![Nalgonda Ex MLA Rudramadevi Passed Away Due To Heart Attack - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/14/mlaaa.jpg.webp?itok=PU6WJMpO)
రుద్రమదేవి (ఫైల్)
సాక్షి, నల్లగొండ: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి (65) ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జిల్లా కేంద్రంలోని స్వగృహంలో మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. తిప్పర్తి మండలం సిలార్‌మియాగూడెం గ్రామానికి చెందిన రుద్రమదేవి అదే మండలం (ప్రస్తుతం మాడుగులపల్లి) చెర్వుపల్లి గ్రామానికి చెందిన గడ్డం రంగారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
కాగా 1981లో కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా ఘనవిజయం సాధించారు. 18ఏళ్లకు ఎన్నికల్లో పోటీచేసి మొదటి ఓటును తనకే వేసుకున్న చరిత్ర రుద్రమదేవిది. రుద్రమదేవి 1981 నుంచి 99 వరకు కౌన్సిలర్‌గా, నల్లగొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఎమ్మెల్యేగా గెలుపొంది నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లు, కరెంట్, ఇతర అభివృద్ధి పనులు చేసి తనదైన ముద్ర వేసుకున్నారు.
ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో రుద్రమదేవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరినప్పటీ ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంలోనే ఆమె భర్త గడ్డం రంగారెడ్డి కొన్నాళ్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందించారు.
నివాళులర్పించిన జానా, కంచర్ల
మాజీ ఎమ్మెల్యే రుద్రమదేవి మృతదేహానికి పట్టణంలోని రామగిరిలో ఆమె స్వగృహంలో మాజీమంత్రి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ, కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి ఆమె పార్ధివదేహంపై పూల మాలలు వేసి నివాళులరి్పంచారు. వారు రుద్రమదేవి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్, మార్కెట్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.
రాజకీయాల్లో తనదైన ముద్ర : ఎంపీ కోమటిరెడ్డి
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మృతికి మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment