మన సినిమా చరిత్రను తిరగరాసే 'బాహుబలి' | Rajamouli makes Bahubali as a great cinema | Sakshi
Sakshi News home page

మన సినిమా చరిత్రను తిరగరాసే 'బాహుబలి'

Published Sun, Oct 20 2013 4:49 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

మన సినిమా చరిత్రను తిరగరాసే 'బాహుబలి' - Sakshi

మన సినిమా చరిత్రను తిరగరాసే 'బాహుబలి'

భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే విధంగా అత్యంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో  'బాహుబలి'  చిత్రం రూపొందుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో దాదాపు వంద కోట్ల రూపాయల వ్యయంతో భారీ చిత్రంగా దీనిని తెరకెక్కించనున్నారు.  ఈ చిత్రం నిర్మాణ దశలో, షూట్ చేసిన డేటా భద్రపరచడంలో, చిత్రం ప్రచారం దశలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్క ధనవ్యయమే కాదు, రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ ఎంతో శ్రమిస్తూ, కటోరదీక్షతో ఓ యజ్ఞంలా ఈ సినిమా  చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్లోనే  అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇది. తను ఇంతవరకు పడనంతగా కష్టపడుతున్నారు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలలో ప్రత్యేకంగా శిక్షణ పొందారు.  రాజమౌళితోపాటు ప్రభాస్ కూడా ఎన్నో జాగ్రతలు తీసుకుంటున్నారు.  ఇంటికి షూటింగ్కే పరిమితమయ్యారు. బయట ఏ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఎవరికీ కనిపించడంలేదు. ముఖ్యంగా మీడియా కంటపడటంలేదు. సినిమా పూర్తి అయ్యేవరకు  ప్రభాస్లో వచ్చిన శారీరక మార్పులు ఎవరూ చూడకుండా ఉండేందుకు ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.   అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ అద్బుతమైన రీతిలో భారీ సెట్స్ రూపొందించారు.

 ఇప్పటికే చాలా కాలం నుంచి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయి మన ముందుకు రావడానికి మరో సంవత్సరం పట్టే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఏవీ బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. షూటింగ్ స్పాట్లో ఏ రూపంలోనూ ఫొటోలు తీయడానికి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే సిడి బయటకు రావడంతో  అలాంటి పరిస్థితి తలెత్తకుండా  ఆధునిక పద్దతులలో  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా షూటింగుకు సంబంధించిన వీడియో డేటాను భద్రపరిచేందుకు  ‘కస్టమ్ బుల్ట్ ఆన్ లొకేషన్ డేటా స్టోరేజీ' అనే పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. హాలీవుడ్ రేంజి సినిమాలకు ఇటువంటి  పరికరాలను ఉపయోగిస్తారు.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉంటాయో, అన్ని నష్టాలు కూడా ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆ నష్టాలను అధిగమించడానికి రాజమౌళి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ కర్నూలు సమీపంలోని గుట్టల ప్రాంతంలో జరిగింది.  రాజమోజీ ఫిల్మ్ సీటీలో వేసిన భారీ సెట్టింగులో సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశారు.  రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన మరో భారీ సెట్లో  మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పాత్రలు పోషిస్తున్నారు.  సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్  ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.  తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తరువాత  హిందీ, విదేశీ భాషల్లో కూడా  విడుదల చేస్తారు.

 రాజమౌళి ‘ఈగ' చిత్రం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి ఘడించారు. ఈ చిత్రం అంతకుమించిన పేరు తెస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఈ  సినిమా ప్రచారానికి రాజమౌళి కొత్త పద్దతులను అనుసరిస్తారని తెలుస్తోంది. ఒక చిత్రం విజయవంతం కావడానికి అన్నిరకాల సమర్ధలతోపాటు ప్రచార ప్రాముఖ్యత  కూడా తెలిసినవాడు రాజమౌళి. సినిమా నిర్మాణంలోనూ, ప్రచార పద్దతులలో నూతన వరవడులు సృష్టించగల దిట్ట. నిరంతర అన్వేషి. ప్రచారం కోసం కొత్తకొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో ‘ఈగ'  విడుదలకు ముందే కథను లీక్ చేశారు. ఈ సారి కథను ఏమాత్రం లీక్ చేయరు. చిత్రం మేకింగ్ వీడియోలను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్రం షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అయింది. పూర్తి కావడానికి మరి కొంతకాలం పడుతుంది. ఈ మధ్యలో చిత్రంపై ప్రేక్షకులకు ఆసక్తి పెంచే మార్గాలను వెతుకుతున్నారు.  ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా  ఈ 23న  చిత్రం తొలి మేకింగ్ వీడియోను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక నిమిషం మాత్రమే ఉండే ఈ వీడియోను చిత్రంపై అత్యంత ఆసక్తిని రేకెత్తించే విధంగా రూపొందించాలన్న ఆలోచనతో ఉన్నారు.

తెలుగులో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందే ఈ చిత్రంపై సినీపరిశ్రమతోపాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఉన్నారు. అందరి అంచనాలను రాజమౌళి అధిగమించగలరని ఆశిద్ధాం.

s.nagarjuna@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement