద్ధి రాయబారిగా గణపతిదేవుడి ఆస్థానానికి వెళ్లి సహాయం అర్థించాడు. గణపతిదేవుడు ‘సామంతభోజుడు’ అనే సైన్యాధికారి నాయకత్వంలో కాకతీయ సైన్యాన్ని నెల్లూరుకు పంపాడు. అక్కన, బయ్యనను వధించిన కాకతీయ సైన్యం చోళరాజును, కర్ణాటక ప్రభువును, విజయగండ గోపాలుడిని ఓడించింది. క్రీ.శ.1250లో కాకతీయులు కాంచీపురాన్ని ఆక్రమించుకున్నారు. ఇది ‘వలమూరు’ యుద్ధంగా ప్రసిద్ధి కెక్కింది. రెండో మనుమసిద్ధిని నెల్లూరు రాజుగా, కాకతీయ సేనాని గంగమ సాహిణిని మార్జవాడి (కడప) ప్రాంతం అధిపతిగా నియమించారు. గణపతి దేవుడు కళింగ రాజ్య ఆక్రమణకు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు. పాండ్య రాజైన జటావర్మ సుందర పాండ్యుడు, వీర గండగోపాలుడు, కొప్పెర జింగుడు కలిసి మొదట కాంచీపురాన్ని, తర్వాత నెల్లూరును ఆక్రమించారు. మనుమసిద్ధికి సాయంగా వచ్చిన గణపతిదేవుడి కాకతీయ సైన్యాలు పరాజయం పాలయ్యాయి. క్రీ.శ. 1263లో జరిగిన ఈ ‘ముత్తుకూరు’ యుద్ధంలో రెండో మనుమసిద్ధి మరణించాడు. ఈ ఘోర ఓటమితో కుంగిపోయిన గణపతిదేవుడు రాజకీయ రంగం నుంచి నిష్ర్కమించాడు. కాకతీయుల కీర్తి ప్రతిష్టను దేశమంతా వ్యాపింపజేసిన గణపతిదేవుడి పాలన కాలానికి మంచి గుర్తింపు ఉంది. ఇతడి గురువు విశ్వేశ్వర శివదేవుడు. జాయపసేనాని వేయించిన చేబ్రోలు శాసనం గణపతిదేవుడి పాలన గురించి తెలియజేస్తోంది. బంగాళాఖాతం తీరంలో ఉన్న మోటుపల్లి రేవును వాణిజ్యానికి అనుగుణంగా అభివృద్ధి చేశాడు. విదేశీ వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ‘అభయ శాసనం’ అనే పేరుతో కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేశాడు. మోటుపల్లి రేవు అధిపతిగా ఉన్న సిద్ధయ్యదేవుడనే సేనానికి దీని పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాడు. రుద్రదేవుడు పునాది వేసిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేశాడు. కాకతీయ రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లు కోటకు క్రీ.శ. 1254లో మార్చాడు. పిల్లలమర్రి, పాలంపేట (రామప్ప), కొండపల్లి, నాగులపాడు, ఓరుగల్లులోని స్వయంభూ దేవాలయాలు గణపతిదేవుని కాలంలో నిర్మించిన గొప్ప శిల్పకళా నిలయాలు. రేచర్ల రుద్రుడి స్వయం పర్యవేక్షణలో నిర్మించిన పాలంపేటలోని రామప్ప దేవాలయం ముఖ్యమైంది. గణపతిదేవుడు వ్యవసాయాభివృద్ధికి రామప్ప, పాకాల, లక్నవరం, నెల్లూరు చెరువులను తవ్వించాడు. గణపతిదేవుడికి మగ సంతానం లేకపోవడం వల్ల పెద్ద కుమార్తె రుద్రమదేవిని సింహాసనమెక్కించి అతడు మరణించేంతవరకూ (క్రీ.శ. 1269) సహపాలన చేశాడు. రుద్రమాంబను చాళుక్య వీరభద్రుడు, చిన్న కూతురైన గణపాంబను కోట బేతరాజు వివాహమాడారు. వీరభద్రుడు ‘నిడదవోలు’ (పశ్చిమ గోదావరి) పాలకుడు. రుద్రమదేవి (1263-1289): తెలుగు ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి మహిళ రుద్రమదేవి. ‘రుద్రమహారాజ’ అనే బిరుదుతో కాకతీయ సింహాసనాన్ని అధిష్టించారు. ఈమె పాలన మొత్తం యుద్ధాలతోనే గడిచింది. మహిళా పాలనను సహించలేని అనేక సామంతరాజులు, చిన్న చిన్న ప్రభువులు తిరుగుబాటు చేశారు. ఈ బలహీనతను గమనించిన శత్రురాజులు కాకతీయ రాజ్యంపై దండెత్తడం ప్రారంభించారు. వీరిలో ముఖ్యులు పాండ్యులు, యాదవులు, తూర్పు గాంగులు (కళింగులు). కళింగ రాజైన భానుదేవున్ని కాకతీయ సైన్యం పొట్ట పోతినాయకుడు ప్రోలయ నాయకుడు అనే సేనానుల నాయకత్వంలో ఓడించారు. దేవగిరి యాదవరాజు మహాదేవుడు వరంగల్పైకి దండెత్తగా, రుద్రమదేవి స్వయంగా పోరాడి అతడిని ఓడించారు. ఈ విజయంలో కాకతీయ సేనాని గోనా గన్నారెడ్డి పాత్ర గణనీయమైంది. ఈ యుద్ధ విజయానికి చిహ్నంగా రుద్రమదేవి ‘రాయగజకేసరి’ అనే బిరుదు పొందారు. ఈ విషయాలు విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర చరిత్ర, రుద్రమదేవి వేయించిన బీదర్ శాసనం ద్వారా తెలుస్తున్నాయి. గణపతి దేవుడి వద్ద సేనానిగా పనిచేసిన ‘గంగమసాహిణి’ మూలపురుషుడిగా ‘కాయస్థ వంశ’ పాలన ఆరంభమైంది. వీరి రాజధాని వెల్లూరు (తమిళనాడు). వీరి వారసులైన కాయస్థ జగదేవుడు, కాయస్థ త్రిపురాంతకుడు రుద్రమకు విధేయులుగానే ఉన్నారు. కానీ కాయస్థ రాజైన అంబదేవుడు స్వాతంత్య్రాన్ని కోరుకొని కాకతీయులపై తిరుగుబాటు చేశాడు. ఇతడు పాండ్యులు, యాదవరాజులతో స్నేహం చేస్తూ రుద్రమను ధిక్కరించి తూర్పు దక్షిణ ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. అంబదేవుడిని అణచడానికి మల్లిఖార్జునుడు అనే సేనాని నాయకత్వంలో రుద్రమదేవి స్వయంగా దండయాత్రకు వెళ్లారు. క్రీ.శ. 1289లో జరిగిన ఈ యుద్ధంలో రుద్రమ మరణించినట్లుగా తెలుస్తోంది. క్రీ.శ. 1289లో వేయించిన చందుపట్ల (నల్గొండ) శాసనం, క్రీ.శ. 1290లో అంబదేవుడు వేయించిన త్రిపురాంతక శాసనం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. రుద్రమ పాలనా కాలంలో వెనిస్ యాత్రికుడైన మార్కోపోలో మోటుపల్లి రేవును సందర్శించాడు. ఇతడు తన రచనల్లో కాకతీయరాజ్యం సుభిక్షంగా ఉందని వర్ణించాడు. మార్కోపోలోకు ‘పయోనీర్ ఆఫ్ ట్రావెల్స్’ అనే బిరుదు ఉంది. రుద్రమదేవి ఓరుగల్లు కోటకు మరమ్మతులు చేసి శత్రు దుర్భేద్యంగా మార్చారు. కాకతీయ సేనానులైన కాయస్థ జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, గోన గన్నారెడ్డి, ప్రసాదిత్య నాయకుడు, రుద్రమ నాయకుడు, బెండమూడి అన్నయ్య రుద్రమదేవికి అండగా ఉంటూ ఆమె విజయాలకు నాయకత్వం వహించారు. రుద్రమదేవికి మగ సంతానం లేదు. ముమ్మడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముమ్మడమ్మ, కాకతీయ యువరాజు మహాదేవుడి కుమారుడైన ప్రతాపరుద్రుడు (రుద్రమదేవి మనువడు) కాకతీయ సింహాసనాన్ని అధిష్టించాడు. ప్రతాపరుద్రుడు (1289-1323): ఇతడిని రెండో ప్రతాపరుద్రుడిగా, రుద్రదేవుడిని మొదటి ప్రతాపరుద్రుడిగా పిలుస్తారు. కాకతీయ పాలకుల్లో చివరివాడైన ఇతడి కాలంలో సామ్రాజ్యం ఉన్నత స్థితికి చేరుకుంది. ఇతడు కాయస్థ అంబదేవుడిని, యాదవ రాజులనూ ఓడించాడు. కాకతీయ సామంతరాజైన గోన విఠలుడు రాయచూరు దుర్గాన్ని నిర్మించాడు. వర్ధమాన పురం శాసనం (మహబూబ్‌నగర్) ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి. దక్షిణ భారతదేశంపై ముస్లింల దండయాత్ర మొదటిసారిగా యాదవరాజుల రాజధాని ‘దేవగిరి’పై క్రీ.శ. 1295లో జరిగింది. యాదవ రామచంద్రదేవుడు లొంగిపోయి ఢిల్లీ సుల్తాన్‌కు కప్పం చెల్లించడానికి అంగీకరించాడు. క్రీ.శ. 1303లో తురుష్కుల చూపు ఓరుగల్లుపై పడింది. అప్పటి నుంచి క్రీ.శ. 1323 వరకు ఐదుసార్లు ముస్లిం రాజులు కాకతీయులపై దండయాత్ర చేశారు. కాకతీయులపై దండెత్తిన మొదటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. క్రీ.శ. 1303లో మాలిక్ ఫకృద్దీన్ జూనా నాయకత్వంలో ఢిల్లీ సైన్యాలు బెంగాల్ మీదుగా ఓరుగల్లుపై దాడి చేశాయి. ఈ సైన్యాన్ని ఉప్పరపల్లి (కరీంనగర్) వద్ద కాకతీయ సైన్యం ఓడించింది. ప్రతీకారంతో ఉన్న అల్లావుద్దీన్ సైన్యం క్రీ.శ. 1309-10లో ‘మాలిక్ కపూర్’ నాయకత్వంలో ఓరుగల్లు కోటను ముట్టడించారు. 25 రోజుల ముట్టడి అనంతరం ప్రతాపరుద్రుడు లొంగిపోయి కప్పం చెల్లించడానికి అంగీకరించాడు. క్రీ.శ. 1311 లో అల్లావుద్దీన్ ఆదేశం మేరకు ప్రతాపరుద్రుడు పాండ్యులపై దండయాత్రకు పూనుకున్నాడు. ప్రతాప రుద్రుడు స్వయంగా నాయకత్వం వహించిన కాకతీయ సైన్యం కాంచీపురం వరకు సాగి ఆ ప్రాంతాన్నంతా ఆక్రమించుకుంది. అల్లావుద్దీన్ క్రీ.శ. 1316లో మరణించడంతో ప్రతాపరుద్రుడు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని ఢిల్లీ సుల్తాన్లకు కప్పం చెల్లించడానికి నిరాకరించాడు. క్రీ.శ. 1318లో ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ సైన్యం ‘ఖుస్రూఖాన్’ నాయకత్వంలో ఓరుగల్లుపై దాడి చేశాడు. అప్పుడు ప్రతాపరుద్రుడు భయపడి తిరిగి కప్పం చెల్లించడం ప్రారంభించాడు. ఢిల్లీ సింహాసనాన్ని తుగ్లక్‌లు (క్రీ.శ.1320 వశపర్చుకున్న తర్వాత ప్రతాపరుద్రుడు కప్పం ఎగవేశాడు. దీంతో కోపగించిన ఘీయాసుద్దీన్ తుగ్లక్.. కుమారుడైన మహ్మద్‌బిన్ తుగ్లక్ (జునాఖాన్)ను ఓరుగల్లుపైకి పంపాడు. క్రీ.శ. 1323లో జరిగిన ఈ దాడి ఢిల్లీ సింహాసన అంతర్గత కారణాల వల్ల సైన్యాలు వెనక్కి తగ్గి మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత జునాఖాన్ విస్తృత సైన్యంతో ఓరుగల్లు కోటపై దాడి చేసి దాన్ని ఆక్రమించాడు. ఢిల్లీ అమీరులైన ఖాదర్‌ఖాన్, ఖ్వాజాహజీ ప్రతాపరుద్రుడిని బందీగా ఢిల్లీకి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో సోమోద్భవ (నర్మదా) నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఓరుగల్లుపై కాకతీయుల పాలన అంతమైంది. కాకతీయ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల ఆధిపత్యంలోకి వెళ్లింది. ఈ విషయాలు ముసునూరి ప్రోలయ నాయకుని విలాస తామ్రశాసనం, అతడి తల్లి కలువచేరు శాసనం ద్వారా తెలుస్తున్నాయి. ప్రతాప రుద్రుడికి కూడా రాయగజకేసరి అనే బిరుదు ఉంది. ఇతడి ఆస్థాన కవి విద్యానాథుడు సంస్కృతంలో ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ అనే అలంకార గ్రంథాన్ని రాశాడు. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రతాపరుద్రుడు నాయంకర విధానాన్ని పునరుద్ధరించాడు. కేవలం పద్మనాయకులనే నాయంకరులుగా నియమించాడు. ఈ నాయంకరులు వారి ఆధిపత్యంలోని ప్రాంతాలకు అధిపతులుగా ఉంటూ బలోపేతమయ్యారు. ఈ వ్యవస్థ పాలనా వికేంద్రీకరణను తెలియజేస్తుంది. వీరికి సొంత సైన్యం ఉండేది. వీరి జాగీర్లలోని శాంతి భద్రతలను కూడా వీరే చూసేవారు. ప్రతాపరుద్రుడి కాలంలో 75 మంది నాయంకరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకతీయుల పాలన అనంతరం రెడ్డి, వెలమలకు చెందిన ఈ బలమైన నాయంకరులు రాజులుగా చెలామణిలోకి వచ్చారు. వీరు ఢిల్లీ సుల్తాన్లకు కప్పం చెల్లిస్తూ తమ ప్రాంతాలను స్వతంత్రంగా పాలించుకున్నారు. మాదిరి ప్రశ్నలు 1. ‘కాకతీయ రాజ్య ప్రతిష్ఠాపనాచార్య’ బిరుదు ఎవరిది? 1) రేచర్ల రుద్రుడు 2) కాపయ నాయకుడు 3) రేచర్ల ప్రసాదిత్యుడు 4) రుద్రమదేవి 2. రామప్ప దేవాలయాన్ని ఎవరి కాలంలో నిర్మించారు? 1) ప్రతాపరుద్రుడు 2) గణపతిదేవుడు 3) రుద్రమదేవి 4) రుద్రదేవుడు 3. రెండో మనుమసిద్ధి ఆస్థానకవి? 1) నన్నయ 2) ఎర్రన 3) పోతన 4) తిక్కన 4. ఏ యుద్ధంలో ఓడిపోవడం వల్ల గణపతి దేవుడు కుంగిపోయాడు? 1) వలయూరు 2) ముత్తుకూరు 3) నాగులపాడు 4) వెల్లూరు 5. రామప్ప, పాకాల, లక్నవరం చెరువులను తవ్వించిందెవరు? 1) మొదటి ప్రతాపరుద్రుడు 2) రెండో ప్రతాపరుద్రుడు 3) గణపతి దేవుడు 4) రుద్రదేవుడు సమాధానాలు 1) 1; 2) 2; 3) 4; 4) 2; 5) 3. -
అప్పట్లో ఏమీ తెలిసేది కాదు!
‘‘నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. దర్శకుడు ఎలా కోరుకుంటే అలా నటిస్తా. అలాగని నా శైలిని వదలుకోను. ఓ పాత్ర తీరుతెన్నులను దర్శకుడు చెప్పిన తర్వాత, ఒకవేళ నేనే ఆ పాత్ర అయితే ఎలా ఉంటానో.. ఊహిం చుకుని నటిస్తా’’ అంటున్నారు అనుష్క. ‘బాహుబలి, రుద్రమదేవి, లింగా, ఎన్నయ్ అరిందాల్’.. ఇలా తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారీ బ్యూటీ. ఇటీవల ఓ సందర్భంలో నటిగా రంగప్రవేశం చేసిన తొలినాళ్లను అనుష్క గుర్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణం ఎలా ఉంటుందనే విషయంపై తనకు కనీస అవగాహన ఉండేది కాదని అనుష్క చెబుతూ -‘‘సినిమాల్లోకి రాక ముందు నేను సాదా సీదా అమ్మాయిని. చాలా నిరాడంబరంగా ఉండేదాన్ని. అప్పట్లో మేకప్ వేసుకోవడం కూడా తెలియదు. ఇక కెమెరా యాంగిల్స్ గురించి ఏం తెలుస్తుంది! కానీ, ఓ నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత ఫిలిం మేకింగ్ గురించి ఒక అవగాహన వచ్చింది. అలాగే, కెమెరా యాంగిల్స్ కూడా తెలుసుకున్నాను. అప్పట్నుంచీ నాదైన శైలిలో నటించడం మొదలుపెట్టాను. తెరపై చూస్తున్న రెండున్నర గంటల సినిమా కోసం పడే కష్టం ఏ స్థాయిలో ఉంటుందో స్వయంగా తెలుసుకున్నాను’’ అని చెప్పారు. ‘పోటీలో ఉన్న ఇతర నాయికలు హిందీ సినిమాలు చేస్తున్నారు కదా! మీరెందుకు చేయడంలేదు?’ అనే ప్రశ్న అనుష్క ముందుంచితే -‘‘హిందీ సినిమా చేయాలి కాబట్టి అని చేస్తే బాగుండదు. బాలీవుడ్ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, ఏదీ కొత్తగా అనిపించలేదు. అందుకే ఒప్పుకోలేదు’’ అన్నారామె. -
ఊరికో చరిత్ర
ఘట్కేసర్ కీసరను రాజధానిగా చేసుకొని విష్ణుకుండినులనే రాజులు పరిపాలిం చారు. వారు తమ విద్యాసంస్థలను ఘటికలు అని పిలిచేవారు. ఘట్కేసర్ సమీపంలో వారు కొన్ని ఘటికలను ఏర్పాటు చేశారు. దాంతో ఘటికేశ్వరంగా పేరొచ్చింది. అదే కాలక్రమంలో ఘట్‌కేసర్‌గా రూపాంతరం చెందింది అనేది పూర్వీకుల కథనం. ఇక్కడ మరో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న శివలింగాలను శ్రీరామ భక్తుడైన హనుమంతుడు విసిరేసినట్లు చెబుతారు. అలా విసిరేసిన శివలింగాల్లో ఒకటి వచ్చి ఈ ప్రాంతంలో పడిందంటారు. ఘటికల వద్ద ఉన్న ఈశ్వరుడు కాబట్టి ఘటకేశ్వరుడిగా పేరొచ్చిందని, రానురాను అక్కడే గ్రామం వెలియడంతో ఘటకేశ్వరంగా అనంతరం ఘట్‌కేసర్‌గా మారిందని పెద్దలు చెబుతుంటారు. ఏదులాబాద్ ఈ ప్రాంతంలో సుమారు 48 వరకు వివిధ ఆలయాలు ఉన్నాయి. వీటిలో కుబేరాలయం, శ్రీగోదాదేవి సమేత మన్నార్ రంగనాయకస్వామి దేవాలయాలకు సుమారు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. వీటిలో ఏదో ఒక దేవాలయంలో తరచూ పూజలు, ఉత్సవాలు జరుగుతుండేవి. అప్పుడు పాలించిన నైజాం నవాబులు పండుగను ‘ఈద్’ అని పిలిచేవారు. దాంతో ఈ ప్రాంతం కాస్తా ఈద్‌లాబాద్‌గా పేరుబడింది. కాలక్రమేణా ఏదులాబాద్‌గా మారింది. ప్రతాప్‌సింగారం ఓరుగల్లును రాజధానిగా చేసు కొని పాలించిన రాణీరుద్రమదేవి మనుమడైన ప్రతాపరుద్రుడు యేడాదికోసారి వేటకు వచ్చి కొంతకాలం ఇక్కడే గడిపేవాడట. దీంతో ఈ గ్రామానికి ప్రతాపసింగారంగా పేరొచ్చింది. ప్రతాపరుద్రుడు అశ్వాలతో కాచివానిసింగారం వద్ద దిగి నడుచుకుంటూ తన బలగాలతో వేటకు వచ్చేవాడట. తిరిగి కాచివానిసింగారం వద్ద గుర్రాలను ఎక్కి తన రాజధానికి తిరుగుపయనమయ్యేవాడట. ఈ కారణంగా అప్పట్లో కాచివాని సింగారాన్ని ఎక్కే సింగారంగా, ప్రతాప్‌సింగారంను దిగే సింగారంగా పిలిచేవారట. ముత్వెల్లిగూడ నైజాం పాలించిన కాలంలో కాచివానిసింగారం, ప్రతాప్‌సింగారం గ్రామాల్లోని కొన్ని వందల ఎకరాలను (జాగీర్లు) చూసుకోవడానికి నైజం ప్రభువు ముతవల్లీ (నిర్వాహకుడు)ని నియమించుకున్నాడు. ముతవల్లీ శిస్తు కింద పొలాల ద్వారా వచ్చిన ఫలసాయంలో కొంత భాగం నైజం నవాబుకు పంపేవాడు. ముతవల్లీ నివసించే గూడెన్ని ముతవల్లీగూడగా పిలిచేవారట. అదే కాలానుగుణంగా ముత్వెల్లిగూడగా మారింది. అవుశాపూర్ ఈ గ్రామానికి సమీపంలో ఓ జాగీర్ ఉండేది. ఆ జాగీర్ను నైజాం కాలం లో జమీలా అనే దొరసాని చూసుకునేదట. ఆమెకు సంబంధించిన అశ్వాలను జాగీర్‌కు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉంచేవారట. దాంతో ఈ ప్రాంతం అశ్వాల పురం తదనంతరం అశ్వాపు రంగా పేరుమారి చివరికి అవుశాపురంగా రూపాంతరం చెందింది. కాచివాని సింగారం ప్రతాపరుద్రుని అల్లుడైన కసురుడు కాచివాని సింగారంను పరిపాలిం చాడు. అందుకే ఆ గ్రామం కసురుని పేరుతో కాసవాని సింగారంగా.. తర్వాత రూపాం తరం చెంది కాచివాని సింగారంగా మారింది. కసురుడు మంచి వేటగాడని తన మామ ప్రతాపరుద్రునితో కలిసి వేటకు వెళ్లేవాడని చెబుతారు. -
రుద్రమదేవి మేకింగ్ వీడియో విదుదల
-
బర్త్‌డే గిఫ్ట్ కోసం వెయిటింగ్..!
-
తెలుగు వణిజులు
గణపతిదేవుని జైత్రయాత్రల వల్ల 12వ శతాబ్దిలో కోస్తాంధ్ర కాకతీయుల ఆధిపత్యంలోకి వచ్చింది. వరంగల్లు ఆంధ్రనగరి అయింది. 5వ శతాబ్దంలో అడుగంటిన విదేశీ వాణిజ్యం 10వ శతాబ్దికి మళ్ళీ పుంజుకుంది. కళింగపట్టణం (ముఖలింగం), భీమునిపట్టణం, కోకండిపర్రు (కాకినాడ), నరసాపురం, హంసలదీవి, మోటుపల్లి, కాల్పట్టణం (ఒంగోలు వద్ద పాదర్తి), కృష్ణపట్నం, గండగోపాలపట్టణం (పులికాట్) మొదలైనవి ప్రముఖ ఓడరేవులుగా ఎదిగాయి. ఆంధ్రవర్తకులు సంఘాలుగా ఏర్పడి బర్మా, థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేసియా, వియెత్నాం, చైనా దేశాలతో నౌకా వాణిజ్యం సాగించారు. ఎర్రసముద్రం, గల్ఫ్ దేశాల నుండి వచ్చే అరబీ వర్తకులు గుర్రాలు, తగరం, దంతం, ఆయుధాలు ఆంధ్రరేవులకి తెచ్చి ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు, నూలు, పట్టువస్త్రాలు కొనుగోలు చేసేవారు. ఆంధ్రతీరాన్ని పరిపాలించిన రాజులకు రేవు వర్తకం నుంచి కస్టమ్స్, సేల్స్ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం చాలా ముఖ్యమైనది. అడ్డపట్టం, చీరాను, గండం, పవడం, పట్టి అనే పేర్లతో అనేక పన్నులు ఉండేవి. బంగారం విలువ నిర్ణయించేందుకు పొన్ను వెలగాళ్ళనే అధికారులు ఉండేవారు. ప్రతి రేవు వద్దా సుంకాధికారులతో కూడిన అధికార యంత్రాంగం ఉండేది. వర్తకులకు పన్నుల వివరాలు, వర్తకాన్ని ప్రోత్సహించే స్కీముల వివరాలు తెలిపే శాసనాలు రేవు పట్టణాలలో కనిపిస్తాయి. క్రీ.శ. 1150లో కాకతీయ గణపతిదేవుడు, 1280లో రెడ్డిరాజు అనపోతయరెడ్డి మోటుపల్లిలో వేయించిన శాననాలు వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు వర్తకులకు ఇచ్చిన సదుపాయాలు, హామీలు, పన్నులపై మినహాయింపులు తెలుపుతాయి. మోటుపల్లికి వచ్చిన వర్తకులకి ఉచితంగా గృహాలు, గిడ్డంగులకి భూములూ ఇచ్చి ప్రోత్సహించారు. హరవిలాసం అంకితం తీసుకున్న అవచి తిప్పయశెట్టి గురించి శ్రీనాథుడు చెప్పిన ఈ పద్యం ఆనాటి వైశ్యులు సాగించిన విదేశీ వాణిజ్యానికి అద్దం పడుతుంది. తరుణాసీరి తవాయి గోప రమణా స్థానంబులం జందనా గరు కర్పూర హిమంబు కుంకుమ రజఃకస్తూరికా ద్రవ్యముల్ శరధిస్ కల్పలి, జోంగు, వల్లి వలికా సమ్మన్ల, దెప్పించు నే ర్పరియై వైశ్యకులోత్తముం డవచి తిప్పండల్పుడే యిమ్మిహన్ ఇందులో తరుణసీరి బర్మాలోని తెన్నసెరిం, తవాయి థాయ్‌లాండ్, రమణా అంటే బర్మాలో రామన్న దేశం అనే రంగూన్ ప్రాంతం. ఇవేగాక, పంజారం అంటే సుమత్రాదీవిలోని పాన్సార్, యాంప అంటే శ్రీలంకలోని జాఫ్నా, బోట అంటే భూటాన్, హరుమూజి అంటే గల్ఫ్‌లోని హోర్ముజ్; ఇలా అనేక విదేశీ రేవుల ప్రస్తావన హరవిలాసంలో కనిపిస్తుంది. కప్పలి, జోంగు మొదలైనవి ఆనాటి ఓడల్లో రకాలు. కప్పలి నేటి తమిళనాడులో కనిపించే కప్పళ్, జోంగ్ ఇంగ్లిష్‌లో జన్క్ అనబడే చైనా నౌక, వల్లీ, వలికా అనేవి వణిజ అనే పదం నుండి వచ్చిన తెలుగు వర్తకుల నావలు. సమ్మన్ అంటే చైనావాళ్ళ చిన్న నౌక సాంపాంగ్. క్రీ.శ. 1194లో రుద్రమదేవి పాలనలో ఉన్న మోటుపల్లిలో దిగిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో, చైనా రేవుల్లో ఇండియా నౌకలే అతి పెద్దవి అన్నాడు. అప్పు ఎగవేస్తే అది వసూలు చేసుకునేందుకు దొరికిన వాడి చుట్టూ గిరిగీసి వీధిలో నిలబెట్టడం అనే ఆచారాన్ని మోటుపల్లిలో చూసినట్లు మార్కోపోలో రాశాడు. ఎంతటి రాజయినా సరే అప్పు తీర్చడమో లేదా ఏదైనా పరిష్కారమో చూపి ఋణదాత ఒప్పుకుంటేనే తప్ప ఆ గీసిన గీత దాటలేడని చెప్పాడు. -
దోష నివారణకు పూజలు!
జరగకూడనిది ఏదైనా జరిగినప్పుడు.. ఎవరైనా కంగారుపడతారు. రకరకాల సందేహాలు, భయాలు కలుగుతుంటాయి. ఏదైనా దోషం వల్లే ఇలా జరిగిందేమో అని కూడా అనుకుంటారు. ఇటీవల అనుష్క అలానే అనుకున్నారట. అందుకే, రుద్రమదేవికి పూజలు నిర్వహించారు. తెలుగు, తమిళం భాషలలో భారీ ఎత్తున రూపొందుతున్న చారిత్రక కథా చిత్రం ‘రుద్రమదేవి’లో అనుష్క టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఇందులో ఆమె సహజత్వం కోసం ఖరీదు గల బంగారు నగలు ధరించి నటించారు. కాగా.. ఆ నగలు షూటింగ్ లొకేషన్లో తస్కరణకు గురైన విషయం తెలిసిందే. దీంతో చిత్రబృందం దిగ్భ్రాంతికి గురయ్యారు. నగలు మాయమైన వ్యవహారంలో చిత్రం యూనిట్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలా నగలు దోపిడీకి గురి కావడం అనుష్కను కలచి వేసిందట. దీని గురించి అనుష్క మాట్లాడుతూ.. ‘‘ఆ నగలను చాలా జాగ్రత్తగా భద్రపరుస్తూ వచ్చాం. అయినా అవి మాయమవడం బాధాకరం. దోషం కారణంగానే నగలు మాయమయ్యాయని కొందరు అంటున్నారు. దీంతో ఏమైనా విపరీతం జరుగుతుందనే భయం కలిగింది. అందువలనే రుద్రమదేవి ఆలయంలో మొక్కుకుని దోష నివారణకు పూజలు నిర్వహించాను’’ అని చెప్పారు. -
రిలాక్స్‌కావాలి బాసూ
యంత్రంలా పని చేస్తున్న నటి అనుష్కకు రిలాక్స్ కావాలట. తమిళంలో రజనీకాంత్ సరసన లింగా, అజిత్‌కు జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతోపాటు తెలుగులో భారీ చారిత్రాత్మక చిత్రాలు బాహుబలి, రుద్రమదేవి చేస్తున్నారు. వీటిలో బాహుబలి, రుద్రమదేవి చిత్రాలకు దాదాపు రెండేళ్లకు పైగా పని చేస్తున్నారు. ఇలాంటి సంచలన చిత్రాల్లో ఒకదానికి తరువాత ఒకటి చేస్తూ, ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా నటిస్తూ వస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రాల షూటింగ్‌ల కోసం చెన్నై టూ హైదరాబాద్, బెంగుళూర్ తదితర ప్రాంతాలకు గాలిలోనే విహంగ పయనం (విమానయానం) చేయాల్సి వస్తోంది. ఎంతయినా అనుష్క కూడా మనిషే కదా? అందులోనూ మగువ. కాస్త రిలాక్స్ చాలా అవసరం. ఇలాంటి విశ్రాంతి సమయాన్ని కోరుకుంటున్నారు. చిత్రాల ఒత్తిడి వల్ల సాధ్యం కాలేదు. అయితే ప్రస్తుతం నటిస్తున్న రజనీకాంత్ లింగా, అజిత్ చిత్రాలతో అనుష్క నటించాల్సిన సన్నివేశాలు దాదాపు పూర్తి అయ్యాయి. అలాగే తెలుగు చిత్రాల షూటింగ్‌లకు చిన్న విరామం దొరకడంతో అమ్మడు రిలాక్స్ కోసం పది రోజులపాటు సినిమా ప్రపంచానికి దూరంగా నచ్చిన ప్రాంతాల్లో స్వేచ్చా విహారానికి రెడీ అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఆమె విహార యాత్ర ప్రాంతాలను కూడా వెల్లడించడానికి నో అంటున్నారట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక మొబైల్ కంపెనీకి అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. తన విహార యాత్రను ముగించుకుని వచ్చిన తరువాత ఆ వాణిజ్య ప్రకటన కోసం నటించనున్నారని తెలిసింది. -
ఇంతకీ 'రుద్రమదేవి' నగలేమైనట్టు?!