
చెన్నుని బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనం
మాచర్ల రూరల్: శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని గరుడు వాహనంపై ఊరేగించనున్నారు. మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాటి ప్రజల ఇలవేల్పు శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. భక్తులు వేలాదిగా తరలివస్తారన్నారు. ఈఓ ఎం. పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కొమెర అనంతరాములు, బండ్ల బ్రహ్మం, గాజుల గణేష్, కోమటి వీరు, మద్దిగపు శ్రీనివాసరెడ్డి, సుంకె వాసు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ సంక్షేమ శాఖ డీడీగా రాజా దేబోరా
నెహ్రూనగర్: గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా రాజా దేబోరా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ డీడీగా పనిచేస్తున్న డి.మధుసూదన్‌రావు 3 నెలలకుపైగా సెలవుపై వెళ్లడంతో ఇప్పటి వరకు ఏఓగా పనిచేస్తున్న మాణిక్యవరరావు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. తాజాగా ఆయన స్థానంలో బాపట్ల జిల్లా ఎస్సీ వెల్ఫేర్ డీడీగా పనిచేస్తున్న రాజ్ దేబోరాకు గుంటూరు జిల్లా డీడీగా (పూర్తి అదనపు) బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వెబ్‌సైట్‌లో ఎస్‌ఏల
సీనియార్టీ జాబితా
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 హెచ్‌ఎం పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లతో రూపొందించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీఈవోజీఎన్‌టీ.బ్లాగ్‌స్పాట్.కామ్ సైట్‌లో ఉంచిన సీనియార్టీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈ నెల 20వ తేదీలోపు గుంటూరు డీఈవో కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలని తెలిపారు. మున్సిపల్ యాజమాన్యంలోని పాఠశాలల్లో ఉద్యోగోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయులతో సీనియార్టీ జాబితాను ఇప్పటికే విడుదల చేశామని గుర్తుచేశారు.
దుర్గమ్మ సన్నిధిలో 241 గ్రాముల బంగారం చోరీ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి 241 గ్రాముల బంగారాన్ని ఆగంతకులు చోరీ చేసిన ఘటన మంగళవారం జరిగింది. హైదరాబాద్ బృందావనకాలనీలో నివసించే ఆచంట దుర్గారావు కుటుంబం అమలాపురంలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు మంగళవారం మధ్యాహ్నం విజయవాడలో ఆగారు. దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ సమీపంలో తమ కారు నిలిపారు. 241 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను కారులోనే ఉంచి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చిన తరువాత కారులో నగల బ్యాగ్ కనపడలేదు. వెంటనే సమీపంలోని పోలీసు అవుట్‌పోస్టులో ఉన్న పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి చుట్టు పక్కల వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవ టంతో మంగళవారం రాత్రి వస్తువుల ఆధారాలతో వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 515.20 అడుగుల వద్ద ఉంది. ఇది 140.6684టీఎంసీలకు సమానం.