
తెనాలి: కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి జీవిత అంశాలను గుంటూరు జిల్లాలోని మూడు శాసనాలు బహిర్గతం చేస్తున్నాయి. ఇటీవల వెలుగుచూసిన ప్రస్తుత పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెం కొండపై గల శాసనం.. ఆమె మరణకాలంపై గల సందేహాలను తీరుస్తోంది. విజయవాడ కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్వేషణలో అక్కడి పురాతన బౌద్ధస్థావరం బహిర్గతమైంది. అక్కడి ఆయక స్తంభంపై చెక్కిన శాసనంలో గల రాణి రుద్రమదేవి వివరాలను తెలంగాణ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ వెలుగులోకి తెచ్చారు.
సూర్యాపేట జిల్లాలోని చందుపట్లలోని శాసనంపై గల కాలాన్నే నిజమైన మరణ తేదీగా ఎక్కువమంది భావిస్తారు. పుట్లగూడెం కొండపై వెలుగుచూసిన తాజా శాసనం ఆ కాలాన్ని బలపరిచేలా ఉందని హరగోపాల్ వెల్లడి చేశారు. క్రీ.శ 1289 డిసెంబర్ 15న వేసిన ఈ శాసనంలో రుద్రమదేవి మరణం తర్వాత, కొండపై గల ఆలయానికి భూమిని దానమిచ్చినట్టుంది. చందుపట్లలోని సోమనాథ దేవాలయ శాసనం(1289 నవంబర్ 25)లో రుద్రమదేవికి శివలోక ప్రాప్తి కోరుతూ దేవాలయానికి భూమిని దానం ఇచ్చినట్టుంది.
రుద్రమదేవి మరణించాక, దశ దిన కర్మ జరిగేలోపు.. అంటే అందులోని తేదీకి దాదాపుగా పక్షం రోజుల ముందు ఆమె మృతిచెంది ఉంటారని చరిత్రకారుల అంచనా. గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర్లోని ఈపూరులో నాగమయ్యస్వామి ఆలయంగా వ్యవహరించే గోపాలస్వామి ఆలయం ఎదుట గల స్తంభంపై 1289 నవంబర్ 28న చెక్కిన శాసనంలో రుద్రమదేవితో పాటు అంగరక్షకుడు బొల్నాయినికి పుణ్యంగా స్వామికి భూమిని సమర్పించినట్టుంది. ఈ రెండు శాసనాల్లో రాణి రుద్రమదేవితోపాటు ఆమె సైన్యాధిపతి మల్లికార్జుననాయుడు, అంగరక్షకుడు బొల్నాయినికి కూడా శివప్రాప్తి కోరారు. అంటే ముగ్గురూ ఒకేసారి మరణించారని చరిత్రకారులు చెబుతారు.
చనిపోయే నాటికి ఆమె వయసు 80 ఏళ్లు!
అంబదేవుడి తిరుగుబాటును అణిచివేసే యుద్ధంలో రుద్రమదేవి మరణించినట్టు చరిత్ర కథనం. చందుపట్ల, ఈపూరు శాసనాలు 1289 నవంబర్ 25, 28 తేదీల్లో వేయించినవి. అప్పటికి కొద్దిరోజుల ముందే ఆమె చనిపోయారు. పుట్లగూడెం కొండపై శాసనాన్ని అదే ఏడాది డిసెంబర్ 15న చెక్కారు. అంటే అప్పటికే రుద్రమదేవి జీవించి లేరని స్పష్టమైందని హరగోపాల్ వెల్లడించారు.
చనిపోయేనాటికి ఆమె వయసు 80 ఉండొచ్చని ప్రముఖ చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి అంచనా. 1289లో రుద్రమదేవి మరణించినందున ఆమె జన్మ సంవత్సరం 1209 అయివుండొచ్చు. తన 52 ఏళ్ల వయసులో రుద్రమదేవి పట్టాభిషిక్తులయ్యారని వెల్లడవుతోంది. రుద్రమదేవికి చెందిన కీలక శాసనాలు మూడూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉండటం విశేషం.