'బాహుబలి' 'రోబో'ను మించిపోతుందా?
రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'బాహుబలి' చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. దక్షిణాదిలో ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'రోబో' చిత్రాన్ని తలదన్నడం ఖాయమని సినీవర్గాలు భావిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా నిర్మాణదశలోనే భారీ బిజినెస్ చేస్తోందని వినవస్తోంది. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలకు జరిగిన బిజినెస్ 79 కోట్ల రూపాయలు దాటిపోయిందని సమాచారం. ఇంకా మరికొన్ని ఏరియాల హక్కులు అమ్ముడు కావాలసి ఉంది. అన్ని కలిపితే ఒక్క థియేటర్ హక్కులే 105 కోట్ల రూపాయల వరకు వస్తాయని అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి బాహుబలి చిత్రానికి రైట్స్ రూపంలో 77 కోట్ల రూపాయలలు వచ్చినట్లు అంచనా. కర్నాటక నుంచి 9 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ మరో 9 కోట్ల రూపాయలు వసూలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఇవేకాకుండా, శాలిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ రూపంలో మరో 10 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు తమిళం, హిందీ భాషల థియేటర్రైట్స్ బిజినెస్ జరుగాల్సి ఉంది. వీటి ద్వారా 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా. దీంతో పాటు ఇతర భాషల్లోనూ సినిమా విడుదలవుతోంది. అన్ని కలిపితే 'బాహుబలి' విడుదలకు ముందు బిజినెస్ 'రోబో' బిజినెస్ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై సోబు యార్లగడ్డ, కొవెలమూడి రాఘవేంద్ర రావు, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క,తమన్నా, రమ్యకృష్ణ, సుదీప్, నాజర్, ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతోపాటు తమిళ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేసే అవకాశం ఉంది
- శిసూర్య