చరిత్రను చెక్కుతున్న రాజమౌళి, గుణశేఖర్ | Gunasekhar and Rajamouli Creations | Sakshi
Sakshi News home page

చరిత్రను చెక్కుతున్న రాజమౌళి, గుణశేఖర్

Published Thu, Apr 23 2015 5:18 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

రాజమౌళి - గుణశేఖర్ - Sakshi

రాజమౌళి - గుణశేఖర్

రెండు సినిమాలు - ఇద్దరు డైరెక్టర్లు - వెండి తెర కోసం శిల్పాలు చెక్కుతున్నారు - చరిత్రను వెండి తెరకెక్కిస్తున్నారు - 250 కోట్ల బడ్జెట్‌ - మూడేళ్ల శ్రమ... ఆ సినిమాలు ఏమిటో, ఆ దర్శకులు ఎవరో ఇప్పటికే మీకు అర్దమైపోయి ఉంటుంది. దర్శకులు రాజమౌళి - గుణశేఖర్. ఇద్దరూ దర్శక దిగ్గజాలే. ఆ చిత్రాలు ఒకటి బాహుబలి - రెండు రుద్రమదేవి.  ఈ దర్శకులు  చరిత్ర సృష్టిస్తారా? ఈ చిత్రాలు రికార్డులను బద్దలు కొడతాయా? ఇదే ప్రస్తుతం టాలీవుడ్డే కాదు, భారత చలన చిత్ర పరిశ్రమ టాక్.  మూడేళ్లుగా వినిపిస్తున్న సినిమా తెరమీదికి రాకపోతే ఏం జరుగుతుంది. సాధారణంగా ప్రేక్షకులు దాని గురించి మర్చిపోతారు లేదా ఆ సినిమా గురించి అంచనాలైనా తగ్గించుకుంటారు. కానీ కొన్ని సినిమాల విషయంలో అది నిజం కాదు. కొంతమంది డైరెక్టర్లు సినిమా గురించి ప్రకటించిన తరువాత  అది రిలీజ్‌ కావడానికి ఎంత సమయం పట్టినా అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉంటారు. రోజు రోజుకీ ఆ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉంటాయి. అలాంటి జాబితాలో  టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఉన్నాయి.

జక్కన్న చెక్కుతున్న బాహుబలి చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, రాణా, సత్యరాజ్, తమన్నా వంటి నటీనటులు  నటిస్తున్నారు. మూడేళ్లుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై  ఇప్పటికీ ఫ్రెష్‌ టాక్‌ ఉండేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకున్నారు.  ఇక ఇదే కోవలో ప్రేక్షకులు అలుపు లేకుండా ఎదురు చూస్తున్న రెండో చిత్రం రుద్రమదేవి. అనుష్క టైటిల్‌ రోల్‌తో, గోన గన్నారెడ్డిగా బన్నీ ప్రత్యేక పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంపై కూడా ఎప్పటికప్పుడు అంచనాలు తగ్గకుండా నిలబెట్టుకుంటూ వస్తున్నారు డైరెక్టర్‌ గుణశేఖర్‌. ఈ రెండు చిత్రాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కంటే,  కాస్త ఆలస్యం అయినా కచ్చితంగా ఇండస్ట్రీ చరిత్రలో నిలిచిపోయేలా రావాలని కోరుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. డైరెక్టర్లు, నటీనటులు వాళ్ల శ్రమను నమ్ముకున్నట్టే, అభిమానులు, ప్రేక్షకులు ఆ దర్శకుల ప్రతిభను నమ్మి ఎదురుచూస్తున్నారు.

 రాజమౌళిని ఇండస్ట్రీలో అందరూ జక్కన్న అంటారు. అతను సినిమాను శిల్పంలా అంత శ్రద్ధగా చెక్కుతారని అలా పిలుచుకుంటారు. ఆ పేరుకు తగ్గట్టే జక్కన్న భారీ చిత్రానికి తెరతీసి మూడేళ్లుగా చెక్కుతున్నారు. ఆ శిల్పాన్ని చూడ్డానికి ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ ఎదురుచూపుల్లో ఉత్సాహం తగ్గకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక టీజర్‌ వదులుతూనే ఉన్నారు. రాజమౌళి అంటే అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ ఒక స్థాయి ఇమేజ్‌ ఉంది. అది హీరోలకు కూడా అసూయ కలిగించే స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే, అతను ఈగను కూడా హీరోను చేశారు. హిట్‌ కొట్టి చూపించారు. అలాంటి దర్శకుడు ఎత్తుకున్న భారీ ప్రాజెక్టే బాహుబలి. షూటింగ్‌ ఏడాది పూర్తి చేసుకున్నప్పుడే కాదు, సినిమాకు పనిచేస్తున్న ప్రధాన నటులు, టెక్నీషియన్స్ లో ఎవరి పుట్టినరోజు వచ్చినా వదిలిపెట్టలేదు జక్కన్న. ఆ సెలబ్రేషన్స్ వీడియోలను కూడా సినిమాకు ఒక ప్రమోషన్‌లా ఉపయోగించుకుంటూ బాహుబలిని వార్తల్లో ఉంచడంలో ఇప్పటివరకు సక్సెస్‌ అవుతూనే వచ్చారు. కథ దర్శకుని సృష్టే అయినందున అతను ఎలాగూ నమ్ముతారు. కానీ, ఒక డైరెక్టర్‌ కథను నమ్మి ఒక కథానాయకుడు మూడేళ్ల కాలాన్ని కాల్‌షీట్‌గా ఇచ్చేయడమంటే మాటలు కాదు. ప్రభాస్‌ అదే చేశాడు. ఒక సూపర్‌ హిట్‌ తర్వాత సినిమా లేకపోయినా, తను నమ్మిన కథ కోసం వారియర్‌గా మారిపోయాడు.

రాజమౌళి కథ తయారు చేస్తే, ఆ కథకు నటుల్ని కూడా తానే తయారు చేసుకుంటాడు. సినిమాకు సరిపోయేవాళ్లను వెతుక్కోవడం ఒక పద్ధతి. వెతుక్కున్న వాళ్లను సరిపోయేలా తయారుచేసుకోవడం రెండో పద్ధతి. జక్కన్న స్టైల్‌ రోండోది. అతను ఈగను ఎంచుకుని కూడా హీరోగా తయారుచేసుకున్న డైరెక్టర్‌. అందుకే 100 కోట్ల రూపాయలు దాటి బడ్జెట్‌ పెడుతున్న సినిమాకు, అంతకు మించిన ఎక్సర్‌సైజ్‌ చేశారు. ప్రతి నటుడిని తనకు కావాల్సిన శిల్పంలా చెక్కుకున్నారు. ఒక సినిమా కోసం ఏళ్ల తరబడి కలిసి పనిచేయడం అనేది హాలీవుడ్‌లో మామూలే.  కానీ, టాలీవుడ్‌కి కూడా అలాంటి అనుభవం ఇచ్చిన ప్రాజెక్ట్‌ బాహుబలి. అందుకే షూటింగ్ లొకేషన్లో టీమ్‌ మధ్య జరిగిన ప్రతి వేడుకనూ స్పెషల్‌గా ప్రేక్షకుల కోసం రిలీజ్‌ చేస్తూ వచ్చారు జక్కన్న. ఒక సినిమాకు ఇంత ఖర్చు పెట్టడమే కాదు, ఇంత కాలం తీయడం కూడా తెలుగులో ఇదే ప్రథమం. అయినా సరే, బాహుబలి గురించి వచ్చిన వార్తలు - విడుదలైన ట్రైలర్లు చూసిన ప్రేక్షకులు ఎప్పుడూ తమ అంచనాలు మాత్రం తగ్గించుకోలేదు. కారణం, రాజమౌళి మీద నమ్మకం. దర్శకుడిగా ఇప్పటివరకూ ఓటమి తెలియకుండా సాగిన అతని ప్రయాణం.
ఇక గుణశేఖర్
ఒక్కడు సినిమాతో బాక్సాఫీస్ లెక్కలు మార్చారు. బాల రామాయాణాన్ని తెరపైకి తెచ్చి తరింపజేశారు. ఆ గుణశేఖర్ ఇప్పుడు ఓ కలగన్నారు. తెలుగు తెరపై చరిత్ర సృష్టించాలని చారిత్రక కలగన్నారు. ఆ కల ఖరీదు 80 కోట్ల రూపాయలు. దాని పేరు రుద్రమదేవి. కాకతీయ వీరనారి సాహసాలు వెండితెరపై చూపించాలని, అతిపెద్ద సాహసం చేస్తున్నారు.   కాకతీయ సామ్రాజ్య చారిత్రక సత్యాల్నిరుద్రమదేవి సాహస కృత్యాల్ని, రికార్డ్ చేస్తున్నారు.  కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, ఆనాటి కాలాన్నితన చూపులో బంధించి మనకందించబోతున్నారు. అందుకోసం కఠోర శ్రమ - చరిత్రను తిరగదోడి సినిమాగా మలిచారు. కళ్లు మిరుమిట్లు గొలిపే సెట్లు, అబ్బురపరిచే ఫైట్లు - రుద్రమదేవికి స్పెషల్ ఎసెట్స్. అనుష్కలో రుద్రమదేవి రాజసం ఉట్టిపడుతోంది. బన్నీలో గోన గన్నారెడ్డి సాహసం సాక్షాత్కరిస్తోంది. అతి త్వరలోనే రుద్రమదేవి తెరమీదికి రాబోతోంది. ఉన్నదంతా ఊడ్చిపెట్టి రుద్రమదేవిని తీర్చిదిద్దుతున్నారు.  ఈ సినిమా అటూ ఇటూ అయితే ఇక గుణశేఖర్కు ఏమీ ఉండదన్న వార్తలు వస్తున్నాయి. వాటిని కీడు ఎంచి మేలు ఎంచే వారి  ఆశీర్వచనాలే అని గుణశేఖర్ అంటున్నారు.  
 
భారీ సినిమా అంటే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు. అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. రుద్రమదేవిపై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. అదే స్థాయిలో సినిమా కూడా ఉంటుందని ఊహిస్తున్నారు. అనుష్కకు తమిళనాడులో కూడా మార్కెట్ ఉంది. అల్లూ అర్జున్కు మల్లూవుడ్లో ఫ్యాన్స్ ఉన్నారు. కథ చారిత్రకమైనదైనందున  భాషాపరమైన ఎల్లలు ఉండవు. ఇవే రుద్రమదేవికి కలిసొచ్చే అంశాలని  గుణశేఖర్ ఆశిస్తున్నారు.    తెలుగు తెరపై అతిపెద్ద చారిత్రక చిత్రం ఇది. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం. ఫస్ట్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీ. కేవలం రీ రికార్డింగ్కే 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మొట్ట మొదటి సినిమా.  ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. అన్నీంటికీ మించి గుణశేఖర్ ధైర్యం ఉంది. టాలీవుడ్లో ఏ బిగ్ ప్రొడ్యూసర్ చెయ్యని సాహసం ఇది. హిస్టరీని రికార్డ్ చేసి రికార్డులు కొల్లగొట్టిన చిత్రాలు తెలుగలో తక్కువే. రుద్రమదేవి వీరగాథ తెలుగు ప్రజలకు విధితమే. అయితే, రుద్రమ వీర రసాన్ని బుల్లితెరపై చూశాంగానీ, బిగ్ స్కీన్ పై ఇంతవరకూ చూసింది లేదు. ఆ విజువల్ వండర్ని గుణశేఖర్ చూపించబోతున్నారు. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఎన్నో స్కెచ్ లు వేశారు. కాకతీయ సామ్రాజ్యాన్ని, అప్పటి ఆభరణాల్నీ, కోటల్నీ తరణీ రమణీయంగా రూపొందించారు.   

ప్రభాస్ - అనుష్క
యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తెరమీద కనిపించి మూడేళ్లయింది. ఒక హీరోకి ఇది చాలా పెద్ద గ్యాప్‌. అది కూడా మిర్చిలాంటి ఒక సూపర్‌ హిట్‌ కొట్టిన తర్వాత సినిమా లేదు. తనను ఛత్రపతిగా చూపించి మాస్‌ ఇమేజ్‌ తెచ్చిన రాజమౌళికి కెరీర్‌ రాసిచ్చినంత పనిచేశానే ప్రభాస్. అడిగినంత బరువు పెరిగాడు. నచ్చినంత కండలు తిప్పాడు. జక్కన్న ప్రాజెక్టు ఇంత క్రేజీగా మారడానికి సగం కారణం కూడా ప్రభాసే.  జేజమ్మగా అనుష్క ఇమేజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. అదే ఆమెకు చరిత్రాత్మక పాత్రలు దక్కేలా చేసింది. అనుష్కకు కూడా తెలుగులో మిర్చి తర్వాత సినిమా లేదు. ఒక పక్క బాహుబలిలో హీరోయిన్‌గా,  మరో పక్క రుద్రమదేవిలో టైటిల్‌ రోల్‌ చేస్తూ  ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మునిగిపోయింది. అందరికీ ఒక టెన్షన్‌ అయితే, అనుష్కకు డబుల్‌ ధమాకా.

రాజమౌళి - గుణశేఖర్
 ఈగ సినిమా  జులై 5, 2012 లో రిలీజైంది. రాజమౌళి సినిమా రాక దాదాపు మూడు సంవత్సరాలు. జక్కన్న మార్క్ సినిమా కోసం అతని స్టాంప్ను తెరమీద చూడటం కోసం తెలుగు ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మగధీర, ఈగ  ఈ రెండు ప్రయోగాల తర్వాత అంతకు మించిన ప్రయోగం రాజమౌళి చేస్తున్నారు.

రుద్రమదేవి కోసం గుణశేఖర్ పట్టువదలని విక్రమార్కుడయ్యారు. నిద్రహారాలు మాని తన స్వప్నాన్ని నిజం చేసుకుంటున్నారు. తన లాస్ట్ మూవీ నిప్పు రిలీజై 3 సంవత్సాలు దాటింది. ఇంతకాలం గుణశేఖర్ గడియారాన్ని చూసుకోలేదు. ప్రతి ఘడియా రుద్రమదేవి గురించే ఆలోచించారు. దాని కోసమే శ్రమించారు. తన గత సినిమాలు ఓ ఎత్తైతే, రుద్రమదేవి మరో ఎత్తు.   

నిజానికి బాహుబలి బలమెంతో, రుద్రమదేవి పవరెంతో ఈ సమ్మర్‌కే తేలిపోవాలి. కానీ, ఎంత కష్టపడి పనిచేసినా ఈ చిత్రాలు వేసవి మిస్సయ్యాయి. త్వరలో రిలీజ్కి సిద్ధమవుతున్న ఈ హిస్టారికల్‌ విజువల్‌ వండర్స్ ప్రేక్షకుల ఎదురుచూపులకు ఎంత ప్రతిఫలమిస్తాయో చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement