
దోష నివారణకు పూజలు!
జరగకూడనిది ఏదైనా జరిగినప్పుడు.. ఎవరైనా కంగారుపడతారు. రకరకాల సందేహాలు, భయాలు కలుగుతుంటాయి. ఏదైనా దోషం వల్లే ఇలా జరిగిందేమో అని కూడా అనుకుంటారు. ఇటీవల అనుష్క అలానే అనుకున్నారట. అందుకే, రుద్రమదేవికి పూజలు నిర్వహించారు. తెలుగు, తమిళం భాషలలో భారీ ఎత్తున రూపొందుతున్న చారిత్రక కథా చిత్రం ‘రుద్రమదేవి’లో అనుష్క టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఇందులో ఆమె సహజత్వం కోసం ఖరీదు గల బంగారు నగలు ధరించి నటించారు. కాగా.. ఆ నగలు షూటింగ్ లొకేషన్లో తస్కరణకు గురైన విషయం తెలిసిందే.
దీంతో చిత్రబృందం దిగ్భ్రాంతికి గురయ్యారు. నగలు మాయమైన వ్యవహారంలో చిత్రం యూనిట్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలా నగలు దోపిడీకి గురి కావడం అనుష్కను కలచి వేసిందట. దీని గురించి అనుష్క మాట్లాడుతూ.. ‘‘ఆ నగలను చాలా జాగ్రత్తగా భద్రపరుస్తూ వచ్చాం. అయినా అవి మాయమవడం బాధాకరం. దోషం కారణంగానే నగలు మాయమయ్యాయని కొందరు అంటున్నారు. దీంతో ఏమైనా విపరీతం జరుగుతుందనే భయం కలిగింది. అందువలనే రుద్రమదేవి ఆలయంలో మొక్కుకుని దోష నివారణకు పూజలు నిర్వహించాను’’ అని చెప్పారు.