
చలివేంద్రానికి పోలీసు అనుమతి నిరాకరణ
పర్చూరు (చిన్నగంజాం): చలివేంద్రం ఏర్పాటు చేసేందుకు రోటరీ క్లబ్ చేసుకున్న విన్నపాన్ని పర్చూరు పోలీసులు తిరస్కరించారు. బొమ్మల సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందన్న కారణంతో పోలీసులు అనుమతిని నిరాకరించినట్లు తెలిసింది. దీంతో పాదచారులు, ప్రయాణికులు ఎండ తీవ్రతకు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల దాహార్తిని తీర్చటానికి బొమ్మల సెంటర్లో చలివేంద్రం లేకపోవడంతో స్థానికులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పర్చూరు రోటరీ క్లబ్ గత 23 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో నిస్వార్థ సేవలు అందిస్తుంది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటుచేసి దాతల సహకారంతో 45 రోజుల పాటు మజ్జిగను కూడా అందిస్తుంది. ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నా ఇంకా చలివేంద్రం మొదలు కాక పోవడంతో స్థానికులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. పంచాయతీ వారు అనుమతిని మంజూరు చేసినా, పోలీసులు నిరాకరించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇన్ని సంవత్సరాల నుండి లేని ట్రాఫిక్ సమస్య ఇప్పుడే తలెత్తిందా అన్న ప్రశ్నను స్థానికులు లేవనెత్తుతున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించడం వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో జోరుగా చర్చ సాగుతోంది. ఏదేమైనా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బొమ్మల సెంటర్లో చిన్నపాటి చలివేంద్రం ఏర్పాటుకై నా పోలీసులు అనుమతిని మంజూరు చేయాలని కోరుతున్నారు.