ఎవడో ఒకడి కింద బతకడం తప్ప మీకు వేరే దారిలేదన్నావ్... ఇప్పుడు వీడు పోయాడు. వీడి స్థానం లోకి నువ్వు వస్తావా...?
ఇది పోర్ట్ ఏరియా... నా వాళ్లు బతుకుతున్న ఏరియా...
ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం... గుడ్డకేడ్చాం.. కడుపు మాడితే కన్నీళ్లు మింగిబతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవరైనా వస్తే మాడిపోతారు.
వాడుపోతే వీడు... వీడు పోతే నేను... నేను పోతే
నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే....
దాదాగిరికొచ్చినా దౌర్జన్యానికొచ్చినా... గూండాయిజానికొచ్చినా
గ్రూపులు కట్టడానికొచ్చినా... రాచరికంతో వచ్చినా...
రౌడీయిజంతో వచ్చినా... పూటకో శవం పోర్టుకి బలౌతాయి...
సినిమా థియేటర్లన్నింటినీ హర్షధ్వనాలతో నింపేసిన డైలాగులివి. ఎరుపెక్కిన కళ్లతో ప్రభాస్ ఈ డైలాగులు చెబుతుంటే... ప్రేక్షకుడు రోమాంచితుడయ్యాడు. ‘ఛత్రపతి..’ అంటూ విజిల్స్ వేశాడు. దటీజ్ ప్రభాస్. నిజానికి ఈ సినిమాకు ముందు ఇంతటి తీవ్రమైన ఉద్వేగాన్ని ప్రభాస్ పలికించగలడని ఎవరూ ఊహించలేదు. అలా ఊహించని పరిణామమే ‘ఛత్రపతి’ సినిమా. ఆ మాటకొస్తే... ప్రభాస్ ఏనాడూ ప్రేక్షకుడి ఊహకి అందలేదు. ఎప్పటికప్పుడు తనను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ.. యువతరానికి సరికొత్త రోల్ మోడల్‌గా అవతరించారు.
సినీపరిశ్రమలో మాస్ ఇష్టపడే హీరోలు కొందరైతే... క్లాస్ ఇష్టపడే హీరోలు కొందరు. కానీ మాసూ, క్లాసూ కలిసి ఇష్టపడే హీరో మాత్రం ఒక్క ప్రభాసే. మాస్ ప్రేక్షకులకు ఆయనో ‘ఛత్రపతి’. క్లాస్ ప్రేక్షకులకు అతనో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’. ఇక అమ్మాయిలకైతే... ఏకంగా డార్లింగే. ‘మిర్చి’ సినిమాతో చిన్నపిల్లలకు కూడా చేరువై... నంబర్ రేస్‌లో చాప కింద నీరులా దూసుకెళుతున్నారు ప్రభాస్. ఒకే తరహా సినిమాలు చేయకుండా... భిన్నమైన నటప్రయాణం సాగిస్తున్నందువల్లే ఈ క్రెడిట్ సాధించగలిగారాయన.
ప్రస్తుతం ప్రభాస్ ఓ తపస్సులా భావించి చేస్తున్న సినిమా ‘బాహుబలి’. ‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళితో ఆయన చేస్తున్న సినిమా ఇది. ఈతరం హీరోల్లో జానపదం చేసే అపూర్వఅవకాశం ప్రభాస్‌కే దక్కింది. ఈ జానపదంతో అన్ని వయసుల వారికీ ప్రభాస్ మరింత చేరువవుతారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కెరీర్ కోసం సాటి హీరోలందరూ బరువు తగ్గుతుంటే... ఏకంగా ‘బాహుబలి’ కోసం 150 కిలోల బరువుకు చేరుకున్నారట ప్రభాస్. ఈ వార్త తెలిసి పరిశ్రమలో అందరూ ‘వావ్’ అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. కథ రీత్యా ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర పేరు ‘బాహుబలి’ అని తెలిసింది. ఈ పాత్రలో ప్రభాస్ నట విశ్వరూపాన్ని చూడొచ్చని ఆ చిత్రం యూనిట్ నమ్మకంగా చెబుతుంది. ‘బాహుబలి’గా ఆయన వెండితెరపై సాక్షాత్కరించడానికి ఇంకా ఏడాదిన్నరైనా పట్టొచ్చని సమాచారం. ప్రభాస్ అభిమానులకు ఇది కాస్త కష్టం కలిగించే విషయమే. ‘మిర్చి’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఇన్నాళ్లు ఒకే సినిమాపై దృష్టిని కేంద్రీకరించడం ‘బాహుబలి’పై ప్రభాస్‌కి ఉన్న నమ్మకాన్ని చెబుతోంది. నేడు ఈ యంగ్ రెబల్‌స్టార్ పుట్టినరోజు. ఆయన్ను అభిమానించే అందరికీ ఇది నిజంగా స్వీట్ డే.
అబ్బో..! 150 కేజీల బరువా?
Published Wed, Oct 23 2013 12:40 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM
Advertisement